27, డిసెంబర్ 2009, ఆదివారం

అట్లపిండి

నా చిన్నతనం లో మాకు ఒక నాయనమ్మ వుండేది .ఆమె పేరు వెర్రి బామ్మ ,కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది .ఆవిడ చేస్తే ఇంతవరకు ఒక్కసారిగా ,పాతికట్లకంటే తక్కువ తిన్నాడు లేడుమాలో. ఆమెని అట్లబామ్మా అనే వాళ్ళం .ఎల్లా చేసేదో ఆ పిండి లో 'ఏం కలిపేదో ' ఎవరికి తెలియదు .ఒకసారి నేను మా చేల్లిలి గారి ఊరు వెళ్తున్న,మా చెల్లెలు గర్భిణి తో వుంది బామ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది ,బామ్మ ఏం చేసిందంటే ,పిండి కలిపి ,ఒక పెద్ద సత్తేప్పాల లో వేసిసిబ్బి బోర్లించి ,గుడ్డ వాసిన కట్టి ,నన్ను ముందు తీసికెళ్ళమంది .మరునాడు రైల్ కి తను వస్తానంది .....
తరువాత కథ మీకు మీరు చదివితేనే అద్భుతంగ వుంటుంది .ఈ కథ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది .నేనైతే బాగా ఎంజాయ్ చేసాను .చదివిన ప్రతిసారి నవ్వించక మానదు .పిండి గిన్నె పట్టుకుని రైలు ప్రయాణం దిగినాక పాట్లు ...సో నేను చెప్పేకంటే మీరు చదవడం బాగుంటుంది .
సరికాని ఎవరు రాసింది తల్లీ అంటారా?
ఇంకెవరు మన గుడిపాటి వెంకటచలం -:)
హ్మం !చలం అంటే ఒక్కసారే ఉలిక్కిపడ్డారా ?
నిజంగా చలం గారి రచనేనండీ ...అయన కథలనగానే స్త్రీ వాదం అనేస్కుంటారని నొక్కి వక్కాణిస్తున్న -:)
కథ పేరు "అట్లపిండి ".చలం గారి రచనలు చదివేవారు చదివే వుంటారు .ఈ కథ కావాలనుకుంటే సులువుగా దొరికే మార్గం చెబుతాను వినండి . సాకం నాగరాజ అద్వర్యంలో సంకలనం చేసిన "తెలుగు కథకి జేజే !" పుస్తకంలో పొందుపరచిన మొదటి కథే "అట్లపిండి "..ఈ పుస్తకం రెండువేల ఏడు లో ప్రచురించబడినది .వెల మూడు వందల రూపాయలు మాత్రమె .విశాలాంద్ర అన్ని బ్రాంచిల్లో దొరుకుతుంది .
నేను మాత్రం కొనలేదు -:) నా కొలీగు ( నా ఒకప్పటి మిత్రురాలు )నా పుట్టినరోజుకి బహుమతిగా పంపించారు .తోచక పుస్తక ప్రక్షాళన చేస్తుంటే కంటబడింది ,చదవవలసిన మంచి పుస్తకం అని మీతో పంచుకుంటున్న

23, డిసెంబర్ 2009, బుధవారం

మరచిపోలేని కథ

  1. డిసెంబర్ ఇరవయ్యిఆరు రెండువేల తొమ్మిది నాటికి మన దేశాన్ని సునామి తాకి సరిగ్గా అయిదు సంవత్సరాలు అవుతుంది .ఆనాటి ప్రకృతి ప్రళయాన్ని కళ్ళకి కట్టినట్లు రాసిన కథ "కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం".ఈ కథ రెండు వేల అయిదు జనవరి పదహారు 'ఆంధ్రజ్యోతి 'ఆదివారం అనుభంధం లో ప్రచురించబడింది . ఈకథ ఉత్తమ కథ గా "కథరెండువేల అయిదులో " చోటు చేసుకుంది పైన ఆకాశం ,కింద భూమి ,చుట్టూ నీరు .భూమి బద్దలైనపుడో ,నీరు ఉప్పొంగినపుడో మనిషి కాళ్ళ కింద నేలకరిగిపోతుంది .నమ్మినవాళ్ళు ,నమ్ముకొన్న ప్రపంచం ఆనవాళ్ళు అన్ని క్షణాల్లో చెదిరిపోయినపుడు,విశాలాకాశం కింద ఒంటరిగా నిలబడ్డప్పుడు జీవితానికి అర్ధం ఏవిటనే ప్రశ్న ముందుకొస్తుంది .మనుషుల మద్య నిరంతరం ఉండే సవాలక్ష అంతరాలు అర్ధం లేనివని అవగాహన ముందుకొస్తుంది . ప్రతి వాక్యము రచయిత అక్కడ వీక్షించి లేక ఆ స్థితిని అనుభవించి రాసారా అన్న ప్రశ్న మన మస్తిష్కం లో రేగుతుంది . కథ చదివి పొగిలి పొగిలి ఎడ్వటమే కాక మా ఇంటిల్లిపాది చదివించి ఎడ్పించాను. రచయితని ప్రత్యక్షంగా ఒక సమావేశం లో కలిసినపుడు నేను అడిగిన ప్రశ్న మీ సన్నిహితులకథ రాసారా అని .ఈ రోజు ఈ కథను గూర్చి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడానికి కారణం కల్పన గారు వారి బ్లాగ్ లో ఈ కథ గురించి ప్రస్తావించారు .నేను మరచిపోలేని మరువరాని కథ ఇది ,ఎవరైనా చదవని వారుంటే చూస్తారనే ఉద్దేశముతో పరిచయం చేస్తున్నాను .రచయిత శ్రీ చోరగుడి జాన్సన్ గారు .వీరు సమాచార పౌర సంభందాల శాఖలో డిప్యుటీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు .వీరు కథలు వ్యాసాలూ సమీక్షలు తరుచు రాస్తుంటారు .ఈ కథ సంకలనం అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో దొరకవచ్చును .
j

16, డిసెంబర్ 2009, బుధవారం

కళామాత ముద్దుబిడ్డలు

ఇప్పటివరకు సమైక్య ఉద్యమానికి కాని తెలంగాణా ఉద్యమానికికాని యువతే స్పూర్తిదాయకంగా నిలబడి తమ చదువులు ప్రాణాలు సైతం లెక్కచేయక కదం తొక్కుతున్నారు,వీరంతా రాజకీయ నాయకులకి భలంగా వున్నరనడం లో ఎటువంటి సందేహం లేదు .అన్ని వర్గాలు ,స్త్రీలు పురుషులు ,వ్యాపారులు ఉద్యోగులు సైతం ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు .ఉద్యోగులు పెన్ డౌన్ చేసి తమ నిరసన తెలియచేస్తున్నారు .ఇంత జరుగుతున్న ఒక వర్గం మాత్రం స్పందించడం లేదు .ఎన్నికలప్పుడు ,విపత్కర పరిస్తితులప్పుడు హంగామా చేసే వీరు ఏమైపోయారు ...వారిని ఎవరైనా ఆపుతున్నారా? వీరికున్న మాస్స్ ఫాల్లయింగ్ వేరేవారికి ఉండదే ?వారికి ఏమి వద్దా ? ముఖ్యంగా కోస్తాజిల్లాల నుండి వెళ్ళిన ఈ కళామాత ముద్దు బిడ్డలు ఏమయ్యారో ?గళం ఎత్తి గానం చేస్తున్నా వినబడటం లేదే ?

14, డిసెంబర్ 2009, సోమవారం

ఇది మా సత్తా

నిద్రపోతున్న సింహాలను నిద్రలేపారు .....బ్రేవో బ్రదేర్స్!
సమైక్య గీతం ఆలపించుదాం అలుపెరుగని ఉత్సాహంతో

10, డిసెంబర్ 2009, గురువారం

"మేము ఎవ్వరికీ వద్దంటా"

అటేమో తెలంగాణాహైదరాబాద్ తో సహా అధిష్టానం ఇచ్చేస్తుంటే 'రాయలసీమోళ్ళు'నెల్లూరు ప్రకాశం కలిపి ప్రత్యేకం కావాలట ,మరిటేమోఉత్తరాంద్ర వాళ్లకు ఉభయగోదావరి జిల్లాలతో ప్రత్యేకం రాష్ట్రం కావాలట ,మరి మిగిలిపోయింది కృష్ణా గుంటూర్ వాళ్ళే .మేము ఎవరికి అక్కర్లేదంట-:)ఎట్టగబ్బ!

6, డిసెంబర్ 2009, ఆదివారం

కొత్తపాళీ పుస్తకావిష్కరణ "రంగుటద్దాల కిటికీ " ఎలా జరిగిందంటే .....

బ్లాగ్ లో కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ ఆహ్వానం చూసి వెళ్లాలని ముచ్చటపడ్డాను,అనుకున్నాను అంటే కచ్చితంగా అయ్యి తీరాల్సిందే .నా మిత్రుల్ని అడిగాను వస్తారేమోనని కాని తనకి వీలుపడలేదు .సరే ఒక్కదాన్నే వెళ్ళటమా అని ఆలోచించే లోపు మా పాప ,చెల్లి పాప నాతో దగ్గరలో వున్నా లేపాక్షి ఎక్సిబిషన్ చూస్తానంటూ నా వెనుక పిల్లి పిల్లల్లా వచ్చారు.మొత్తానికి వెదుక్కుంటూ స్వాతంత్ర సమరయోధుల భవనం పట్టుకున్నాం కచ్చితంగా ఐదు గంటల పది నిమిషాలకి అక్కడ చేరాను అక్కడే నాకో మిత్రురాలు కలిసారు పైన సభా కార్యక్రమాలు మొదలు కాలేదని చెప్పారు ,క్రింద సమరయోధులు శ్రీ వామనరావు,పట్టాభి పిచ్చాపాటి కబుర్లలో వున్నారు ,వాళ్ళ కబుర్లు వింటూ మేము కాసేపు గడిపాక కార్యక్రమం మొదలవ్వబోతుంది అని కబురోచ్చాక పైకి వెళ్ళగానే మెట్ల మీదే గుమ్మా సాంబ శివరావు గారు ,ఆచార్య సిమ్మన్న గారు ,పూర్ణచంద్ గారు ఇంకొంత మంది రచయితలూ కనబడిపలకరింపులు నవ్వులు పువ్వులు తో కొంతసేపు కబుర్లతో గడిపాము , కొత్తపాళీ గారు బిజీగా పుస్తకాలు సర్దుకుంటున్నారు ఆయనను నెట్ లో చూడటం వలన గుర్తుపట్టాను.మొత్తానికి అనుకున్న సమయంకంటే ఒకింత ఆలస్యంగా ప్రారంభం అయ్యింది .
మొదట పుస్తకావిష్కరణ జరిపాక అతిధులు పుస్తకం గురించి పరిచయం చేసారు ,వంశి కృష్ణ గారు చాలా వివరంగా క్లుప్తంగా చాల చక్కగా చెప్పారు ,సత్యవతిగారు చేసిన పరిచయం ఆకట్టుకోలేదు .స్పెషల్ గ్రేడ్ డిప్యుటీకలెక్టర్ ముఖ్య అతిధిగా వచ్చిన చెప్పిన రెండు ముక్కలు వినదగినట్లే వున్నాయి గంట పైన సాగిన ఈ కార్యక్రమానికి చాల మంది రచయితలూ పత్రికాధిపతులు వచ్చారు ,సాధారణంగా ఇటువంటి సమావేశాలకు తక్కువమంది వస్తుంటారు ,అదే సమయంలో తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఘంటసాల విగ్రహావిష్కరణ వున్నా ఇక్కడ చూసుకుని అటు వెళ్ళిన వారు వున్నారు..సభ నిండుగానే వుందని చెప్పొచ్చు .
చివరిగా కొత్తపాళిగారు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసారు .ఒకరు చెన్నై నుండి వచ్చిన భైరవబట్ల కామేశ్వర రావు గారు,ఇంకొకరుఎస్ .అర్ర్ .రావు గారు,విజయవాడ...అంత దూరం నుండి వచ్చిన కామేశ్వరరావు గార్ని చూస్తె ముచ్చట అన్పించింది .
కొత్తపాళిగారు తన సంతకం తో కూడిన పుస్తకం విచ్చేసిన అతిదులందరికి బహుకరించారు ,పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ వందన సమర్పణ చేసారు,తరువాత ఇష్టాగోష్టి అన్నారు కాని నాకూడా పిల్లిపిల్లలు క్రింద ఎదురుచూస్తూ ఫోన్స్ మీద ఫోన్ చేయడం వలన నేను చివరివరకు ఉండలేకపోయాను...కొత్తపాళీ గారి దగ్గరికి వెళ్లి పుస్తకం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పి నాఅసలు పేరు తో పరిచయం చేసుకున్నాను.అన్నట్లు ఎక్కడో మూల నవ్వులాట శ్రీకాంత్ గార్ని చూసాను.....ఇంతకి కొత్తపాళీ గారికి నేనెవరో చెప్పలేదు .-:)

4, డిసెంబర్ 2009, శుక్రవారం

వన్నె తగ్గిన"వంశి" కథలు

'పసలపూడి కథలు'నాకు చాల ఇష్టం .చాలావరకు వంశి కథలు మిస్ కాను .చదువుతున్నంతసేపు అక్కడ విహరింప చేసేట్లుంటాయి అతని కథలు .వంశి కథలు యెంతఇష్టం అంటే రావులపాలెం మీదనుండి కాకినాడ వెళ్తుంటే 'పసలపూడి 'దగ్గర కార్ ఆపేసి వంశి రాసినవన్నీ తలుచుకుంటూ ...ఈ వంతెన మీద కాలక్షేపం చేసుంటారు ,ఇక్కడ హోటల్లో పుల్లట్లు తిని ఉంటాడు అని సరదాగా ,ఒకింత అభిమానం తో తలుచుకునే దాన్ని..
ఇటీవల వంశి కి ఏమైందో అర్ధం కావడం లేదు తన రాతల్లో చాల మార్పు వచ్చింది ..స్వాతిలో తన కథలు 'మాదిగువ గోదావరి కథలు ' పేరిట వస్తున్నాయి ..చాలవరకి నాణ్యత లోపించి ఉంటున్నాయి.ఈరోజు స్వాతి లో తను రాసిన కథ చదివితే నిజంగా వంశి రాసిందేనా అన్న సందేహం వచ్చింది.తన భాష ప్రయోగం ప్చ్...పోయిన వారం నా మిత్రునితో ఇదే విషయం చర్చకి వచ్చినపుడు తను కూడా విచారం వ్యక్తం చేసాడు ..దిగువ గోదావరి కథలు చదవడమే మానేసానని చెప్పాడు ...'ఇప్పుడే వస్తానందిశకుంతల'రచయితా స్వానుభవం , ఇదే ఒకప్పుడైతే చాల చక్కగా అల్లి మనల్ని అక్కడికి తీసుకెళ్ళి పోయేవారు ..కాని ఇప్పుడు ?బహుశ మనస్సు పెట్టి రాయడం లేదో లేక తన పేరుతో వేరెవరైనా రాస్తున్నారా అన్న సందేహం పొడసూపక మానదు ..ఏమైనా వంశి ఆలోచించాల్సిన విషయమే .

26, నవంబర్ 2009, గురువారం

"బంధం "..... ...........

ఇల్లంతా నిశ్శబ్దం.....
ప్రతి రోజు పరిచితమైందే
కాని ఈ రోజేంటి ఇంత క్రొత్తగా వుంది !
మనస్సంత కలతే .....
గుబులు గుబులుగా దిగులు దిగులుగా
నిద్ర కళ్ళతోనే గుర్తొచ్చింది నువ్వేళ్ళతావని
బరువయ్యిన మనస్సుతో నా అడుగులు భారంగా పడ్డాయి
ఇదివరకింత కలత పడలేదే మరెందుకు నాకు చింత !
ఎన్నెని సార్లడిగానోనీవు వెళ్ళాల్సిన రైలు గురించి
నా వంక దీర్ఘంగా చూస్తున్న నీ చూపు నన్ను దాటిపోలేదు
సమయం మించిపోతున్న నీ అడుగులు వడిగాపడక
నింపాదిగా వెనక్కి వెనక్కి నన్ను చూస్తూ వెళ్తోన్న ...
నీ కళ్ళ లోని దిగులు నన్ను మేఘమల్లె ఆవరించి
నే చూస్తున్న కారుఅద్దాల్లో నీ రూపు మసకబారింది
నాకర్ధం అయ్యింది ఉదృతంగా ప్రవహించే జలపాతం సహితం
తన సుదూర ప్రయాణంలో ఎక్కడోఅక్కడ నిశ్చలంగా ప్రవహిస్తుందని
ఈ "బంధం "అంతేనేమో ..... ...........

17, నవంబర్ 2009, మంగళవారం

పుట్టినరోజు జేజేలు

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేట ఇలాగే పండుగ జరగాలి
"పుట్టిన రోజు శుభాకాంక్షల తో"
-అమ్మ
(పాపాయి పుట్టిన రోజు మా పెళ్లి రోజు ఒకటే కావడం యాదృచ్చికం..అందుకే అరుదైన రోజు మా ఇంట :) )

12, నవంబర్ 2009, గురువారం

జేజే లు

'పూసిందిపూసిందిపున్నాగ 'అంటూ నా మొబైల్ నుండి శ్రావ్యంగా ... ఇంత ప్రొద్దున్నే ఎవరా అని బెడ్ దిగకుండానేచెయ్యి సాచి మొబైల్ అందుకున్నాను ,టైం చూస్తె ఆరు దాటింది తలుపులన్నీ వేసినవి వేసినట్లే వున్నాయి చడిచప్పుడు లేకుండా అయ్యగారు వాకింగ్ కి వెళ్లిపోయారు .ఎప్పుడైనా నేను అలా నిద్రపోతుంటే నన్ను లేపడానికి మనసొప్పక అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడు . ఈ రోజు ఇంపార్టెంట్ రోజు అని గుర్తుకొచ్చింది .అల్లం ,ఇలాచి వేసి స్ట్రాంగ్ గా టీచేసి సిట్-అవుట్ లో వున్నా గూటిలో (కేనేఉయ్యాల )లో కూర్చుని తాగబోతుండగా వాకింగ్ కి వెళ్ళిన వారు లోపలి అడుగు పెట్టారు ,లోపలి పోయి ఇంకో కప్ నిండుగా వేడి వేడి టీ తెచ్చి తనకి ఇవ్వబోతు కుడి చేయి చాపమని అడిగాను తను ఆశ్చర్యంగా ఒక లుక్ నావైపు ఇచ్చి చేయి చాపాడు .మనం ఆ చేతిలో చేయి వేసి 'హ్యాపీ బర్త్ డే 'అని అభినందించి, ఇప్పుడు తాగు అని వేడి కప్ అదే చేతిలో పెట్టాను .ఎన్నిసార్లు చేస్తారండి నా పుట్టిన రోజు అన్న మావారి మాటకీ సమాధానం నా చిరునవ్వు ఒకటి విసిరి ఖాళి కప్ తో వంటింటిలోకి వెళ్ళిపోయాను మిక్సిలో గారెలకి పప్పు రుబ్బడానికి. మా అత్తగారి ప్రకారం నాగుల చవితి రోజు వుదయాన్నే అందరుకు పుట్టకి బయలుదేరుతున్న సమయంలో వాళ్ళింట్లో నాగ జాతికి చెందిన స్నేక్ పుట్టిందట :) ఆ రోజు నవంబర్ పన్నెండు .మా మామగారు ఆ నాగు కి పుట్టినరోజు ఆ తారీకు ఖాయం చేసారు ...నాలుగు ఏళ్ళ క్రితం వరకు కూడా ప్రతి నాగుల చవితికి మా ';చిన్నోడు'పుట్టినరోజు అని తలుచుకునేది ...ఇప్పుడు తలుచుకోవడానికి ఆవిడ లేరు ,నేను మా అమ్మాయి గుర్తుచేస్తాము .అసలు పుట్టిన రోజు మాత్రం ఈరోజు మాత్రమె ...ఇంకొక అయిదురోజుల్లో చాల అరుదుగా వచ్చేరోజు మా ఇంట్లో వస్తుంది .:):) Happy birth day Nag :):)

8, నవంబర్ 2009, ఆదివారం

ఆ నాటి హృదయాల ఆనందగీతం

"హాయ్ చిన్ని"నా వీపు చురుక్కుమంది. వెనక్కి తిరిగి చుసిన నా కళ్ళకి రంగు రంగుల చీరల్లో ఒకరినిమించి ఒకరు అందాలు ఒలకబోస్తూ'అతివలు'ఒక్కసారే అంతమందిని పోల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవ్వుతున్న నన్ను రక్షిస్తూ మా విజ్జి క్లూ లు ఇస్తుంటే చెప్పనీకుండా గోల చేస్తున్న ఆ బృందాన్ని చూస్తూ ఒక్కొక్కరిలో ఆ నాటి చిన్న పిల్లల్ని వెదుక్కుంటూ పోల్చి చెబుతుంటే కేకలు పెడ్తున్న మమ్మల్ని చూసి చుట్టుప్రక్కల వారుమండపం లోని వధువరులను వదిలి మా కేరింతలు ,అల్లరి నే చూసి ఆనందించరనే చెప్పొచ్చు. ఒక్కొక్కరు చేసిన అల్లర్లు ఏకరువు పెట్టుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూఆడుతూ పాడుతూ విస్మయంగా ఒకరినొకరు చూసుకొంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరు విచారించుకుంటూ విందు బోజనాలు ఆరగిస్తూ చిన్నపిల్లలం అయిపోయాం.
ఎన్నోఏళ్ళ తరువాత నవంబర్ ఐదవ తారీకుసాయంత్రం సికింద్రాబాదు లోని ఒక గార్డెన్ లో మా మిత్రబృందమంతాకలిసాము .ప్రతి యాడాది నా స్కూల్ మిత్రులమంతా ఏదొక సందర్భం పురస్కరించుకుని ఎవరోకరి ఊర్లో,ఇంట్లోనో కలసి ఒకటిరెండురోజులు గడుపుతుంటాము.మేమంతా ఏలూరు సెయింట్ తెరిసాలో కలసి చదివాము అందరం ఫస్ట్ క్లాసు బోర్దిన్గ్లోను వుండేవాళ్ళం.కేవలం హాస్టల్లో వున్నా మా క్లాసు పద్నాలుగుమంది బాచ్ వరకే ఈ విదంగా కలుసుకుని మంచి చెడుకి ఒకరికొకరు తోడ్పాటుగా వుంటున్నాము .ఈసారి మాత్రం వినూత్నంగా హాస్టల్లో ఐదు నుండి పదివరకు చదివిన మిత్రులంతా కలవడానికి మా మిత్రురాలు ఏర్పాటు చేసింది.తన ఇంట జరిపే వివాహ వేదికను అందరు కలవడానికి వేదిక చేసింది.నాలుగైదు తారికులు మా హాస్టల్ వారందరికీ గెట్ టుగదర్ ఏర్పాటు చేసింది నాలుగు వెళ్ళలేక ఐదున వెళ్ళిన మా అక్క చేల్లెల్లని అంత సులభంగా పోల్చుకోలేకపోయారు.మేమును అందర్నీ గుర్తుపట్టడానికి కష్టపడాల్సి వచ్చింది .మా సేనియర్ అక్కలు ,జునియర్ చెల్లెళ్ళు కలబోసి చూస్తుంటే తెలియని ఉద్విగ్నత మా జునియర్ అయిన ఇద్దరి అమ్మాయిల అకాల మరణ వార్త కూడా కలచివేసింది .స్వచ్చమైన భాల్యం మా అందరిలోతాండవిచ్చింది.హిపోక్రసి వదిలేసిన మా పిలుపులు ఆ ప్రేమలు మరపురాని అనుభవం అని చెప్పొచ్చు.మా కెరీర్ని తీర్చిదిద్దిన మా స్కూల్ సెయింట్ తెరిసాని ఆ క్షణాన'తల్లిని'తలుచుకున్నట్లు తలిచాము .అందరం మరొకసారి కలవాలని తీర్మానం చేసుకున్నాం . ప్రముఖ రాజకీయనాయకులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు,సినిమారంగానికి చెందిన ప్రముఖులు,తారలు విచ్చేసిన ఈ వివాహ వేడుకలో మా చిన్ననాటి మిత్రుల కలయిక ఇంకెంతోశోభనిచ్చింది. .

1, నవంబర్ 2009, ఆదివారం

నాలోనేను

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటునీవే మరుగైనా కావే ...
ఎదుట నీవే ఎదలోన నీవే .....

మరుపే తెలియని నా హృదయం
తెలిసివలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం........
గాయన్నయిన మాననీవు
హృదయన్నయిన వీడిపోవు
కాలం నాకు సాయం రాదూ
మరణం నన్ను చేరనీదు .......
పిచ్చి వాణ్ని కానీదు .....

కలలకుభయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డానూ ...........
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకలేగా
స్వప్నం సత్యం ఐతే వింత
సత్యం స్వప్నంయ్యేదుంద .........
ప్రేమకింత బలముందా ....

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవే
మరుగైన కావే.....

29, అక్టోబర్ 2009, గురువారం

నేను -4

కళ్ళు తెరిచి చూసేసరికి నేనొక విశాలమైన ప్రాంగణం లో వున్నాను ఇక్కడ పక్షుల కిలకిలలు సెలయేటి గలగలలు లేవు .అంత రణగొణ ధ్వనులు,దుమ్ము ,రకరకలయిన మనిష్యులు వస్తుపోతున్నారు నన్ను తాకి ''నిఖార్సైన జాతి"అంటున్నారు .వారి మాటలు అర్ధం కాలేదు కాని ఒక్కటి మాత్రం తెలిసింది ,మేము పుట్టిపెరిగిన నేలమంచిదని నీరు మంచిదని వాటితో జాయలు వస్తాయని దాని వలెనే నా అందం ఇనుమడించిందని....
మా కోసం పోటీపడి పెద్దమొత్తం చెల్లించి సాయంత్రం వరకైనా అక్కడ వుండనీయలేదు.
అక్కడినుండి మరొక ప్రదేశానికి చేర్చారు ...నాకు ఒకటే ఆశ్చర్యం ,ఇంత చిన్న మానవుడు మమ్మల్ని ఎంత అవలీలగా తరలిస్తున్నాడో అని.బక్కచిక్కిన ఒక వ్యక్తి తన చేతిలో సరంజామా తో వచ్చి మమ్మల్ని చూసి అతని కళ్ళు మెరవగా ఆప్యాయంగా స్పృశించాడు ,అతని వెనుక వచ్చిన వారికి ఏదో పురమాయించాడు.నన్ను ప్రక్కకి తీసుకువచ్చి వారివద్దనున్న రంపాలతో అడ్డదిడ్డంగా నన్ను ముక్కలు ముక్కలు చేసారు,అదృష్టం నా గుండెను కోయలేదు...కోసినా భరించే శక్తి నాకొచ్చింది .ఆ నాటినుండి ఆ ముగ్గురు మమ్మొధలక దినారాత్రులు మాతోనే గడిపారు ,చెప్పొద్దు !నాకు ఆసక్తిగానే వుండేది వారేం చేస్తారా చూడాలనే .నా భాదని నా వారిని మరచిపోయి ఈ కొత్త ప్రపంచంలో పడిపోయాను ఆసక్తిగా చూస్తూ ..
మమ్మల్ని చూస్తే మాకే ఆశ్చర్యంగా వుండేది వారి చేతుల్లో నునుపుదనం సంతరించుకున్నాం ముట్టుకుంటేనే జారిపోయేట్టుతయారయ్యాం ,మాకు రకరకాలైన లేపనాలు అద్దేవారు నాజుకుదనం కోసం మిషనుల్లో పెట్టేవారు ..ఆ బక్కచిక్కిన వ్యక్తికి మేము ప్రాణం అని అర్ధం అయ్యింది ,ఎంత అందంగా చేసిన తృప్తి పడక ఇంకా మాకు మెరుగులు దిద్దేవాడు,ఎండ వానకి కూడా మేము తట్టుకుని నిలబడాలనే కోరిక వ్యక్తం చేసేవాడు

ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగా పూసిన పూలను కాయలను కర్కశంగా చిదిమి మరల పునః సృష్టిగావిస్తున్నాడు.నా బాధను మరపించుటకు నా పూలను నన్నే నమ్మి ఆశ్రయించిన పిట్టలను నాలోనే చెక్కాడు చూసి మరచిపోమ్మని
ఒక మద్యాహ్నం ఆదమరచి నిద్రలో వుండగా నా చెక్కిలిమీద వెచ్చని కన్నీటి బొట్లు నన్ను మలచిన ఆ శిల్పి కనులనుండి ,యేమి జరుగుతుందో చూసేలోపు నేను అక్కడినుండి తరలించబడ్డాను ,మనస్సు భాధతో ఒక్క క్షణం కలవరపడింది ,అయిన ఇలాటి అనుభందాలకి అతీతంగా తయారవ్వాలన్న నా సంకల్పాన్ని నిర్వీర్యం చేయదలుచుకోలేదు .
నేను క్రొత్తగా వచ్చిన ప్రదేశం చాల బాగుంది ..అందరు నాలానే మలిచిన వారేఅంతా నా జాతే ..ఒక్కొక్కరి అందం చూడటానికి కళ్ళు చాలడం లేదు ...యేమి హొయలు ! యేమి నిగారింపు లో ! ముసిముసి నవ్వులతో పలకరింపులు ,కుశలం ప్రశ్నలు ...అబ్బ నేను వెళ్లి గంటయిన కాలేదు ఎక్కడినుండో ముగ్గురబ్బాయిలు వచ్చి నన్ను నాతో మరో ఇద్దరినీ ఎంచుకుని మమ్మల్ని బయటికి తీసుకు వచ్చేశారు ,మమ్మల్ని చాల దూరం తీసుకెళ్లాలని వారిలో వారు అనుకుంటుంటే తెలిసింది ..మమ్మల్ని అపురూపంగా కట్టి చీకటి బండిలో పెట్టారు గాలి వెల్తురు లేక తెగ ఇబ్బంది పడ్డాను .నేను గమ్యం చేరేసరికి నాకోసం ఎదురుచూస్తూ అక్కడ చూసిన అందమయిన అబ్బాయి .నన్ను తనతో తీసికెళ్ళాడు ...ఓహో రేపటినుండి ఇతని తో వుంటాను కాబోలు అనుకునేలోపు ఒక ఇంటికి చేర్చాడు ..ఇంతకి నన్ను చేర్చింది చిన్ని అనే వాళ్ళింటికి ..స్నేహితులంతా కలసి మమ్మల్ని తెచ్చుకున్నారట ,చిన్ని రాలేదని చిన్ని తరుపున ఈ అబ్బాయి నన్ను ఎంపిక చేసాడు ...చిన్ని కి నేను చాల నచ్చానని అతని చెప్తుంటే విన్నాను

హమ్మయ్య ! ఇక్కడ రణగొణ ధ్వనులు లేవు ,ప్రశాంతం గా వుంది .అసలు వాకిట్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యం ..ఆ వీధంతా నా వాళ్ళే ,పచ్చగా కళకళ లాడుతూ ..నగరాల్లో ఇలాటి వీధి నేను చూడలేదింత వరకు ..మా అడవిలోకి వచ్చానా అని క్షణం భ్రమపడ్డాను .ఆ చెట్ల మీద ఆడుకుంటున్న గోరింకలను చుస్తే మనస్సోక క్షణం కలుక్కుమంది.వరండాలో పరిసరాలు చూస్తూ నిట్టురుస్తూ నుంచున్న నన్ను నెమ్మదిగా ఎవరో వచ్చి ఇంట్లోకి చేర్చారు నిశబ్దం గా వున్నా ఆ ఇంట్లో మనుష్యులు వున్నారన్నట్లు తెలిసేది చిన్ని కాలి మువ్వల చప్పుళ్ళే.చిన్ని నన్ను అపురూపంగా చూస్తుంది .నా కోసం చిన్ని వాళ్ళ పాప గది ఇచ్చింది ,నేనోస్తానని నా ముందు వున్నవారిని వాళ్ళమ్మ వాళ్ళింట్లో బోల్డన్ని గదులున్నాయని అక్కడికి పంపేసింది .పెద్ద పెద్ద కితికిలకి వున్నా తెరలు తీస్తే మావాళ్ళంతనా కళ్ళ ముందు కనబడతారు .నా మీద మెత్తటి పరుపు వేసి తెల్ల పూల దుప్పటి వేసింది ...నిజం చెప్పోద్చు ..నన్ను చూస్తె నాకే ముద్దోచ్చాను ...చిన్ని ఇంట్లో వున్నప్పుడు నాతోనే ముచ్చట్లు ....ఈ రోజు ఆదమరచి నా మీదే వాలి నిద్రపోయింది ..చిన్ని ని చూస్తె నా గూటిలోని గువ్వపిల్లలు గుర్తొచ్చారు .....నా ఒడిలో నిశ్చింతగా ఆదమరచి నిదుర పోయిన తీరు .......బ్రతికిన మరణించినమేము సమస్త ప్రకృతిలోని జంతు జీవలకి వుపయోగ పడుతూనే వుంటాం .. ..మా సహజ లక్షణం.

నేను .......? చిన్ని ముచ్చటపడి తెచ్చుకున్న అందమయిన మంచాన్ని :):)

28, అక్టోబర్ 2009, బుధవారం

నేను -౩

యధాప్రకారం గువ్వలన్ని పిల్లల్ని నా మీద వదిలి గూడు విడిచి ఆహరాన్వేషణ కి వెళ్ళాయి .పిల్లలని గోలచేస్తూ ఆడుకుంటున్నాయి .నేను నా వాళ్ళు కబుర్లలో మునిగిపోయము .ఒక్కసారిగా మా అడివంత కలకలం రేగింది .స్వేచ్చగా తిరుగాడే జంతుజాలం కకావికలమై నలు దిక్కులు పరుగులు తీసాయి .గువ్వపిల్లలన్ని భీతి తో తల్లడిల్లి ముడుచుకుని గూటిలో దూరాయి ...పరికించి చుసిన వింత జంతువులు ...వారే మనుష్యులు .

నా దగ్గరకి వచ్చి ఆపాదమస్తకం పరికించి చూసారు,నా తనువునెల్ల తడిమి తడిమి చూసారు .అందరిలో భలిష్టమైన వ్యక్తి ముందుకు వచ్చి నా పై చేయి వేసాడు ...ఒక్కసారే ఉలిక్కిపడ్డాను,భయంతో తడబడిపోయాను,నా ఆకులన్ని జలజలమని రాలిపడ్డాయి,ఆ వ్యక్తి సంతృప్తిగా ప్రక్కని వారితో ఏదో చెప్పాడు .నాకు అయోమయంగానూ,ఆనందం గాను వుండి నా సన్నిహితులవైపు గర్వంగా చూసాను .వారు నావైపు చుసిన జాలి చూపులు అర్ధం కాలేదు .
నా ఆలోచనల్లా ఒక్కటే ఇతగాడు నన్ను తనతో తీసుకు వెళ్ళతారేమో వెళ్ళితే నగర సందర్శనం అవ్వుతుంది కదా అని.....ఆలోచనలో వుండగానే పడింది నా మీద దెబ్బ .సొమ్మసిల్లి పోయాను.మెలుకువ వచ్చి చూడగా నా కాళ్ళ వరకు నరికేసాడు ఆ మానవుడు .

భాదని ఓర్చుకుంటూ కన్నీరు కారుస్తున్న నన్ను చూసి నా సన్నిహితులంతా నిస్సహాయంగా విలపించడం మరింత కుదిపేసింది.నన్నే నమ్ముకుని గూటిని ,గూటిలోని పిల్లల్ని వదిలివెళ్ళిన గువ్వల కలకలం ,పిల్లల వెక్కి వెక్కి ఏడ్పులు ,నేలను తాకి విగత జీవులైన పసి గుడ్లను చూసి శోకిస్తున్న ఆ పిచ్చి తల్లులను చూసి ......అయ్యో !నా ప్రాణమైన పోదేమీ అని రోదించాను .నా గుండెతో పాటు వాటి గూడులన్ని చెదిరిపోయాయి .
ఆ నలుగురు నన్ను నిలువునా క్రింద పడవేసి పాశవికంగా తాటి మొకులతో కట్టి నా వారి ముందే నన్ను భలంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు ,కడసారిగా నావాళ్ళ కి కంట నీరుబుకుతుండగా కళ్ళతోనే వీడ్కోలు పలికాను .నన్ను ఈడ్చుకేల్లుతున్న వైనం చూసి అందరు ఒక్కసారే గొల్లుమన్నారు .నన్ను వదలక నా బిడ్డలైన పులుగులన్ని వారిని ముక్కుతో పొడుస్తూ భీభత్సం సృష్టించాయి .నా మనస్సు దిటవు పరచుకొని ,వారిని వారించి 'నా వారిలో నన్ను చూసుకొమ్మని ,నలుగురు కూర్చుని ముచ్చటించే వేళ నన్ను తలుచుకోమని హితవు పలికాను .,నా శరీరాన్ని కష్టపడి ఒక భారి వాహనం లో చేర్చారు ..కొంత దూరం వెంబడించిన నా బిడ్డలు మరి రాలేక శోకం తో వేనుతిరిగాయి .

అప్పటికే వాహనం లో నాలానే ఎందరో !అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి .మా అందర్ని కలిపి కట్టేశారు,ఎక్కడికి జారి పారిపోకుండా .దుఖాన్ని నిగ్రహించుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చీకటిలో చుక్కలు చూస్తూ నిద్రలోకి ఒరిగిపోయాను .

25, అక్టోబర్ 2009, ఆదివారం

నేను -2

నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ లేత ప్రాయం వీడి పరిపూర్ణత్వం ఏర్పడింది నా తనువునకి .నా మేను విశాలమై నా ఆలోచనలు విస్తారం అయ్యాయి .అమాయకత్వం వదిలి జీవితం చూడటం నేర్చుకున్నాను ...నా చుట్టూ నా ఈడువారే భిడియం వీడి నా చుట్టూ వున్నవారితో నెయ్యమెరిపాను.మా మద్య ఎన్నో ఊసులు ,పగలంతా మా కబుర్లకు అంతే వుండేది కాదు రాత్రల్లాగువ్వల వద్ద నుండి మేము విన్నవి కన్నవి పంచుకునేవాళ్ళం .
రాత్రయ్యేసరికి నా తనువంత సందడే ..చిన్న కీటకాలు మొదలు రంగురంగుల పిట్టలకు ఆవాలము నేనే ..వారిని ముద్దుగా హత్తుకున్నానేగాని కొంచమైన విసుగుచెంధలేదు .ఒక గడసరి గువ్వ నన్ను తొలచి నా హృదయం లోనే గూడు కట్టుకుంది నన్నడగకుండానే....ఎక్కడినుండి తెచ్చుకుందోగానిబుల్లి గువ్వని ముద్దుగా కాపురం నా లోగిలిలోనే పగలల్లా ఆ గువ్వల జంట పిల్లలికి కాపలాగా లాలిస్తూ ....వాటి సుఖ సంతోషాల్లో ,వ్యధల్లో పాలు పంచుకుంటూ రెక్కలొచ్చి రివ్వునెగిరిపోయే పిల్లల్ని చూసి దిగులు పడుతూ కొత్తగానన్ను చేరే గువ్వల జంటలకి స్వాగతం చెబుతూ ...ఇలా ఎన్నో జంటల జీవితాలకి సాక్షి భూతం అయ్యాను

నా వయస్సు తోపాటే ప్రపంచ జ్ఞానం పెరిగింది .కాకమ్మ చిలకమ్మలు ఎప్పుడు మనుష్యుల గురించే మాట్లాడుకునేవాళ్ళు ,వాళ్ళు ఎలా వుంటారో మాకు చూడలన్పించేది .వారి మాటల బట్టి నాగరికత మార్పు వస్తుందని తెలుస్తుంది .రాను రాను అవి పట్టణాలకి వెళ్ళే పరిస్థితి తగ్గిపోతుందట,ఎంతో ఆందోళన పడుతూ అవి చెప్పుకునే కబుర్లు వింటుంటే మా మనుగడకి ఏదో ముప్పు వుంటుందని తోచేది .అసలు అవి చెప్పుకునే కబుర్ల కోసం సాయంత్రం నుండే ఎదురు చూపులు ...ఎప్పుడైనా రావలసిన సమయానికి అవి రాకపోతే ఎంతో ఆందోళనకి గురయ్యేదాన్ని .....గువ్వల ఊసులు వింటే మాకు ఆ నగరాలను చూసిరావాలనే కోరిక గా వుండేది
ఎన్నో వసంతాలు ,శిశిరాలు చూసిన ఈ నా జీవితం నిస్పృహగా మారుతున్న తరుణం లో ఒక అధ్బుతం జరిగిందీ ....

24, అక్టోబర్ 2009, శనివారం

నేను

కళ్ళు విప్పిచుసే సరికి చుట్టూ అంత పచ్చగా నాలానే ....ఎండవానలో ఊహవచ్చేవరకు ఎదిగాను ....అసలు ఎందుకు పెరుగుతున్ననో ,ఎక్కడినుంచి వచ్చానో నాకే తెలిదు ..చినుకు రాలినపుడు పరవశించుతూ ,ఉరుములు ఒరుమినపుడు ఉలిక్కిపడుతూ .. మెరుపులు చూసి ఆశ్చర్యపోతూ ....మంచుకి వణుకుతూ ఇదంతా ఏవిటని .అడగాలంటే చెప్పేవాళ్ళు లేరు అన్నిటిని చూస్తూ ...రాత్రివేళ నిద్ర రానపుడు నక్షత్రాలను లెక్కపెడుతూ ...
ఎప్పుడు పూయడం మొదలు పెట్టానో ...నాలో వయసేప్పుడు వికసించిందో నాకే తెలీదు ..వసంతం లో కోయల కూసినపుడు తొలి వలపు గుండెల్లో వికసించడం మాత్రం గుర్తుంది .ప్రకృతి నాలో నింపిన సొగసునంత నీలాకాశం కింద పచ్చగా పరిచాను .నా పూల సొగసుకి మురిసిన తుమ్మెదల ఝుంకారాలు,తీనటీగల హోరు ,సీతాకోక చిలుకల సందడి.......నాలో ఏదో చిన్న గర్వం ...నాకోసమేకదాఅని హొయలు ...అసలు ఇంతకి నేనెవర్నో ..?

19, అక్టోబర్ 2009, సోమవారం

కార్తీకసోమవారం

నిన్న రాత్రి నిద్రపోయేముందు రోజు లేచేదానికంటే అరగంట ముందు లేవాలని నిర్ణయించుకోవడం తోపాటు ఎందుకైనా మంచిదని టైం సెట్ట్ చేసి నిద్రలో వున్నా మావార్ని లేపి "అలారం మోతకి నేను లేవకపోయిన నువ్వు లేస్తావు కాబట్టి నన్ను లేపు" అని చెప్పాను .ఎక్కడికి వెళ్తున్నావు అన్న మావారిని విసుక్కుని ,ఎటు వెళ్ళడం కాదు కార్తిక సోమవారం శివాలయం కి వెళ్ళాలి....అన్న నా మాటలు విన్నారో లేదో తెలీదు నిద్రలో వున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతె ఇంత హటాత్తుగా నాలో పెరిగిన ఈ భక్తి శ్రద్దలకికళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు
తను లేపకుండానే అలారం మోతకి మెలకువ వచ్చింది ...చల్లటినీళ్ళు నెత్తిమీద పోసుకుని పూలు పళ్ళు ఆవుపాలు తీసుకుని మా ప్రక్క వీధి లో వున్నా శివాలయం కి వెళ్లాను.అక్కడ చాల ప్రశాంతంగా వుంటుంది అరగంట అభిషేకం పూజ అయ్యాక ,అరగంట ఆ ఆలయ ప్రాంగణం లో వున్నా అరుగుల మీద కూర్చుని ఉసిరిచేట్టుకు పూజలు చేస్తున్న భక్తులను ,వచ్చిపోయేవారిని గమనిస్తూ ఉషోదయాన్ని గడిపేశాను .
గంట తరువాత ఇల్లు చేరిన నన్ను చూసి మావారికి ఒహటే హాచ్చర్యం:) నాకెమైందాఅని .
తనకి మాత్రమె టి చేసి ఇచ్చాను ....తను ప్రశ్న వేయక ముందే చెప్పాను ..ఈ రోజు నేను ఉపవాసం వుండబోతున్నాను అని ...
నువ్వు నువ్వేనా ,....అని ప్రశ్న .
నేను నేనే ....నా జవాబు .
అయితే ఏదో ప్రళయం రాబోతుంది .....తను సాలోచనగా నా వైపు చూస్తూ .
జలప్రళయం వచ్చేసింధిగా ....ఇంకేం వస్తుంది ....నేను .
భూకంపం రావచ్చేమో ....నువ్వేమిటి ,శ్రద్దగా గుడికి వెళ్ళడం అంతటి తో సరిపెట్టుకోక కార్తిక సోమవారం ఉపవాసం ,మీ అమ్మ వెనకపడితెగాని పౌర్ణమికి దీపాలు వెలిగించే నీవు ...హ్మం ...ఏదో అయ్యింది నీకు ......మావారు ఒకింత మురిపెంగా (భక్తి ఎక్కువ )
యెమికాలెధుగాని..మీ పేరున పాప పేరున పూజ చేయించాను మంచిదని .,వంట మీ ఒక్కరికే ...చేయమంటావా ?వద్దా ?......నేను .
టిఫిన్ చేయి చాలు ,బయట తినేస్తాను ....మరి ఆఫీసుకి వెళ్ళవా ?...తను .
ప్చ్ ...వెళ్ళను....రెస్టు తీసుకుంటాను
పోనీ నేను వెళ్ళేప్పుడు మీ అమ్మ వాళ్ళింట్లో డ్రాప్ చేయనా ...తను .
అబ్బ వద్దులే ..నేను వెళ్ళాలంటే వెళ్తానుగా.........నేను. .
నెట్ కూడా చూడవా ?....నవ్వుతు ...తను .
అయ్యో ....అదేకదా మనకి కాలక్షేపం ....
హమ్మో ఒక్కరోజు నా అంతట నేను గుడికి వెళ్ళితే ఎంత ఆనందమో కదా ఈయనకి ....అసలు సంగతి చెపితే ఆయన ఫీలింగ్స్ యెట్లా వుంటాయో ....
గత ఆరునెలల నుండి నేను చాల లేజీ గా తయారయ్యాను .ఉదయం నా షెడ్యులు అస్తవ్యస్తంగా వుంటుంది .బొత్తిగా సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా తయారయ్యాను .పని మీద కూడా శ్రద్ధ తగ్గింది .ఆఫీసు విషయాలు బర్డెన్ గా ఫీల్ అవ్వుతున్నాను ....అలాటి ఆలోచన క్రమమే మార్చుకోవాలని తెగ ప్రయాస పడుతున్నాను .కనీసం ధ్యానం కి ఇరవయ్యి నిమిషాలైనకేటాయించే నేను పూర్తిగా నిర్లక్ష్యం చేసాను ..నన్ను నేను నిర్లక్ష్యం చేసుకుంటున్నాను ...ఇలానే వుంటే ఏమై పోతానో అనే భయం అంతర్లీనంగా ....హెచ్చరిస్తుంది .నిన్నంత బాగా ఆలోచించాను ...సోమవారం నుండి అమలు చేయాలి ...ఎలాను కార్తిక మాసం ...ఒంటికి అలానే మనస్సుకు పట్టిన బద్దకం వదుల్చుకోవాలి .....పూర్వం పు చిన్ని లా మారాలంటే వేకువనే నేనచరించే "భావాతీత ధ్యానమే "మార్గమని నా అంతర్వాణి పదేపదే చెబుతుందీ ...ప్రశాంతమైన వాతావరణం లో పునః ప్రారంభించాను నా ధ్యానం ..
నాకిష్టమైన శీతాకాలపు ఉదయాలు పొన్నాయిచెట్లు రాల్చే పూలను ఏరుకుంటూ మసక చీకట్లలో నడిచే నా నడకను...భాల భానుడి వేలుగురేకల్ని మిస్ కాకూడదనే ధృడమైన సంకల్పం తో నా వెనుకటి జీవితానికి శ్రీకారం చుట్టాను ....ఈ కార్తికసోమవారం ...ఈ రోజు పూర్తిగా నాది ....రాబోయే రోజులకి రచన చేస్తూ ......

16, అక్టోబర్ 2009, శుక్రవారం

''అల ''జడి

హమ్మ !యెంత నంగనాచివమ్మకృష్ణమ్మా
నిన్నటి వురుకు పరుగులేమయ్యయమ్మా ..
చేయాల్సినదంతా చేసేసి మౌనంగా సాగిపోతున్నావే
కలలో కూడా ఊహించని కల్లోలం రేపావే
కంటిమీద కూసంత కునుకు తీయనీక కుదిపెసావే
నీ ఒరవడికి తట్టుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేసావే
ప్రశాంతంగా సాగుతున్న జీవితాన్ని కలతబెట్టావే

నీ ప్రేమావేశ మొహంతో వువ్వేత్తరంగాలతో
నీ సందిట భందీ చేస్తే తట్టుకోగాలరనుకున్నవా
చూడు నీవు చేసిన గాయాలు ఇంకా మాయనేలేదు
చేయవలసినధంత చేసి నన్నేరగానట్టు కదిలి పోతున్నావా
నీవు చేసిన అల్లరి ఓపికగా భరించామే కాని నీపై కినుక వహించలేదే
ఎందుకంటావా ......నువ్వంటే మాకెంతో ఇష్టం అని చెప్పమంటావా ..........




ఒక్కసారి ఆలోచించండీ

దీపావళి అందరికి ఇష్టమైన పండుగే ...చిన్నప్పుడు నాకు చాల చాల ఇష్టం ...పుట్టిన రోజుకోసం ఎదురు చూసినట్లు ఎదురు చూసేదాన్ని ...కాని ఈసారి పండగ చేసుకోవడం అంటే మనస్సు ఒప్పడం లేదు ...చేసుకునేంత మంచి వాతావరణం లేదు .........రాష్ట్రం లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఆనాటి జాడలు పోలేదు అయిన తప్పదు మన పద్ధతి ప్రకారం మనం జరుపుకుంటాం ....
ఒక్కసారి భాణసంచా కొనేప్పుడు ఆలోచించండీ అనవసరంగా తగలబెట్టేవాటిల్లోకొంత వరద ప్రాంత భాధితులకు వెచ్చించండి ...మన ఆనందం కోసం వెచ్చించే రూపాయి ఒకరి ఆకలి అయిన తీరుస్తుందేమో .....ఆలోచించండీ.

14, అక్టోబర్ 2009, బుధవారం

నా "అద్దాల గోల "

ఈ మద్య ఉదయాన్నే పేపర్ చదవాలంటే తెగ ఇబ్బందిగా వుంది ...ఇబ్భంది ఉదయాన్నే లేవటం లో అనుకుంటున్నారా ....అబ్బే ..అదేమీ కాదు అంత చిన్న చిన్న అక్షరాలూ మరీ నలకల్లా కనబడీ పేపర్ కాస్త దూరం పెట్టుకుని చదుతుంటే అంత కష్టపడే బదులు కాస్త ముఖానికి ఆ అద్దాలు తగిలించుకోరాదు అంటూ ఓ ప్రక్క ఈయనగారి వెక్కిరింత ...అసలే కళ్ళద్దాలు అంటే చిరాకు పొద్దున్న పొద్దున్నే ఏమి పెట్టుకుంటాం అందుకే లాంగ్ షాట్ లో చదుతు సరిపెట్టుకుంటున్న కొన్ని తరువాత చదవచ్చులే అని వాయిదా వేసేస్తున్నాను ..అస్సలు మొన్న మొన్నటివరకు గ్లాసెస్ లేకుండా బానే చదివాను రాను రాను తేడా స్పష్టంగా తెలుస్తుంది .కొన్నాళ్ల క్రితం గమనించి టెస్ట్ కి వెళితే ప్రాబ్లం ఏమీలేదు కాని గ్లాసెస్ వాడాలి అన్నారు డాక్టర్ ..అదేంటండీ ప్రాబ్లం ఏవిటంటే .....వయస్సు తల్లీ అన్నారు ...దీన్ని చత్వారం అంటారు ఒక్కోసారి తగ్గిపోతుంది ,చదివేప్పుడు రాసేప్పుడు తప్పనిసరిగా వాడండి ,కళ్ళు స్ట్రైన్ అవ్వవు అన్నారు ...

నేను ఉదయం పేపర్ చూడటం తప్పించి మిగిలిన సమయాల్లో అంటే ఆఫీసు పని లో ,పుస్తకాలు చదివేప్పుడో ,ఇలా సిస్టందగ్గర వున్నప్పుడో తప్పనిసరిగా నా సులోచనలకి పనిపెడుతూనే వున్నాను .
ఒకసారి ఒక జర్నలిస్ట్ పని మీద నా దగ్గరకి వచ్చారు ..మాట్లాడారు తనకి కావలసిన సమాచారం ఇచ్చాను ,ఏవో ఫైల్స్ చూసి చెప్పాల్సి వస్తే గ్లాసెస్ తీసి పెట్టుకుని ఫైల్ చూస్తూ చెబుతుంటే సడెన్గా అతను ...మీరు గ్లాసెస్ పెట్టుకుంటే పెద్దవాళ్ళ లా...వున్నారు అని ముఖం మీద అంత పరిచయం అప్పటికి లేకపోయినా అనేసారు .,అంతే మనము ఉలిక్కిపడ్డాం-:) అసలే మనకి సంతూర్ అని బిరుదాయే.....ఏ కాలేజ్ ?పెళ్లి అయ్యిందా అని అప్పటివరకు అనిపించుకుని :):)...ఇప్పుడేమో వెధవ కళ్ళద్దాల వలన పెద్దరికమా!...నేను తేరుకుని ''పెద్దదాన్నే కదా అలానే కనిపిస్తాను ''...అని వెధవ నవ్వు నవ్వి వురుకున్నాను .
ఇక ఆరోజు ఇంటికి వెళ్ళాకా మా పాపని ,మావారిని అడిగాను ,నేను అద్దాలు పెట్టుకుంటే ఏవైనా తేడా వుందా అని ,వాళ్ళ ప్రాణం తీశాను ...మా పాపమో '' కాస్త అమ్మ లా కనబడుతున్నావు ఇలానే రోజాంత పెట్టుకో ''అన్నది నన్ను ఎడ్పించడానికి..అమ్మ ని ,చెల్లిని అందర్ని అడిగి చివరికి తేలింది ఏవిటంటే మనకి అద్దాలు నప్పడం లేదని ..అలాటి కళ్ళద్దాలు పూర్తిగా వాడే పరిస్థితి వస్తుందేమోనని నా బెంగ . ..నిజానికి నాకు ఇవి కొత్త కాదు ఇది చెప్పాలంటే మరోసారి నా ఇంటర్ అయ్యి డిగ్రీ కి అడుగు పెట్టిన మొదటి నెలలోకి వెళ్ళాల్సిందే ..................రేపు చెబుతాను

9, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ'

సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా సిటీలో వున్నా మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కి వెళ్లాను ..ఐ.సి .యు విసిటింగ్ హౌర్స్ సాయంత్రం రెండు గంటలు మాత్రమె కావడం వలన ఒకింత ఉద్విగ్నత తో రూం దగ్గరకి చేరి నా చేతిలోని హ్యాండ్ బాగ్ అక్కడే కూర్చ్చున్న మా కజిన్ ఒడిలో విసిరినంత పనిచేసి తలుపు తోసుకుంటూ రూం లోకి వెళ్లాను.నా కళ్ళు మూలనున్న బెడ్ వైపు వెళ్ళాయి...ఒక్కసారే దిగులు కళ్ళు మసకబారిపోయాయి .....క్రిటికల్ కేర్ బెడ్ మీద ''బాపు బొమ్మ ''...అటు ఇటు నర్సేస్ బ్రతిమాలుతూ పాలు తాగిస్తూమద్య మద్యలో ఆమె తల అడ్డంగా తిప్పుతూ ....నేను తనని సమీపించగానే నన్ను చూసి కనుబొమలు ఎగరవెస్తు నవ్వింది ఆ హాస్పిటల్ రూల్స్ ప్రకారం రెండుజడలు వాళ్ళ యునిఫారం షర్ట్ వేసుకున్న తనని చూస్తుంటే పోలిక లేకపోయినా 'వసంతకోకిల''సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చింది .నన్ను గుర్తుపట్టలేదు ..అర్ధం అయ్యింది ...ఎప్పుడో వుండుండి మన లోకం లోకి వస్తుంది..అప్పుడు నన్ను అడుగుతుంది అలానే మాట్లాడిస్తూ వుండగా హటాత్తుగా మన లోకం లోకి వచ్చి నన్ను గుర్తుపట్టి కన్నీరు .....తనకి జ్వరం రావడం తల నొప్పి రావడం చెబుతుండగానే మరల వేరే ధ్యాసలో చిన్న పిల్ల లా గోల ....మూడు రోజుల్లో ఎలా వుండే మనిషి ఎలా అయ్యిందో తలుచుకుంటే గుండె చెరువు అయ్యింది .రంగు మారి,పాలిపోయిన పెదవులు నిర్లిప్తంగా ఎటో చూస్తున్న కళ్ళు చిక్కిపోయిన చెంపలు ....యంత మార్పూ ....ఈమేనా ''బాపుబొమ్మ''....
కళ్ళు తుడుచుకుంటూ బయటకి వచ్చి కొంచెం ఎడంగా వున్నా బాల్కనీ లో కూర్చున్న వచ్చేపోయే వారిని చూస్తూ ...ఒక్కసారే నా మనసు గతం లోకి పరిగెట్టింది... ఆమెను మొట్ట మొదటిసారి నేను ఆరవ తరగతి చదువుతుండగా చూసాను .స్కూల్ నుండి వచ్చేసరికి మా ఇంటి బయటి చక్కబల్ల ఊయ్యాలలో ఒడిలో నెలల బాబుతో అపరిచితురాలు ,కళ్ళు చెదిరే అందం ...మెరిసిపోతూ బాపుబొమ్మ (ఈ పేరు అక్క పెట్టింది ) ఊయల నుండి నేలను తాకుతున్న పెద్ద జడ ....పోటి పడుతూ ఆమె పమిట చెంగు ....అలా కళ్ళార్పకుండా చూస్తున్న మమ్మల్ని ఆవిడకు పరిచయం చేసింది మా అమ్మ .ఆవిడ నవ్వుతుంటే మరింత అందంగా వుంది ...కాసేపట్లో ఆవిడతో కలసిపోయము .ఆమె అమ్మమ్మ చెల్లి కోడలాట.. మా అమ్మకి తమ్ముడు వరుస అవ్వుతాడు ..అతను కొవ్వూరు క్యాంపు కి వస్తు ఆమెను కూడా తీసుకు వచ్చాడట .మాకు చుట్టాలు అప్పటివరకు సరిగ్గా తెలియదు..వున్నా రెండురోజులు సరదాగా గడిచిపోయింది..ముఖ్యంగా అక్కా నేను ఆమె అందాన్ని తెగ అడ్మిరే చేసేవాళ్ళం .
తరువాత మేము కాలేజికి వచ్చాక నాన్నగారు పనిచేసే ఊర్లోనే అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళుకూడా ట్రన్స్ఫెర్మీద రావడం ఆమె తన పిల్లల్ని తీసుకు రావడం మేము వెళ్ళడం జరిగిందీ ..ఆమెలో అందం ఏ మాత్రం తగ్గలేదు సరికదా అప్పటికంటే ఇంకా అందంగా వుండినది .ఏ చీర కట్టిన బొమ్మలా వుండేది .
నా నిశ్చితార్ధం రోజు ఆమెదే మా అత్తగారి తరుపు హడావిడి ....ఎందుకంటే ఆమె ఆ ఇంటి పెద్దకోడలు కాబట్టి ...నేను ఆ ఇంటి చిన్న కోడలిని ...ఆ బాపు బొమ్మ నా తోటికోడలు.ఇప్పటికి ఏభయ్యేళ్ళ వయస్సంటే ఎవ్వరు నమ్మరు నలభయ్యిలో అడుగు పెట్టినట్లున్టది....అమృతం తాగుతున్నావా అని అడుగుతుంటాను...అన్నిటికి నవ్వే తన సమాధానం ......
మూడు రోజులక్రితం హటాత్తుగా తలనొప్పి తీవ్ర జ్వరం తో పడిపోయి ఒక రోజంతా కోమాలో వుండి...మృత్యు ముఖం నుంచి బయటపడింది బ్రెయిన్ ఫివేర్ ..ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా ..మనలోకం లోకి వచ్చి తన లోకం లోకి వెళ్ళిపోతుంది ..మెలుకువ వస్తే అందరికోసం చూస్తుంది అదీ నిమిషాలే ....కోలుకుని మాలోకి రావాలని అందరం ఎదురుచూస్తున్నాం ...ఆ పిల్లలు మరీ తల్లడిల్లుతున్నారు .....ఆ పైవాడు ఏం చేస్తాడో చూడాలి ....

8, అక్టోబర్ 2009, గురువారం

నేనంటే క్రేజ్ ....

నేనంటే ఎంత క్రేజ్ అర్ధం అవ్వుతుందిఈ మద్య బ్లాగ్ లో పదెపదె నన్ను తలుచుకుంటూ నా పేరుతో కామెంట్స్ రాస్తున్నారు,రాసేది ఆడో మగో కూడా బొత్తిగా అర్ధం కావడం లేదుకాని తరచి తరచి ఆలోచించగా ఈ రెండు జాతి కాకుండా మూడో జాతివాళ్ళని అర్ధం అవ్వుతుంది ...
ఏమైతేనేం "చిన్ని"అంటే పిచ్చి క్రేజ్ అనితెలుస్తుంది

6, అక్టోబర్ 2009, మంగళవారం

ఎవడి గోల వాడిదే

ఎవరిగోల వారిదంటే ఇదే కాబోలు ..ప్రకృతి వైపరీత్యలకి ఎవరు మాత్రం ఏమి చేయగలరు,ముందే గమనించితే సాద్యమైనంత (అంటే మానవునికి చేతనైనంత ) నివారణ ముందస్తు జాగ్రత్త తీసుకోవడం తప్పించి .ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమైన కర్తవ్యం,మిగిలినవి అంటారా''బ్రతుకుంటే బలిసాకుతిని అయిన గడపొచ్చు"అనే నానుడి వుండనేవుంది.
కాని ఈ మీడియా ముఖ్యంగా ఎలెక్ట్రోనిక్ వాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే చాల విచారం కలుగుతుంది,ఇరవయ్యి నాలుగు గంటల సమాచారం పేరుతో చెప్పడానికి ముడిసరుకు(-వార్తలు )లేక పూసింది అంటే కాసేసింది అంటూ వక్రభాష్యం చెబుతూ సగం ప్రజలలో భయాందోళనలు కలగచేయుచున్నారు .మూడు రోజుల నుండి వరధప్రాంతల్లో జిల్లా యంత్రాంగం పోరుగుజిల్లా యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రజలు 'అతి ధీమా 'తో యంత్రాంగానికి సహకరించక ఇప్పుడు నిండా నీరు వచ్చి మునిగాక వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని,అన్నం ,పాలు లేవని చలికి వణుకుతున్నాంఅని ,మూగజీవాలు సైతం కరకట్టల్లో ఆవాసం చేయాల్సి వస్తుందని ,కరకట్టల మీదే వంటలని మీడియా ని పిలిచి కధనాలు చెబుతుంటే ,వారికి మీడియా తందాన అంటూ అధికారులు నిర్లక్ష్యం కరకట్టల మీద వంటలు అంటూ కధనాలు .....ఇదే మీడియా వారిని ఎందుకు ఖండించదు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి ,ప్రభుత్వం ,సేవ సంస్థలు వసతి బోజనాలు ఏర్పాటు చేసారు,ఆస్తులుకాదు ముఖ్యం ప్రాణాలు కాపాడుకుని ,కట్టు విప్పి మూగజీవాల ప్రాణం కాపాడమని ....అలాచెబితే ఎలా అక్కడితో కథ సుఖాంతం అవ్వుతుంది కదా ,కధనాలు వెదుక్కోవాలి కదా ..
ఇప్పటికిప్పుడు కొల్లూరు మండలం 'పెసరలంక 'లో జరగని పడవ ప్రమాదాన్ని జరిగినట్లు వక్రీకరించడం ...వార్తా వచ్చినపుడు అన్నీ పరిశీలించాకే చెప్పాలి ..అంటే కాని కథలు సృష్టించడం కాదు .ఏదేమైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగం తమ ఇల్లు వాకిళ్ళు వదిలి రాత్రి పగలు బేదం యెరుగక''మీకు మేము ఉన్నాం ''అని వరద భాదిత సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు .....ఇవ్వేమి మీడియా కి కనబడవు .....వినబడవు ....

4, అక్టోబర్ 2009, ఆదివారం

కర్తవ్యం

మన చుట్టూ ఆవరించిన'' పెను చీకటిని ''తిట్టుకుంటూ,భాధ పడటం కంటే మనమే ముందుకు వచ్చి ''దీపం ''వెలిగిస్తే కొంతైనా చీకటిని పారద్రోలగలం.

30, సెప్టెంబర్ 2009, బుధవారం

ప్రతి దినం నీ దర్శనం దొరకునా ........

ప్రతిదినం నీ దర్శనంమరి దొరకునా..దొరకునా..... .
నిను చూడని రోజు నాకు రోజు కాదు......
తప్పదని తెలుసు అయిన నా మనస్సునా మాట వినదే ....అయ్యో దీనికి జత నా కళ్ళు కూడా తోడయ్యాయే ..
...హమ్మయ్య నక్షత్రాలను కమ్మేసి కారుమబ్బులు ఆత్మభందువుల్లా చల్లగా కమ్ముకున్నాయి ......
నా కోసం కరుణించి చిందించిన జల్లులు నన్ను ,నా మనస్సులోతడిని కడిగేసినా మసకబారిన కళ్ళతో నవ్వుతు నే చెప్పిన వీడ్కోలు .... కొండంత ధైర్యం తో అమ్మ కలలకోసం లక్ష్యం వైపు నీ గమనం .................
ఆ రోజు కోసం నేను ..............వేచివుండలేనా ?

26, సెప్టెంబర్ 2009, శనివారం

"ప్రతిసారి ఒక్కరు మిస్సింగ్ "

యే వి.ఐ .ఫై మిస్ అయ్యారా మాకు తెలీకుండా అని బోల్డంత ఆశ్చర్యపోతున్నారా ?....అబ్బే రాజకీయనాయకులు కాదు బ్యురోక్రట్స్అంత కన్నాకాదు ....ఒక యెమ్.యెన్ .సి లో ఎగ్జిక్యూటివ్ స్థాయి వాడు మా శీనుగాడు ఈ సారి పండగకి మిస్ అయ్యాడు,ప్రతిసారి అంతే ఏదోక అకేషన్ పెట్టుకుని మేము ఆరుగురు పిల్లలం (పెద్దోల్లమే)కలుద్దామంటే ఒక్కళ్ళు తప్పనిసరిగా మిస్ అయ్యి అయిదుగురు మాత్రమె కలుస్తాము ,మా వెనుక తోకలు (అల్లుళ్ళు కోడళ్ళు ...అమ్మ వాళ్లకి )వచ్చిన రాకపోయినా అస్సలు పట్టించుకోము ....కొంచెం మాకు ఒక్కొక్కళ్ళకు ఉన్న ఒక్కో పిల్లకాయల్ని మాత్రం వెనకాలే పట్టుకుపోతాం అమ్మగారింటికి ..రెండు మూడేళ్లు ఒక చెల్లి అమెరికాలో వుండిపాపం తను మిస్ అయ్యేది ...కొన్నిసార్లు కొలువుకి సెలవు లేక అక్క ,లేక పెద్ద తమ్ముడో ....ఎప్పుడు అమ్మ వాళ్ళని వదలకుండా పక్క వీధిలో కాపరం వుండే మనం మాత్రం ఎప్పుడు మిస్ అవ్వం ....పెద్ద చెల్లెలైన అప్పుడప్పుడు మిస్ అవ్వుద్ది ...అందరు అమ్మవాల్లింటికి చేరారు మనం కూడా రెండు రోజులు అక్కడే .....మా కబుర్లకు అంతే వుండదు ......నిజమైన పండుగ మాకు ఇప్పుడే ...అమ్మ నాన్నకి కూడా ................
'' బ్లాగ్ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు ''

23, సెప్టెంబర్ 2009, బుధవారం

''నా ముద్దు పేరు ''

నాకు చిన్నప్పటినుండి నాకున్న పేర్లతో పెద్ద తలనొప్పి వుండేది.నాకు అందరిలానే స్కూల్ రికార్డ్కి ఒక పేరు ఇంట్లో పిలవడానికి ఒక పేరు వుండేది.అప్పట్లో నా వయస్సు పిల్లలు నా పేర్లను ఎగతాళి చేస్తుంటే కొంత వయస్సు వచ్చేవరకు భాధపడే దాన్ని తరువాత తరువాత నా అస్సలు పేరు అర్ధం తెలిశాక భాధపడ్డం మానేసాను కాని ఇప్పటికి నేను ఇబ్బంది పడేది నా ముద్దు పేరుతోనే .చిన్నప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడల్లా నా తోటి పిల్లలు నాకు కోపం తెప్పించాలంటే నా ముద్దుపేరును పదేపదే పిలిచేవారు,అదేమంటే మీ అక్కవాళ్ళు పిలవడం లేదా అనేవాళ్ళు .మా అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని పైగా'' నీవేమో చక్కగా బేబీ అని పెట్టుకుని నన్నేమో ఇంత పిచ్చి పేరుతో పిలుస్తారా'' అని .
దానికి మా అమ్మ ఒక కథ చెప్పుకొచ్చేది ..
అమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు వుండేవారట ,కాని మాకు ఊహ తెలిసాక ఇద్దరు మాత్రమె తెలుసు,అందరిలో పెద్ద తమ్ముడు తన పద్దెనిమిదవ ఏట అకాల మరణం చెందాడట..అప్పుడు నేను నెలల పిల్లనట ,తన పాకెట్ మనీతో నాకు మబ్బురంగు క్రేప్ గౌన్ కొనుక్కోచ్చాడట ,అమ్మ నాకు ఆ గౌన్ తొడిగితే పచ్చగా మెరిసిపోతున్న (అప్పుడు) నన్ను మామయ్యా ఎత్తుకుని''అక్క దీనిని ఈ రోజు నుండి ......అని పిలుద్దామే అన్నాడట ,అలా నా ముద్దు పేరు నాకు స్థిరమయ్యి ఇంట్లో అందరి నోళ్ళలో కొందరు దగ్గరి భందువులలో ప్రాచుర్యమయ్యింది.ఎంచక్కగా బుజ్జి ,చంటి చిన్ని చిన్నారి వుండగా ఇదే మీకు దొరికిందా అని ఇప్పటికి నా నుండి మా అమ్మ రెండు మూడు నెలలకోసారి యుద్ధం చూస్తుంది ,ముఖ్యంగా ఎవరైనా స్నేహితులో చుట్టాలో వచ్చి వెళ్ళాక .....వాళ్ళ ముందు నన్ను పిలిచినప్పుడు నాకేమో ఇబ్బందిగా వుంటాది .
మా అక్క మరీను ,తనతో బయటికి వెళ్తే అక్కడ ఎవరున్నా పట్టించుకోదు గట్టిగ పిలుస్తుంది ,ఒకటి రెండుసార్లు మా ఆఫీసు కి వచ్చినప్పుడు మా స్టాఫ్ ముందు నా ముద్దుపేరుతో పిలిచింది ,అదేమంటే ఇంకా కొత్తగా ఏం పేరు పెట్టి పిలవాలే నిన్ను అంటుంది.తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్క అనటానికి ముందు నా పెట్ నేమ్ తగిలించి మరీ అంటారు
మా అమ్మాయి, వాళ్ళ నాన్న కూడా నన్ను ఏడ్పించాలంటే అదే పిలుపు .
ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు అంటే సాయంత్రం మా నాన్నగారు ఎవరో స్నేహితులు వస్తే పరిచయం చేయడానికి నా పేరును గట్టిగ పిలిచి మా రెండో అమ్మాయండీ పలానాపలానా అని నా గురించి పరిచయం చేస్తుంటే అక్కడ ఏడవలేని వెర్రి నవ్వు ఒకటి నవ్వి మళ్లీమా అమ్మతో ఫైటింగ్ చేసోచ్చాను ...మన బ్లాగ్ లోకంలో ఎవరో నా పెట్ నేమ్ తో తెగ రాసేస్తున్నారు :)

21, సెప్టెంబర్ 2009, సోమవారం

"నా కవిత్వం"


వారం నుంచి బోల్డంత తీరికగా వున్నాను ...ఏదో మద్యలో ఒకటి రెండురోజులు తప్పించి .....ఇష్టం వచ్చినప్పుడు లేవడం ...నిద్రపోవడం పుస్తకాలు చదువుకుంటూ ...బ్లాగ్లు చదువుకుంటూ ...పాటలు వింటూ...కబుర్లు చెప్పుకుంటూ ....గంటలు గంటలు ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపేస్తున్నాను...
ఇంత చేస్తున్న ఇంకా చేయాల్సిన పనులు మిగిలున్నాయని చక్కగా పేపర్ ,పెన్ను పట్టుకుని ఒక కథ రాద్దాం అని కూర్చున్న ....ఏదో రాసాగాని రెండోసారి చదువుకుంటే నీరసంగా అనిపించింది ...సర్లేమ్మని దాన్ని ప్రక్కన పడేసా ...నా పాత డైరీ ఒకటి తీసుకున్న ...అప్పుడెప్పుడో నేను రాసుకున్న కవితలు ......హమ్మ్...అబ్బో "మరువం " ఉషగారు రాసిన కవితలతో పోటీ పడుతున్నాయి ...అన్ని తిరగేసి చదివి మురుసుకున్న....మచ్చుకి మీకొకటి ఇందులో పెడతాను ....ఓపిక వుంటే చూడండీ ....ముఖ్యంగా బ్లాగ్లలో వున్నా కవిత మహులందరికోసం............ఎంత ఓపిగ్గా రాసానో ....
...
రేగినకోరికలతో ...... గాలులు వీచగా
జీవన వేణువులలో ..... మోహన పాడగా
దూరము లేనిదై .....లోకము తోచగా
కాలము లేనిదై ...గగనము అందగా
సూరీడేఒదిగి ఒదిగి ...జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే ...నిదుర లేచే ప్రణయ గీతికి
ఒంటరి బాటసారి... జంటకు చేరగా
కంటికి పాపవైతే ...రెప్పగా మారనా
తూరుపు నీవుగా.... వేకువ నేనుగా
అల్లిక పాటగా ........పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులోకటై ...పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకు
ఓం నమః నయనశ్రుతులకు ఓం నమః హృదయలయలకు ఓం
ఓం నమః అధర జతులకుఓం నమః మధుర స్మృతులకుఓం
నీ హృదయం తపన తెలిసి,నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో.......................


ఇదండీ నాకు చాల ఇష్టమైన లిరిక్ ....గీతాంజలిలో మా నాగ్ అధ్బుతంగా లీనమయ్యి నటించేసాడు ....
ఎంత బాగా రాసుకున్నానో కదా .....ఎన్ని సార్లు విన్న విసుగు అనిపించదు ..... విని విని కాపీ చేసుకున్న ......నా కవిత .......-:)


20, సెప్టెంబర్ 2009, ఆదివారం

"అమ్మ పిలిచింది"


మనకు భక్తి చాలా తక్కువ,కొన్ని పరిస్థితులవల్ల అలా తయారయ్యి వుండొచ్చు.ఒక్క షిర్డీ బాబానే గురువుగా భగవంతుని దూతగా నివేధించుకుంటాను...మనసులోనే మాట్లాడుకుంటాను.యెంతఅవకాశం వున్నా గుడులు గోపురాలు తిరగడం తక్కువఒకవేళ వెళ్ళిన అక్కడ ప్రాచిన శిల్పసంపద ,చారిత్రిక ప్రాశస్త్యం చూస్తానుఅలా అని నాస్తికరాల్ని కాదు....ఏమో నాకు నేనే అర్ధం కాను ...:(
ఒక ప్రక్క తిరుపతిలో బ్రహ్మొస్థవాలు ఇంకో ప్రక్క కనకదుర్గమ్మ శరవన్నవరాత్రులు,విద్యాలయాలకు సెలవులు ఎటుచూసినా"భక్త జనం ".....రాష్ట్రమంతా స్వైన్ ఫ్లూ భయం ....జాగ్రత్తలూ .
ఉదయాన్నే పేపర్ చూస్తూ "వీళ్ళకి ఇంత భక్తేంటి,పూజారులు భక్తులు వ్యాధి నుండి రక్షణ కొరకు మాస్క్ లు తగిలించుకొని ఇంత రిస్క్ తీసుకోపోతే యేం?" నేను .
"ఆ విలువ,భక్తి భక్తులకు తెలుసుఇటువంటివి ఏమి ఖాతరు చెయ్యరు " శ్రీవారు.
"ఇప్పుడే వెళ్లి దర్శనం చేసుకోవాలా ?..తోసుకుంటూ నానా కష్టాలు పడి పిచ్చిజనం " నేను .
"అది వారి ఆనందం ,వారి భక్తి కి కష్టం తెలిదు " మా పాప.
పేపర్ చదువుతూ టీ ముగించాను ....ఇంతలో ఫోన్ కాల్ సారాంశం గంటలో oka దగ్గర అరగంటలో హాజరు వేసుకుని వారు వెళ్ళేవరకు మనం vundaali .ఒక అయిదునిమిషాలు ముందే అటెండెన్స్ వేసుకున్నాను "అతి వినయంగా"....araganta taruvatha ........


కిటకిటలాడే జనసందోహం లో ఇంద్రకీలాద్రి మలుపులు తిరుగుతూ......ప్రక్కనే నిండు "కృష్ణ వేణి "సోయగాలు చూస్తూ తన్మయినైన నేను అమ్మ వారి అంతరాలయం లో ప్రవేశించగానే అమ్మ నవ్విన నవ్వు చూసి ఉలిక్కిపడ్డాను. .......ఏమన్నావు ప్రొద్దుటే ?చిలిపిగా ప్రశ్నించింది అమ్మ .
"నేనా!" తడుముకున్నాను .
ఎందుకొచ్చావు ?ఇంకా నవ్వుతు కళ్ళు ఇంత చేసి మరి .
నేనేమి రాలేదు.....అర్ధం అయ్యిందిలే ...."అమ్మ నువ్వు పిలిచావు "గడుసుగా నవ్వుకుంటూహారతి కళ్ళకి అద్దుకుంటూ బయటికి వచ్చేశాను ......

12, సెప్టెంబర్ 2009, శనివారం

సెంట్రల్ యునివర్సిటీలో 'ఓనం'

ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ లో కేరళ వాళ్ళ ఫెస్టివల్ "ఓనం " జరుగుతుందట.అది విన్న దగ్గరనుంచి మనస్సు అటు పరుగులు తీస్తుంది .మినీ సైజే ప్రపంచం లా వుండే ఆ యునివర్సిటీ అంటే నాకు చాల ఇష్టం.భాగ్యనగరం వాతావరణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా ఒకింత చిట్టడవి ని తలపించేట్లు వుండేది ,బహుశా ఇప్పుడేమైనా మారి వుండొచ్చు .రుతువులకు అనుగుణంగా రంగులు మార్చుకుంటూ యే కాలానికి ఆ కాలం సొగసులద్దుకుంటూ స్వాగతం పలుకుతుంటది.
శీతాకాలం మంచుతెరల్లో చలికి వణుకుతూ చెట్లమద్య ఒంటరిగా నడిచే ఆనందం ...వర్ణించ తరమ!...అప్రయత్నంగా మనసులో "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై "పాడేసుకుంటూతెలీని ప్రపంచం లోకి వెళ్ళిపోవాలని అన్పిస్తుంది .
వర్షాకాలం లో చిన్న చిన్న తుంపర్లలో తడుచుకుంటూ కనబడిన అడవి జాజిపూలను అందినకొద్దీ గుప్పెల్ల దొరకబుచ్చుకుని సన్నటి ఇరుకు దారిలో నెమళ్లసరస్సు చేరి కనబడిన రాతి గుట్టపై చేరబడి కనబడని నెమళ్ల కోసం వేచిచుడడంలో ఆనందం మళ్లీరాదేమో ...
వేసవి ఉషోదయాలు ,సాయంత్రం సంధ్యా సమయాలు ఎర్రటి అగ్నిపూలతో,పసుపుపూలతో గమ్మతైన పూల పరిమళంతో మనస్సును ఆహ్లాద పరుస్తుంది .
అన్నిటికి మించి ఎల్లలు ఎరగని ఆ స్నేహం లో,ఒక్కసారి అందులో అడుగు పెట్టాక అక్కడున్న ప్రతి చెట్టుతో పుట్ట తో మన అనుభందాన్ని తెంచుకోలేక ,గుర్తొస్తే మనస్సు చిలుకై అక్కడ చెట్టు మీద వాలుతుంది.
నేను ఈ పోస్ట్ రాసే సమయానికి మనవాళ్ళు పదిహేను రకాల కేరళ వంటలతో విందారగిస్తున్నారు....-:)

5, సెప్టెంబర్ 2009, శనివారం

అహం

మీరు నిరంతరం ఇతరులను తక్కువ చేయడం ద్వారా
మిమ్మల్ని మీరు అధికులుగా అనుకుంటూ ఉంటారు .
ఇదే అహంకారానికి మూల కారణం .
ఆత్మా గౌరవంలో పోలిక ఉండదు
ఆత్మా గౌరవంతో నీవు ఇతరుల గురించి ప్రస్తావించవు
అది కేవలం నాకు నేను గౌరవనీయున్ని ,నన్ను నేను
ప్రేమిస్తాను ,నేను ఇలా వున్నందుకే గర్వంగా ఉంటాను .
ఈ అందమైన సృష్టిలో వుండటమే నాకు గర్వకారణం,
అని చెప్తావు ...నీవు పోల్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో ,
అపుడే అది అసహ్యకరమైన ఆటగా మొదలవుతుంది .

పైన రాసిన వాక్యాలు చాల ఇష్టమైనవి ...ప్రాక్టీసు చేయడానికి ప్రయత్నిస్తున్న .....(..ఓషో రచనలనుంచి తీసుకున్నవి ).

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

''ఒక్క క్షణం ఆలోచించండి ''

సాటి స్త్రీగా ఒక్క క్షణం ఆలోచించలేమా ?...ప్రకృతి పరంగాచూస్తె "స్త్రీ " ఎంత ఆకాశంలో సగమైన భేలయే...తన శారీరక నిర్మాణంలో కాని,మానసికంగా కాని పురుషుని తో పోల్చితే చాల "సున్నితమైనది ".పురుషునితో సమానంగా అన్నిరంగాల్లోను పనిచేయవచ్చుకాని సహజంగా సంక్రమించిన తనదైన లక్షణాలను దాచుకోలేదు. యెధైనవిపత్కర సమయంలోపురుషుని మాదిరి గంబీరత తో ఎదుర్కొనలేదు తన హావభావాలను అదుపు చేసుకోవటానికి చాల కష్టపడవలసి వస్తుంది .కదిపితే కన్నీటి పర్యంతమవుతుంది.ఎక్కడో తప్పించి అదీ అబ్నొర్మల్ స్త్రీ లోనే ఇందుకు విరుద్దంగా జరుగుతుంది..అంతవరకు ఎందుకు జీవితంలో ఎన్నో ఆటు -పోటులను ఎదుర్కున్న,కరడుకట్టినట్లు కనబడే 'సోనియా ' కంట నీరు చూడలేదా?
రాఖిల లకే పరిమితమైన చేవెళ్ళచెల్లెమ్మ నోరు విప్పకపోవడం లో ఆశ్చర్యం లేదు .భర్తమరణం వరకు గడప దాటని ఆ ఇల్లాలు అనుకోకుండా తనను వరించిన ఆ పదవుల్లో ఇమడడానికి ఇంకా సమయం కావాలేమో ?తనని నమ్మి ఎంపిక చేసుకున్న ప్రజల సమస్యలు తీర్చడానికి పూర్తి నిభద్దతాతో,ఎక్కడ బేషజం లేకుండా జీవితంలో తను పోగొట్టుకున్న "ఆనందం ''తాలుక విషాదం ని అంతా కళ్ళ లో నింపుకుని అలుపెరుగక పనిచేసే ఈ అమ్మ ని విమర్శించే ముందు ఒక్క క్షణం ఆలోచించాలేమో ......
మొన్న సాయంత్రం మొట్టమొదట ఏర్పాటు చేసిన సమావేశంలో కాస్తంత నిశితంగా పరిశీలించి చూస్తె తెలిసేది ...అప్పటికే జరిగిన పరిస్థితికి ఒక నిర్ణయానికి వచ్చిన ఆంద్రప్రభుత్వం ,కేంద్రప్రభుత్వం ప్రజాపాలన దృష్ట్యా విషయాన్ని ప్రజలు మానసికంగా అంగీకరించేంత స్తాయికి తీసుకురావడానికి తమలోని దుఖాన్ని దిగమింగుకునిమాట్లాడిన తీరు ....చీఫ్ సెక్రటరీ రమాకాంతరెడ్డి మాట్లాడిన తీరు .....
రాజకీయాల్లో కాని ,వయస్సు రీత్యకాని పెద్దవాడు ఆర్ధికశాఖ మంత్రి రోశయ్య మాట్లాడటం "అభ్యంతరకరమైన "విషయం కాదనుకుంటాను .అక్కడ పదవులు కాదు ముఖ్యం,పరిస్థితిని ఎదుర్కొనడం.....
మన హోం మినిష్టర్ ఆర్ధికంగా కలిగిన కుటుంబం నుంచి వచ్చారు,దివంగతుడైన ఆమె భర్త రాజకీయ ప్రస్తానం చేసినోడే ...సహజంగా వారి కట్టు బొట్టు వారికి తగ్గట్లుగానే వుంటుంది ...సమయాను సందర్భంగా అప్పటికప్పుడు వెదికి తక్కువ ఖరీదు దుస్తులు ధరించలేరేమో ?..ఆమె అలంకరణ ఎప్పుడు హుందాగా వయస్సుకు తగ్గట్లు పొందికగా వుండటమే చూసాను ....మిగిలిన కొంతమందిలా అసహజ అలంకరణ ,వయసుకు తగని అలంకరణ ఇంతవరకు చూడలేదు ..ఆమెలో చక్కని "స్త్రీ " చూసాను ....చూస్తున్నాను .

పైన ఇలా రాస్తున్నానని నన్నొక స్త్రీ వాదిగా చూడకండి ....నేను యేవాధిని కాదు అని చెప్పగలను కాని "మానవతావాదిని "మాత్రం కాదు అని చెప్పలేను ....ఇది రాసే సమయం కాదు ..అయిన రాయకుండా వుండలేను ...ఎవరికైనా అనుభవం వచ్చే కొద్ది సమర్ధతతో పనిచేస్తారుఇంకా మూడు నెలలెనాయే....అత్యంత భిడియస్తుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ,ఇందిరాగాంధీ యావత్ భారత దేశానికే నేతృత్వం వహించలేదా ?......practice makes men perfect ......

3, సెప్టెంబర్ 2009, గురువారం

"రాలిన మణి పూస"

మా కాలేజి పూర్వ విద్యార్ధి సంఘమనే ముత్యాల హారం నుండి ఒక 'మణిపూస'జారిపోయింది......ఎక్కడ పడిందోననిఇరవయ్యి నాలుగు గంటలు గాలించగా .....దొరికింది .......ఎక్కడో తెలుసా గగనం లో చమక్కున మెరిసేటి ఓ 'తార 'గా...........మీరు చూస్తారా .......ఎంత వెలుగులు చిమ్ముతూ ప్రకాశిస్తుందో ......రాజసం తో దర్పంగా ......
నిన్ను మరువగలమా......! .

అశ్రునివాళి

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ,స్పెషల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ,సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ ఇద్దరి పైలేటేస్ లకు ఆత్మశాంతి కలగాలని ,కుటుంబ సభ్యులంతా త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ .....

29, ఆగస్టు 2009, శనివారం

సాయంసమయంలో

మలి సంధ్యవేళలో ...
కడలి అంచున నేను
మదిన మౌనగీతం ఆలపిస్తూ ...
అనంతమైన ఆకాశం లోని
నీలి మేఘాల పరదా కప్పుకుని
ఎగిసిపడే అలల నురుగ చూస్తూ
అల్లరి గాలికి ఎగిసిపడే వలువలనదిమి
కలల ప్రపంచంలో నీకై విహరిస్తున్నాను
తారలన్నీ రేరాజు చేరి సరసమడే వేళ
చిన్నబోయిన మోముతో దిక్కుదోజక
చుక్కల నీ జాడలు వెదుకుచు ...సొమ్మసిల్లిన నా మేను
తొలి ప్రొద్దు పొడుపుకై తూరుపు దిశ నా "తిరోగమనం"....

27, ఆగస్టు 2009, గురువారం

కార్ డ్రైవర్ కథ -3

గత టపాలో మా స్వంత కార్ మీద పనిచేసిన డ్రైవర్ కథ రాసాను ..ఇది ఆఫీసు కార్ మీద పనిచేసిన డ్రైవర్ కథ.ఈ మద్య కాలం లో గవర్నమెంటు స్వంత కార్స్ కొనకుండా ఏడాదికి టాక్సీ వి అగ్రీమెంటు చేసుకుంటునారు,అందువలన కార్ లో పనిచేసే డ్రైవర్ బయటి వ్యక్తి అయ్యి వుంటున్నాడు.అదీ ట్రావెల్స్ వాళ్ళేనియమిస్తారు.తరుచు డ్రైవర్లు మారుతుంటారు.నేను చెప్పబోయే సంఘటన నాలుగు నెలలు క్రిందట జరిగిందీ.
ఒక డ్రైవర్ చెప్పకుండా మానేస్తే నలభయ్యేళ్ళ పై వయస్సున్న వ్యక్తిని పంపించారు .అతని డ్రైవింగ్ విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా చక్కగా డ్రైవ్ చేసేవాడు .మనిషి సన్నంగా ,కొంచెం పొడవుగా ,కళ్ళు ఎప్పుడు తీక్షణం గా వుండేవి .చెప్పిన టైంకి ఐదు నిముషాలు ముందు వుండేవాడు.కాంట్రాక్టు డ్రైవర్ అయిన ఆఫీసు సిబ్బందితో త్వరగానే కలిసిపోయాడు.ఎప్పుడైనా ట్రాఫ్ఫిక్ లో అడ్డం వచ్చిన అవతలివారితో చాల రఫ్ఫ్ గ వ్యవహరించేవాడు,నేను వారిస్తూ వుండేదాన్ని.
ఒకసారి అత్యవసరంగా స్టేట్ కాన్ఫరెన్స్ విశాఖ లో పెట్టారు.పది గంటలకు ఎట్టి పరిస్థితిలో అక్కడ వుండాలి,ఏమాత్రం మానినా ,లేట్ అయ్యిన ఆ సినియర్ ఐయేఎస్ ఆఫీసర్ వూరుకోడు.ట్రైన్ కాని బస్ కానివీలు కాలేదు.తప్పనిసరి అయ్యి కార్ లో బయలుదేరల్సివచ్చింది . తెల్లవారుజామున మూడు గంటలకు మా సినియర్ అసిస్టెంట్ ని తీసుకుని ఇంటివద్ద బయలుదేరాం ..అది శీతాకాలం చలి చంపుతున్న సర్కారి సేవకులం కాబట్టి చచ్చినట్లు అవి పక్కన పెట్టి హైవే లో బయలుదేరాం .డ్రైవెర్ విపరీతమైన వేగం తో నడపడంతో నిద్రవస్తున్న అతన్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ చీకటిలోకి చూస్తూ హై వే పొడవునా మిరిమిట్లుగోల్పుతున్న రెడిyam దీపాలు చూస్తూ అప్పుడప్పుడు నిద్రలోకి ఒరుగుతుండగా సడెన్గా మెలుకవ వచ్చింది ,ముందు సీట్ లో వున్నా నా స్టాఫ్ ఘాడంగా నిద్రపోతున్నాడు .రోడ్ కి ఇరువైపులా కాంతులు కనబడటం లేదు ,వెంటనే డ్రైవర్ ని అడిగాను ..."ఎటు వెళ్తున్నాం నాయన ' అని ...అతని నుండి సమాధానం రాలేదు వినలేదా విని చెప్పడం లేదా అని ఒక్కసారే డౌట్ వచ్చింది .మరల గట్టిగ అడిగేసరికి స్టాఫ్ లేచాడు.మేము వేల్తున్నాది కచ్చ రోడ్ 'నల్లజర్లరోడే ' తారు రోడ్ వేసిన అటు ఇటు చెట్ల తో ముందుకు పోయేసరికి క్యరీ లు ,కొండలతో వుంటాది ,నాకు అర్ధం కాలేదు బంగారం లాటి హైవే వదిలి ఇటేందుకు వచ్చాం ,కార్ వెనక్కి తిప్పమన్నాను ,నిజానికి ఆ క్షణం లో బయం వేసినా భింకంగా వుండటానికి ప్రయత్నించాను .మా స్టాఫ్ కి దారుల పట్ల అవగాహన లేదు ,నేను చెప్పేసరికి డ్రైవెర్ ని గట్టిగ గద్దిచ్చాడు...ఇది దగ్గర దారండి అని అతని నుండి నిర్లక్షమైన సమాధానం వచ్చింది .అయిష్టంగా కార్ వెనక్కి తిప్పాడు ,అప్పటికి పందొమ్మిది కిలోమీటర్లు వచ్చాము హై వే నుండి ...నిద్ర ఎగిరిపోగా నా కోపం మా స్టాఫ్ మీద చూపిస్తూ తెల్లవారేసరికి రాజమండ్రి చేరి అక్కడే వున్నా నా ఫ్రెండ్ దగ్గర అరగంట ఆగి మొత్తానికి వైజాగ్ సమయానికి చేరడం జరిగిందీ .నా మనసులో ఆ డ్రైవర్ పట్ల అనుమానం మొదలయింది ...అతను పైకి కనిపించేంత మంచి వ్యక్తి కాదనే బీజం నా మనస్సులో పడిపోయింది.అతన్ని తీసేయడం అంత వుత్తమం ఇంకొకటి లేదనిపించింది.
అతను చేరినప్పటి నుండి ఒక విషయమై ముఖం మీద చెప్పాను ,సిగరెట్లు డ్యూటీ పిరియడ్ లో త్రాగావద్దని ,కార్ మొత్తం ఏ.సి.లో పట్టేస్తుందని ....అతన్ని ఎంత హెచ్చరించిన అతని అలవాటు మార్చుకోలేదు రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరల మొదలు పెట్టేవాడు.దానితో చాల ఇబ్బందిగా వుండేది ,వాళ్ళ ఓనరు ని పిలిచి చెప్పాను ,ఇలాటి అలవాట్లు మానితేనే మా దగ్గర వుంచమని .ఒక రోజు మా ఆఫీసు స్టోర్ రూం తాళాలు పోయి రాకపోతే డ్రైవర్ ఒక్క నిమిషం లో తాళం రెండు ముక్కలుగా పగలకొట్టాడు ..నాకయితే అనుమానం భలపడింది
మా కార్ ఓనరు కి గట్టిగ చెప్పేసాను ...పూర్తిగా అతను సిగరెట్లు మానితేనే రమ్మనమని లేకపోతె వేరే ఎవరినయినా పెట్టమని కుదరని పక్షంలో కార్ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకుంటాం అని చెప్పేసాను .దానితో ఆ ఓనరు గట్టిగ డ్రైవర్ ని హెచ్చరించేసరికి 'నా అలవాట్లు మానుకోను 'అని అతను చెప్పడం నాకు వేరే డ్రైవర్ ని పెట్టడం జరిగిందీ ...
ఇది జరిగిన నెలరోజులకు మా ఆఫీసు వాళ్ళందరు నేను వెళ్ళేసరికి టెన్షన్ తో కూడిన చర్చల్లో వున్నారు ....అందరు నన్ను చుట్టూ చేరి "మేడం చూసారా ?"అని పేపర్ నా చేతికి ఇచ్చారు.చుసిన నేను వాళ్ళలా తెగ ఆశ్చర్య పోలేదు,ఎందుకంటే అలాటిది ఎప్పుడో చూస్తాము ,అని......ఇంతకి జరిగిందీ ఏవిటంటే మా దగ్గర మానివేసినా డ్రైవర్ తన ఇంట్లో అద్దెకు వున్నా వ్యక్తిని తన భందువుల సహాయం తో చంపి ఇసుక దిబ్బలలో పూడ్చిపెట్టాడు,అది అతని కొడుకుకి సంభందించిన వ్యవహారం లో కలిపించుకుని చేసిన హత్య. అది చేసిన రెండురోజుల్లోనే పోలీసులు పట్టుకోవడం ,క్రైమ్ వాచ్ లో చూపించడం జరిగిందీ ...మా ఆఫీసు లో .ఒక్క నా క్యాంపు క్లార్క్ కి మాత్రమె తెలుసు అతన్ని నేను అనుమానపడుతున్నాను అని ...ఇంట్లో వాళ్లకి సరేసరి వద్దన్నా ఏదొక కంప్లైంట్ చేబుతానుగా :)

ఏమైనా ఇంట్లో పనివారి ఎంపికలో ,డ్రైవర్ ,ఎంపికలో కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలిసిందే...ఇది జరిగాక నాకు అతి జాగ్రత్త ఎక్కువ అయ్యింది .:)..............సమాప్తం .

24, ఆగస్టు 2009, సోమవారం

"గుత్తివంకాయ కూరోయి మామ "

గుత్తోంకాయి కూర మీద పాట రాస్తున్నాను అనుకుంటునారా !...ఓహ్ ...నేను వండిన కూర గురించి అనుకుంటున్నారా !..అబ్బే అదేం కాదు....
ఈ రోజు లేవడమే చికాకుతో లేచాను ...బాబా ని కూడా చూడలనిపించలేదు,కాని కిచెన్ లోకి వెళ్ళేప్పుడు "నన్ను వదిలి నీవు పోలేవులే...అది నిజములే " అన్న తరహాలో పూజ గది ముందే దర్శనం ఇస్తుందాయే,చూడకుండా పోదామనుకున్నా కాని క్రితం రోజు నా చిన్నారి చేసిన పాలవెల్లి అలంకారాలు నా అడుగు పక్కకు పడనీయలేదు..పూలు ఆకులు ఇంకా తాజాగా వున్నాయా అని ఒకసారి పరిశీలించి మొక్కుబడిగా దేవుళ్ళన్దరికి ఓ నమస్కారం పడేసి కిచెన్ లోకి పోయి టీ చేసుకుని తనకి ఓ కప్ మనకొక కప్ తీసుకుని పేపర్ చదువబోయా ...టీ అయ్యింది కాని ఒక్క లైన్ కదిలితే ఒట్టు..తగ్గట్టే ఆఫీసు ఫోన్ మోగడం వరుస చికాకులు ,అటు వంట చేస్తూ వెధవ గోలకి ఆన్సర్ చేస్తూ...పదకొండు తరువాతే ఆఫీసు చేరాం ....మరల మొదలు,నా విసుగు తో విసిటేర్స్కి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు..ఎప్పుడు ఇలా చేయలేదు ...కొంచెం రిలాక్స్ కావడానికి నా మిత్రులు కొందరిది బాతాకాని "సోదికబుర్లు"చెప్పి మద్యలో అరగంట బ్లాగ్లు చదివి బోల్డంత పనిచేసి అలిసిపోయాను ....ఎన్నడు లేనన్ని టెన్షన్స్ అన్నీ ఒక్కసారే !..ఇంత చిరాకు లో వుండగా నా స్నేహితుడి నుండి కాల్....బోజనంకి ఇంటికి వెళ్ళడం లేదా అని ,లేదని చెప్పి తనని కాసేపు విసిగించాక ..".సరే ఇంటికి వచ్చాక కాల్ చేయండి నేను తీరికగానే వున్నాను తీరికగా మాట్లాడుదాం "అన్నాడు. బాగా విసిగించానేమో అని ఒక్క క్షణం డౌట్ పడ్డా ...హు ..ఏముందిలే మనం ఎప్పుడు ఇంతే కదా అనుకుని సరే అనేసాను ...పని వలన త్వరగా వెళ్ళలేకపోయాను...ఈ లోపు నా స్నేహితుని కాల్స్ ,ఇల్లు చేరాన ,లేదా అని ..
ఇంటికి చేరగానే సమాచారమందుకున్న నా మిత్రుడు పావుగంటలో ప్రత్యక్షం .....మాములుగా కాదు చేతి లో పెద్ద టిఫిన్ బాక్స్ తో,..అబ్బో ఏంటిది అంటూ హడావిడిగా మూత తీసానో లేదో ....ఘుమ ఘుమల తో "గుత్తొంకాయ కూర "డబ్బా నిండుగా ..'.నేనే మద్యాహ్నం చేసాను కష్టపడి '.మెరిసే కళ్ళతో తనకే ప్రత్యేకమైన అందమయిన నవ్వు తో ...చెప్పాడు ......ప్రోద్దుటినుండి నుండి వున్నా విసుగు ,కోపం ,చిరాకు ..హుష్ ...మాయం ......ఎలా వుందో తిని చెప్పాలంట........ఇదిగో ఇంత అధ్బుతంగా వుంది .....మద్యాహ్నం వున్నా రైస్ తో కొంచెం తిన్నాను...అప్పుడే వచ్చిన మా వారికి కొంచెం రుచి చూపించాను ...అబ్బో నా మార్కులే కాదు మా శ్రీవారి మార్కులు కొట్టేసావ్ .....ఇదిగో చెల్లికి,అమ్మకి కూడా పంపిస్తున్న .........వాల్లెన్ని మార్కులేస్తారో ......గుత్తొంకాయ కూర అధ్బుతంగా చేసారని ...ఇదిగో ప్రపంచానికి చాటింపు వేస్తున్నా......:):).....ఇప్పుడు నేను కూల్ గా వున్నాను .

23, ఆగస్టు 2009, ఆదివారం

ఎదురుచూపులు

ఎదురు చూసినంత సేపు పట్టలేదు నీ నిష్క్రమణం .మరల అవే చూపులు ...అవే తలపులు మన పునస్సమగం కోసం .
నా నుంచి నీవు ఎప్పటికి వేరుకావని ఒకప్పుడు బ్రమపడ్డాను...మన యెడబాటుతాత్కాలికం అనుకున్నా ...కాని అదే మన ఇద్దరి మద్య దూరానికి నాంది అని తెలుసుకున్నా...
మొదటిసారి నన్ను వీడివెళ్ళినప్పుడు నీ బేల చూపులు నా మనో ఫలకం ముద్రితమై అనుక్షణం తడిమి తడిమి చూసుకుంటుంది నా చిన్ని హృదయం ...ఇప్పుడు అవే ...ఆ అందమయిన కళ్ళలో యెన్నిమూగ భావాలో ....బంగారం ...యేమి చెప్పాలనుకున్నావురా ?...నను వదిలి వెళ్ళడం భాధగా వుందనా?....నేను వుండలేక పోతున్నాను అనా!అంత పాషాణంలా తయారయ్యేనాని కినుకా ! నీ చూపుకు అర్ధం యేమని వెదుక్కొనురా కన్నా ...?పెదవి ధాటి పలుకలేని నీ మౌనం నా మదిని ఎప్పుడో తట్టిలేపిందిరా చిన్నా ...నీకు తెలుసు ..........
,నిన్ను తలచినంతనే నేనొక పులుగై నిన్ను వీక్షించగాలనని .
నిన్ను గాంచినంతనే నా మనస్సోక నాట్య మయురమవునని
నిను తాకినంతనే నా తనువెల్ల కడలి తరంగమని
నీ యెడబాటు నా మనస్సుకు తడబాటేనని............అయిన నా మనస్సు తలుపులు మూసివేసి మన కలయిక కోసం ఎదురుచూస్తుంటాను ....ప్రియా
.!

16, ఆగస్టు 2009, ఆదివారం

"మా వజ్రాల వేట "

మేము చిన్నతనంలో ఇంట్లో ఏ పుస్తకం కనబడిన చదివేసేవాళ్ళం,చదవడమే కాకుండా ఆ బుడత వయస్సులోనే మాలో మాకు చర్చలు ,వాద ప్రతివాదాలు వుండేవి.మా నాన్న ప్రత్యేకించి పిల్లలికి సంభందించి 'చందమామ ,బొమ్మరిల్లు ,భాలమిత్ర పుస్తకాలు మిగిలిన వారపత్రికలతో పాటు తెప్పించేవారు.అప్పట్లో కథల్లోవన్ని నిజమే అని నమ్మే వయస్సు .మా అందరికంటే అక్క చాల పుస్తకాలు చదివేది,చదవడమే కాకుండా తనకు చెప్పాలని మూడ్ వచ్చినప్పుడల్లా వింతవింత కథలు చెప్పేది,మేము నోర్లు తెరుచుకుని మరీ వినేవాళ్ళం.అలా విన్న కథల్లో "ముత్యలదీవి ,వజ్రలదీవులు ,పగడాల దీవులు,బంగారం నిధులు ,ఇలా సాగేవి,అవన్నీవిన్నప్పుడు వాటిని చూడాలని,అలా సముద్రంలో ప్రయాణం చేసి ముత్యపు
చిప్పలు కుప్పలుగా తెచ్చుకోవాలని చాల ఆశగా వుండేది .ఖాళి దొరికినప్పుడల్లా సెలవురోజుల్లో సాహసయాత్రలు మా ఆటల్లో బాగం అయ్యేవి.పగడాల దీవులు,ముత్యాల దీవుల వేట అన్న మాటా .
మేము హైదరాబాద్ లో వున్నప్పుడు విజయనగర్ కాలనీ లో మా ఇంటికి కొంత దూరం లో మా అక్కచేల్లెల్లంముగ్గురం పాండురంగారావు మాస్టర్ దగ్గర ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం .మా అక్క నాకన్నా రెండు క్లాసులు ఎక్కువ చదివేదిఅంటే అక్క నాలుగో క్లాసు మనం రెండన్నమాట .ఆమె స్నేహితులు మమ్మల్ని పిల్లకాయల్ల చూసేవాళ్ళు,అందుకని వాళ్ళు కొంచెం ముందుగా గ్రూప్ గా నడిచేవాళ్ళు .చెల్లి నేను ఒక్క క్లాస్సే,తను నాకన్నా ఒక్క సంవస్తరం చిన్నది ,మరి మా ఇద్దర్ని ఎలా ఒకటే క్లాస్ లో చేర్పించారో తెలీదూ,ఇద్దరికీ కలిపి ఒకటే తట్ట బుట్టాను.(అనక నేను డబల్ ప్రమోషన్ కొట్టి తనకన్నా ముందుకి వెల్లిపోయననుకోండి మరల పీ.జి లో చచ్చినట్లు కలిసే చదివాం ) మా చెల్లి కి నాకు కలిపి ఒకటే అల్యూమినియం బాక్స్ వుండేది అందులోనే ఇద్దరి పుస్తకాలు వుండేయి.ట్యూషన్ నుండి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు వంతులవారిగా మోసేవాళ్ళం.
ఒకరోజు మేమంతా ట్యూషన్ అయ్యాక ఇంటికి వస్తుండగా రోడ్ వార అల్లంత దూరం లో ధగ ధగ మెరుస్తూ (ఎండకి)వజ్రాలు కనబడ్డాయి,చెల్లి నేను ఒక్కసారే చూసాం,అక్క అవేమి పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ మా ముందు నడుస్తుంది .అక్కని ఆగమంటే వాళ్ళంతా చూసేసి వాటాఅడుగుతారని ఇద్దరం అక్కడే ఆగిపోయాం,అక్క కొంత దూరం పోయాక నేనే అరిచి చెప్పాను ,మా కోసం కమ్యునిటీ హాల్ దగ్గర ఆగమని,...అక్కకి తెలిసి నేను ఏ గోడవార పూలు కోస్తానికో అనుకుని ,వెనక్కి తిరిగి నాకు వార్నింగ్ ఇచ్చింది ,'మరల యే గండు చీమనో చేతికి పట్టించుకుని వస్తే మాత్రం తీయను,తరువాత నీ ఇష్టం'అని ముందుకు వెళ్లిపోయింది . చెల్లికి నాకు కళ్ళు పండుగే పండుగ,మొదట కనపడినవి కాక దానికి కొంచెం దూరం లోనే కుప్పగా వజ్రాలు పోసివున్నాయి .నేను పుస్తకాల పెట్టె ఖాళి చేసేసి పుస్తకాలు చెల్లి చేతిలో పెట్టి ఆ డబ్బా నిండా నింపుకుని మాకోసం ఎదురు చూస్తున్న అక్కని దాటుకుని ఇద్దరం ఇల్లు చేరేము,వాటిని ఎక్కడ దాచాలో మాకు సమస్య అయ్యి పెరటిలో వున్నా మామిడి చెట్టు మూలలో పోసి ఇసుకతో కప్పి పెట్టాము . ఖాళి చేసిన పుస్తకాల పెట్టి పట్టుకుని ఇద్దరం ఇల్లు గేటుతుంటే మా అమ్మ ఇద్దర్ని కేకవేసింది,'ఎక్కడికి మళ్ళాపెట్టె పట్టుకుని బయలుదేరారు 'అని.మా అక్క మాకు ఎదురు రానే వచ్చింది అంతలోపు..మా దగ్గర సమాధానం లేకఆ రోజుకి విరమించుకున్నాం .మా అక్కని తీసికెళ్ళి పెరటిలో దాచిన వజ్రాలు చూపించాం రహస్యంగా,అక్క వాటిని చూసి ముచ్చటపడింది కాని ఇవి వజ్రాలు కావేమోనని సందేహం వెలిబుచ్చింది,అయినా అక్కడ మిగిలినవి కూడా అక్క బాక్స్ లోను మా బాక్స్ లోను నింపి తెచ్చేయాలని ఆలోచన చేసాము.ఆ రాత్రంతా మా కబుర్లు అవే ,మిగిలినవి అక్కడ వుంటాయో ఎవరైనా పట్టుకు పోతారోనని .మరునాడు ట్యూషన్ కి వెళ్ళే దారిలో వాటికోసం చూసాం ,మిగిలినవి అన్నీ అలానే వున్నాయి .మా ట్యూషన్ కావడం ఆలస్యం అక్క బుక్స్ బాక్స్ నుండి తీసేసి ,మా బుక్స్ కూడా అక్క చేతిలో పెట్టి ముందుగా వెళ్ళిపోయి రెండు డబ్బాల నిండుగా చెమటలు కారుకుంటూ నింపుకుని మా స్థావరం లో పోసాము .ఈ విషయం చాల గుట్టుగా మా అమ్మకి తెలియనీయకుండా జాగ్రత్తపడ్డాము,బహుశ కథల ప్రభావం వల్ల సీక్రెట్ గా వుంచామేమో ఇప్పటికి అర్ధం కాదు . మొత్తానికి మేమేదో సాహసం చేసి వజ్రాలు సంపాధించుకున్నట్లు ఘనంగా బావించాము .
ఒక ఆదివారం పెరట్లో మేము నల్గురం ఆడుకుంటూ ఆలీబాబా సినిమాలో లా వజ్రాలు లేక్కలేసి కొలుద్దాము అని మొత్తం ఇసుకనుండి త్రవ్వి మా ఇంట్లో భియ్యం కొలిచే సోల తో కోలుస్తుండగా మా చిన్ని చెల్లె రెండేళ్లది మా దగ్గరకి ఆడుకోవటానికి వస్తే దాని రెండు బుల్లి చేతుల నిండా వజ్రాలు పోసాను మురిపెంగా.అది రెండు గుప్పెళ్ళనిండుగా పుచ్చుకుని మా దగ్గరనుండి ఎప్పుడు ఇంట్లోకి వెళ్లిందో గమనించలేదు ,మా అమ్మ కంగారు పడుతూ మా దగ్గరికి వచ్చి ,' చంటిదాని చేతికి గాజుపెంకులు ఎవరిచ్చారు,ఎక్కడివి అవి ,నాన్న విడిపిస్తున్న వదలడం లేదు'అంటూ ఆందోళన గా అడుగుతూనే మేము ఆడుతున్న వజ్రాలను చూసి కెవ్వున అరిచింది ,ఎంటివి ఇక్కడికి ఎలా వచ్చాయని ...ఆ క్షణాన మాకేం అర్ధం కాలేదు ,..'ఇవి వజ్రలమ,నేనుచెల్లి తెచ్చాం 'అని గర్వంగా చెప్పాను .ఇంతలో మా నాన్న రావడం చెల్లిని ఎత్తుకుని ,దాని చేతిలోవి నాన్న చేతిలో వున్నాయి...నాన్న ని చూసి అమ్మ మొత్తం కథ చెప్పడం నాన్న మొఖం చాల కోపంగా పెట్టుకుని ,మా అమ్మ ని బాగా తిట్టారు పిల్లలు ఎమ్చేస్తున్నారో కనీసం గమనించడం లేదని...అనక మా ముగ్గుర్ని విచారించి మా అక్కని అందరిని లోపలి పొమ్మని నన్ను చెల్లిని అలానే నెల మీద మోకాళ్ళ మీద సాయంత్రం వరకు కూర్చోమని ,నాన్న చైర్ తెచ్చుకుని పెరట్లో మా ఎదురుగానే పేపర్ చదువుతూ కూర్చున్నారు,మధ్యమధ్యలో 'ట్యూషన్ కి పంపిస్తే అవలాగా పెంకులు ఎరుకుంటార'అనిసుప్రభాతం చదువుతూ మద్యాహ్నం భోజనాల సమయానికి ఇద్దర్ని లేపి ,మరొక్కసారి అలాటివి చేయకూడదని హెచ్చరించారు ,హెచ్చరించ్డమే కాక మా భ్రమలు తొలగించారు ఆ 'వజ్రాలు'ఏమిటో వివరించారు.
ఇంతకి మేము సంపాధించుకొచ్చిన 'వజ్రాలు' ఒక లారీ ఆక్సిడెంట్ అయినా తాలుక గాజుముక్కలూ .,లారీ ముందున్న అద్దం పగిలి నుజ్జుగా అయ్యి స్పటికం లా చిన్న చిన్న మెరిసే రాళ్ల లా వున్నాయి,కొంచెం గట్టిగ పట్టుకుంటే చేతులు కూడా తెగుతాయి ..రోడ్ల మీద ఇప్పుడు అలాటివి కనబడిన చెల్లికి నాకు అవే జ్ఞాపకాలూ ,అప్పుడప్పుడు తలుచుకుని నవ్వుకుంటాం.ఎంత అమాయకమైన రోజులో తిరిగి అక్కడికి వెళ్లి పోవాలని అనిపిస్తుంది.

12, ఆగస్టు 2009, బుధవారం

"గంట గడిస్తే చాలు"

అవి నేను కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. మేము నివసిస్తున్న ఊరికి అరవయ్యి మైళ్ళ దూరం లోని ప్రక్క జిల్లా లో నా మొదటి పోస్టింగు ..మావారిది సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం కావడం వలన ,పాప చదువు వలన నేనే మూడు సంవస్తరాలు రోజు నేనున్నా ఊరి నుండి గంట ప్రయాణం చేసి వెళ్లి సాయంత్రం మరల ఇల్లు చేరేదాన్ని.పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన ఆ ఊరిలో ఎవరు వుండటానికి ఇష్టపడక మేమున్న సిటీ నుండే వందల్లో షటిల్ చేసేవాళ్ళు .రైల్లో గంట లేక నలభయ్యి నిమిషాలు పట్టేది మాకు ఉదయం,సాయంత్రం అనుకూలంగా సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ లుండేవి వందల్లో వున్నా మా తోటి ఉద్యోగస్తులతో ప్రయాణం అస్సలు తెలిసేది కాదు .ఎప్పుడైనా అత్యవసరం అయినపుడు ఏదొక ట్రైన్ లో వెళ్ళిపోయేవాళ్ళం .

ఒకరోజు అత్యవసరంగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చి ట్రైన్స్ కోసం వాకబు చేస్తేస్వర్ణజయంతి ఎక్ష్ప్రెస్స్ వుందని విజయవాడ వెళ్ళేవరకు ఎక్కడ ఆగదని కాకపొతే ట్రైన్ ఖాళీగా వస్తుంది కాబట్టి రిజర్వ్షన్ భోగి ఎక్కడం అంత సేఫ్ కాదు జెనరల్ఎక్కమని నాకూడా వచ్చిన సబ్ స్టాఫ్ చెప్పారు .వారు చెప్పినట్లే ట్రైన్ కి చివరిలో వున్నా భోగీ లలో ఆడవాళ్ళు కిటకిట లాడుతుంటే గబాల్న నేను ఎక్కడం ట్రైన్ కదలడం జరిగిందీ.అన్ని సీట్లు కలర్ఫుల్ గా వున్నాయి ఒక చోట ఇద్దరు ప్రక్కకి జరిగి నాకు మద్యలో సీట్ ఇచ్చారు నేను నా అలవాటు ప్రకారం నా హ్యాండ్ బాగ్ లోనుండి చదువుకోవడానికి పుస్తకం తీసుకుంటువుండగా ప్రక్కనుండి మగవాళ్ళ గొంతు వినబడింది ,ఎవరున్నారా అని నేను తలెత్తి చూడగా దరిదాపుల్లో ఎవరు లేరు ...కాని చూస్తున్న నేను ఒక్కసారే ఉలిక్కిపడ్డాను ...నా గుండె జారిపోయిందినా కాళ్ళ లో వణుకు ,నా గుండె చప్పుడు అతి స్పష్టంగా ఏడ్పు ఒక్కటే తక్కువ నా కళ్ళు పుస్తకంలో అతుక్కున్న మెదడంతా మొద్దుభారిపోయి ముడుచుకుపోయి కూర్చున్నాను వాళ్ళ లో వాళ్ళు ఒరియానో ,హిందినో గోలగోలగా మాట్లాడుకుంటున్నారు .మొత్తం కంపార్ట్మెంట్ అంతా 'హిజ్రా'లే వాళ్ళంతా దూరం నుండి ఎక్కడికో వెళ్తున్నారు.నిజానికి వాళ్ళు కనీసం నన్ను పలకరించలేదు,జరిగి మరీ ప్లేస్ ఇచ్చారు.కాని నాకు వారంటే చిన్నప్పటినుండి విపరీతమైన 'భయం'అదీ ఇప్పటికి పోలేదు
వాళ్ళు తరుచు రత్నాచల్,పినాకిని లలో చప్పట్లు కొడుతూ అక్కా,బావ అంటూ మీదమీదకివచ్చి డబ్బులు అడుగుతూ అదే అబ్బాయిలనైతే ఇక చెప్పనవసరంలేనంతగా విపరీతంగా ప్రవర్తిస్తారు.వాళ్ళ చప్పట్లు వినగానే ముడుచుకుపోతాను ,వారి వైపు చూడటానికి ఇష్టపడను,వాళ్ళు నా దగ్గరనుండి కదిలేవరకు టెన్షన్ అనుభవిస్తూనే వుంటాను .నాతోటి సిజనర్స్ నన్ను ఎప్పుడు భయపెట్టేవాళ్ళు ...వాళ్ళు వస్తున్నారు,ఇదిగో అదిగో అంటూ.అటువంటి భయం కలిగిన నేను గంటసేపు వాళ్ళ మద్య గడపడం,ఎప్పుడెప్పుడు నా గమ్యం చేరతానా అని భిక్కు భిక్కుమని ఎదురుచూస్తూ ,ఆఖరికి స్టేషన్ వచ్చాక దిగడానికి ఓపిక లేనంతగా నీరసపడిపోయాను.కార్ లో కూలబడి మావారిని చూసి భోరుమని ఏడ్చేసాను,అప్పటివరకు అతి కష్టం మీద ఆపుకుని :)విషయం తెలుసుకుని ఇంత చిన్నవాటికే బెదిరిపోయే నీవు ఇంకా ఉద్యోగం చేయగలవా అని హాస్యమాడారు .ఆ అనుభవం నన్ను చాల కాలం పీడకల లా వెంటాడింది.వాళ్ళంటే నాకు జాలే,కాని వారి ప్రవర్తన నచ్చదు .భగవంతుడికి ఎందుకింత పక్షపాతమో .....ఎందుకిలా సృస్టిస్తాడో.....లోతుగా ఆలోచిస్తే చాల భాధగా అన్పిస్తుంది ....ఇంత ఆలోచించిన వాళ్ళంటే ఇప్పటికి 'భయమే'
('నాకు హిజ్రాలంటే ఒళ్ళు మంట ' టపా కూడలి లో చదివాక రాయలన్పించింది )

6, ఆగస్టు 2009, గురువారం

కార్ డ్రైవర్ కథ -2

అనుకోని పరిస్థితిల్లో చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చిందన్నాడు .పని వుంటే ముందు రోజు చెప్పమని కొంచెం గట్టిగానే హెచ్చరించాను.ఇలా ప్రతివారం లో నో పదిహేను రోజులకో హటాత్తుగా రేపు రానండి ,సెలవు కావాలనేవాడు .ఒకరోజు విసుగొచ్చి అడిగాను ,'నీకు యేం బాద్యతలు వున్నాయి బాబు అస్తమాను ఇలా సెలవలు పెడుతుంటావు 'అని .విచారించగా తేలినది ఏమంటే అతను కోర్ట్ కి అటెండ్ కావాలట ,ఎందుకంటె వాళ్ళ నాన్న స్థలం తాలుక ఆస్తి తగాదాల్లో వాళ్ళ నాన్న కి ఓపిక లేదని అతను హాజరు కావలసి వస్తుందన్నాడు .ఒక ఐదు ఆరు నెలల లో అయిపోతాదని చెప్పాడు .అతను మానేసిన రోజు ఒకసారి మా ఎదురింటి డ్రైవర్ ని అడిగాను,ఈ అబ్బాయి సంగతేంటని ,అతను పొంతన లేని సమాదానం చెప్పాడు .కోర్ట్ కి వెళ్ళాలని చెప్పాడు నాతో అనేసరికి,చెప్పాడామీకు అని అతను బోల్డంత ఆశ్చర్యపోయాడు .తనకి సరిగ్గా తెలీదని దాటవేశాడు.
ఆ అబ్బాయి నెమ్మది నెమ్మదిగా చేసినంత వరకు పద్దతిగా చేస్తూవుండటం తో ,అతను సెలవు పెట్టిన పెద్దగ పట్టించుకునేవాళ్ళం కాదు .ప్రక్క వీధిలో వున్నా మా అమ్మ వాలింటికి పనుల మీద పంపడం ,చెల్లి ,తమ్ముడు పిల్లలోచ్చిన ఒక్కరినే అతని తో పంపడం చేసేదాన్ని .ఒకరోజు చిన్న చెల్లి నాకు వార్నింగ్ ఇచ్చింది ,మరీ నమ్మేసి పిల్ల లిని అలా అతని కూడా పంపించోద్దని. ఆమె అన్నప్పటి నుండి నేను అతన్ని గమనించడం మొదలెట్టాను.ఎప్పుడు కార్ ఎక్కబోతున్న సన్నగా పాటలు వినిపిస్తుండేవి..ఆలకించగా అభినందన లోని 'మాటరాని మౌనమిది' అసలు ఎప్పుడు చుసిన అదే పాట ఎంతిష్టం ఐతే మాత్రం అస్తమానం ఇదే వినాలా అని ,అది అవ్వగానే ఆఫ్ చేసేసేవాడు .నాకు వుండే కొద్ది అర్ధం అయ్యింది ,నేను ఎక్కే ముందే అది ఆన్ లో పెట్టి అయ్యాక ఆపుతున్నాడని ,ఇక ఇంట్లో చర్చ పెట్టాను వీడు ఇదే పాట కావాలనే పెడుతున్నాడని ...ఉహు ...ఇంట్లో మావారు ,పాప ఒప్పుకోరు ,పాపం వాడికి పాటల పిచ్చితో ఇష్టమై అదే వింటున్నాడు అనేవాళ్ళు.వాళ్లంతా వున్నప్పుడు ఎఫ్.యేం పెట్టేవోడు .ఒకరోజు నేను ఒక షాప్ లో వుండగా దగ్గరలో పార్కింగ్ లోనుండి గట్టిగట్టిగా "నిన్నేనిన్నే దిల్సే ....వాయే వాయే "వస్తుంది,ఇంతకీ అది మా కార్ నుండే,నేను దగ్గరికి వచ్చాక బాగా తగ్గించేసాడు ,నేను కొంచెం కటువుగానే "ఏంటయ్యా ఈ పాటలు,ఎక్కడినుండి పట్టుకోచ్చావు నాయన "అన్నాను .కొత్తవండి 'దేశముదురు 'లోవి మేడం చాల బాగున్నాయండి అని,వాడి సమాదానం.వాడు అభినందన మార్చి వినవె వినవె మొదలెట్టాడు .అతని ప్రతి కదలిక నాకు విపరీతంగా గోచరించడం నాకు నేను సర్దిచేప్పుకోవడం అనవసరంగా వాడిని అనుమానిస్తున్నానేమోనని .
నేను కొంచెం దూరం వెళ్ళేప్పుడు పుస్తకాలు నా కూడా వుంటాయి ,అదే నాకు తీరిక టైం కూడా .ఒకరోజు చదువుతూ ఎందుకో హటాత్తుగా తలెత్తి చుస్తే కార్ వ్యూ మిర్రొర్ లోనుండి ఆ వెధవ నన్నే చూస్తున్నాడు కంగారుపడి చూపులు తిప్పేసుకున్నాడు .నేను గమనించనట్లు ఊరుకుండిపోయాను.తరువాత అదే పరిస్థితి రోడ్ వెనుక వచ్చే వాహనాలకు వుండాల్సిన పోసిషన్ వెనుక సీట్కిపరిమితం అయ్యింది .డౌట్ లేదు వీడో క్రిమినల్ అని నాకు అర్ధం అయ్యి ,ఇక ఈ డ్రైవర్ మనకి వద్దు అని జరుగుతున్నది చెబుతుంటే మా వారు సంశయం లో పడ్డారు,నేను ఊరకనే అనుమానిస్తున్నానని.వాడు యధాప్రకారం మరునాడేదో కోర్ట్ అన్నాడు, సరే ప్రస్తుతం అవసరం లేదు కబురు చేస్తాం అన్నాను వాడు నా మొహం లోకి సిరియస్ గా చూస్తూ పోయాడు ,మరునాడు నేను ఇంట్లో లేని టైములో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసిఫోన్ లిఫ్ట్ చేసిన మా అమ్మాయి తో అమ్మకివ్వు అని కాస్త తేడాగా మాట్లాడడు,మమ్మీ ఆఫీసు లో వుంటారుగా అక్కడికే మాట్లాడమని పాప చెప్పడం తో నా ఆఫీసు కి ఫోన్ చేసి చెత్త చెత్త వాగుడు బాగా తాగేసి వున్నట్లున్నాడు వినకుండా పెట్టేసాను .మరునాడు వాళ్ళ నాన్న,అక్కల్ని తీసుకొచ్చి పనిలో పెట్టుకోమని ఒకటే బ్రతిమాలడం .వాళ్ళేమో అమాయకంగా వీడు చాల మారాడు బుద్ధిగావుంటున్నాడు అని,అవసరం అయినపుడు పిలుస్తానులే అని చెప్పి పంపించేసాను.అతన్ని పెట్టిన ఎదురింటి డ్రైవర్ రవి ని గట్టిగ నిలదీసాను ,ఎందుకు అలాంటివాడిని పెట్టావని,వాల్లిన్ట్లోవాళ్ళు చాల మంచోళ్ళు వాళ్ళు చెప్పడం వల్లపెట్టాను మారాతాడనుకున్నమమ్మఅని క్షమార్పణలు చెప్పాడు .ఇంతకి మొత్తం ఆర తీస్తే ఇతను ఏదో గ్యాంగ్ కేసులో ఉండి బెయిల్ మీద బయట వుండి చెడు సావాసాలు వదలలేకో ,పుట్టుకతో వచ్చిన గుణం ఏదైనా వుంటే వదల్లెకో తన 'బుద్ది'చూపించుకుంటున్నాడు..........ఇంకో డ్రైవర్ కథ త్వరలో .

5, ఆగస్టు 2009, బుధవారం

" కారు డ్రైవర్ కథ "

కథ శీర్షిక చూసి బోల్డంత ఆశ్చర్యపోతున్నారా !నాలుగు నెలల క్రితమే 'అనంతం 'బ్లాగ్ లో చూసాముకదా అని మరల ఇదేమీ కాపీ కథ అనుకుంటే అది నా తప్పు కాదు. మనకు .ఎదురయ్యే సంఘటనలతో ఎన్నో చెప్పొచ్చు .అతి జాగ్రత్తగా ఎంచుకోవలసిన వ్యక్తుల్లో వీరు వస్తారు ..నిజమే కదండీ మన నిత్య జీవితం లో మనం ఆధారపడే వ్యక్తిల్లో పనమ్మాయి ,డ్రైవర్లు నా వరకు ముఖ్యమైన వాళ్ళే .ఇపుడు ఏ ప్రభుత్వకార్యలయాల్లో కండిషన్ బండ్లు లేక ,కొనడానికి పర్మిషన్ లేక సెంట్రల్ ,స్టేట్ గవర్నమెంట్ లో ప్రవేట్ వెహికల్స్ ఇయర్ కి హైర్ చేయడం తో కారు డ్రైవర్లు ప్రవేట్ వ్యక్తులై వుంటారు.ఆఫీసు కార్ డ్రైవెర్ కన్నా ముందు ఇంట్లో కార్ డ్రైవెర్ కథ చెప్తాను . .మూడేళ్ళ క్రితం ఇంట్లో వున్న స్వంత కార్ కి మావారెంత వారిస్తున్నా వినకుండా డ్రైవర్ ని పెట్టాను .తనకి స్వంత డ్రైవింగ్ మీదే నమ్మకం ,నా గోల పాప గోల భరించలేక ఒప్పుకున్నారు.... ఆ డ్రైవర్ ని మా ఎదురింటి డ్రైవర్ తీసుకొచ్చాడు ,ఎదురు మార్వాడి దగ్గర పదేళ్ళ నుండి నమ్మకం గా పనిచేసే అబ్బాయి ఇలా అతన్ని తేవడం వలన గొప్ప నమ్మకం తో అప్పటికప్పుడే కుదిర్చేసాను/అతనికి ఓ పాతికేళ్ళు వుండొచ్చు.
.ఆ డ్రైవెర్ తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగాని,అన్న అక్కలు మంచి చదువులు చదివారని , ఇతని కి మాత్రమె చదువబ్బక డ్రైవింగ్ నేర్చుకుని ఇలా పనులు చేస్తున్నాడని చెప్పాడు.మేము ఇచ్చే జీత భత్యాలకు ఎదురు ఇంత కావాలని అడగకుండా పనిలోకి చేరిపోయాడు .

ఆ అబ్బాయి చాల పద్ధతి గా టైం కి రావడం నీట్ గా కార్ తుడుచుకోవడం చూసి మావారికి చాల ముచ్చటేసింది ..పోనిలే ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావు అని మనకు కీతాభుఇవ్వటం జరిగిందీ .ఎక్కువ పని వుండేది కాదు ,చక్కగా చెట్ల క్రింద కార్ పార్క్ చేసుకుని ఎఫ్ .యెమ్.వింటునో ,సీ.డి లు వింటూ పేపర్ పుస్తకాలు బుద్దిగ చదువుకుంటూ వుండేవాడు.ఒకరోజు చెప్పాపెట్టకుండా మానేసాడు .మరుసటిరోజు వచ్చి చాల అర్జెంటుగా ఊరెల్లాల్సి వచ్చిందన్నాడు ( మిగిలినది రేపు )

3, ఆగస్టు 2009, సోమవారం

"యెగతాళి "

నాకు ఇప్పటికి అర్ధం కాని విషయం ఒకటుంది .మనిషి పుట్టుక తన చేతుల్లో లేదని ,తను ఒక మతంలోనో ,కులంలోనో ,ఒక వర్గంలోనో (అది ధనిక,పేదాకావొచ్చు)ప్రదేశంలోనో లేదా ఆడ,మగ గానో ,రంగుఆకృతి లోనో
పుట్టడానికి తన ప్రమేయం ఎంత మాత్రం లేనిదని తెలిసినా ,ఇది సత్యమని జగద్వితమైన ,కొందరు అవివేకులు మూర్ఖంగా యెగతాళి చేస్తూ పైశాచీకానందం పొందుతరెందుకో? జన్యుపరంగా మనకు సంక్రమించిన వాటిగురించి మాట్లాడి యెగతాళి చేయడం వివేకవంతుల లక్షణమైతే కాదు .మానవుని బలహీనతే అది ,ఎదుటి వ్యక్తిలోని మంచి లక్షణాలను వదిలేసి ఏదైతే తక్కువ కనిపిస్తుందో దాని మీదనే మాట్లాడటం !
నిన్న మా దగ్గర భందువుల ఇంట్లో పెళ్లి జరిగితే వెళ్ళడం జరిగిందీ.అమ్మాయి ,అబ్బాయి ఇద్దరు మాకు దగ్గర వాళ్ళే కావటంతో పైగా మేమంతా దగ్గరదగ్గర నివాసం వుండటం తో వచ్చేపోయే బంధువులతో మా ఇంట్లో కూడా కొంత హడావిడి చోటుచేసుకుంది.ఇలా బందుమిత్రులంత ఎప్పటికో కలవడం సరదాగానే వుంది .చాలాకాలం క్రిందట చుసిన బంధువులను కలవడం జరిగిందీ .మా బంధువుల్లో మా వారికి చెల్లె వరుస అయ్యే అమ్మాయి నిన్న చాల విసిగించింది.ఇటువంటి వారిని చుస్తే ఎందుకు కలిసాంర బాబు ,ఇక్కడినుండి మనమో వాళ్ళో మాయం అయితే బాగుండుననిపిస్తుంది.కొందరికి వయస్సు పెరుగుతుంది కాని జ్ఞానం,సంస్కారం మాత్రం క్రింది స్థాయిలోనే ఉంటాయి .అదే కోవకి చెందినది ఈ అమ్మాయి.ఆ అమ్మాయి పలకరింపులు కూడా చాల వ్యంగ్యంగా ను వేళకోళంగా వుంటాయి. ఆమె వచ్చిరాగానే నన్ను చూస్తూ "ఏంటి అప్పటి నుండి అలానే వున్నావు ,ఏమాత్రం గుప్పెడంత పెరిగినట్లేవు?"అన్నది .మొదట నాకు అర్ధం కాలేదు ,పెరగడం ఏమిటి అదీ ఈ వయస్సులో అని ఆలోచిస్తుండగా తట్టింది ఆమె చాల నిగుడమైన అర్ధం తో పలకరించిందని ,తనదైన తరహలోనని .నా ముఖం పై రాని నవ్వు పులుముకుని 'దేని గురించడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదు 'అన్నాను ."అదే నీ ఎత్తు గురించి అప్పటికి ఇప్పటికి ఏ మార్పు రాలేదు "వంకరగా నవ్వుతు అన్నది.'ఓహో నా ఎత్తు గురించా ఇంకా ఏమి పెరుగుతాం పెరిగే వయస్సు దాటి చాల కాలం అయ్యిందిగా అడ్డంగా పెరగమంటే పెరుగుతాం కాని నిలువుగా కష్టం కదా 'అన్నాను ఒకింత తీవ్రమైన స్వరంతోనే .ఆమె కొంచెం తత్తరపడిన తగ్గకుండా "నీవు ఎన్నైనా చెప్పు మా అన్నాముందు దిగదుడుపే "అన్నది .
నాకైతే ఆమె ప్రవర్తన అర్ధం కాలేదు ,ఎన్నో ఏళ్ళ తరువాత కలిసాము ,పైగా నేను వెళ్లేదే తక్కువ తీరిక వుండక.ఈమె నా పెళ్ళయిన క్రొత్తలో అత్తగారింట్లో మా ముగ్గురు ఆడపడుచులతో పాటు నన్ను టీజ్ చేయడం ఇప్పటికి నేను మరిచిపోలేదు.వాళ్ల అన్నయ్య ప్రక్కన నేనేమాత్రం చూడటానికి బాగోలేదని దానికి కారణం ఆయన చాల పొడవు వున్నారని నేనేమో తక్కువగా వున్నానని .అప్పుడు నాది మరీ చిన్నతనం ,పైగా అదంతా కొత్త వాతావరణం వలన మాటకీ మాట అనలన్పించినా బిడియం తో భేలగా వాళ్ళేమి అంటున్న మౌనంని ఆశ్రయించేదాన్ని .పోనీ నన్ను యెగతాళి చేసిన వారేమైనా సూపర్ గ్రోమోరే ఎరువు తో ఏపుగా ఎత్తుగా వున్నారా అంటే ..ఉహు ...నా అంతే ఇంచుమించుగ.:) మా పెద్దఆడపడుచు మాత్రం "నీవు మా అన్నా ప్రక్కన నడవాలంటే హై హీల్స్ వేసుకుని నడవాల్సిందే "అని కండీషన్ . నేను ఆగలేక ఒకరోజు అనేసాను 'మీ అన్నా ఏమైనా అమితబచ్చాన అంత ఎత్త లేదా నేనేమైనాజయబాధురి ల ప్రక్కన వున్ననా ,మరీ అంత తేడ అనిపించినా పట్టుబట్టి ఎందుకు చేసుకున్నారని 'నవ్వుతూనే అన్నాను.

వాస్తవానికి అక్క ,నేను మాత్రమె మిగిలినవారికన్నా హైట్ తక్కువ ,అది మేమెప్పుడు లోపంగా బావించలేదు .ఏదో నాయనమ్మో తాతలవో జీన్స్ అనుకునేవాళ్ళం .మొదటిసారిగా పెళ్ళయ్యాకే ఎదుర్కున్నాను.అప్పటి సంఘటనా నా మనస్సులో గాడంగా ముద్రపడిపోయింది. మా పాప వాళ్ల అత్తల్ని ఇప్పుడు టీజ్ చేస్తుంటది కావాలనే ...వాళ్ల పిల్లల హైట్ గురించి ప్రస్తావించి , ఎందుకంటే ఎవరు పాపంత వుండరు ,అలా మాట్లాడకూడదు అని చెప్పిన ,'లేదు మమ్మీ ఆ ఫీల్ వాళ్ళకి తెలియాలి 'అంటు నవ్వుతుంటుంది .

ఇంతాజేసి కట్టుకున్న వాడు ఎప్పుడు ఒక్కసారి కూడా పోల్చుకోలేదు ,తగినదానివి కాదు అనలేదు .:) ఇంట్లో వాళ్లకు లేని బాద ఊళ్ళో వాళ్లకు ఎందుకో అర్ధం కాదు .ఒక్కటి మాత్రం తెలుసుకున్నాను 'వివేకంతో మాట్లాడేవారు ఒక్క మాటన్న ఎంతో ఆలోచించాలని ,అవివేకులు వంద మాటలు మాట్లాడిన వాటికేమాత్రం విలువనివ్వకుండా వదిలేసేయాలని '.



'

31, జులై 2009, శుక్రవారం

నా బహుమతి 'పుస్తకం'

ఈ మద్య ఒక నవలని మరల చదవవలసినపుడు దానికోసం పుస్తకాల షెల్ఫ్ అంతా గాలించినా దొరకలేదు .ఎమైపోయిందబ్బా అని ఆలోచిస్తుంటే ఫ్లాష్ బాక్ లు కళ్ళ ముందు గిర్రున తిరిగాయి సినిమాల్లో లాగ.అప్పుడప్పుడు వచ్చే స్నేహితులు నచ్చిన పుస్తకాలు తీసుకుపోయి వాళ్ళిష్టం వచ్చినపుడు అంటే యాడదికో ,ఆర్నేల్లకో మళ్ళి తీసుకొచ్చిపడేయడం ,అలా ఆ పుస్తకానికి రెక్కలొచ్చి ఉంటాయని సరిపెట్టుకుని ఇంకోటి తెచ్చిపెట్టుకున్న .అలా అని నేను పుస్తకాలు ఎవరి దగ్గర తీసుకొని చదవనని కాదు , ఒకవేళ తీసుకున్న సదరు యజమానికి చెక్కు చెదరకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను , పైగా ఆ పుస్తకానికి అట్ట వేసుకుని మరి చదువుతాను యధాతధం గా ఇవ్వాలనే ప్రయత్నంతో . నాకో చెడ్డ అలవాటుంది ,చదవడం తో ఆపకుండా చదివిన దాన్ని గురించి ఎవరోకరి తో చెప్పడం ,వాళ్లు ఆ పుస్తకం చదవాలనుంది ఇవ్వమని అడగడం ,సదరు పుస్తకం అడిగిన వాల్లెంటపడికూడా పోవడం అది మనింటి మొహం చూడడానికి నెలలు పట్టడం ,ఒక్కోసారి జాడలు కూడా లేకపోవడం , మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు కనిపించినవల్ల చదువుతాడు ,చదివి దాన్ని ఎక్కడ వదిలేస్తాడో తెలీదు ,అదేమంటే చదివేసాంగా అంటాడు ,తన దగ్గరికి పుస్తకాలు వెల్లాయంటే ఆశలు వదులుకోవాల్సిందే .తనని తరుచు విసుక్కుంటాను ,జాగ్రత్త లేదని ,...చిన్నప్పుడైతే ఎవరికైనా ఏవైనా ఇస్తే అడిగేసేదాన్ని ,ముఖ్యంగా పుస్తకాలు లాటివి . ఇప్పుడైతే అడగడానికి చచ్చే మొహమాటం. నా చిన్నతనం లో జరిగిన సంఘటనా తరుచు గుర్తోస్తుంటాది,అదీ చెప్తాను .

అవి మేము చిత్తూర్ లో వున్నా రోజులు .అప్పుడు నేను అయిదు ఆరు తరగతులు చదివాను .అప్పటికే వేసవి తరువాత క్లాసు లు మొదలయ్యి రెండు నెలలు దాటి పోయాక ఒక ప్రభుత్వ స్కూల్లో మమ్మల్ని చేర్పించారు. మేము సంచార జాతికి చెందినోల్లం కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడి వాళ్ళతో కలిసిపోతామన్నమాట :) మరి ఏడాదికో ఊరాయే . అక్కడ చదువు తో పాటు ఆటపాటలు ,అనేక సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్లు . అక్క ,నేను అన్నింటా పార్టిసిపేట్ చేసేవాళ్ళం .ఒకసారి చిల్డ్రెన్స్ డే సందర్భంగా భారిగా పోటీలు నిర్వహించారు .నేను పాటలు,నృత్యం,పైంతింగ్,వ్యాస రచన ,వక్రుక్త్వ (స్పీచ్) పోటీలు అన్నిటికి నా పేరు ఇచ్చేసా ,అస్సలే మనం జాక్ అఫ్ అల్ ట్రేడ్సే కదా ముందు వెనుక ఆలోచించకుండా గొప్పగా దూకేసాం .అన్నింటిలో పాల్గొని చిన్నదో పెద్దదో బహుమతులు గెలుచుకున్నాం ,ఏమి లేని చోట ఆముదం వృక్షం చందాన ....అసలు కథ ఇక్కడ మొదలయ్యింది ,వక్రుత్వపు పోటిలకు పేరు ఇచ్చాను కాని ,అదేంటో నాకు సరిగ్గా తెలిదు ,ఆ రోజు మద్యాహ్నం నుండి మా అక్క ప్రాణం తీసేసా , ఎలా మాట్లాడాలి ,ఏమి మాట్లాడాలని ,అక్క తో తిట్టించుకుంటూ నేను మాట్లాడవలసిన 'గ్రంధాలయాలు ' మీద రాయిన్చుకున్నాను.చూడకుండా అంతమంది ముందు స్టేజి మీద చెప్పడం ఆ రోజుల్లో నాకు హీర్కులియన్ ఎఫ్ఫోర్ట్ అని చెప్పొచ్చు .రెండు ,మూడు సార్లు తన ముందు ప్రాక్టిస్ చేయించింది .సరిగ్గా చెప్పడం లేదని 'గ్రంధాలయాన్ని'బట్టి వేయించింది .(మనకి లెక్కలు కూడా స్టెప్ ల తో సహా బట్టి వేయడం అలవాటే )...భయం వేస్తె ఎవరి వంక చూడకుండా చెట్ల వంక ,ఆకాశం వంక చూస్తూ చెప్పెసేయమంది .

నా పేరు స్టేజి మీద పిలవగానే నా కాళ్ళ లో వణుకు వచ్చేసింది .,నిజానికి నాకు పాటలు ,డాన్సులు అందరి ముందు చేయడం కొత్తేమి కాదు ...మైక్ ముందు ఒంటరిగా స్పీచ్ నాకు కొత్త . మైక్ ముందు అందరిని చూస్తూ బేలగా వుండిపోయాను ,మా టీచర్ జడ్జి లు సైగలు చేయడం తో మా అక్క కోసం వేదికను ధైర్యం కోసం ...ఇక లాభం లేదని మెదడంతా బ్లాంక్ అవ్వుతుండగా గొంతు సవరించు కుని సభకు ,ప్రధాన ఉపాధ్యాయునికి నమస్కారాలు చెప్పి ఇలా మొదలెట్టాను "గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము"అని రెండు సార్లు చెప్పి ,అనక ఒక్క ముక్క గుర్తు రాక ఎదురు కూర్చున్న జనాలే మనస్సంతా నిండిపోయి ,ఏడుపొచ్చి ,నన్ను రక్షించేవారే లేరా ఇక్కడ అని ,బేల చూపులు చూస్తున్న నన్ను మా క్లాసు టీచర్ చొరవగా స్టేజి మీద నుండి దిగి పోవడానికి సహాయపడ్డారు.

ఇక చుడండి నా తరువాత ఒక్కొక్కరు మాట్లాడేవాళ్ళు తమ పేర్లు పిలవగానే రావడం ,దిక్కులు చూస్తూ నోరు పెగలక వెళ్లి పోవడం .ఆఖర్న వెంకటరత్నం అనే అబ్బాయి స్ప్పేడ్ గ వచ్చి అందరికి నమస్కారాలు గబగబా చెప్పేసి ,తను మాట్లాడబోయే టాపిక్ మరిచిపోయి బుర్ర గోక్కుంటూ నిలబడి పోయాడు అలా జునియర్ విభాగం పోటీలు ముగిసాయి .ఆ పోటికి సంభందించి మొదటి ,రెండో భాహుమతులు మా హెడ్ మాస్టర్ అప్పుడే స్టేజి మీద ప్రకటించారు ఫస్ట్ నాకు ,సెకండ్ వెంకటరత్నం కి ఇచ్చారు .ఇంటికెళ్ళే దారంతా అక్క నన్ను తిడుతూనే వుంది ,ఇంట్లో అందరికి చెప్పి నవ్వడం , "అయితేనేం నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినదిగా "అని సిగ్గులేకుండా వాదన పెట్టుకున్నాబహుమతి ప్రధానం చిల్డ్రన్స్ డే నాడు జరిగిందీ .అక్కా ,నేను చాల తెచ్చుకున్నాము .వ్యాస రచనకి ,ఎలాక్త్యుషన్ కి పుస్తకాలు బహుమతులుగా ఇచ్చారు .నా వ్యాస రచన కు మొదటి బహుమతి "పాయసం తాగిన పిచ్చుక " నా బ్రహ్మాండ మైన ప్రసంగానికి "చరిత్రకెక్కిన చరితార్ధులు "అనే పుస్తకం ఇచ్చారు .

ఒకరోజు అంటే ప్రోగ్రామం అయిన రెండు రోజులకు అనుకుంటాను , మాకు సోషల్ కి వచ్చే టీచర్ క్లాసు రూం లో నన్ను ,వెంకటరత్నం ని లేపి మాకు బహుమతులుగా వచ్చిన పుస్తకాలను మరునాడు తెచ్చి చుపమన్నది .మరునాడు నేను హడావిడిగా నా పుస్తకాల బాక్స్ లో పెట్టుకుని ,ఆవిడ క్లాసు రూం లో వచ్చిందో లేదో నేను వెంకటరత్నం పోటీపడి ఆవిడ దగ్గరికి వెళ్లి నా రెండు పుస్తకాలు ఆవిడ చేతుల్లో పెట్టాను అదేదో ఘన కార్యం చేసినట్లు .ఆమె చక్కగా ఆ పుస్తకాలని తన హ్యాండ్ బాగ్ లో పెట్టుకుని సాయంత్రం స్టాఫ్ రూం కి వచ్చి కలెక్ట్ చేసుకోమంది .సాయంత్రం స్టాఫ్ రూం కి వెళ్లాను ,అప్పటికే ఆవిడ వెళ్లిపోయారని చెప్పారు .మరునాడు స్కూల్ కి వెళ్ళగానే స్టాఫ్ రూం కి ముందే వెళ్లాను .,ఆ టీచర్ నన్ను చూసి ,ఇంట్లో మరచిపోయాను రేపు తెస్తాను అని చెప్పింది , ఆ రేపు రేపు కాస్త నెలలు దాటేయి ,ఒకరోజు మాత్రం మొహం చిట్లిస్తూ నలిగి జీర్ణవస్థలో వున్నా 'పాయసం తాగిన పిచ్చుక ' ఇచ్చింది .ఆమె నన్ను చూడగానే అడగకుండానే రేపు అనేసేది .ఆ రేపు కాస్త మా యన్యుఅల్ పరీక్షలయ్యి ,వేసవి లో కొవ్వూరు వెళ్ళేదాకా జరిగిందీ.ఇప్పటికి నాకు ఆ పుస్తకం గుర్తొస్తే మనస్సు కలుక్కుమంటుంది .,ఆవిడ ఎక్కడుందో కనుక్కుని నా పుస్తకం నాకు ఇవ్వు అనాలన్పిస్తుంది.తరచుగా తలపుల్లోకి వచ్చి అసహనంగా అన్పిస్తుంది ,అప్పుడప్పుడు అనిపిస్తుంది 'అయాచితంగా' వచ్చింది కాబట్టి నిలవలేదేమోనని . ఇదండీ రెక్కలొచ్చి ఎగిరిపోయినా నా జ్ఞాపకం నా పుస్తకం .నేను పూర్తిగా చదవకుండానే నా చేతుల్లోంచి జారిపోయిన ముత్యం .

21, జూన్ 2009, ఆదివారం

మా నాన్న

ఈ రోజు ఉదయాన్నే పేపర్ తీయగానే కనిపించింది "మారిన నాన్న పాత్ర "....ఫాదర్స్ డే సంధర్భంగా రాసిన ఆర్టికల్ లలో ....నిజంగానే నాన్న లు మారారు ...ప్రపంచం మొత్తం ఒక్క కుగ్రామం అవ్వుతున్న తరుణం లో ..మార్పు స్పష్టంగా కనబడుతుంది ,మా అమ్మ నాన్న కి , మా నాన్న కి ,మా అమ్మాయి వాళ్ల నాన్నకి ఎంత దూరమో ..తరం తరం నిరంతరం "మార్పు "...కారణాలు ఎవైనా కావచ్చు ....మానవ సంభంధాలలో ఈ మార్పు స్వాగతించ దగ్గవే .
నా వ్యక్తిత్వం పై నాన్న ముద్ర చాల వుందనే చెప్పవచ్చు .రెండేళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి సంరక్షణలోనే పెరిగి ఎంతో ప్రయోజకుడై న మా నాన్న ,తన పిల్లలకు కే కాకుండా ఎంతో మంది పేద ,అనాధలకు ఆశ్రయం కల్పించి వారి వున్నతాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు .నేను బాగుండాలి నాతోటి వారు బాగుండాలి అనే సూత్రం నాయనమ్మ ఉగ్గుపాలతో పోసి నాన్న ను పెంచింది .చిన్న కుటుంబములో పెరిగిన నాన్న పెద్దయాక తన కుటుంబాన్ని పెంచుకున్నారు ,,,అందుకే మేము ఆరుగు పిల్లలం . నాన్న మాకు ఊహ తెలిసి ఎవర్ని కొట్టడం తెలిదు ..అస్సలు ఎంతో అల్లరి చేసే నేనే ఎప్పుడు దెబ్బలు తినలేదు ...కాని ఆయన వునికి చాలు ఆ పరిసరాలు నిశభ్ధం ఆవరించడానికి ..ఒక విధంగా అమ్మే మా దృష్టిలో నాన్న ను పులి ని చేసిందని చెప్పొచ్చు ..మాకు భయం వుండాలని నాన్న కి అది ఇష్టం వుండదు ,ఇది ఇష్టం వుండదు ,ఇలా చేస్తే కోపం వస్తుందీ అని చెప్పి మమ్మల్ని కంట్రోల్లో పెట్టిందని చెప్పొచ్చు.:)..
నాన్న ఇంట్లో పెద్దగా డామినేట్ చేసినట్లు కనబడినా నిజానికి అన్నింటా అమ్మ నిర్ణయానికే వదిలేసేవారు .తను చేసే ఉద్యోగాన్ని అంకిత భావంతో చేసేవారు.వృత్తి దైవంగా భావించేవారు ...నిజానికి ఆయన ఫ్యామిలీ తో గడిపే సమయం కన్నా ఉద్యోగం తో గడిపిన సమయం ఎక్కువ ,అయిన ఎక్కడ అలసట చెందకుండా ,విసుగు లేకుండా మాకే లోటు తెలీకుండా, మా అందరిని రాకుమార్తెల్లా పెంచారు ,ప్రేమానురాగాలు పంచారు . ఏడాదికి కి ఒక ఊరు తన కూడా తిప్పారు.మేము కాలేజి చదువుకి వచ్చాక పాపం తనే ఒంటరిగా తిరిగారు .
చదువు విషయం లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పుల గురించి వివరిస్తూ మాకు వాటి పట్ల ఆసక్తి కలిగేలా చేసిన ఘనత నాన్నదే .ఒక్క ఇంటినుండే ఒక్కసారే నలుగురు పిల్లలు సివిల్సేర్విసే మెయిన్ ఎగ్జామ్స్ రాసిన ఘనత మా నాన్న పిల్లలకే దక్కింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు .ఆరుగురికి మంచి మంచి చదువులు చెప్పించి తండ్రిగా తనవంతు భాద్యతను నిర్వర్తించారు .చదువొక్కటే కాదు లోకం అంటు పిల్లల అభిరుచికి తగ్గట్లు ప్రోత్సాహం ఇచ్చారు .మా ఇల్లోక చిన్న గ్రంధాలయం చేసి మాలో సాహిత్యాభిలాష పెంచారు .తన వృత్తి లో రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారాలు అందుకున్న మా నాన్న మాకు ఆదర్శంగా నిలిచారు .ఈరోజు మేము అందుకుంటున్న యోగ్యత పత్ర్రాలు మా నాన్న పెంచిన మొక్కలే కదా ...! ఇరవయ్యొకటో సంవత్సరం లో మా రెండో పాపను పోగొట్టుకుని పూర్తి డిప్రెషన్ లో వున్నా నన్ను ఓదార్చి ,ఇంటి ఆవరణలోని నిండు పూతతో వున్నా కొబ్బరి చెట్టుని చూపించి ,వాటికి వచ్చిన పూతంతా నిలవదుగా ,కొన్ని మాత్రమేగా పిందెలుగా మారి కాయలవ్వేది ....అని మరణం గురించి మాట్లాడి నాలో తాత్విక దృష్టి పెంచి ధ్యానం సాధనగా చేసుకుని తిరిగి భాహ్య ప్రపంచం లోకి రావడానికి చేయూతనిచ్చారు. నాన్న ఈ నాటికి వుద్యోగ విరమణ చేసి పదవ సంవత్సరం ,అరవయ్యి ఎనిమిది నిండి అరవయ్యితోమ్మిది జరుగుతున్న మా నాన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ,,,భావి తరానికి స్పూర్తిగా వుండాలని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.

15, జూన్ 2009, సోమవారం

హాస్యం

నాకు చాల ఇష్టమైన వాటిల్లో హాస్యం ఒకటి .చిన్నప్పటినుండి జోక్స్ చెప్పమని మా అమ్మ తమ్ముళ్ళు ,చెల్లెళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళం .మా చిన్న మామయ్యా అయితే యాక్షన్ తో సహా మరీ చెప్పేవాడు .వాడు వేసే కోతి వేషాలకి పగలబడి నవ్వే వాళ్ళం .,ఎక్కువగా సెలవల్లో ఊరు వెళ్లి నప్పుడు రాత్రి బోజనాలు అయ్యాక అందరం ఇంటి ప్రక్క అరుగుల మీద కూర్చుని అర్ధరాత్రి వరకు పిల్ల పెద్దా కాలక్షేపం చేసేవాళ్ళం . నవ్వి నవ్వి పోరపోఎది , అంతలా నవ్వకు ,నవ్వినంత ఏడుస్తావు అనేవాళ్ళు అమ్మమ్మ వాళ్లు ...నిజంగానే నవ్వినంత ఎడుస్తామేమోనని భయం వేసేది .కథలు పుస్తకాలు చదివే వయస్సు వచ్చాక హాస్యం ఎక్కువగా వున్నా వాటికి ప్రేఫెరేన్స్ ఇచ్చేధాని ...తరువతరువత అన్ని చదివేయడం మొదలు పెట్టాను .చిన్నప్పుడు బుడుగు పుస్తకం బోల్డన్ని సార్లు చదువుకున్న ,..మల్లిక్ ,యర్రంశెట్టి వి హాస్యకథలు చాల వుండేవి ,ఒక్కటి వదలకుండా చదివేదాన్ని .బాపు ,బాలి కార్టూన్స్ ..బొమ్మలు చెప్పే హాస్యం పడిపడి చూసేదాన్ని ,ఇప్పటికీ చూస్తున్న ,అలానే సరసి కార్టూన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి ..

ఇకపోతే సినిమాలకు వెళ్ళాలి అంటే సినిమా మొత్తం నవ్విచ్చేధిగా వుంటే తప్పకుండా చూసేదాన్ని ...చాలామంది హాస్యనటులు తమ హావభావలతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారు. నాకు శ్రీలక్ష్మి అంటే చాల నచ్చుతుంది ..ఆ అమాయక ముఖం తోనే హాస్యం కురిపించేది .అలానే బ్రహ్మానందం ముఖం చూడగానే నవ్వోచ్చేట్లు వుంటుంది .అది ఇదీ అనేది లేకుండా హాస్యరసం తో వుందంటే చూడకుండా వుండేదాన్ని కాదు . అంత ఇష్టం అన్నమాట .

ఈ మద్య సాహిత్యం లోను ,సినిమాల్లోనూ హాస్యరసం దిగజారుతుంది .,స్వాతి లాంటి పత్రికల్లో హాస్యం కథ అని ప్రచురిస్తారు ,పరమ చెత్తగా వుంటాయి ,ఒకే మూస పోసినట్లు , సగంలోనే చదవకుండా మూసేసయ్యలని అన్పిస్తుంది .అలానే సినిమాలు తయారయ్యాయి ...హాస్యం దిగజారుతుంది ..సభ్యత మరిచి ,వాడరాని పద ప్రయోగాలతో వెకిలితనం అడుగడుగునా ప్రదర్శిస్తూ అదే హాస్యం గా చూపిస్తున్నారు ..అది అపహాస్యం అవుతుంది .

ఇకపోతే బ్లాగ్ విషయానికి వస్తే మొదట్లో చాల సంతోషపడ్డాను ..ఎన్నో చదవచ్చు అని ....ఈ నాలుగు నెలల్లో అర్ధమయ్యింది ఏమిటంటే ఇన్ని వందల బ్లాగ్స్ లో మంచిగా వుండేవి నలభయ్యి ...యాభయ్యి కి మించి వుండవని .మొదట్లో కొన్నిబ్లాగ్స్ హాస్యంగా రాస్తున్నారనుకుని చదివాను ...రాను రాను వారు వాడే పద ప్రయోగం చూస్తుంటే తిన్నాది వోమిట్ అవుతుంది...వారు అలా రాసి ఏమి పైశాచికానందం పొందుతారో అర్ధం కాదు ..ఇలాటి వారిని parverted అని అనుకుని జాలిపడి అటువైపు చదవకుండా వుంటే సరిపోతుందని అని అనుకుంటున్నాను .వారు స్వంతగా ఏమి రాయలేక పిచ్చి రాతలు రాస్తూ దానికో polishedga పేరు తగిలించుకుని ఆనందపడుతున్నారు...

14, జూన్ 2009, ఆదివారం

వినయం

మా స్కూల్లో ప్రతి వారం మోరల్ క్లాసు వుండేది ,దానికి ప్రత్యేకంగా ఒక టీచర్ వుండేవాళ్ళు .క్లాసు లేనప్పుడు ఆవిడ ఎక్కడ ఎదురైన వినయంగా విష్ చేసి పక్కకు తప్పుకునేవాళ్ళం ..క్లాసు జరిగిన రోజయితే ఇక చెప్పక్కరలేదు మోస్ట్ ఓబిడ్ యంట్ స్టూడెంట్స్ ల బిహేవే చేసేవాళ్ళం ...ఇంతకీ అంతలా ప్రభావం చూపేది విన్న గంటైన . అలా స్కూల్లో వినయంగా వుండటం నేర్చుకున్నా:) ఇంట్లో చిన్నప్పుడు అమ్మ బోల్డన్ని కల్పిత కథలు మా అందరికి కూర్చోబెట్టుకుని మరీ చెప్పి క్రమశిక్షణ తప్పితే ఎలాటి కష్టాలు పడతారో సోదాహరణంగా వివరించి మరీ చెప్పేది (అలాబెదరేయకపోతే పాపం తట్టుకోగలదా మా అల్లరి ) పెద్దల పట్ల ఎంత వినయంగా వుండాలో మరీ చెప్పేది ,పెద్దవాళ్ళు కనపడగానే గ్రీట్ చేయాలని ,పని చెప్పిన నోరుమూసుకు చేయాలని ,ఫలాని వాళ్ల పిల్లలు చాల మర్యాదగా ప్రవర్తిస్తారు ,అని నలుగురు చెప్పుకోవాలని కోరేది .పాపం ఆవిడ పుణ్యమాని ,నాన్న గారి భయం కానివ్వండి బయటివారి తో చిన్నైన పెద్దైన మర్యాదగా మసులుకోవడం అలవాటైంది .ఇప్పటికి నాన్న ముందు అతి వినయంగా వుంటాము .

ఈ అతి వినయం వల్ల అవతలి వారితో మాట్లాడేప్పుడు వాళ్ళేం చెబుతున్నారో అర్ధం కాదు ..అన్నిటికి అలాగే నాన్న ,అలాగే నాన్న అంటు అస్సలు ఆయనేం చెబుతున్నారో మనస్సుకి ఎక్కేది కాదు .తరువాత పక్కన వాళ్ళని అడగడం అయ్యేది ....ఇంతకీ నాన్నేం అన్నారు అని . కాలేజీ లో ఫాదర్స్ ,సిస్టర్స్ వద్ద కూడా ఇలాటి అనుభవమే కలిగేది ....తరువాత తర్వాతా వుద్యోగంలో బాస్ దగ్గర ....ఇక్కడ మరీను వాళ్ళేం చెప్పినా ....సర్ ..సర్ ...సర్ ...ఎదురు ఒక్క మాట మాట్లాడే పని వుండదు . కేవలం వాళ్ల ఆర్డర్ మాత్రమే వినాలాయే .అంతా అయ్యాక ఏం చెప్పాడా అని విశ్లేషించుకుని ఆ ప్రకారంగా చేయాలి ,అదే విధంగా వాళ్ళనుండి కాల్ వచ్చిన నెంబర్ చూడగానే సగం బ్లాంక్ ..ఆ బ్లాంక్ మైండ్ తోనే సర్ ...సర్ ..సర్ ..ఫోన్ పెట్టాక తీరికగా అవలోకనం చేసుకోవాలన్న మాట . చాల సార్లు విని మరల కొలీగ్ కి కాల్ చేసి అడిగిన సందర్భాలున్నాయి .

నా క్రింది వాళ్లు ఇదే పంధా ...కాని నా క్రింది ఆఫీసుర్స్ కి నాతో ఇంతా ప్రాబ్లం వుండదు ...కలిసిపోతాను కాబట్టి :)మా ఆఫీసు లో వున్నా అటెండర్ లలో ఒక అబ్బాయ్ అతి వినయం మనల్ని చూడగానే చేతులు కట్టుకుని ..సినిమా టైపు లో మాటకు ముందు "అమ్మగారు " అంటూ బోల్డంత కామెడి .వెంటపెట్టుకు ఎక్కడికైనా వెళ్ళిన ఫలానా చోటుకు వెళ్ళాలి అంటే "అలానే అమ్మగారు " అంటాడు ..కార్ ఎక్కాక డ్రైవర్ కి అడ్రెస్స్ చెప్పడం రాదూ ...తెల్లమొహం వేసుకు చూస్తూ నీళ్లు నములుతుంటాడు ...నేను పైకి ఏమి అనను కాని మనసులో ఎంజాయ్ చేస్తాను ...నా ఫ్రెండ్స్ ఎవరయినా ఆఫీసు కి వచ్చినా అడుగుతుంటారు ,,మీ అతివినయం ఎక్కడా అని .....మా అతి వినయం తో పని చెప్పేకంటే వేరే అటెండర్ కి చెప్పడం బెటర్ అనుకుంటాను . సరే ఈ వినయం కథ ఇలా ఉంటే ఈమద్య మూడు నెలల నుండి ఇంకో వినయం తగిలాడు ...ఇంటి దగ్గర . మా చెల్లి మూడు నెలల క్రితం ఒక డ్రైవర్ ని పెట్టుకుందీ .తను మా పైన వుంటుంది , మనకి ఉదయానే ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ టీ త్రాగడం అలవాటు . వాళ్ల డ్రైవర్ పుణ్యమాని బయట తిరగడానికి లేకపోయే ....తను ఉదయానే వచ్చి కూర్చుంటాడు ఎదురుగ వున్నా చెట్ల క్రింద ..బయట కనబడితే చాలు అతి వినయంగా నమస్కారం పెడతాడు ,,అది ఎన్ని సార్లైనా అతనికి మనం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ,అతన్ని చూసి భేదిరిపోయి ఇంట్లోకి పారి పోవాల్సి వస్తుంది . నైట్ డ్రెస్ లో తిరగే అవకాశం లేకుండా పోయింది ...చెల్లి వాళ్ల పాప ప్రవేట్ క్లాస్ కోసం ఉదయానే రప్పిస్తుంది ఆ అబ్బాయిని .,,.పైకి వెళ్ళాలంటే తూర్పు వైపే మెట్లు వుంటాయి ...ఆ అబ్బాయ్ పైకి వెళ్ళేప్పుడు మా వంటగది కిటికీ వైపు చూస్కుంటూ నేను కనబడగానే అక్కడినుండే మరల నమస్కారం పెడతాడు ....నేను ఆఫీసు కి వెళ్ళేప్పుడు అక్కడ వుంటే మా డ్రైవర్ కన్నా ముందు లేచి మరల ఓ నమస్కారం పెట్టి నేను కార్ ఎక్కి పోయే వరకు అతి వినయంగా అక్కడే నిలబడతాడు ..మా చెల్లి తో మొత్తుకుంటున్నా "మీ భాస్కరుడి అతి వినయం తట్టుకోలేక పోతున్నానే " అంటూ ...చెబితే ఫీల్ అవ్వుతాడని అదొక మొహమాటం ....అతి వినయం కొన్ని సార్లు ఎంత ఇబ్బంది పెడుతుందో అని నవ్వుకుంటూ ఊరుకోవడం తప్ప ఏమి చేయలేము చెప్పిన అర్ధం చేసుకుంటారో లేదో .........

11, జూన్ 2009, గురువారం

"శ్రీ శ్రీ అభిమానులకు "

ఈ వారం నవ్య {ఆంధ్రజ్యోతి} శ్రీ శ్రీ ముఖ చిత్రం తో మార్కెట్ లోకి వచ్చింది ,మహా కవి ప్రత్యెక సంచిక గా పత్రిక మొత్తం కవిగారి తో వున్న అనుభందాలు ,జ్ఞాపకాలు వారి సమకాలీనులు ,శిష్యులు అభిమానులు పంచుకున్నారు . నవ్య వెరైటీగా చాల బాగుంది . పత్రిక చదువుతోంటే శ్రీ శ్రీ ని స్మరిస్తూ చాలామంది బ్లాగ్మిత్రులు రాసుకున్నది గుర్తొచ్చి తెలియచేయాలని రాస్తున్నాను . మరో మార్తాండ అనొద్దు .-:)
(రెండు వాక్యములకు పోస్ట్ రాసానని )

4, జూన్ 2009, గురువారం

తంగేడుపూలు


రుధిర ,కాషాయ వర్ణంల్లో ఆకులు లేకుండా విరగాబూసే పూల చెట్టును మేము "తంగేడుచెట్టు" అంటాము .నేను బాగా ఇష్టపడే చెట్లలో ఇదొకటి . నిన్న సాక్షిలో ఇదే చెట్టు మీద రచయిత తన జ్ఞాపకాలూ పంచుకున్నారు , తంగేడు ని వారు తురాయి చెట్టని అంటారట ,కాని మా అమ్మమ్మ ,నాన్నమ్మ వాళ్ల పల్లెటూరిలో మాత్రం తంగేడు అనే పిలుస్తారు ,నాకు అదే తెలుసు .ఈ చెట్టుతో అనుభంధం చాల గాడమైనది .
వేసవికి ఊరు వెళ్ళడం అనగానే నా కళ్ళ ముందు కనపడే దృశ్యం ......అమ్మమ్మ ఊరిలోని పిల్లికోడు (ఏలూరు కాలువ కాబోలు )ఊరు పక్కనుండి వంపులు తిరుగుతూ వెళ్తుంది (ఎక్కడికో ) ఆ కాలువ ఒడ్డును సైనికుల్లాఅటు ఇటు నిలబడి విరగబూసి వుండేవి తంగేడుచేట్లు.ఎండి అడుగంటి వుండే కాలువ నీళ్ళ లో గాలికి రెపరెపలాడే ఆ పూల గుత్తులు ప్రతిభింభం ఇంకా ఈ కళ్ళలో అలానే వుండిపోయింది . పంటపొలాల్లో అక్కడక్కడ చింతచెట్ల ప్రక్కనే క్రొమ్మలు కనబడకుండా విరగభూసేవి . పిల్లలం ఆ చెట్ల క్రింద చేరి ఆటలాడే వాళ్ళం ,వాడ్ని వీడ్ని బ్రతిమాలి ఆ పూలగుత్తులు చేతుల నిండా పట్టుకెల్లెదాన్ని..అదోరకమయిన పిచ్చి వాసన వేసేవి ..పూలతో పాటు మొగ్గల గుత్తులు తెంపి చెట్ల క్రింద భయంకరమైన జూదం ఆడే వాళ్ళం -:) ఎవరైనా సాహస వీరులు ఇద్దరు పందేంకి మొగ్గల్లో వున్నపుప్పొడి కాడలు పట్టుకొని వాటి తలలు తెగడానికి యుద్ధం చేసే వాళ్లు , కొంచెం చిన్న పిల్లలం gumpuluga vidipoyi పందెం కాసేవాళ్ళం ...పెద్ద వాళ్లు కూడా చాల ఆసక్తిగా చూసేవాళ్ళు .మా ఆటలతో ఇంటి నిండా అవే వుండేవి ...ఆ మొగ్గలు పట్టుకుని ఇంట్లో ఖాళీగా ఎవరు దొరుకుతారా ఆడటానికి వెదుక్కునే వాళ్ళం . మా బొమ్మల పెళ్లి ఆటల్లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అవే పూల దండలు .
ఒక వేసవి మధ్యాహ్నం పిల్లలందరం (మా అమ్మ వాళ్లు ఆరుగురు ,వాళ్ల పిల్లలం ) ఇంటి ఆ వరణలో వున్న గేదెల చావడిలో బొమ్మల తో ఆడుతున్నాం ,వాటికి పెళ్లి పూల దండలు హడావిడి నేను చూస్తో తంగేడు పూలతో చేసిన దండలు బొమ్మలకి చాల పెద్దవి అవుతున్నాయి ,బోలెడన్ని పూలు మిగిలి పోతున్నాయి అని మా అక్క వాళ్ళతో నేనొక ఐడియా చెప్పాను ,దాని ప్రకారం నేను ఇంట్లోకెళ్ళి ఊయ్యాలలో నిద్రపోతున్న మా పెద్దమామయ్య కూతురు సత్య ని (యేడాది పిల్లనుకుంట ) ఎవరు చూడకుండా చావడి లోకి తీసుకొచ్చా ,అప్పటికే రెండేళ్ళ మా చిట్టి తమ్ముడు శ్రీనుగాడ్ని మా అక్క వాళ్లు తయారు చేసి పీట మీద కూర్చోబెట్టారు ,నేనేమో ఈ బుడ్డి దాన్ని నిద్ర లేపి పడకుండా వాడి ప్రక్కన కూర్చోబెట్టి ఇద్దరికీ తంగేడుపూల దండలు వేసి పెళ్లి చేస్తుండగా ...ఇంట్లో నుండి అందరు కంగారుగా ఊయ్యాలలో పిల్ల లేదు అంటు వెదుకుతుంటే ....మా అమ్మ వాళ్ల నాయనమ్మ మా వద్దకు రానే వచ్చి పాప మెళ్ళో వున్న దండ పీకేసి మా అందర్ని తిట్ల దండకంతో తగులుకొంటే అందరం పరార్ పెళ్లి కొడుకుని వదిలేసి .........గంట దాక ఎవ్వరం పెద్దొళ్ళకి అందలేదు ..ఆ రోజు జీవితం లో మరిచిపోలేదు ,,ఇప్పుడు తలుచుకుని నవ్వుకుంటాం . తంగేడుపూల దండ ఎంతపని మా చేత చేయించిందో కదా అని .
మా ఇంటి ప్రక్క ఉత్తరం దిక్కు పెద్ద తంగేడు చెట్టు వుంది . ఉదయాన్నే వరండాలో కూర్చుని టీ తో పాటు వాటి అందాన్ని త్రాగుతాను .-:) దాని పక్కనే వున్న గుల్మొహర్ క్షణ క్షణం పస్పు పూలు రాలుస్తూ కుంకుం ప్రక్క పసుపు అద్దుతున్నట్లు ....భలే వుంటాది .... అన్నట్లు నిన్న ఏజెన్సీ ఏరియా కి పని మీద వెళ్లాను ......దారికిరువైపులా వున్న తంగేడు పూలు చూస్తూ నన్ను నేను మరిచిపోయాను ..అస్సలు ప్రయాణం అలసటే తెలిలేదు .....'ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై .....అడవి ...సాగిపోనా ..." ఒట్టు అక్కడినుండి రాబుద్ది కాలేదు . వేసవి కాలం లో మల్లెపూల తో పాటు గాజు తోట్టేల్లో నీళ్ళలో ఈ "అగ్నిపూలు " కూడా ఫ్లోవేర్వాస్ గా ఆమరుస్త్హాను ,ఇంట్లో .

28, మే 2009, గురువారం

ఇప్పపూలు -మొదటిదాని తరువాత

విప్పపూల చెట్టు దగ్గరకి తీసుకెళ్ళమని కొత్తగకుదిరిన పనమ్మాయి ఎల్లమ్మ వెంటపడ్డాను(ఆ ప్రదేశం కొత్త అవ్వటం వలన అలా ఆధారపడల్సోచ్చింది) అదంతా పెద్ద ఆవరణ ,నిజమయిన అడివిలా వుంది (అప్పుడు నా చిన్ని బుర్రకు )మొత్తానికి ధంతావధానం అవ్వకుండానే నిద్రకళ్ళతో ఎల్లమ్మ వెంటపడి వెళ్లాను ,మా ఇంటి ఫెన్సింగ్ ఆవథలకి తీసుకెళ్ళి ఓ పెద్ద చెట్టు కింద నిలబడింది ....నేనేమో సహనం పట్టలేక ఇంకెక్కడా ,ఎంత దూరం అంటుంటే ...ఆ అమ్మి సావధానంగా "ఇక్కడ ఏరుకోవచ్చు ఎవరు నడవరు "అంటూ వంగి ఎండిపోయిన ద్రాక్ష ,చిన్న కుంకుడు తొక్కలు లాటివి ఏరడం మొదలెట్టింది ,,నేనేమో అయ్యేవో తరువాత యేరుకో ముందు విప్పపూలు కోసుకోచ్చుకుందాం పద అనటం తడవు ..ఇవ్వెగధఇప్పపూలు నూ కూడా మంచి చూసి యేరు అంటు ..ఇది బాగుంది తిని సుడు అని నా నోట్లో పెట్టింది ..మనం "దూ ' అని వుమ్మి ఛీ ఇయ్యేవరికి కావాలి అంటూ ఇంట్లోకి వురికాను ....నా వెనుకే ఎల్లమ్మ పమిట కొంగు నిండా బోలెడన్ని తెచ్చి వంటగదిలో అమ్మ ముందు పోసింది ...మా అమ్మ కి విషయం తెలిసి ఒకటే నవ్వు ...నేను అవి తలలో పెట్టుకునే పూలనుకుని వాటికోసం కలవరించానని ..నోరంతా చేదుగా కుంకుడు రసం నోట్లో పడ్డట్లు వుండే విప్పపూలు నాకస్సలు ఇష్టం లేదు . వారం తరువాత భద్రాచలం వెళ్ళినప్పుడు గుడి దగ్గర ప్రసాదం ల ఇస్తోంటే ఇంకా ఆశ్చర్యపోయాను .... తరువాత అమ్మ వాటి ప్రాశస్త్యం చెప్పింధనుకోండి ....మొన్నామధ్య సాక్షిలో చదివి గుర్తు చేసుకున్నాం . ......తరువాత ఆటలకోసం చాల ఎరేదాన్ని :) అలా నా రంగుల కల విప్పపూవు వెలీసిపోయింది .
( ప్రాబ్లం వల్ల కొంత పోయింది అందుకే మరల రాసాను )

నాకిష్టమైన పాట- సన్నివేశం

నాకు ఈ పాటంటే చాల ఇష్టం ..సుత్తివేలు సన్నివేశం అధ్బుతం -:) మీరు సరదా చూడండి .

-

"ఇప్ప పూలు "

ఈ మద్య సాక్షి పేపర్ లో వరుసగా సమ్మర్ స్పెషల్ -చెట్టు కథలు వరుసగా ప్రచురిస్తున్నారు ,అవి చాల బాగుంటున్నాయి .మనల్ని భాల్యం లోకి మరి ఇంక్కేక్కడికో తీస్కుని వెళ్తున్నాయి .వీలయితే తప్పకుండా చదవండి . ఈ రోజు ఫలవంతమైన చెట్టు ,నిన్న అరుణమ్మ ఏరూ....పత్తాటి చెట్ల రేవూ రాసారు .నిన్నటి చెట్టు కథ రాసింది స.వెం .రమేశ్,ఈ కథని రెండు మూడు సార్లు చదుకున్నాను ,నాకైతే చాల నచ్చింది .పత్తటి చెట్టు కథ చదివి తాటి చెట్టు తో నా అనుభంధం రాద్దామనుకున్నాను బ్లాగ్ లో ....ఈ లోపు మన నెమలికన్ను "మురళి "రాసేసారు ..అందుకే మన ప్రయత్నం విరమించేసాం . ఆ మద్య ఒకరు సాక్షి లో విప్పపూల చెట్టు (ఇప్ప పూలు ) గురించిరాసి మన జ్ఞాపకాల తేనె తుట్టు ను కదిపెసారు ,అప్పుడే పంచుకోవాలనుకున్నాను కాని టైం కుదరలేదు .


ఈపాటికి అందరికి అర్ధం అయ్యే వుంటుంది మనకున్న "పూల పిచ్చి" ...మనం ఏ పువ్వును వదలం చిన్నప్పుడైతే తల లోకి ఇప్పుడేమో ఫ్లవేర్ వాస్ లోకి వెళ్తుంటాయి .(మనం ఆఫీసు కి పూలు పెట్టుకోం బాగోదని ప్చ్.....) పూలు అనే మాట వినబడితే చాలు ఎక్కడ అని అనేదాన్ని ....అలాంటి పిచ్చన్న మాట :)


నేను రెండవ తరగతి లో వుండగా మా నాన్నగారికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయ్యింది ,మాకు ఫైనల్ పరీక్షలు జరుగు తున్నాయని నాన్న ముందు ఒక్కరే వెళ్లి జాయిన్ అయ్యారు . ఒక వారం తరువాత అక్కడి జవాన్లను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు ,,వాళ్లు సామాను షిఫ్ట్ చేయడానికి సహాయపడ్తారని. మేము వెళ్లబోయే ఇల్లు ,ఆఫీసు ఇల్లు కలిపే వుంటుందని ,వేహికాల్స్ చెకింగ్ కి అన్ని అక్కడికే వస్తాయని మా అమ్మతో జవాన్ (అటెండర్ ) చెప్తుంటే విన్నాము ..మా అమ్మ కుతూహలంగా ఆ ఇంటి వైశాల్యం ,గదులు పెరడు ,,అంతక్రితం వుండి వెళ్ళిన ఆఫీసర్ ఫ్యామిలీ వివరాలు ,పని మనుషుల వివరాలు అన్ని అడుగుతుంటే వాళ్లు హుషారుగా ఇంక అడిగినవి అడగనివి చెబుతుంటే మనము నోరు తెరుచుకొని మరి విన్నాము ...మేము వెళ్ళ బోయే ఇంట్లో ప్రహరీ లా సీతాఫల చెట్లు వున్నాయని సీజన్లో లో గంపలు గంపలు పండి తినలేక పారేయ్యలని మొక్కల కోసం ఎక్కడత్రవ్విన రాక్షసి బొగ్గు వస్తుందని ఇంటి వెనుక విప్పపూల చేట్టుందని కావలసినన్ని పూలని చెబుతుంటే ఇక మనం ఈస్ట్మాన్ కలర్లో ఆ పూలన్నీ కోసేసుకున్నట్లు (ఇప్పటికి కళ్ళల్లో మెదులుతుంది ) ఇక మా అమ్మని ఊపిరాడ నీయలేదు ,ఆ పూలు బీరు (సార ) చేయడానికి వుపయోగిస్తారని చెప్పింది ...అప్పటివరకు హైదరాబాద్ వదిలి వెళ్లడానికి బెంగాపడ్డ మనం ఎప్పుడెప్పుడు కొత్తగూడెం చెట్టు .తరువాత రెండురోజులకు మేము కొత్తగూడెం వెళ్ళాం .మేము అక్కడికి చేరడం గుర్తు లేదు ,,నిద్ర లేచేసరికి కొత్త ఊర్లో కొత్త ఇంట్లో వున్నాం . నేను లేచేసరికి అమ్మ జవాను తీసుకొచ్చిన ఎల్లమ్మ (పనమ్మాయి )తో మాట్లద్తోందిఆ అమ్మాయికి మా అందరిని పరిచయం చేసింది ..నాకయితే ఎప్పుడెప్పుడు పూలు చూడాలా అని కోరిక ,ఎల్లమ్మని అడిగాను మన ఇంటి వెనుక




24, మే 2009, ఆదివారం

మా వంటింటి కథ -3

మా పక్కింటి వాళ్లు వచ్చినప్పటినుండి ఉదయం కాని సాయంత్రం కాని సందడి సందడిగా వుండేది ..ఆ అమ్మాయి కూనిరాగాలో లేక టీవీ రాగాలో వినవస్తుందేవి ...అరేయ్ ..ఒరేయ్ బంగారం పిలుపులు వారి మద్య .చాల నిశ్శబ్దంగా వుండే లోకాలిటీలో వాళ్ళదే సందడంతా ..ఆ అబ్బాయికి శనివారం ఆఫ్ అనుకుంటాను ...ఆ రోజు ఇంట్లో కనబడే వాడు .వచ్చినప్పటినుండి ఒక మూడు నెలలు ఇదే సందడి .ఆ తరువాత అసలు కథ ప్రారంభం అవ్వింది .
ఒక శనివారం ఉదయం పక్కింట్లో నుండి కెవ్వుమని కేక వినబడింది .ఇంతకి ఏవిటంటే ఆ అమ్మాయి మీద బల్లి పడిందట ..ఇక ఊరు వాడ అదిరిపోయేలా "మమ్మీ ..మమ్మీ అని ఏడుపు ..ఆ అబ్బాయి సముదాయించలేక తంటాలు పడ్తున్నారు ...ఆ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ కి ఫోన్ చేసి ఫోనేలోనే ఏడ్పులు .....నాకయితే సందేహం వచ్చింది నిజంగా బల్లి భయమా లేక అమ్మ వాళ్ల మీద బెంగాతోనా అని (స్వానుభవం :)) నెమ్మదిగా వాళ్ళింట్లో నవ్వులు పువ్వులు స్థానే "నిశభ్ధం ఆవరించింది . ఆ అమ్మాయి గొంతు వినబడడం తగ్గింది . ఇదివరకు విని వినబడనట్లుందే అతని కీచు గొంతు వినిపిస్తుంది ...ఇదివరకు అతను వెళ్తుంటే గేటు బయటకు యెదురెల్లె ఆ అమ్మాయి కనీసం వరండాలోకి రావడం లేదు ..,ఆ అమ్మాయి ముఖం లో విషాదం కొట్టవచ్చినట్లు కనబడేది ..ఆమె పేరెంట్స్ మహారాష్ట్రలో వుద్యోగ రీత్యా వుంటున్నట్లు తెలిసింది ,..ఆ అబ్బాయికి సెలవురోజు న కచ్చితంగా గొడవ జరగాల్సిందే,,..అంత కేకలు వేస్తూ బయటికి వస్తూ ఏమి జరగనట్లు అమాయకంగా వెళ్తుంటాడు (వద్దన్నా మా కళ్ళల్లో ,చెవుల్లో పడతాయని వాళ్ళకి తెలిదాయే )..ఒకరోజు అతని అక్క ఇద్దరు పిల్లలతో వచ్చింది ...ఆవిడ ఇద్దర్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తూ ...తన తమ్ముడు చెప్పినట్లు నడుచుకోమని ,,అయినదానికి కానిదానికి పుట్టింటికి ఫోన్లు చేయడం మానమని ,,డిగ్రీ చదివింది కాబట్టి ఖాళీగా వుండక వుద్యోగం చేయమని ...మొత్తం బుద్దులన్ని మరదలుకే చెప్పింది ...ఆ అమ్మాయి చదివింది హింది మీడియం కాబట్టి తెలుగు చదవడం రాయటం రాదు కొన్నాళ్ళు నేర్చుకున్నాక బయటకు వెళ్తాను అని పాపం ఆ అమ్మాయి సంజాయిషీ ఇచ్చింది . అతని అక్కయ్య వెళ్ళిన రెండురోజులకు ఒక రాత్రి ఆ ఇంట్లో పెద్ద గొడవ ...బహుశ చేయి చేసుకున్నట్లున్నాడు ...ఆ అమ్మాయి గుండె పగిలేలా ఏడ్చింది .... ఇక ఈ అమ్మాయి ఇక్కడ వుండదు వెళ్ళిపోతుంది అనుకున్నాను ..నేను నా హడావిడిలో గమనించలేదు ...వారం తరువాత ఆ అబ్బాయి వెళ్ళగానే తను తయారయ్యి బయటికి వెళ్ళిపోయేది ..ఆ అమ్మాయి వుద్యోగ ప్రయత్నం చేసి ఒక కార్పొరేట్ కాలేజీ లో చిన్నపాటి వ్యుద్యోగం సంపాదించుకుంది .. ఇంట్లో ఆ అబ్బాయి సణుగుడు తెలుస్తూనే వుంటుంది ..పాపం ఆమె వురుకులు పరుగుల మీద పనులు చేస్కుంటూ కాలేజీ కి పరుగులు తీస్తుంది ..వాళ్ళింట్లో ఆమె కూనిరాగాలు లేవు టీవీ రాగాలు లేవు అప్పుడప్పుడు వినబడే ఆ కీచుగొంతు దాని వెనుక వచ్చే వెక్కిళ్ళు తప్ప . వాళ్లు పక్కింట్లోకి వచ్చి ఆరు నెలలు కూడా సరిగ్గా చూసుకోలేదు ....నాకు అర్ధం కానిది ఒక్కటే ,బయట ఆఫీసు లో అంత మంచి పేరు ,అక్కచెల్లెళ్ళతో ప్రేమ ,బయట పెద్దవారితో గౌరవంగా కాని భార్య దగ్గరకి వచ్చేసరికి అంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో ....
పెళ్ళయిన ఆరునెలలకే వెలిసిపోయిన బొమ్మలా ఆ అమ్మాయి తిరుగుతుంటే మనసు పిండేసి నట్లు వుంటోంది ...దూరంలో వున్నా ఆ తల్లిదండ్రులు అమ్మాయి ఇక్కడ ఆనందంగా వుందిలే అని భ్రమల్లో వుంటారు ...ఒకవేళ తెలిసినా "సర్దుకోమ్మా" అంటారేమో ...ప్చ్..
ఇదండీ మా వంటింటి కిటికీ చెప్పిన పక్కింటి కథ .

మీకు తెలిస్తే చెప్పరూ....

కామెంట్ బాక్స్ లో రిప్లై రాద్దామన్న అలానే కొందరి వాటికి వాల్లదాంట్లో కామెంట్ రాద్దామన్న పేజ్ ఎర్రర్ అని వస్తోంది ఇది ఎలా రెక్టిఫై చేయాలో అర్ధం కావడంలేదు ...ఎవరికైనా తెలిస్తే చెప్పరూ ..అపరభాగీరదుడికి స్పంధించినవారికి ధన్యవాదములు . నిన్నటి నుండి ఈ ప్రాబ్లం వచ్చింది అందువలన సమాధానం రాయలేక పోతున్నా .

22, మే 2009, శుక్రవారం

అపర భగీరధుడు

ఉరుకులు పరుగులతో సుడులు తిరుగుతూ , నురగలు కక్కుతూ , గలగల పారుతూ హొయలు పోయే కృష్ణవేణి కి ఆనకట్ట వేసి రైతన్నల పెదవులపై చిరునవ్వులు పూయించిన క్రుషివలుడతను. ఆయనే లేకుంటే కృష్ణాజిల్లా ఇంత సుభిక్షంగా ఉండేది కాదు . ఆయనే లేకుంటే విజయవాడ నగరానికి మరో ట్యాంక్ బండ్ లాంటి "ప్రకాశం బ్యారజే లభించేది కాదు . ఆయన మరెవ్వరో కాదు .....అపర భగీరధుడు గా పేరొందిన "సర్ అర్ధర్ కాటన్ ". కృష్ణా గోదావరి డెల్టా ను సస్యశ్యామలం చేసిన కాటన్ కు తెలుగువారు గుండెల్లో గుడి కట్టి ఆరాధిస్తున్నారు .తమ పిల్లలకు ఆయన పెరుపెట్టుకుంటున్నారు.( చూసారా ఎవ్వరో యూరపు వాళ్లు వచ్చి చేస్తే కాని మనకి తెలిలేదు -:))
ఈ నెల మనము ఆయన ౨౦౬ (రెండొందల ఆరు ) వ జయంతి జరుపుకుంటున్నాము . మనమందరము ఆయనకు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుందాము.
(మా రోటరీ క్లబ్ సౌజన్యంతో )

20, మే 2009, బుధవారం

మా వంటింటి కథ -2

పదిరోజుల క్రిందట మా వంటిల్లు పరిచయం చేశాను ,అక్కడ నేను రోజు చూసే ప్రపంచం గురించి కూడా చెప్పేసాను ..ఇక పొతే నేను చెప్పబోయేది మా పక్కింటి వాళ్ల కథ (క్షమాపణలు). ఎదురుగా వుండే కిటికీ లోనుండి రావిచెట్టు ,పూలచెట్లు ,సూరీడు మనల్ని కులాసాగా పలకరిస్తుంటారు కాని ప్రక్క కిటికిలోనుండి పక్కింటి కొత్త దంపతులు (ఆరేడు నెలలు )గడిబిడ చేస్తుంటారు .వాళింట్లో జరిగే విషయాలన్నీ లౌడ్ స్పెకర్ లేకుండానే మన వంటగదిలో మనం బుద్ధిగా పని చేసుకుంటున్నా వినిపిస్తూనే వుంటాయి అంత పెద్ద ప్రహరీ గోడ నుండి చేదించుకుంటూ మరి వస్తుంటాయి ,ఈ గొంతు అమ్మాయిగారిదే ఆ అబ్బాయిది మాత్రం నూతిలోనుండి వచ్చే సన్నని గొంతు .


మా పక్కిల్లు ఎప్పుడో కాలనీ కట్టిన మొదట్లో ఒక ప్రభుత్వాధికారి సనాతనంగా కట్టుకున్న ఇల్లు దానిని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా తక్కువ అద్దెకు ఇస్తుంటారు ..దానిలోకి ఎప్పుడు కొత్త కొత్త వాళ్లు మారిపోతూ వస్తుంటారు . మనం వాళ్ళను ఖాళిగా వున్నపుడు గమనిస్తుంటాము తప్పించి మాట్లాడే చనువు వుండదు .ఒక సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేసరికి ప్రక్క ఇంటి ఆవరణలో సందడి సందడిగా చాలామంది వున్నారు ,అప్పటికి రెండు నెలలుగా ఆయిల్లు ఖాళీగా వుండటం వల్ల ఒక్కసారే కళ వచ్చినట్లయింది ,ఇంతకీ ఏమిటంటే ఇరువయిపుల పెద్దోళ్ళు వచ్చి కొత్తగాపెళ్ళయిన ఆ దంపతులతో కాపురం పెట్టించడానికి వచ్చారు .వాళ్లు ఒక వారం వుండి వెళ్లిపోయారు .ఆ అమ్మాయి ఎప్పుడు సందడి చేస్తూ పాటలు పాడుకుంటూ ,టివి గట్టిగ పెడ్తూ చాల సరదాగా వుండేది నేను ఉదయం అయిదున్నరకి లేచేసరికే ఆ అమ్మాయి కిచెన్ నుండి కుక్కర్ విజిల్ వినపడేది .ఆ అబ్బాయి ఎనిమిదింటికల్లా వెళ్ళిపోయేవాడు ,,ఎప్పుడు అతను వున్నా అలికిడి వినపడేది కాదు .


ఒకరోజు నేను ఆఫీసు కి వెళ్ళబోతూ కార్ ఎక్కుతుండగా ఒకతను వచ్చి మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి తను పెళ్లి చేసుకుని పక్కింట్లోకి దిగానని ,తను వుద్యోగం సక్రమంగా చేస్తున్నట్లు అలానే శాలరీ పెరిగినట్లు చెప్పాడు ,నాకు మొదట అర్ధం కాలేదు తరువాత గుర్తొచ్చింది నా ద్వారా ఆ అబ్బాయికి ఒక పెద్ద కంపెనీలో వుద్యోగం వచ్చింది ఎవరో తెలిసినవాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇంజినీరింగ్ చదివిన ఆ అబ్బాయినిసదరు కంపనీలో పెట్టించి అప్పుడే మరచిపోయాను ...కాని ఆ కంపనీ మేనేజర్ అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు , మంచి వర్క్ చేసే కుర్రాడిని పంపానని ,,ఆ సదరు కుర్రాడే మా పక్కింట్లోకి దిగిన జంటలోని వాడు .ఆ అబ్బాయి చాల నిదానంగా అమాయకంగా కనిపించాడు (రేపు)