16, నవంబర్ 2011, బుధవారం

సంతృప్తి

నాపై పెట్టిన భాద్యత సంతృప్తిగా నెరవేర్చగలిగాను .ఇచ్చిన పనిని చాలెంజ్ గా తీసుకుని అనుకున్నదానికన్నా బాగాచేసాను (అంటున్నారు ) ఏమైనాగుర్తుంచుకోదగ్గ రోజు.

6, నవంబర్ 2011, ఆదివారం

నన్ను వెదుక్కుంటూ వచ్చావా

అలసట నీ జాడ తెలీదు అనుకున్నానే ;ఇన్నాళ్ళు మచ్చుకయి కాన రాలేదే !ఇంత హడావిడిగా నన్ను వెదుక్కుంటూ వచ్చావెందుకమ్మ!ఇంకొన్నాళ్ళు నన్ను వదిలేయరాదా;ఎంత కాలమో కాదు పదునైదు సంవత్సరాలు చాలు చిటికలో అన్ని చక్కబెట్టుకుని నీతో కూర్చుంటాను !

14, అక్టోబర్ 2011, శుక్రవారం

మరో జన్మ

మరో జన్మ !
దేవుడా నా చిన్ని గూడు నిలబెట్టాడు .తను మమ్మల్ని గుర్తు పట్టేవరకు నేను నేనే కాదు .మా ఇద్దరి ప్రపంచం తన తోనే అని అప్పుడు ఇప్పుడు అని స్పష్టం అయ్యింది .ఇప్పడు చుట్టూ ప్రపంచం అందం గా కనబడుతుంది .తనకోసం ఈ వారం రోజులు నిద్రాహారాలు మాని నాతో కష్టం పంచుకున్న నా మిత్రులకు బంధువులకు ఏమిచ్చిన ఋణం తీరదు .దేవుడు మా అందరి మొర ఆలకించి తిరిగి ఆయనకీ మరో జన్మ ప్రసాదించాడు

28, సెప్టెంబర్ 2011, బుధవారం

చిన్ని చిన్ని ఆనందాలు

రెండురోజులనుంచి కాస్త సాంత్వన .ముఖ్యంగా కొలువు కి రిలీఫ్ మనస్సుకి విశ్రాంతి .కాలం తో పాటు పరుగు వెనక్కి తిరిగి చూసుకుంటే వెలితి .హ్మం నేను మెచ్చేవి నాకు నచ్చేవి నా ఇష్టాలు ఆనందాలు కోల్పోతూ వేరోకదానిలో సరిపెట్టుకుంటూ కాలం గడిచిపోతుంది .చిన్ని చిన్ని ఆనందాలే మిస్ అయ్యిపోతున్నాను :-(
ఇంట్లో మధ్యాహ్నం సమయంలో హాల్లో నేల మీద పడి పుస్తకాలు చదవడం ఇష్టం కాని ఇప్పుడదేదో అపురూపంగా దొరికే సమయం అయ్యింది .
అలానే ఉత్తరం అంటే చాల ఇష్టం .(ఉత్తరాలు ఇష్టమే )..ఉత్తరం అంటే ఉత్తర దిక్కు అన్నమాట ,అక్కడ తలుపు మెట్టుపైన కుర్చుని ప్రపంచాన్ని చుసేయ్యవచ్చు .ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అరటిచెట్ల నీడలో రంగుల పిట్టలు గోరింకలు ఉడుతలు చేసే కిచకిచ ధ్వనులతో గాలికి అటుఇటు కదిలే కొమ్మల తో పాటు సిరిమువ్వల్ని తలపించే ఫెంగ్శ్యు గంటల రాగాలతో ...అదో అధ్బుత ప్రపంచంలా అనిపిస్తుంది .ఇది అరుదయింది .
సాయంత్రాలు అలా ఇంటి మేడ పైకెక్కి కొండల్లో క్రుంగి పోతున్నసూరీడ్ని చూడటం ఇష్టం,కన్యాకుమారిలోచూసిన దృశ్యం కంటే అధ్బుతంగా వుంటుంది .కాని చంద్రుడ్ని చుక్కల్ని చూసుకుంటూ ఇల్లు చేరవలసివస్తుంది .ఇదీ నాకు అపురూపం అయ్యిందే !నిత్య జీవితంలోని ఆనందాలే స్వల్పమైనవి కోల్పోతున్నాను .వినడానికి విచిత్రంగా అనిపించినా ఇవి నాకు అపురూపం!
జీవితానికి ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అంటే ఇదేనేమో :-)

21, సెప్టెంబర్ 2011, బుధవారం

సంస్కృతి

సంస్కృతి అంటే ? ఎంత ఆలోచించిన అర్ధం కావడం లేదు ...మనం అసలే అన్నిట్లోనూ వీక్ :-):)

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

An invitation.....

to acqire good dharma........

we invite you to participate in our endeavour to work for the upliftment of the poor and disabled. let us work together to serve our less fortune brothers and sisters by improving our hospitals ,hostels,veternary dispensaries and to give support to the disabled in WEST GODAVARI DISTRICT.lord Buddha says- "we receive only what we give " Hence ,donate liberally and acqire dharma.............


we can't help everyone........but everyone can help someone.......


peace of mind is rooted in affection n compassion.......


don't think small good deeds don't help.....it is drops of water that makes an ocean....
హమ్మయ్య చాలా రాసేసాను.అన్నట్లు ఇవన్ని నా సొంతమాటలు కాదు .మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ప్రభుత్వంతో పాటు సంక్షేమ పధకంలో పాలుపంచుకోమని ప్రజలకి ముఖ్యంగా జిల్లవాసులకి ఉద్యోగులకు ,పారిశ్రామిక వేత్తలకి పిలుపునిచ్చారు .పశ్చిమ గోదావరికి చెందిన ఎన్నారైలు కూడా తమ వితరణలు ఇస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చని నా భావన :)
please contact our tollfree no.1800-425-8848 or 98499 09082.

31, ఆగస్టు 2011, బుధవారం

ప్రమోషన్ వచ్చినట్లే

హమ్మయ్య !ఇన్నాళ్ళకి నేను ఎదురుచూసిన ప్రమోషన్ వస్తుంది .ఏప్రిల్ నుండి మొదలు పెడితే ఇప్పటికి అయ్యింది .నేను మరీ తొందర పడుతున్నట్లు మా చిన్నారి అభిప్రాయం కాని ఎప్పుడు జరగవలసినవి అప్పుడు జరిగితేనే అందం అర్ధం కూడా అని మా ఆలోచన వెరసి అమ్మనాన్న ల అభిప్రాయం అదే.
కెరీర్ ని తీర్చి దిద్దుకోవడం మన చేతిలోనే వుంది ఒకదానితో ఒకటి ముడి పెట్టుకుంటే మనం వెళ్ళవలసిన రైలు దాటిపోవచ్చేమో అని నచ్చచెప్పడానికి చాలా కష్టపడవలసి వచ్చింది .దాదాపు అత్తగారి హోదా వచ్చేసినట్లే ..నాలుగు నెలలు ఆగితే పూర్తిగా అత్తగార్నే :)

22, ఆగస్టు 2011, సోమవారం

చిన్నిబొమ్మ

మాకు ఆడుకోవడనికో "బొమ్మ"

నా ఒడిలో చైనీస్ చింకి ..నాటి పాత మధురాలు


18, ఆగస్టు 2011, గురువారం

అవినీతిరహిత సమాజం కావాలా!

అన్నాహజారే అంటే తెలియని వారుండరేమో అని అనిపించేంత విధంగా ప్రజలలోకి వచ్చారు .అవినీతిని వ్యతిరేకించే వారంతా వారికి మద్దతు పలుకుతున్నారు మంచి పరిణామం .
నీతి మార్గమం అవినీతి రహిత సమాజం కావాలనుకోవడం తప్పులేదు కాని అసలు విలువలు పాటించకపోవడం ఎక్కడినుండి మొదలవుతుందోనని మనలోకి మనం తొంగి చూసుకుంటే దానికి సమాధానం తప్పకుండా మనవద్ద దొరుకుతుంది .మనల్ని మనం బాగు చేసుకుని తరువాత మన పరిసరాల ఉద్దరణకు పాటుపడితే బాగుంటుంది .
ఇప్పటి యువతను చుస్తే ముచ్చటగా అనిపిస్తుంది.అవినీతిని అరికట్టాలి అనే నినాదం లో వారే ముందుంటారు .అటువంటి రాజకీయ పార్టీలకు తమ మద్దతు వుందని తేల్చి చెబుతారు.అవినీతి రహిత సమాజం కావాలని కోరుకుంటారు ....కాని ఆచరణలో ఇదంతా జరుగుతుందా? ఇటీవల ఎన్నికల్లో ఇటువంటి నినాదం తో వచ్చిన పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది ?మాటల్లో ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత సమర్ధించిన వారే కాని ఫలితాలు అందుకు భిన్నం గా వచ్చాయి .
ఇంత అన్యాయాల్ని అక్రమాల్ని వ్యతిరేకించే యువత సమయం వచ్చినప్పుడు తమకి ఇష్టం అయిన నటుడు సినిమా వచ్చినపుడు బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూడటానికి ఏమాత్రం వెరవరు పరోక్షంగా అక్రమర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వారికి తోచదా? అత్యవసరంగా కులధృవీకరణ పత్రమో ,జనన పత్రమో మొదలైన అవసరం అయినపుడు నిర్ణీత సమయం వరకు వేచివుండలేక అక్రమార్గాల్లో వాటిని తెప్పించుకోవడం పని పూర్తిచేసుకునేప్పుడు వారికి అవినీతిని పరోక్షంగా ప్రోస్త్సహిస్తున్నట్లు అనిపించదా?ఇలా ఉదాహరణలు చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో పాత తరం విలువలు ఇప్పుడుబలహీన పడుతున్నాయి .
అవినీతికి వ్యతిరేక పోరాటం చేయాలి కాని అది మన ఇంటి నుంచే మొదలు కావాలి .పిల్లలికి బాల్యం నుంచే విలువలు తల్లిదండ్రులు నేర్పించాలి తరువాత వాళ్ళు చదువుకునే స్కూలు భాద్యత వహించాలి .....అప్పుడే అందరు కోరుకునే అవినీతిరహిత సమాజం చూడగలం
(ఇది ఎవర్ని ఉద్దేశించి రాసింది కాదు..ఇంట్లో పిల్లలి తో వచ్చిన డిస్కషన్ ) కావాలా!

16, ఆగస్టు 2011, మంగళవారం

పచ్చని గులాబి

నిన్న నా దగ్గరికి అందమైన ఎర్రగులాబీ పూల గుత్తి వచ్చింది వాటి మద్యలో పిస్తా గ్రీన్ కలర్లో ఒక చక్కని గులాబి కళ్ళు విచ్చుకు చూస్తుంది .ఈ రంగులో ఇలాటి పువ్వుని చూడటం ఇదే మొదటిసారి .

11, ఆగస్టు 2011, గురువారం

ఫ్రెష్ ఫ్రూట్స్

ఈరోజు పని మీద తణుకు వెళ్ళడం జరిగింది .టౌన్ లోకి వెళ్ళగానే రోడ్ కి ఇరువైపులా పెట్టిన పళ్ళ దుకాణం లను చుస్తే కళ్ళు కుట్టాయి కనబడినవల్లా కోనేయలన్పించాయి ఎందుకంటే ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కడ దొరకవు తణుకు కి దగ్గరలో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పండిస్తారనుకుంటాను .రేపు వరలక్ష్మి వ్రతం కోసం కాబోలు పళ్ళు పూల దుకాణాలు కళకళ లాడ్తున్నాయి.బత్తాయిలు మరీను ఆకులు కాడలతో అమ్ముతున్నారు ...రుచి కూడా అద్భుతం 1

7, ఆగస్టు 2011, ఆదివారం

సిస్ -ఫ్రెండ్స్ డే
ఈ రోజు ఫ్రెండ్షిప్డే అని చాల ఏళ్ళ నుండే తెలుసు కాని సిస్టర్స్ డే కూడా సెలేబ్రట్ చేస్తారని లాస్ట్ ఇయర్ మాత్రమె తెలిసింది .ఈ రెండు రోజులు ఒక్కరోజే కావడం కూడా బాగుంది .నాకు తెలిసి అక్క చెల్లెళ్ళు అందరు స్నేహితులే ఎంత వయస్సులో వ్యత్యాసం ఉన్నప్పటికీ స్నేహంగా వుంటారు .ఒకరకంగా చెప్పాలంటే రక్తసంభంధం కంటే స్నేహమే ఎక్కువ కనిపిస్తుంది .మా ఇంట్లో నలుగురం స్నేహితులమే .పెద్దచెల్లి నేను చిన్న తరగతులు కలిసి చదివాము ఒకే క్లాసు అవ్వడంతో ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం తరువాత పి.జి లో రెండేళ్ళు కలిసే చదివాము .అప్పట్లో అందరు ఆశ్చర్యపోయేవారు "మీరు నిజంగా అక్కచెల్లెల్లా లేక స్నేహితులా "అనిఅక్క చెల్లెళ్ళు స్నేహంగా ఉండకూడదా అని ఎదురు ప్రశ్నించేవాళ్ళం ఇంత క్లోజ్ గా పెర్సనల్ విషయాలు మాట్లాడుకునే వాళ్ళని మిమ్మల్నే చూసాము అని విచిత్రంగా మాట్లాడేవారు .స్నేహితుల మద్య చిన్ని చిన్ని తగాదాలు వచ్చినట్లే మా అందరి మద్య వచ్చినా రెండ్రోజుల్లో మాయం అయిపోతాయి .అన్నదమ్ముల మధ్య ఇంత స్నేహం వుండదేమో కాని అక్కచెల్లెల్ల మద్య కచ్చితంగా స్నేహం ఉంటుందని నమ్ముతాను .ఈ రోజు సిస్టర్స్ డే సందర్భంగా మా అక్క చెల్లెళ్ళ గూర్చి పబ్లిక్ తో షేర్ చేసుకున్న రెండుమూడు అంశాలు ఇలా ......

5, ఆగస్టు 2011, శుక్రవారం

Malayalam Movie urumi songs Chimmi Chimmi HD

3, ఆగస్టు 2011, బుధవారం

చీకటి అంటే భయం పోయింది

"అమ్మ మమతా!నా గది లో టేబిల్ మీద పెన్ను వుంది తీసుకురామ్మా" ఇంగ్లీషు మాస్టారు


"అక్కడ చీకటి గా వుంది నాకు భయం నేను వెళ్ళను "మమత


"చీకటా..భయమా! అయితే ఏమైంది ?"ఇంగ్లీష్ మాష్టారు


"ఉహు ...నాకు భయం నేను వెళ్ళను "మమత .


"పిచ్చితల్లీ !డర్క్నెస్స్ ఇస్ నథింగ్బట్ అబ్సేన్సు అఫ్ లైట్ ..సన్ లైట్ లేకపోబట్టేగా ఈ చీకటి సన్ వచ్చిన వెంటనే వెలుతురు అంతా మన ఊహలోనే భయం వుంటుంది వూ ...మరి వెళ్లి తీసుకురా పో "... ఆ తండ్రీ కూతుళ్ళ


సంభాషణ అంతా గుడ్లప్పగించి వింటున్న నాకు చీకటి పట్ల భయం పోయింది నిజంగా ఆ వయస్సులో జ్ఞానోదయం అయింది.


ఇదంతా ఒక పాతికేళ్ళ క్రితం జరిగిన కథ .మేము విజయవాడ వచ్చిన క్రొత్తలో సిద్దార్థ కాలేజి ప్రక్క వీధిలో వుండేవాళ్ళం అక్క ఇంగ్లీష్ లిట్ కి మా ఎదురింట్లో వున్నా సిద్దార్థ కాలేజి ఇంగ్లీష్ లెక్చరర్ వద్ద సాయంత్రం ట్యూషన్ తీసుకునేది తనతోపాటు పి. జి చేసే నలుగురైదుగురు వుండేవారు . అమ్మ పిలవమని చెప్పిన లేక తోచకపోయిన వాళ్ళతో పాటు కుర్చుని వాళ్ళ మమత తో కబుర్లు చెప్పేదాన్ని .ప్రతీ రోజు క్లాస్స్ అయ్యాక ఆయన రాసిన కవితలు చదవడానికి ఇచ్చేవారు అప్పట్లో టెన్స్ టైమ్స్ కూడా ప్రచురణ అయినట్లుంది .అక్క కూడా కథలు కవితలు రాసే అలవాటు వుండటం తో మాస్టారు రాసినవి ఇస్తుండేవారు .అప్పట్లో అయన మా ఎదురింటి అంకుల్ లేక ఇంగ్లీష్ లెక్చరర్ గానే తెలుసు .


ట్యూషన్ లేనప్పుడు కాలేజి లేనప్పుడు కాని చేతిలో సిగరెట్టూ తో దీర్గాలోచనలో వాళ్ళ వరండా లోని కుర్చీలో కనబడేవారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎదురెదురు ఇళ్ళలో ఉన్నాము .తరువాత నాన్న వాళ్ళు స్వంత ఇల్లు కట్టుకుని వచ్చేయడం వాళ్ళు ఇల్లు ఖాళి చేసి జర్నలిస్ట్ కాలనీ కి వెళ్ళిపోవడం ..అప్పుడప్పుడు ఏ బుక్ ఎక్జిబిషన్ లోనో షాపింగ్ లోనో కనబడటం దాదాపు టచ్లో లేరనే చెప్పొచ్చు .


ఎప్పుడు చీకటి గదిలోకి వెళ్లి లైట్ వేయబోతున్న లేక భయమనిపించే చీకటిని చుసిన నాకు "వేగుంట మోహనప్రసాద్ గారు" గుర్తొస్తారు .నిశబ్దంగా చీకటిలో కలిసిపోయిన ఆ మహానుభావుని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ

31, జులై 2011, ఆదివారం

చరిత్ర ఇష్టం

బ్రిటిషు పాలకులు తమకోసం నిర్మించు కున్న ఆ భవనం హుందాగా చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడి వుంటుంది .రైలింగ్ పట్టుకుని టకటక మని చప్పుడు చేసుకుంటూ ఆ మెట్లు ఎక్కి దిగుతున్న ప్రతిసారి నా మనస్సు చరిత్రలోకి పరిగెడుతుంది .ఎప్పుడో బ్రిటీషువారు కట్టిన ఆ భవనంలో జిల్లా ముఖ్యాధికారి కొలువు వుంటుంది ,కొండరాళ్ళ తో చెక్క మెట్ల తో చాలా పటిష్టంగా వుంటుంది .పనిమీద ఎప్పుడు వెళ్ళిన నా మనస్సు వెళ్ళిన పని నుండి మరలి చరిత్రలోకి పరిగెడుతుంది .

చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం .నేటి కథేగా రేపటి చరిత్ర!చరిత్ర ఎందుకు చదవాలి అదేమైన కూడు పెడుతుందా ఈ రాజు ఎప్పుడు పుడితే ఏమి చస్తే ఏమి ఆ తేదీలు సంవత్సరాలు బాబోయ్ అంటారు చాలా అమాయకంగా :-)
నేను చరిత్ర చదవబట్టే అది నాకు కూడు పెడుతుంది ఆ సబ్జెక్టు మీద ఇష్టం ప్రేమ ఇంకా వగైరా వగైరా ఉండబట్టే కదా ఒక ఆప్షన్గా తీసుకుని మాక్సిమం స్కోరు తో వరుసగా రెండు మూడు ఉజ్జోగాలు సంపాదించాను :-)
సమావేశ మందిరంలో కూర్చున్న నా కళ్ళు నిశితంగా కూడ్యాలు దర్వాజాల వైపు చక్కర్లు కొడుతుంటాయి .అప్పుడెప్పుడో పందొమ్మిదివందల ఇరవయ్యో లో భాధ్యతలు నిర్వహించిన నోరు తిరగని అధికారుల పేర్లనుంచి ఇప్పటివరకు నిర్వహిస్తున్నవారివి చెక్క ఫ్రేం లో రాసి వున్నాయి చదుకుంటూ అప్పటిలో అక్కడ కొలువు చేసిన గతించిన అధికార్లను ఊహ రూపం లో చూస్తూ రేపటి మనల్ని చూస్తుంటాను .
పాలకులుగామౌర్యుల్ని గుప్తులని అల్లాఉద్దిన్ ఖిల్జీ ని అక్బర్నిషేర్ష సూరిని ఔరంగాజేబుని తుగ్లక్ ని శివాజీ ని కృష్ణదేవరాయని ఇంకా ముఖ్యంగా మనకి పాలన వ్యవస్థని అంచెలంచెలుగా అందించిన "బ్రిటిషు "వారిని ఇష్టపడతాను .బ్రిటిషువారి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన (వదిలివెళ్ళిన )ఆ పూరాతన కట్టడాలు నాకెంతో ఇష్టం .

25, జులై 2011, సోమవారం

నాలోనే పొంగెను నర్మదా

ఎన్ని సార్లు విన్నా విసుగనిపించదు ...అలా ప్రయాణంలో అలసటలో వింటుంటే నా అలసటంతా చిటుక్కున మాయం అవుతుంది .....

నేను-చిన్ని

ఇలా వుంటుంది మా ఇద్దరి కథ :-)
-చిన్ని నేను

14, జులై 2011, గురువారం

ఊహించని బహుమతి

నీకోసం పార్సిల్ వచ్చింది అంటున్న శ్రీవారి మాట పూర్తికాకుండానే వంటగదిలో నుండి ఒక లాంగ్ జంప్ చేసి తడి చేతుల్ని చీరకు తుడిచేస్తూఎవరు పంపారా అని ఆత్రంగా ఫ్రం అడ్రెస్స్ చూసి నవ్వుకున్నాను పంపిన వస్తువేమిటోఊహించేసాను .
ఫటాఫట ఓపెన్ చేస్తూ నాచేతికి పిన్ను కూడా గుచ్చించేసుకున్నాను.నొప్పిని కూడా లెక్కచేయకుండా ఆ వస్తువుని తీస్తే అందమైన
బాపు బొమ్మలతో 'వంశీ 'గారి "మా దిగువగోదారి కథలు"పుస్తకం దర్శనం ఇచ్చింది .
పుస్తకం లో పేజి తెరవగానే అందంగా తన చేత్తో రంగులద్దిన లతలురాసిన అయిదు పంక్తులైన ఆత్మీయత కలబోసి ...'పుస్తకమేమో దాచుకోవల్సినదీ .....
కథలేమో మళ్ళి మళ్ళి చదివించేవి ..అంటూ .ఎన్ని ఈ మెయిల్స్ రాసుకున్న ఇంత ఆనందం వుండదేమో ..ఇలా ఉత్తరాలు అందుకోవడం పుస్తకాలు
గిఫ్ట్లుగా పొందడం లో వున్నా ఆనందమే వేరు .
హ్మం ఈ గోదారి వాళ్లకి గోదారి అంటే ఎంత ప్రేమో !
ఏవిటో మా కృష్ణా నదీ అందమైనదే శైవ క్షేత్రాలతో ,బౌద్దారమాలతో త్రుళ్ళి పడుతున్న దానితో ఎవ్వరు ప్రేమలో పడరు.గోదారోల్లు
మాత్రం అప్పుడే కళ్ళు తెరిచినా బుడతడు నుంచి తొంబయ్యి ఏళ్ళ కురు వృద్దుడి తో సహా గోదారి అందాల వెంటపడే వారే .అందులోనే
అమ్మని ,ఆడపడుచుని నేస్తాన్ని ప్రియురాల్నిచూస్తారట ..బహుశా ఆ నీటి మహత్యం కావొచ్చు.సంవత్సరం పైనుండి గోదారి ప్రజలతో
కూడి పనిచేస్తున్న వీళ్ళకి జీవితాన్ని ఆస్వాదించడం తెలిసినట్లో మరొకరికి తెలియదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది .ప్రతిపనిలోను
నవ్యత్వం కనిపిస్తుంది.. ఇలా ఊహించని రీతిలో బహుమతులు పంపేస్తారు :-)

1, జులై 2011, శుక్రవారం

అతను యేమయ్యాడో

అతను యేమయ్యాడోఒకటే ఆలోచన .ఇప్పుడా అప్పుడా దాదాపు మేము ఈ ఇంట్లో కి వచ్చినప్పటి నుండి పరిచయమంటే సుమారు ఎనిమిది ఏళ్ళు అనుకోవచ్చు .ప్రతి సోమవారం గురువారం వచ్చేవాళ్ళు .పోయిన ఏడాది ఇలానే టెన్షన్ పడ్డాను నెలరోజులు కనబడపోయేసరికి..అప్పట్లో ఎండలకి అనారోగ్యం వలన ఇల్లు కదలలేక పోయారట .ఇప్పుడు అలానే అనుకుని మనస్సుకి సరిపెట్టుకున్న ఏదో కీడు శంకిస్తుంది .నాకు చాలా ఇష్టం అయిన వ్యక్తి .ఈ వయస్సులో కూడా తన పాత సైకిల్ వేసుకుని ఓపిక కూడగట్టుకుని సైకిల్ హండిల్ కి ఇరువైపులా బరువైన పుస్తకాల సంచులు తగిలించుకుని నెమ్మదిగా బరువు మోసుకుంటూ..అమ్మా .పాపా అంటూ అతి కష్టం మీద నూతిలోంచి మాట్లాడినట్టు పిలుస్తాడు .నేను పలకపోతే అక్కడే వున్నా ఉయ్యాలలో నాకు కావలసిన పత్రికలూ పెట్టేసి వెళ్ళిపోతాడు . నెలవారి డబ్బులు ఇస్తే తప్ప ఏ రోజు నోరు తెరిచి అడగలేదు .రాకపోయినా తను ఎక్కడున్నా ఆరోగ్యంగా వుండాలని రోజు దేవునికి మొరపెడ్తున్నాను.ఈనాడు లో పత్రిక ప్రమోటర్ గా చేరి ఇప్పుడు ఒంట్లో ఓపిక సన్నగిల్లి గడవక అప్పటి వాసనలతో అక్కడక్కడ ఆదరిస్తున్న సాహిత్యభిమానుల ఆదరణ తో కదిలే గ్రంధాలయం లా బ్రతుకు బండి లాగిస్తున్నాడు ....ఈ రోజుల్లో ఇలాటి వ్యక్తులు చాలా అరుదుగా తారసపడ్తుంటారురోజు ఉదయం వస్తాడేమో అని ఎదురు చూపులు నాతో పాటు పాప మావారు ఏమయి ఉంటాడని రోజుకోసారయిన తలుస్తారు .తన అడ్రెస్స్ కాని నంబర్ కాని తెలీదు ఎన్నిసార్లడిగిన మీకు తెలీదమ్మా రాలేరమ్మ అనేవాళ్ళు నంబర్ తనకి లేదని ప్రక్కవాల్లది ఎప్పుడు వాడుకోలేదని చెప్పేవాడు ....నాకైతే వీధి వీధి వెదకాలని వుంది :-(

14, జూన్ 2011, మంగళవారం

సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ బాగుంది

మారిన సివిల్ సర్విస్ ప్రిలిమినరీ పేపర్ చాల బాగుంది .మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఇచ్చిన పేపర్ టూఇంకా బాగుంది .దీనివలన పూర్తి స్థాయిలో ఫిల్టర్ అవ్వొచ్చు .ఎప్పుడు కోలాహలంగా వుండేపరీక్ష కేంద్రాలు ఎందుకో బోసిపోయినట్లు అనిపించాయి .మారిన సిలబస్ తెలియని మోడల్ పేపర్ అంటుకోవడానికి చాల మంది సాహసించలేదు.మెయిన్ పేపర్లో కూడా ఇదేవిదమైన మార్పులు వుంటే బాగుండును అంటే అస్సలు ఆప్షన్ పేపర్ అనేదే లేకుండా.

1, జూన్ 2011, బుధవారం

మేఘమా స్వాగతం

నిన్నటి నుంచి నాలో నూతనోత్సాహం అంబరాన్ని చుంబిస్తుంది..కారణం ఏవిటా అని తరచి చూసుకుంటే హప్పుడు అర్ధం అయ్యింది .నిన్న లేచి లేవగానే చుట్టుముట్టిన నీలిమేఘాలు తాకగానే చిన్ని చిన్ని బిందువులై తనువెల్ల తడిపాయి ..కానుగ చెట్టు గొడుగు క్రింద కూర్చుని నీలగిరి తేనేరు వేడి వేడిగా సేవిస్తుంటే నాలో తెలీని ఉత్సాహం పురులు విప్పి నాట్యం చేసింది ....ఆ అందమైన అనుభవం ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తున్న వదలక వెన్నంటే వుంది నీలం పచ్చదనం నీటి బిందువులు పోటిపడి కనువిందు చేస్తున్నాయి .....ఇంత అధ్బుతమైన ఆనందాన్ని కలిగిస్తున్న "వర్ష ఋతువా"నీకుస్వాగతం.

25, ఏప్రిల్ 2011, సోమవారం

చిన్నపనులను నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాలను సాధించలేరు .

6, ఏప్రిల్ 2011, బుధవారం

అప్పుడే వండిన వంటలు

హేవిటో ఎంత వద్దని అనుకున్న అప్పటికప్పుడు వండిన వంటకాలన్నీ నా వద్దకి చేరిపోతాయి మనం తిన్నాక అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది హ్మం ...అలా పంచుకోపోతే మనకి నిద్రపట్టదాయే....


మొన్నకి మొన్న అంటే పది రోజుల క్రిందట కౌన్సిల్ సమావేశం లో ముఖ్యమైన చర్చలో వుండగా వేడి వేడి వంటకం నా టేబిల్ మీద చేరింది వచ్చాక దానివంక చూడకుండా ఉండలేము కాదాయె ...ఎక్స్జ్యుమి ఒక్క నిమిషం అని సదరు పాత్ర లోకి తొంగి చూడగా ఒక్కసారే గుండె జారిపోయింది ..కెవ్వు మన్న నా కేక విని నా ఎదురుగు ఆసినులయ్యి వున్నాసదరు అధికార్లు "ఏమయ్యింది మాం ?''అంటూ ఒక్క ఉదుటన కుర్చిల్లోనుండిలేచి ఆతృతగాఅడిగారు .మనం తేరుకుని అప్పుడే వండిన వార్తని మోసుకొచ్చిన మా "బుజ్జితల్లి "(నా మొబైల్ ముద్దు పేరు )ని చూస్తూ అందరకి పంచేసాను ...విషయం ఏవిటంటే ..."sad news for all indians ...our ex-president dead in kovai military hospital due to heart attack...pls forwd to all indians ...అని పైకి చదివాను .ఇంకేం వుంది అందరి ముఖాల్లో విషాదం ..అయన రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివి ఒకరు అయన గొప్పతనం గురించి ఒకరు మానవత్వం సింప్లిసిటీ గురించి ఒహరు జ్ఞాపకం చేసుకుని ఆ సమావేశాన్ని సంతాపసభ గా ముగించాము.ఒక అధికారి ఏకంగా "రేపు సెలవు కాబట్టి ఆ మర్నాడు ఫైల్ చూద్దాము "అనేసుకున్నాడు :-) ఇక మేమంతా సదరు వంటకాన్ని కావలసిన బంధు మిత్రులందరికీ పంచేసి భాధతీర్చేసుకున్నాం .ఇంటికి వెళ్ళాక టివి లో స్మృతి గీతాలు లాటివి ఏమైనా ప్రసారం జరుగుతుందేమోనని చూద్దును గదా ..హబ్బే ... ఆ జాడలె లేవు ....ఎందుకు ఇలాటి వార్తలు ప్రయాణం చేస్తాయో అర్ధం కాదు మనం ఫూల్ అవ్వడమే కాకుండా ఇతరులని ఫూల్ చేసే పరిస్థితి .....ఆనక నాకు సారీ చెప్పిన నేను ఎందరికి చెప్పాలో కదా ! రెండు రోజుల క్రితం వార్త కూడా మనసును కలిచి వేసింది .చూద్దాం ఇది అబద్దం అవుతుందేమో !

18, మార్చి 2011, శుక్రవారం

అయ్యవార్ని చేయబోతే కోతి అయ్యిందట

అయ్యవార్ని చేయబోతే కోతి అయ్యిన చందాన ఏదో కాస్త తిన్నది తగ్గించి కాస్త అందం గా తయారవ్వుదామని(నా కూతురికి తోడు ) నెల రోజులనుండి జిమ్ కి వెళ్లి రెండుగంటలు గడిపి వస్తుంటే రెండు చేతులు కాస్త ఉక్కు కడ్డీల్ల తయారయ్యాయి :-(
పది రోజుల క్రిందట బ్లౌజ్ లో తేడా అనిపించి కోచ్ ని అడిగాను ..."యెం నాయన నీవు చెప్పేవి చేస్తే నీలా తయారయ్యేట్లున్నాను ఇవి చేయొచ్చా నాకెందుకో అనుమానంగా వుంది" అని .అస్సలుకి ప్రాబ్లం లేదు మాం నిక్షేపంగా చేయొచ్చు మీ చేతులు వారం లో తగ్గిపోతాయి నేను చెబుతున్నాగా అని మరిన్నివర్కవుట్స్ చేయించాడు..నేనేమో కార్డియో ఓ గంట చేసి రావచ్చు అనుకుంటే వాటికంటే వీటిమీదే దృష్టి పెట్టించాడు ఎంత చిన్న పిల్లాడయిన మాకు పెర్సనల్ కోచ్ కదా వినక తప్పుతుందా !సరిగ్గా నిన్నటికి నెల మనం బుద్ధిగా ఉదయాన్నే అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టి ..వెయిట్ చూసుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ..హ్మం .కొరకొర చూస్తున్న నా చూపుల్ని తప్పించుకుంటూ "మీరు సరిగ్గా డైట్ ఫాల్లో కావడం లేదనుకుంటా" అని డిఫెన్స్ లో పడ్డాడు..
వెయిట్ తగ్గకపోయినా నా భుజాలు వెయిట్ లిఫ్టర్ లా తయారయినేం నా కూతుర్ని మాత్రం డేసిప్లిన్ లో పెట్టగలిగాను చీకటితో లేచి చకచక తయారయ్యి జిమ్మ్కి వస్తుంది తనలో మాత్రం చాల మార్పు వచ్చింది అన్ని రకాలుగా ..నా కోచ్ కంటే తన కోచ్ బెటర్ గా గైడ్ చేస్తున్నాడు ..నా చేతులు తగ్గించు కోవటానికైన రెండు గంటలు కేటాయించక తప్పదు ..కోచ్ ని మార్చేసాను:)

12, మార్చి 2011, శనివారం

తమరి రాక మాకెంతో సంతోషం

కొన్ని స్నేహాలు ఎలా మొదలవుతాయో అర్ధం కాదు చాల మాములుగా అయిన పరిచయాలు మంచి స్నేహితులుగా మారవచ్చు .బ్లాగు ద్వారా నాకు ముగ్గురు మిత్రులు ఏర్పడ్డారు .మొట్టమొదట నాకునేను పరిచయం చేసుకుని చాట్ ఆ తరువాత ఫోన్ లో మాట్లాడుతున్న మిత్రులొకరు మిగిలిన ఇద్దరు కామెంట్స్ ద్వారా ఆ తరువాత చాట్ లో మాట్లాడతూ పరిచయం అయినవారు ,వీరెవ్వర్ని ఇంతవరకి ముఖాముఖి చూడలేదు కలవలేదు ...కాని ఈ రోజు బ్లాగ్ ద్వారా ఇటీవల పరిచయం (స్నేహం )అయిన మిత్రుడు మా ఇంటికి రావడం జరిగింది మా పొరుగు జిల్లాలో ఆఫీసు పనిమీద వచ్చి ప్రత్యేకంగా ఈ రోజు సమయం కేటాయించుకుని మా ఫ్యామిలీ అందరితో మద్యాహ్నం వరకు గడిపి వెళ్ళారుచాలా సంతోషంగా అనిపించింది .బ్లాగులు మంచి స్నేహితుల్ని ఇస్తాయి :-)

9, మార్చి 2011, బుధవారం

లిటిల్ ఏంజెల్స్


ఏంజెల్స్ గురించి వినడమే కాని ఎప్పుడు కళ్ళార చూడలేదు .ఈ రోజు సాయంత్రం వారందర్నీ కలవడం వారి కాండిల్ లైటింగ్ సెరిమోనీ లో పాల్గొనడం జరిగింది .వారంతా ఫ్లారెన్సు నైట్ ఇంగెల్ బాటలో నడిచే చిన్నారులు .పదవతరగతి చదివి పద్దెనిమిది నెలల శిక్షణ తీసుకుంటారు ఈ లిటిల్ ఏంజెల్స్.వృత్తివిద్య శిక్షణ అనంతరం వీరు ప్రభుత్వ ప్రవేటు హాస్పిటల్ లో పనిచేయడానికి అవకాశం వుంటుంది . ఈ సెరేమోనీ లో వారికి కాప్స్ ఇవ్వడం వారితో ప్లేడ్జ్ తీసుకోవడం దీపాలతో ఫ్లోరేన్స్ అడుగుజాడల్లో నడుస్తామని ప్రమాణాలు చేయడం మరిచిపోలేని అనుభవం .ఎప్పుడు ఇటువంటి కార్యక్రమానికి వెళ్లకపోవడం తో ఉన్నంతసేపు చాల ఎంజాయ్ చేసాను .

6, మార్చి 2011, ఆదివారం

భవిష్యత్తు

ఈ పదిహేనురోజుల్లో ఎన్నో ఆలోచనలు నిర్ణయాలు మార్పులు చేర్పులు .చాలా మారాను అనుకునేకంటే మార్పులు అనుగుణంగా చేసుకున్నాను ఉద్యోగం పూర్తిగానో తాత్కాలికంగానో వదిలేయన్న ఆలోచనకి శివరాత్రి రోజున తేలిపోయింది కొన్నాళ్ళు చూడాలని వాయిదావేసుకున్నాను ఈయనతో తీరికగా చర్చించాక.లాస్ట్ సండే మేమంతా సత్తెనపల్లి వెళ్ళివచ్చాక మరికాస్త క్లారిటీ వచ్చింది నిజానికి అంతక్రితం గుంటూరు వెళ్ళిన రోజే నా దిశ గమనం మార్చుకోవాలని దృడంగానిశ్చయించుకొన్నాను..కొంత నన్ను మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాశ్రీవారి ముందు చూపు నన్ను కొంత వెనక్కి లాగింది అయిన మనసులో రేగిన అలజడి ఇంకా సద్దుమణగలేదు..వేచిచూడాలి.

2, మార్చి 2011, బుధవారం

నా ఫేవరేట్ సాంగ్

23, ఫిబ్రవరి 2011, బుధవారం

ఫనా లో ఇష్టం అయిన పాట

ఎంత ఇష్టం అయిన సినిమా అయిన పదేపదే చూసేవి వేళ్ళలో లెక్కపెట్టవచ్చు .పాటలు మాత్రం వందల్లో వింటాను .అలా లెక్క పెట్ట దగిన సినిమా లో ''ఫనా ''చేరుతుంది .ఎందుకో ఎన్ని సార్లు చూసిన అప్పుడే చూసిన అనుభూతి కలుగుతుంది.ఈ పాట వినేకొద్ది వినాలి అనిపిస్తుంది .

19, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రవాహంలోప్రయాణం

ప్రవాహంలో లో నా ప్రయాణం నిన్నటినుండి మొదలయ్యింది .చాలాకాలం తరువాత తీరికగా ధియేటర్ కి వెళ్లి "అప్పల్రాజు"సినిమా చూసివచ్చాను.ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లాను కాబట్టి నాకు చాల నచ్చింది .సినిమా కామెడి కాదని ప్రారంభంలోనే ప్రేక్షకులకి తెలియజేసినప్పటికి సినిమా సగం నుంచి వేణుమాధవ్ బృందం హాస్యం పండించింది.సినిమాయలోకం,ఔత్సాహిక కళాకారుల కష్టాలు ఇలా తెరమరుగున వుండే విషయాలు విశేషాలతో ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది.సరదాగా చూడతగిన సినిమా .

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఇదే జీవితమా!

ఎందుకో నా ఆలోచన ధోరణిలో రాను రాను మార్పు కనిపిస్తుంది.ఒకప్పుడు వున్నపోటీ తత్వం ఇప్పుడు ఉండటంలేదు ప్రతిపనికి ఇప్పుడు చేయకపోతే నష్టం ఏవిటి నేనే ఎందుకు చేయాలి చేయకపోతే వచ్చే పరిణామాలు ఏవిటి ఇలా సాగిపోతుంది ....నావరకు ఫరవాలేదు కాని నాకున్న ఒక్కగానొక్క బిడ్డ మీద కూడా నా ప్రతికూల ఆలోచనలు ప్రసరిస్తున్నాను.ఒకప్పుడు విపరీతంగా ప్రోత్సహించిన నా నోటి తోనే అంత కష్టపడకు సర్వీసులు తెచ్చుకోవడమే జీవితం కాదువేరే వైపు కూడా జీవితం వుంది ఇంకా నచ్చినట్లు జీవించవచ్చు అని హితవులు పలుకుతున్నాను .నాకులా తను ఎందుకు ఇబ్బంది పడాలి అంత అవసరమాఅని నా మనస్సు ఎదురు తిరుగుతుందికొన్ని సౌఖర్యాలు అధికారాల తోపాటు ఎన్నో అసౌఖర్యాలు మనస్సుకి నచ్చనివి కూడా భరించాలి. తినడానికి నిద్రపోవడానికి సమయం లేని పని ఒత్తిడితో కొన్నాళ్ళకి ఆరోగ్యాన్ని కోల్పోయి చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి మిగుల్చుకుంటామో అర్ధం కావడం లేదు..దీనికి ఎక్కడో చోట ఆనకట్ట వేయవలసిందే అనుకుంటాను .గతంలో ఎంతోమంది మిత్రులు ఇంతా కష్టపడాలా అని అంటుంటే వారు ఇలా నిరుత్సాహ పరుస్తున్నారు ఇదేమి ధోరణి అనిపించేది.మనకోసం మనం బ్రతుకుతూ సాధ్యమైనంత మనకున్న పరిధిలోనే సాటి మనుష్యులకు సాయపడలేమా..దానికిప్రభుత్వుద్యోగమే తోడ్పాటు కావాలా స్వచ్చంద సంస్థ ద్వారాకూడా మన అభీష్టం మేర తోడ్పాటును అందించవచ్చును కదా అనిపిస్తుంది.బహుశా అక్క కూడా ఇలానే ఆలోచించి కొన్ని నెలలుబ్రేక్ తీసుకుందేమో..హ్మం ...ప్రతిది తెలియకుండానే అక్క అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తున్న నేను తనలానే మార్పు కోరుకున్టున్నానేమో చూడాలి.నాన్న మాకు ఇచ్చిన స్ఫూర్తి మా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం ప్చ్... ..

14, ఫిబ్రవరి 2011, సోమవారం

అమ్మమ్మ ఊర్లో వాలంటైన్స్ డే సెలెబ్రేషన్స్ఈ రోజు ''ప్రేమికులరోజు "అందరము అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరుపుకోవాలని అంతా నిశ్చయించుకున్నాము:-) .మా ఊరు చాల అందంగా వుంటుంది ఇల్లు ని ఆనుకుని పొలము తోటలు వుంటాయి.అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తాతయ్య పెద్దమామయ్య ఫ్యామిలీ వుంటారు. అమ్మమ్మ కొంతకాలం క్రితం గతించాక అక్కడికి వెళ్ళడం తగ్గిపోయింది .మా అమ్మావాళ్ళు మొత్తం ఆరుగురు వాళ్ళపిల్లలం అలానే మా పిల్లలు ఇంకా మా తాతగారి తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తానికి కలిపి ఒక వెయ్యిమందిమి ఉదయం ఎనిమిదికల్లా చేరిపోయాము.
అంతా ప్రేమికులరోజు శుభాకాంక్షలు ఒకరికొకరం తెలుపుకున్నాం (ఫలహారాలు ఆరగిస్తూ ).పదకొండు గంటల సమయంలో మాపెద్దమామయ్యా కొడుకు కి తను మూడు సంవత్సరముల నుంచి ఇష్టపడుతున్న అమ్మాయికి మా తాతయ్య అద్వర్యంలో వివాహం జరిపించారు.వైవిధ్యంగా చేయాలనీ ప్రేమికులరోజుని నిర్ణయించారు
ఆ అమ్మాయి వాళ్ళ తరుపు కొంతమంది (ఫ్యామిలీ )మాత్రమె వచ్చారు .తాతయ్య మనవాడి మనస్సు అర్ధం చేసుకుని అన్నీ తానయి నిర్వహించారు.చాలా కాలం తరువాత అమ్మమ్మ ఊర్లో చిన్నపిల్లలం అయిపోయాం .మా భాల్యమిత్రులు కూడా చాలామందిని కలిసే అవకాశం కలిగింది .థాంక్స్ టూ98 years తాతయ్య.
రోజులు ఎలా మారిపోయ్యాయో ...హ్మం .

12, ఫిబ్రవరి 2011, శనివారం

బుజ్జులు
మా ఇంట్లో ముగ్గురికి 'బుజ్జులుగాడ్ని'చూడకుండా వుండనిదే తోచడం లేదు .ఇదివరకు అటుఇటు తిరిగి వచ్చిన తొట్టెలో చేపపిల్లలు ఏమి చేస్తున్నాయో వాటికి ఫుడ్ వేశార లేదా అని అరా తీసి వేయకపోతే వేసి కాసేపు వాటితో కబుర్లు చెప్పేదాన్ని .ఇప్పుడు బుజ్జులు మా జీవితం లో అడుగు పెట్టాక బంగారు చేపల్ని నిర్లక్ష్యం చేసాము వాటిని శ్రద్ద తీసుకోవడం తగ్గిపోయి నిన్న గాక మొన్న వచ్చిన ఈ బోడి బుజ్జులు ఆక్రమించింది .ఈ బుజ్జులు ఏమి చేసిన మాకు అధ్బుతమే ఇది చాలా తెలివైనది అదేకాక చాలా క్రమశిక్షణ తో ప్రవర్తిస్తుంది ఒక్క విషయం లో తప్పించి .అదేమిటంటే కొత్తవాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళను నిలవనీయకుండా ఆనందం తో ఒక్క వుదుటున వాళ్ళ ఒడిలో చేరి గారాలు పోతుందీ మేం ఎంత చెప్పిన అస్సలు లెక్క చేయదు పైగా మీతో నాకేమి పని అన్నట్లు ఒక లుక్ వేసి వచ్చిన వాళ్ళ బుజాల మీదో చేతి మీదో తల వాల్చేసి వాలుగా మా వైపు చూస్తాది.వచ్చిన వాళ్ళు కుక్కలంటే భయం లేని వాళ్ళయితే పర్లేదు ఇబ్బంది పడేవాళ్ళతోటే మాకు ఇబ్బంది అప్పుడు వీడ్నికంట్రోల్ చేయడానికి బోల్డు కష్టపడాలి ..కట్టేసామా ఇక మమ్మల్ని మాట్లాడనీయకుండా గోల గోల దాని బాషలో గొణుగుతూ వుంటాది ఇవన్ని పడేకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు సహనం తో కాసేపు బుజ్జులు ని వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకుంటే బాగుండును అనిపిస్తుంది .పగలంతా మా పాపకి ఎదురుగా కూర్చుని చదివిస్తూ మద్య మద్యలో దానికి బోర్ కొట్టినపుడు మేడపైకి లేక ఇంటి చుట్టూషికారుకి తీసుకుని వెళ్తే సంతృప్తి పడుతూ రాత్రయ్యేసరికి సింహద్వారం ఎదురుగా కూర్చుని మారాక కోసం పడిగాపులు పడ్తువుంటుంది మాఇద్దరిలో ఎవరు ముందు వచ్చిన రెండు నిమిషాలు ఆడిరెండోవారు వచ్చే వరకు గుమ్మం వద్దనే ఎదురుచూస్తుంటది వచ్చాక ఇక ఆటలు మొదలుపెడ్తది.బుజ్జులుకి నిద్ర వచ్చిన నిద్రపోకుండా ఎవరు మెలకువగావుంటారోవాళ్ళ ప్రక్కనే కునికిపాట్లు పడుతూ చివరి లైటుతీసేవరకు వుండి ఆనక నిద్రపోతుంది .
ఉదయాన్నే మాకంటే ముందు లేచిన అల్లరి చేయకుండా మేము లేచాక ఒక్కొక్కర్నీ పలకరించి వెళ్తుంది ..బుజ్జులుకి ఆరుబయట షికార్లంటే ప్రాణం ప్రకృతిని పరవశంగా ఆరాధిస్తుంది. గాలి వీచే దిశగా ముఖం పైకెత్తి కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంది చెట్టుకొమ్మలు గాలికి కదులుతుంటే చెవులు రిక్కించి వింటూ మనకి ఏదో చెప్పాలని తాపత్రయపడ్తుంటది .చెట్టు మీద చిన్ని చిన్ని పిట్టల్నిఅటు ఇటు పరుగులు తీసే ఉడుతల్నిపూలపై వాలుతున్న తెనేటిగలను మురిపెంగా కళ్ళు ఇంతేసుకుని చూస్తాది.కాకుల్ని మాత్రం అస్సలు సహించదు అవి వెళ్ళేవరకు విసిగిస్తూనే వుంటది.బుజ్జు చీకట్లో దోమల్ని అతి సునాయాసంగా పట్టేస్తుందిపట్టినవి పట్టినట్లు గుటుక్కుమని మింగేస్తుంది.ఆల్ అవుట్ ఎందుకు దండగ బుజ్జులు చెంత వుండగా అని మా అమ్మాయి గర్వంగా అందరికి చెబుతాది.
బుజ్జు నాకు మరీ మరీ ఎందుకు ఇష్టం అంటే శ్రీవారిని అస్సలు టి.వి చూడనీయదు తను తీరికగా టివి ముందు కనిపిస్తే చాలు పద బయటికి షికారు పోదాం అంటూ సతాయిన్చేస్తాది ,బుజ్జులు కోరిక ఈయన అస్సలు కాదనరు స్పోర్ట్స్ చానల్ కట్టేసి మరీ అమ్మగారు ఎటు తీసుకుపోమ్మంటే అటు తీసుకొని వెళ్తారు ఆ రకంగా మా ఇంట్లో వెధవక్రికెట్ గోల కొంత తగ్గింది .బుజ్జులు అలిగిందంటే మాత్రం చచ్చామే ఎంత బ్రతిమాలిన దిగి రాదూ తినదు తాగదూ.చిన్న చిన్న విషయాలకే అలుగుతాది..కొంచెం పని ఒత్తిడిలో వుండి పలకరించకపోయిన సోఫా క్రిందో మంచం క్రిందో దూరి ఎంత బ్రతిమాలిన రాదూ అది తిరిగి మామూలు అయ్యే దాక దిగులు ...అసలు ఇంత అనుబంధం పెంచుకోవద్దు ఏ కారణం అయిన దూరం అయితే తట్టుకోలెం అని అనుకున్న అనుకునే కొద్ది మరింత దగ్గర అయిపోతుంది హ్మం ..

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా తుంటరి పని


ఇంట్లో అల్లరికి చిరునామా నాదే .అమ్మమ్మ ఊరు వెళ్తే ఇక నాకు హద్దు వుండేది కాదు.ఒక వేసవి సాయంత్రం స్నేహితుల తో ఆటల్లో మునిగి మద్యలో దాహం వేస్తె ఇంట్లోకి పరుగున వచ్చి(పెరటి దారి ) పెద్ద మట్టికుండ లోని చల్లటి నీళ్ళను అక్కడే బోర్లించి వున్నఇత్తడి చెంబు తో తీసుకుని గటగట కొన్ని తాగి మిగిలిన నీళ్ళను ఏంచేయాలో తెలియక తిరిగి కుండలో పోసేద్దామా అని ఒక క్షణం ఆలోచించి మనసొప్పక అటు ఇటు చుస్తే బియ్యపు డ్రమ్ము మూత తీసి కనబడింది ,అమ్మమ్మ బెడ్డలు వడ్డుగింజలు ఏరే కార్యక్రమం పెట్టుకుని బియ్యం తీసుకొని మూత పెట్టలేదు,ఇకనేం మిగిలిన చెంబులోని నీళ్ళు డ్రమ్ములో పోసేసాను..నీళ్ళు క్షణం లో మాయం అయ్యిపోయాయి అది నాకు ఆశ్చర్యం కలిగించి మరో చెంబుడు పోసాను నీరు మరల మాయం అయ్యేసరికి ఇక వరుసబెట్టి చెంబుల మీద చెంబులు పోస్తుంటే ముందు వసారాలో వున్న అమ్మమ్మ వాళ్ళు చప్పుడుకి హుష్ అంటూ పిల్లి కాని వచ్చిందేమో అని లేచి వస్తుంటే చప్పున మూత పెట్టేసి ఎంచేక్కగా బయటికి వురికేసాను ఆటల్లో పడిపోయి నేను చేసిన పని మరిచిపోయాను .
ఆ మరునాడు మా అందరకి టిఫిన్లు తినిపిస్తూ అమ్మ పిన్ని వాళ్ళు హడావిడిగా వుండగా అమ్మమ్మ "హవ్వ హవ్వ ..ఇదేమి పనమ్మా అజ్జో ఇలా అయ్యింది ..ఎవరి పని ఇది "అని మొత్తుకుంటూ పాలేరు పిల్లాడ్ని డ్రమ్ము పట్టించి వాకిట్లో బోర్లించేరు అందరం ఎమైందా అని వాకిట్లోకి వెళ్లి చుస్తే బియ్యం ఉండలు ముద్దలు ....ఒక్కసారే నేను చేసినపని గుర్తొచ్చింది.కాని నోరు మెదపలేదు .అమ్మమ్మ పని వాళ్ళనే తిట్టింది .ఎవరికేం మాయరోగం వచ్చింది తూముడు బియ్యం నాశనం చేసారు అంటూ ...నేనే అని చెబితే అమ్మమ్మ తిట్టదు కాని అమ్మ చేతిలో మాత్రం తప్పదని గుడ్లప్పచెప్పిఅలా నిలబడిపోయానుఒక ప్రక్క చెప్పేయాలని (అసలే మన నోట్లో నువ్వు గింజ నానదాయే )కష్టపడి ఆపుకున్నాను .ఆ తరువాత కొన్నాళ్ళకి అమ్మమ్మకి చెప్పేసాను సరదాగా నేనే ఆ పని చేసానని.ఇప్పటికి ఆ జ్ఞాపకానికి తడి ఆరలేదు .బియ్యం కడుగుతున్నప్పుడు అమ్మమ్మ గుర్తుకు వస్తది .

31, జనవరి 2011, సోమవారం

Kuch na Kaho-1942 love story

SILSILA

Tu Mera Jaanu Hai - Jackie Shroff & Meenakshi Seshadri - Hero

NIKAAH MOVIE SONG

27, జనవరి 2011, గురువారం

సూరీడు పారిపోయే

చీకటితో మంచుముసుగులో ఉన్న నగరాన్ని విడిచి రచ్చబండ లో రాచకార్యములు ముగించి అలసటతో వెనుతిరుగుతున్ననాకు బలమైన కిరణం నామేను తాకింది పట్టుకుందామని ప్రయత్నిస్తే హమ్మో చెట్టులలో పుట్టల్లో వాగుల్లో దాగి దాగి పారిపోయే ...నన్ను చూసి జడిసిందా:-):-)
21, జనవరి 2011, శుక్రవారం

ఇష్టం అయిన పాట

ఇష్టం అయిన పాట

నాగమల్లి పూలు


నా పని అలసటని ప్రయాణం లో ఇలా ప్రకృతి అందాలని వీక్షిస్తూ మురిసిపోతూ మరచిపోతుంటాను ......నా ఫ్రెండ్ నాగు తమ్ముడు గిరి ఈ మద్య ఇండియా వచ్చినపుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు వాళ్ళఊరు భలే నచ్చింది .వాళ్ళ పోలాలలోనే చెరుకు ఆడటం ,బెల్లం తయారు చేయడం ఇలాటి దృశ్యాలు అబ్బురపరిచాయి .సంక్రాంతి కి ఇక్కడినుండి తీసుకుని వెళ్ళిన బెల్లం తోనే అరిసెలు చేసారు మా ఇంట్లో .అతిధి మర్యాదలలో ఈ జిల్లాల వాళ్ళని మించినవారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో .ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి .ఈ పూలు వాళ్ళ ఇంటి ముందున్న చెట్టువి.నాగమల్లి పూలు అంటాము .పాము పడగ శివలింగము కలిగిన వీటిని శివాలయాల్లో పూజకి పెడ్తుంటారు ,వీటి పరిమళం అద్భుతం .మా లొయోల కాలేజిలో ఆఫీసు రూం కి దగ్గరలో రెండు చెట్లు వుంటాయి అక్కడ మాలిని బ్రతిమాలో కళ్ళుకప్పోవాటిని కైవసం చేసుకునేదాన్ని.ఇప్పుడు ఎప్పుడైనా వాకింగ్కి కాలేజిలోకి వెళ్తే మాఇంట్లో రోజల్లానాగమల్లి సువాసనలు వేదజల్లాల్సిందే :-)


ఇక వదిలేస్తే పోలా

ఎవరి ఆనందం వారిది .ఎవరి బలహీనతలు వారివి .ఇలాగే వుండాలి అంటే కుదరవేమో.ఇది మిధ్య ప్రపంచం అని తెలిసే కూడా అందమైన తేనే గూడు వదల్లేకపోతున్నాము.నిజంగా చెప్పాలి అంటే ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నాం.బాధ జాలి అన్నీ ఫీలింగ్స్ ఒక్కసారే ..హ్మం .ఇక వదిలేస్తే మంచిదేమో. చెత్త రాతలు రాసిన వాళ్ళని కూడా ఇంతమంది ప్రశ్నించలేదేమో....ఒక్కడు ఒకే ఒక్కడు ...హ్మం పాపం !

12, జనవరి 2011, బుధవారం

9, జనవరి 2011, ఆదివారం

హాయ్ లాండ్ లో హాయ్ హాయ్

నిన్న సాయంత్రం మా ఊర్లో వున్నా కృష్ణానది దాటి గుంటూరు జిల్లాలో వున్నా హాయ్ ల్యాండ్ కి వెళ్ళాము .చాలా బాగుంది .పిల్లలు బాగా ఎంజాయ్ చేయవచ్చు .వాటర్ వరల్డ్ మంచి అట్రాక్షన్ .అక్కడ ఆర్కిటెక్చర్ పురాతన బౌద్ద కట్టడాలకి నమూనా గ కనిపిస్తున్నాయి .గుంటూరు కృష్ణా జిల్లా వాసులకు మంచి రిలాక్షేషన్ పాయింట్.అక్కడ వున్నా వింతలు విశేషాలు చూద్దాం అని మేము వెళ్తే అక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరు మా గుంపు వంక ఒక విచిత్రమైన లుక్ వేసి వెళ్ళేవారు అధికం .మొదట మాకు అర్ధం కాలేదు .తరువాత మా తమ్ముడు కొడుకు కోవిద్ 'పప్పా ఏమి మనల్ని ఇలా చూస్తున్నారు ఆగి నిన్ను చూపిస్తున్నారు 'అని అనడం తో అప్పుడు మాకు లైట్స్ వెలిగాయి:-)తమ్ముడి హెయిర్ స్టైల్ చూసి అని అర్ధం అయ్యింది .మా మీద మేము జోక్స్ వేసుకుంటూ హాయ్ లాండ్ లో హాయ్ హాయ్ గ ఎంజాయ్ చేసి వచ్చాము .
8, జనవరి 2011, శనివారం

దేవుడు వరమిస్తే !ఎప్పుడోగాని మేము అంతా కలవడం ఒక్కసారె కలవడం అవ్వదు అదేమిటో ప్రతీసారి ఒక్కరు మిస్ అవుతారు ఈసారి చిన్న చెల్లి మిస్సింగ్ .నాలుగు రోజులనుంచి అంతా కలిసి అమ్మ దగ్గర చిన్నపిల్లలం అయ్యాం.చిన్నతనం లో మేము ఆరుగురం అమ్మ ఎక్కడ వుంటే అక్కడ చేరేవాళ్ళం,అమ్మ ఒడిలో ఒకరు వీపు మీద ఒకరు చాపిన కాళ్ళ మీద తలోకరం పడుకుని అమ్మ చెప్పే కథలు కల్పనలు వూ కొడుతూ ఊహల్లో ఊహించుకుంటూ వినేవాళ్ళం .కొంచెం పెద్దయ్యాక వంట గదిలో వుంటే తన వెనుకే చేరి వింతలో విశేషాలో స్కూలు కబుర్లో చెప్పేవాళ్ళం,అమ్మ పెరట్లో మొక్కలతో వుంటే ఆ వెనుకే గడ్డిపీకుతోనో ,గొప్పులు త్రవ్వుతునో అమ్మ ఆనందం లో పాలుపంచుకునేవాళ్ళం.రాత్రి పూట మా అందరకి అన్నం కలిపి తినిపించి వరండాలో నాన్న కోసం ఎదురుచూస్తున్న అమ్మ చుట్టూ చేరి అమ్మ చిన్నతనం ముచ్చట్లు అమ్మమ్మ వాళ్ళ విశేషాలు అడిగి అడిగి చెప్పించుకుని వినేవాళ్ళం.పెద్ద అయ్యాక ఏమైనా మారామాఅంటే ఉహు ..ఇప్పటికి అదే సీను కాకపొతే మా ఆరుగురికి తోడు మా జూనియర్లు తోడయ్యారు.ప్రపంచంలోని వింతలు విశేషాలుగురించి అమ్మ చుట్టూ చేరి చెబుతాము..మా కథలు వ్యధలు కంటే అమ్మ "ఆనంద పడే "కథలు గుర్తు చేసుకుని మరీ చెబుతాం..ఇంత పెద్దవాళ్ళం అయిన అంతా ఇరుక్కుని ఇరుక్కుని ఒక చోట చేరి ముచ్చట్లుచెప్పుకోవాల్సిందే ...
దేవుడు ప్రత్యక్షం అయ్యి మీకేం వరం కావాలి అని అడిగితె మా అందరిది ఒకటే సమాధానం మా భాల్యం మాకు తిరిగి ఇచ్చేయమని మా అందర్నీ చిన్నపిల్లల్ని చేసేసి మా అమ్మానాన్నలతో మేమంతా కలిసి ఉండేట్లు చేయమని కోరుకుంటాము.......ఇలా వుంటుంది అందరం కలిస్తే .........

1, జనవరి 2011, శనివారం

ఇపుడేవిరిసిన మా పిల్లలు

నివాళి

పెదవే పలికే తియ్యని మాటే అమ్మ...నిజమే కదా !అమ్మ ప్రేమకి మించి ప్రపంచంలోఅధ్బుతమైన ప్రేమ లేదనే అంటాను ,స్వచ్చమైన ప్రతిఫలాపేక్ష లేని 'ప్రేమ'.మనకోసం నిరంతరం తపిస్తూ మన పిలుపుకే పరవశిస్తూ ఆరాటపడే అమ్మ శాశ్వతంగాదూరం అయితే ......తట్టుకోగాలమా :-(
బ్లాగ్ మిత్రులు భా.రా.రె "అమ్మ ప్రేమ " ని తన అనుభవం లో చాల చక్కగా వర్ణించారు
స్వర్గాస్తురాలయిన రామిరెడ్డి మాతృమూర్తి కి ఆత్మ శాంతి చేకూరాలని వారు త్వరగా ఈ దుఖం నుండి తేరుకోవాలని కోరుకుందాం.

నేర్చుకోవాల్సింది చాలా వుంది


"ప్రార్ధన చేసే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న"అన్నది అక్షరాల ఆచరిస్తున్నమహోన్నతమైన వ్యక్తిని మద్య కాలం లో చూడటం జరిగింది.,ఇటువంటి వ్యక్తులు అరుదుగా తారసపడుతుంటారు.తనకున్న అధికార పరిధిలో సంక్షేమపధకాలనుపూర్తిస్థాయిలో అమలు పరచడం,భాధితుల కొరకు ఆలోచించి వారికి తగిన రీతి లో సహకారం అందించడంలో తానే ముందు వుంటారు.నేను మదర్ ధెరిసాను ప్రత్యక్షంగా చూడలేదు కాని అధికారి లో చూస్తున్నాను,స్వల్పకాల సాన్నిహిత్యంలో నేను నేర్చుకోవలసింది చాల వుందని అర్ధం అయ్యింది.పర్యావరణం పారిశుధ్యం ,ఆరోగ్యం సంక్షేమం పూర్తిస్థాయి అమలుకు ఆమె చేస్తున్న కృషి అభినందనీయం .ఆమె బడుగు బలహీన వర్గాలకి "అమ్మ".నిరంతరం మొక్కవోని చిరునవ్వుతో తన యంత్రాంగాన్ని ఉత్సాహ పరుస్తూ తన జిల్లాని అభివృద్ధి దిశలోకి నడిపే ఆమె ప్రతి ఒక్కరికి స్పూర్తిప్రదాత


పర్వదినాల్లో మన దేవాలయాలు అన్నీ దైవాన్ని దర్శించుకోవడానికి జనం తో కిటకిట లాడుతుంటాయి ఒక్కోసారి త్రొక్కిసలాట కూడా చూస్తుంటాం, రోజు ఉదయం క్రొత్త సంవత్సరసందర్భంగా శుభాకాంక్షలుతెలియజేయడానికి తొమ్మిదిగంటలకి వారి బంగ్లాకి వెళ్తే ఒక్కసారే షాక్ తిన్నాను,కార్ లోపలి వెళ్లడానికి పది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది ,ఆవరణ లోపల జనం క్రిక్కిరిసి తిరునాళ్ళని తలపిస్తూ అక్కడ ఎవ్వరోకాని మ్రొక్కుబడి గా వచ్చి వుండరు ఎంతో అభిమానం తో అధికారులు అనధికారులు జిల్లా ప్రజలు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు అంతే చిరు నవ్వుతో ప్రతి ఒక్కరికి తిరిగి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తున్నారు .అనక వచ్చిన పళ్ళు స్వీట్స్ అన్నీ స్వయంగా అనాధ ఆశ్రమాలకు లెప్రసీ కేంద్రాలకి హాస్పిటల్స్ కి పంచడం చేస్తారట ఈ పదకొండు సంవత్సరాల సర్వీసులో ఎంతోమందిని కలవడం జరిగింది కాని ఇంతమంది అభిమానం ని పొందిన అధికారిని చూడటం మొదటిసారి . వారి తో పాటు పనిచేయడం నాకు లభించిన మంచి అవకాశం ....నేను నేర్చుకోవలసింది చాలా వుందని ఈ క్రోత్తసంవత్సరం మొదటిరోజు తెలుసుకున్నాను .