7, డిసెంబర్ 2018, శుక్రవారం

భూగోళం ఆవలికి ప్రయాణం

అమ్మాయి పెళ్ళీ అయ్యి ఆరు నెలల్లోనే అమెరికా వెళ్ళిపోయి  ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయ్యినా ..అమ్మమ్మ గా ప్రమోషన్ వచ్చినా .. యెంతమంది గొడవ చేసినా భూగోళముఆవలికి
అడుగు పెట్టలేదు ...కారణాలు చాలా వుంటాయి ..చూసేవాళ్ళకి మాత్రం విడ్డురమే !
                  ముఖ్యంగా చంటిపిల్లలా మమ్మల్ని వదలకుండా కాళ్ళ వెంట కూడా కూడా తిరిగే మా బుజ్జులు ..కోకిల ను వదలడము చాలా కష్టము తో కూడిన పని ...
 రెండోది సర్కారీ కొలువులో నెలలు సెలవు మంజూరు ఒక యుద్ధమే !
 ఎట్టికేలకు నెల రోజులు సెలవు తీసుకుని  అమెరికా కు ప్రయాణం అయ్యాను ...మా విజివాడ నుండే .... ఇంత చలిలో ఏందబ్బా అని ముక్కు మీద వేలు వేసుకుని అందరు ఒకటే హాశ్చర్యము ....మనవరాలు పిలుస్తుంది రమ్మని ... నేను వెళ్లకుండానే పుట్టేసింది హడావిడిగా ... రేపే  నా ప్రయాణం !

29, నవంబర్ 2018, గురువారం

మిస్ యూ అమ్మా .బుజ్జులు

దాదాపు సంవత్సరం అయ్యింది బ్లాగు రాసి ..... రాయాలని మనస్సులో ఆలోచన వుంటుందికానీ చుట్టూ పరిస్థితులు పర్మిట్ చేయడము లేదు ... అమ్మ మమ్మల్ని వదలి వెళ్ళిపోయి యేడాది దాటిపోయింది  ఆ డిప్రెషన్  నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే  నా బుజ్జులు నన్ను మా ఇంటి వారందరిని ధుఃఖ సాగరంలో ముంచివేసింది  ఇందులో తన తప్పేమి లేదు డాక్టరు నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది .... తలుచుకుంటుంటే గుండె చెఱువు అవ్వుతుంది .. నాకు ప్రాణం అయ్యినవారు ఇద్దరు లేరు ....ఒకింత విరక్తి ... జీవితం ఇంతేనా ...ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టవలసిందే కదా ...ఈ మాత్రం బ్రతకడానికి మనుష్యుల్లో ఇంత  ఆరాటం యెంతో పోరాటం ఎందుకో అనిపిస్తుంది ....రెగ్యులర్ గా యోగా  ధ్యానం తరగతులకు  వెళ్తున్నాను క్రమం తప్పకుండా ఉదయపు నడకలు నడుస్తున్నా ... మనిషిని చిక్కానే  కానీ  మనస్సులో వ్యధ ఇసుమంతయినా  తరగడము లేదు ...మనో వ్యాధికి మందు లేదంటారు ...నిజమే ...లేదు ..కాలం
మారుస్తుందేమో వేచి చూడాలి ....    మిస్  యూ  అమ్మా  .బుజ్జులు             
 పిల్లల  మధ్యలో  అమ్మ

22, అక్టోబర్ 2017, ఆదివారం

ఏకాంతంగా

నిన్న మొన్నా వున్నా దూకుడు తగ్గింది ... వెనక్కి తిరిగి చూసుకుంటుంటే యెంత మార్పో !                                   ప్రతి పనిలోనూ మనమే ముందుండాలని అద్భుతంగా ఉండాలని ఇంటిపని వంటపనిలోను
మనదైన ముద్ర వుండాలనే ఉత్సాహం ఏమై పోయిందో ప్చ్! అటు ఉద్యోగం అయినా గొప్పగా
వెలిగిస్తున్నామా అంటే అదీ లేదు  ఇంకా యెన్నాళ్ళు చేయాలో అని లెక్కలు వేసుకునే స్థితి కి
యెప్పుడో వచ్చేసాను !అలా అని వాలంటరీ ఇద్దాము అంటే యెంత కష్టపడితే ఈ గ్రూప్ వన్
తెచ్చుకున్నానో కళ్ళ ముందు కదులుతుందీ ప్రతీ నెల అకౌంట్ లో జమ అయ్యే జీతం కనబడుతుంది
అస్సలు యే పని చేయకుండా స్థబ్దతగా ఉదయం నుండీ వరండాలో ఏకాంతంగా  కూర్చుని ఆ పచ్చటి చెట్లనూ వాటి మీద
అల్లరి చేసుకుంటూ తిరిగే  ఉడుతలను కిచకిచలాడే పిట్టల్ని ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నిస్తున్న తూనీగలను
ఎక్కడినుండో రివ్వున వచ్చి వెళ్తున్న సీతాకోక చిలుకని నీరెండలో  విడిపోతున్న దూది లాంటి మబ్బుల్ని చూస్తూ
ఆరు నెలల   క్రితం మమ్మల్ని వదిలి వెళ్లిన "అమ్మ "ఆ మబ్బుల్లో ఎక్కడైనా దాగి మమ్మల్ని చూస్తుందేమో
కనబడుతుందేమో అనే ఒకింత ఆశ తో (సత్య దూరమైనా )గడపాలనిపిస్తుందీ

         

       
           

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

బ్లాగింటికి

చాల రోజుల తరువాత బ్లాగు లోకం లోకి మరల రావడం జరిగింది .. సొంత ఊరు వచ్చినట్లుంది ;-). బ్లాగులను ముఖ పుస్తకం వాట్సాఅప్ డామినేట్ చేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు .మనస్సు బాగుండపోతే మనల్ని మనం సంబాళించుకోవడానికి బ్లాగులు నాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి ...కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోవాలన్నా మనం (నేను) రాసుకున్న పిచ్చి రాతలు భావోద్వేగాలు అప్పటికి ఇప్పటికి మారిన మానసిక స్థితి ... ఒక రివ్యూ .....
ఈ పబ్లిక్ డైరీ ని మరల యాక్టీవ్  చేయాలని ధృడంగా సంకల్పం చేసుకుంటున్నాను ... 

18, సెప్టెంబర్ 2017, సోమవారం

జీవితం

జీవితం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
ఈ సంసారంలో ని సంపద ,ప్రాణం ,జీవితం ,
యవ్వనం ఇవన్నీ అశాశ్వతములు అస్థిరములే !
ఈ లోకం లో శాశ్వతమైన "ధర్మము "ఒకటే
స్థిరమైనది గ్రహింపునకు వచ్చినది. 

3, మే 2017, బుధవారం

మరో జన్మ కీ నువ్వే మా అమ్మ వి కావాలీ

అమ్మా అని పిలిచినా పలుకవెమ్మా......

9, అక్టోబర్ 2016, ఆదివారం

రాయాలని ఉంది కానీ రాయలేక పోతున్నా

వారం కి ఒక్కసారైనా  బ్లాగు లో నా ముత్యాల ముగ్గులు (కాకి పిల్ల కాకి కి ముద్దు  నా రాతలు ఎంత చెత్త అయినా ) గీయాలని అనుకున్న కుదరడం లేదు . అంటే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్టే ... పని లేదు పాడు లేదు పరమ లేజీ అయ్యిపోయాను . ఎప్పుడెప్పుడు సుఖంగా అంటే ప్రశాంతంగా పని చేసుకుంటాను బోల్డన్ని బుక్కులు చదివేయొచ్చు అలాగే బోల్డన్ని రాసేయొచ్చు అని కలలు కన్నాను కానీ నా ఆశలన్నీ అడియాశలు అయ్యిపోయే ...అదేదో కోతి కధలా ముళ్ళు పోయి కత్తి వచ్చే కత్తి పోయి పిల్ల వచ్చేలా వెదవ ముఖపుస్తకం మాయలో పడి కొట్టుకుపోతూ మునుగుతూ ..తేలుతూ హమ్మయ్య ఆ మాయలో నుండి తప్పించుకునే లోపు వెధవది వాట్సాప్ పట్టేసుకుంది వద్దు మొర్రో అనుకున్న వందల గ్రూపులు అక్కాచెల్లెళ్ల గ్రూప్ అనురాగాలు ...  అనుబంధాలు ... కజిన్స్  ...  ఫ్రెండ్స్ చిన్నారి బంధాలు ...  ఉజ్జోగం బంధం .... కలెక్టర్ బంధం ,జిల్లా బంధం  టెలిగ్రామ్  ఒకటి కజిన్ లా ...  రోటరీ సేవ బంధం యోగా బంధం ...వాకర్స్ బంధం ..   కులగౌరవాలు .... నాటక బంధం  ...పాటల బంధం  వాట్ నాట్ ...మనకి ఇష్టం వున్నా లేకపోయినా  అందులోకి లాగేయ బడతాం .... మొహమాటం గా నచ్చితే ఉండటం నాలుగు రోజులాగి జంప్ ... కొన్ని నోరుమూసుకుని ఉండాల్సి రావడం ...మరి అప్పుడప్పుడు  బిగ్ బాస్ లకి ఎస్ సార్ ...నోటెడ్  సార్  అనాలిగా ..ఎప్పటికప్పుడు మెస్సేజి చెక్ చేసుకోవాలి లేపోతే ఏమైనా మిస్ అవ్వుతాము మిస్ అయ్యి తిట్లు తినేసిన  రోజులున్నాయి ....అట్లా అలవాటయిన  టెలిగ్రామ్  వాట్సాప్  నేడు వ్యసనం అయ్యి కూర్చుని నా సమయం మొత్తం మింగేస్తుంది .... అక్కడికి చాలా వాటినుండి తప్పుకున్న నాకు నచ్చిన వాటినుండి తప్పుకోలేక పోతున్న ....అందుకే బ్లాగు లేకపోతున్న ....చదవలేకపోతున్న ...ఎక్కడికి పోయిన వైఫై ఉందొ లేదో చెకింగ్...    అన్నట్లు బ్లాగు బంధాలు లేదనుకుంటాను :-)... అది కూడా గ్రూపు చేసేస్తేపోలా --;) ;)