8, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా తుంటరి పని


ఇంట్లో అల్లరికి చిరునామా నాదే .అమ్మమ్మ ఊరు వెళ్తే ఇక నాకు హద్దు వుండేది కాదు.ఒక వేసవి సాయంత్రం స్నేహితుల తో ఆటల్లో మునిగి మద్యలో దాహం వేస్తె ఇంట్లోకి పరుగున వచ్చి(పెరటి దారి ) పెద్ద మట్టికుండ లోని చల్లటి నీళ్ళను అక్కడే బోర్లించి వున్నఇత్తడి చెంబు తో తీసుకుని గటగట కొన్ని తాగి మిగిలిన నీళ్ళను ఏంచేయాలో తెలియక తిరిగి కుండలో పోసేద్దామా అని ఒక క్షణం ఆలోచించి మనసొప్పక అటు ఇటు చుస్తే బియ్యపు డ్రమ్ము మూత తీసి కనబడింది ,అమ్మమ్మ బెడ్డలు వడ్డుగింజలు ఏరే కార్యక్రమం పెట్టుకుని బియ్యం తీసుకొని మూత పెట్టలేదు,ఇకనేం మిగిలిన చెంబులోని నీళ్ళు డ్రమ్ములో పోసేసాను..నీళ్ళు క్షణం లో మాయం అయ్యిపోయాయి అది నాకు ఆశ్చర్యం కలిగించి మరో చెంబుడు పోసాను నీరు మరల మాయం అయ్యేసరికి ఇక వరుసబెట్టి చెంబుల మీద చెంబులు పోస్తుంటే ముందు వసారాలో వున్న అమ్మమ్మ వాళ్ళు చప్పుడుకి హుష్ అంటూ పిల్లి కాని వచ్చిందేమో అని లేచి వస్తుంటే చప్పున మూత పెట్టేసి ఎంచేక్కగా బయటికి వురికేసాను ఆటల్లో పడిపోయి నేను చేసిన పని మరిచిపోయాను .
ఆ మరునాడు మా అందరకి టిఫిన్లు తినిపిస్తూ అమ్మ పిన్ని వాళ్ళు హడావిడిగా వుండగా అమ్మమ్మ "హవ్వ హవ్వ ..ఇదేమి పనమ్మా అజ్జో ఇలా అయ్యింది ..ఎవరి పని ఇది "అని మొత్తుకుంటూ పాలేరు పిల్లాడ్ని డ్రమ్ము పట్టించి వాకిట్లో బోర్లించేరు అందరం ఎమైందా అని వాకిట్లోకి వెళ్లి చుస్తే బియ్యం ఉండలు ముద్దలు ....ఒక్కసారే నేను చేసినపని గుర్తొచ్చింది.కాని నోరు మెదపలేదు .అమ్మమ్మ పని వాళ్ళనే తిట్టింది .ఎవరికేం మాయరోగం వచ్చింది తూముడు బియ్యం నాశనం చేసారు అంటూ ...నేనే అని చెబితే అమ్మమ్మ తిట్టదు కాని అమ్మ చేతిలో మాత్రం తప్పదని గుడ్లప్పచెప్పిఅలా నిలబడిపోయానుఒక ప్రక్క చెప్పేయాలని (అసలే మన నోట్లో నువ్వు గింజ నానదాయే )కష్టపడి ఆపుకున్నాను .ఆ తరువాత కొన్నాళ్ళకి అమ్మమ్మకి చెప్పేసాను సరదాగా నేనే ఆ పని చేసానని.ఇప్పటికి ఆ జ్ఞాపకానికి తడి ఆరలేదు .బియ్యం కడుగుతున్నప్పుడు అమ్మమ్మ గుర్తుకు వస్తది .

3 కామెంట్‌లు:

జయ చెప్పారు...

ఏమో అనుకున్నాను. మొత్తానికి మీ దగ్గిర చాలా కళలే ఉన్నాయి. జాగ్రత్త, బుజ్జులుగాడికి ఇవన్నీ తెలిసిపోయేను. ప్రమాదం మరి:)

మురళి చెప్పారు...

:-) :-)

Hima bindu చెప్పారు...

@జయ
బుజ్జులు మనకన్నా పది ఆకులు ఎక్కువే చదివింది :-)
@మురళి
:-)