జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఆగస్టు 2011, బుధవారం

చీకటి అంటే భయం పోయింది

"అమ్మ మమతా!నా గది లో టేబిల్ మీద పెన్ను వుంది తీసుకురామ్మా" ఇంగ్లీషు మాస్టారు


"అక్కడ చీకటి గా వుంది నాకు భయం నేను వెళ్ళను "మమత


"చీకటా..భయమా! అయితే ఏమైంది ?"ఇంగ్లీష్ మాష్టారు


"ఉహు ...నాకు భయం నేను వెళ్ళను "మమత .


"పిచ్చితల్లీ !డర్క్నెస్స్ ఇస్ నథింగ్బట్ అబ్సేన్సు అఫ్ లైట్ ..సన్ లైట్ లేకపోబట్టేగా ఈ చీకటి సన్ వచ్చిన వెంటనే వెలుతురు అంతా మన ఊహలోనే భయం వుంటుంది వూ ...మరి వెళ్లి తీసుకురా పో "... ఆ తండ్రీ కూతుళ్ళ


సంభాషణ అంతా గుడ్లప్పగించి వింటున్న నాకు చీకటి పట్ల భయం పోయింది నిజంగా ఆ వయస్సులో జ్ఞానోదయం అయింది.


ఇదంతా ఒక పాతికేళ్ళ క్రితం జరిగిన కథ .మేము విజయవాడ వచ్చిన క్రొత్తలో సిద్దార్థ కాలేజి ప్రక్క వీధిలో వుండేవాళ్ళం అక్క ఇంగ్లీష్ లిట్ కి మా ఎదురింట్లో వున్నా సిద్దార్థ కాలేజి ఇంగ్లీష్ లెక్చరర్ వద్ద సాయంత్రం ట్యూషన్ తీసుకునేది తనతోపాటు పి. జి చేసే నలుగురైదుగురు వుండేవారు . అమ్మ పిలవమని చెప్పిన లేక తోచకపోయిన వాళ్ళతో పాటు కుర్చుని వాళ్ళ మమత తో కబుర్లు చెప్పేదాన్ని .ప్రతీ రోజు క్లాస్స్ అయ్యాక ఆయన రాసిన కవితలు చదవడానికి ఇచ్చేవారు అప్పట్లో టెన్స్ టైమ్స్ కూడా ప్రచురణ అయినట్లుంది .అక్క కూడా కథలు కవితలు రాసే అలవాటు వుండటం తో మాస్టారు రాసినవి ఇస్తుండేవారు .అప్పట్లో అయన మా ఎదురింటి అంకుల్ లేక ఇంగ్లీష్ లెక్చరర్ గానే తెలుసు .


ట్యూషన్ లేనప్పుడు కాలేజి లేనప్పుడు కాని చేతిలో సిగరెట్టూ తో దీర్గాలోచనలో వాళ్ళ వరండా లోని కుర్చీలో కనబడేవారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎదురెదురు ఇళ్ళలో ఉన్నాము .తరువాత నాన్న వాళ్ళు స్వంత ఇల్లు కట్టుకుని వచ్చేయడం వాళ్ళు ఇల్లు ఖాళి చేసి జర్నలిస్ట్ కాలనీ కి వెళ్ళిపోవడం ..అప్పుడప్పుడు ఏ బుక్ ఎక్జిబిషన్ లోనో షాపింగ్ లోనో కనబడటం దాదాపు టచ్లో లేరనే చెప్పొచ్చు .


ఎప్పుడు చీకటి గదిలోకి వెళ్లి లైట్ వేయబోతున్న లేక భయమనిపించే చీకటిని చుసిన నాకు "వేగుంట మోహనప్రసాద్ గారు" గుర్తొస్తారు .నిశబ్దంగా చీకటిలో కలిసిపోయిన ఆ మహానుభావుని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా తుంటరి పని


ఇంట్లో అల్లరికి చిరునామా నాదే .అమ్మమ్మ ఊరు వెళ్తే ఇక నాకు హద్దు వుండేది కాదు.ఒక వేసవి సాయంత్రం స్నేహితుల తో ఆటల్లో మునిగి మద్యలో దాహం వేస్తె ఇంట్లోకి పరుగున వచ్చి(పెరటి దారి ) పెద్ద మట్టికుండ లోని చల్లటి నీళ్ళను అక్కడే బోర్లించి వున్నఇత్తడి చెంబు తో తీసుకుని గటగట కొన్ని తాగి మిగిలిన నీళ్ళను ఏంచేయాలో తెలియక తిరిగి కుండలో పోసేద్దామా అని ఒక క్షణం ఆలోచించి మనసొప్పక అటు ఇటు చుస్తే బియ్యపు డ్రమ్ము మూత తీసి కనబడింది ,అమ్మమ్మ బెడ్డలు వడ్డుగింజలు ఏరే కార్యక్రమం పెట్టుకుని బియ్యం తీసుకొని మూత పెట్టలేదు,ఇకనేం మిగిలిన చెంబులోని నీళ్ళు డ్రమ్ములో పోసేసాను..నీళ్ళు క్షణం లో మాయం అయ్యిపోయాయి అది నాకు ఆశ్చర్యం కలిగించి మరో చెంబుడు పోసాను నీరు మరల మాయం అయ్యేసరికి ఇక వరుసబెట్టి చెంబుల మీద చెంబులు పోస్తుంటే ముందు వసారాలో వున్న అమ్మమ్మ వాళ్ళు చప్పుడుకి హుష్ అంటూ పిల్లి కాని వచ్చిందేమో అని లేచి వస్తుంటే చప్పున మూత పెట్టేసి ఎంచేక్కగా బయటికి వురికేసాను ఆటల్లో పడిపోయి నేను చేసిన పని మరిచిపోయాను .
ఆ మరునాడు మా అందరకి టిఫిన్లు తినిపిస్తూ అమ్మ పిన్ని వాళ్ళు హడావిడిగా వుండగా అమ్మమ్మ "హవ్వ హవ్వ ..ఇదేమి పనమ్మా అజ్జో ఇలా అయ్యింది ..ఎవరి పని ఇది "అని మొత్తుకుంటూ పాలేరు పిల్లాడ్ని డ్రమ్ము పట్టించి వాకిట్లో బోర్లించేరు అందరం ఎమైందా అని వాకిట్లోకి వెళ్లి చుస్తే బియ్యం ఉండలు ముద్దలు ....ఒక్కసారే నేను చేసినపని గుర్తొచ్చింది.కాని నోరు మెదపలేదు .అమ్మమ్మ పని వాళ్ళనే తిట్టింది .ఎవరికేం మాయరోగం వచ్చింది తూముడు బియ్యం నాశనం చేసారు అంటూ ...నేనే అని చెబితే అమ్మమ్మ తిట్టదు కాని అమ్మ చేతిలో మాత్రం తప్పదని గుడ్లప్పచెప్పిఅలా నిలబడిపోయానుఒక ప్రక్క చెప్పేయాలని (అసలే మన నోట్లో నువ్వు గింజ నానదాయే )కష్టపడి ఆపుకున్నాను .ఆ తరువాత కొన్నాళ్ళకి అమ్మమ్మకి చెప్పేసాను సరదాగా నేనే ఆ పని చేసానని.ఇప్పటికి ఆ జ్ఞాపకానికి తడి ఆరలేదు .బియ్యం కడుగుతున్నప్పుడు అమ్మమ్మ గుర్తుకు వస్తది .

12, డిసెంబర్ 2010, ఆదివారం

ప్రియం అయిన స్నేహం

కొంతమంది తో జీవితాంతం స్నేహం నిలిచిపోతుంది .అలాంటి వాళ్ళ లిస్టు లో మా "నాగు " చేరుతుంది.నాగు అంటే నా ఎనిమిదవ తరగతి స్నేహితురాలు.నేను అక్క తో పాటు ఏలూరు తెరిసాహాస్టల్లో చేరగానే నా క్లాస్స్ వాళ్ళు పది మంది చుట్టూ చేరి ఎక్కడి నుంచిఏ స్కూలి నుండి వచ్చానో వివరాలు అడుగుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అక్కడున్న వాళ్ళలో ఒకమ్మాయి (నాగమణి )మాత్రం స్వీట్ గా నవ్వుతు చూస్తూ నన్ను ఆకర్షించింది .అప్పట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక వారం కాస్త టీజింగ్ గా చూసేవాళ్ళు (నేను తరువాత అలానే చేసాను ). కాని నాగమణి మాత్రం అస్సలు అలా చేసేది కాదు.ఎవర్ని నొప్పించడం తనకి తెలీదు.చాల మితంగా మాట్లాడేది నేను మాత్రం తనకి అపోజిట్ అయిన మా ఇద్దరికీ స్నేహం కుదిరింది .చెప్పాలంటే నేను తన వెనుకపడి మైత్రి కుదుర్చుకున్నానేమో..నాకు నచ్చితే అలానే చేస్తాను ...గుర్తు రావడం లేదు .ఎవ్వరితోనయిన అభిప్రాయ బేధాలు వస్తే మాట్లాడటం మానేదాన్నికాని 'నాగు 'తో మాత్రం సర్దుకోవడం నేర్చుకున్నానుఎందుకో తెలీదు తనకి నచ్చని పని కి (స్టడీ అవర్ లో సిస్టర్స్ చూడకుండా పుస్తకాల్లోపెట్టి నవలలు చదవడం లాంటివి ) దూరం వుండేదాన్ని.నాగు కూడా నా అల్లరిని నవ్వుతు ఎంజాయ్ చేసేది, స్కూల్లో మా ఇద్దరి సెక్షన్స్ వేరయినా హాస్టల్లో ఉన్నంతసేపు కలిసే వుండేవాళ్ళం.నాగు కి చిన్నప్పుడే నాన్న లేరు ,అది తెలిసి తానంటే ఒకరకమైన కన్సర్న్ అంతర్లీనంగా వుండేది.ఇంటర్ మొదటి సంవత్సరం వరకి తనతోనే కలిసి చదివాను ,ఆ తరువాత నేను విజయవాడ వచ్చిన మా ఇద్దరి మద్య ఏ మాత్రం దూరం పెరగలేదు ,ఎప్పుడైనా ఫోనులో పలకరింపులు (హాస్టల్లో రేస్త్రిక్షన్స్ )చాలా వరకు ఉత్తరాలు ...నేను నాలుగు రాస్తే తను ఒకటి రాసేది అందులోనే ఎన్నో కబుర్లు ....దశాబ్దాలు గడచినా అదే ప్రేమ ,అదే ఆప్యాయత.ఇప్పటికి మెరుపులా మెరుస్తుంది. నాగు ఎవరితో టచ్ లో వున్నా లేకపోయినా నాతో మాత్రం కనీసం ఆరు నెలలకి ఒకసారయిన మెయిల్ రాయడమో ,మాట్లడటమో చేస్తుంది :-) చెప్పా పెట్టకుండా ఇండియా వచ్చి మెరుపులా కనబడి మాయం అవుతుంది .నా స్నేహితులకి నాగు విశేషాలు తెలియాలంటే నన్ను అడగవల్సిందే...పదిసార్లు కాల్ చేస్తే ఒక్కసారే తిరిగి కాల్ చేస్తే ఎవరు మాత్రం ఓపిక పడతారు :-)ఎవరో నాలాంటి వాళ్ళు తప్పించి . రెండు నెలల క్రితం హటాత్తుగా ప్రొద్దున్న ప్రొద్దున్నే కాల్ చేసింది ,నేను మినిస్టర్ ప్రోగ్రాం హడావిడిలో వున్నాను,అయిన అన్నీ ప్రక్కన పెట్టి అరగంట మాట్లాడాను.అప్పుడు అర్ధం అయ్యింది తను నాకు ఎంత ముఖ్యమో....స్నేహం కాని ,ప్రేమ కాని ఇవ్వటమే కోరుకుంటుంది కాని అవతలి వారి నుంచి ఏమి కోరుకోదు అనుకుంటాను ..
నిన్న నాగు కి ఎందుకు గుర్తుకు వచ్చానో..ఒకే ఒక్క లైన్ ఎలా వున్నావు అని.రాసింది,అదే నాకు కొండంత సంభరం.రాత్రి విజ్జి కి వెంకట్ కి చెబితే ఒకటే నవ్వు ...ఆ ఒక్క లైన్ రాయడానికి దానికి ఎన్ని రోజులు పట్టిందో అంటూ ...మరి నాగు అంతే :-)

21, అక్టోబర్ 2010, గురువారం

మా గ్రీమ్స్ పేట మునిసిపాలిటి స్కూలు

గత యాడాది జూలై నెలలో రెక్కలొచ్చి ఎగిరిపోయిన నా చిన్నప్పటి బహుమతి పుస్తకం గురించి వాపోతూ పోస్ట్ రాసుకున్నాను ..ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిన మా టీచర్ని ఓ పాలి అడిగేస్తే అని బ్లాగ్లో అనుకోకుండా తగిలిన మైత్రివనం మిత్రులు అనేసారు ...చాలా సంతోషంగా అనిపించింది .నిజంగా బ్లాగ్స్ విడిపోయిన పరిచితుల్ని ,అస్సలే తెలియని అపరిచితుల్ని ఒక దగ్గరికి చేర్చడానికి వారధిగా సహాయపడుతున్నాయి .http://mhsgreamspet.wordpress.comబ్లాగ్ నేను చిన్నతనం లో అయిదు ఆరు తరగతులు చదివిన గ్రీమ్స్పేట మునిసిపల్ స్కూల్ పిల్లలు (ఒకప్పుడు )రాస్తున్న బ్లాగ్ .వాళ్ళ జ్ఞాపకాలు,చిన్ననాటి మిత్రులన్దర్నీ ఒక దగ్గరికి చేర్చుకునే ప్రయత్నాలు చుస్తే మనస్సు తడిఅవ్వక మానదు .ఈ బ్లాగ్ చూస్తూ నేను అత్యంత ఇష్టపడే భాల్యం లోకి వెళ్ళిపోతున్నాను.ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో ...
భూచక్రగడ్డ రుచి చూసింది ఆ స్కూల్ లోనే అది తింటూ అమ్మతో మూతిమీద కొట్టించుకున్నది అక్కడే "అడ్డమైన గడ్డి తింటున్నాను అని ...తాటి చెక్కలు అక్కడే చవి చూసాను ...బలే రుచిగా ఉండేయి ...పరిగిపళ్ళు అక్కడే తెలుసు ....తలుచుకుంటుంటే మళ్ళి ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలని ..............

26, జులై 2010, సోమవారం

ఆషాడం -గోరింటాకు

ఆషాడం లో గోరింట పుట్టింటికి వెళ్తుందట ,అని మా నాయనమ్మ చెబుతుండేది అందుకే అడిగినంత పండుతుందట ,అందుకని తప్పనిసరిగా శాస్త్రనికయినా పెట్టుకోవాలనేది ,ఇప్పుడు ఇలా గుర్తుచేయడానికి దగ్గరుండి మా అందరికి పెట్టడానికి నాయనమ్మ లేదు కాని ఆషాడం రాగానే ఆ మాటలు పదే పదే గుర్తొస్తాయి .
మా అమ్మ కూడా అంతే తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటుంది ,లేత చిగురుటాకులు తెప్పించి కాటుకలా రుబ్బించి మా అందరికి పంపిస్తుంది .చిన్నప్పుడైతే ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం ,పెద్దయ్యాక ఆ ఇంటరెస్ట్ లు తగ్గిపోయాయి కాని అమ్మ మాత్రం వెంటపడి మరచిపోకుండా మా చేత గోరింటాకు పెట్టిస్తుంది .
నిన్న ఆదివారం సాయంత్రం అమ్మ గోరింటాకు పంపి మరల మేం ఎక్కడ పెట్టుకోకుండా మరచిపోతామో అని రాత్రి ఫోన్ చేసి మరీ గుర్తు చేసి మా చేత చేతికి రంగులు అద్దించింది ,ప్రొద్దున్నే నిద్రకళ్ళ తో లేచి అరచేతులు చూసుకుంటే యంత మురిపెంగా అనిపించిందో చిన్నప్పుడు నాది బాగా పండింది అంటే నాది పండింది అని పోటీలు పెద్దోల్ల దగ్గర తీర్పులు ...... ఆ పచ్చివాసనలో ఎన్నెన్నిజ్ఞాపకాలో ........

16, ఆగస్టు 2009, ఆదివారం

"మా వజ్రాల వేట "

మేము చిన్నతనంలో ఇంట్లో ఏ పుస్తకం కనబడిన చదివేసేవాళ్ళం,చదవడమే కాకుండా ఆ బుడత వయస్సులోనే మాలో మాకు చర్చలు ,వాద ప్రతివాదాలు వుండేవి.మా నాన్న ప్రత్యేకించి పిల్లలికి సంభందించి 'చందమామ ,బొమ్మరిల్లు ,భాలమిత్ర పుస్తకాలు మిగిలిన వారపత్రికలతో పాటు తెప్పించేవారు.అప్పట్లో కథల్లోవన్ని నిజమే అని నమ్మే వయస్సు .మా అందరికంటే అక్క చాల పుస్తకాలు చదివేది,చదవడమే కాకుండా తనకు చెప్పాలని మూడ్ వచ్చినప్పుడల్లా వింతవింత కథలు చెప్పేది,మేము నోర్లు తెరుచుకుని మరీ వినేవాళ్ళం.అలా విన్న కథల్లో "ముత్యలదీవి ,వజ్రలదీవులు ,పగడాల దీవులు,బంగారం నిధులు ,ఇలా సాగేవి,అవన్నీవిన్నప్పుడు వాటిని చూడాలని,అలా సముద్రంలో ప్రయాణం చేసి ముత్యపు
చిప్పలు కుప్పలుగా తెచ్చుకోవాలని చాల ఆశగా వుండేది .ఖాళి దొరికినప్పుడల్లా సెలవురోజుల్లో సాహసయాత్రలు మా ఆటల్లో బాగం అయ్యేవి.పగడాల దీవులు,ముత్యాల దీవుల వేట అన్న మాటా .
మేము హైదరాబాద్ లో వున్నప్పుడు విజయనగర్ కాలనీ లో మా ఇంటికి కొంత దూరం లో మా అక్కచేల్లెల్లంముగ్గురం పాండురంగారావు మాస్టర్ దగ్గర ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం .మా అక్క నాకన్నా రెండు క్లాసులు ఎక్కువ చదివేదిఅంటే అక్క నాలుగో క్లాసు మనం రెండన్నమాట .ఆమె స్నేహితులు మమ్మల్ని పిల్లకాయల్ల చూసేవాళ్ళు,అందుకని వాళ్ళు కొంచెం ముందుగా గ్రూప్ గా నడిచేవాళ్ళు .చెల్లి నేను ఒక్క క్లాస్సే,తను నాకన్నా ఒక్క సంవస్తరం చిన్నది ,మరి మా ఇద్దర్ని ఎలా ఒకటే క్లాస్ లో చేర్పించారో తెలీదూ,ఇద్దరికీ కలిపి ఒకటే తట్ట బుట్టాను.(అనక నేను డబల్ ప్రమోషన్ కొట్టి తనకన్నా ముందుకి వెల్లిపోయననుకోండి మరల పీ.జి లో చచ్చినట్లు కలిసే చదివాం ) మా చెల్లి కి నాకు కలిపి ఒకటే అల్యూమినియం బాక్స్ వుండేది అందులోనే ఇద్దరి పుస్తకాలు వుండేయి.ట్యూషన్ నుండి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు వంతులవారిగా మోసేవాళ్ళం.
ఒకరోజు మేమంతా ట్యూషన్ అయ్యాక ఇంటికి వస్తుండగా రోడ్ వార అల్లంత దూరం లో ధగ ధగ మెరుస్తూ (ఎండకి)వజ్రాలు కనబడ్డాయి,చెల్లి నేను ఒక్కసారే చూసాం,అక్క అవేమి పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ మా ముందు నడుస్తుంది .అక్కని ఆగమంటే వాళ్ళంతా చూసేసి వాటాఅడుగుతారని ఇద్దరం అక్కడే ఆగిపోయాం,అక్క కొంత దూరం పోయాక నేనే అరిచి చెప్పాను ,మా కోసం కమ్యునిటీ హాల్ దగ్గర ఆగమని,...అక్కకి తెలిసి నేను ఏ గోడవార పూలు కోస్తానికో అనుకుని ,వెనక్కి తిరిగి నాకు వార్నింగ్ ఇచ్చింది ,'మరల యే గండు చీమనో చేతికి పట్టించుకుని వస్తే మాత్రం తీయను,తరువాత నీ ఇష్టం'అని ముందుకు వెళ్లిపోయింది . చెల్లికి నాకు కళ్ళు పండుగే పండుగ,మొదట కనపడినవి కాక దానికి కొంచెం దూరం లోనే కుప్పగా వజ్రాలు పోసివున్నాయి .నేను పుస్తకాల పెట్టె ఖాళి చేసేసి పుస్తకాలు చెల్లి చేతిలో పెట్టి ఆ డబ్బా నిండా నింపుకుని మాకోసం ఎదురు చూస్తున్న అక్కని దాటుకుని ఇద్దరం ఇల్లు చేరేము,వాటిని ఎక్కడ దాచాలో మాకు సమస్య అయ్యి పెరటిలో వున్నా మామిడి చెట్టు మూలలో పోసి ఇసుకతో కప్పి పెట్టాము . ఖాళి చేసిన పుస్తకాల పెట్టి పట్టుకుని ఇద్దరం ఇల్లు గేటుతుంటే మా అమ్మ ఇద్దర్ని కేకవేసింది,'ఎక్కడికి మళ్ళాపెట్టె పట్టుకుని బయలుదేరారు 'అని.మా అక్క మాకు ఎదురు రానే వచ్చింది అంతలోపు..మా దగ్గర సమాధానం లేకఆ రోజుకి విరమించుకున్నాం .మా అక్కని తీసికెళ్ళి పెరటిలో దాచిన వజ్రాలు చూపించాం రహస్యంగా,అక్క వాటిని చూసి ముచ్చటపడింది కాని ఇవి వజ్రాలు కావేమోనని సందేహం వెలిబుచ్చింది,అయినా అక్కడ మిగిలినవి కూడా అక్క బాక్స్ లోను మా బాక్స్ లోను నింపి తెచ్చేయాలని ఆలోచన చేసాము.ఆ రాత్రంతా మా కబుర్లు అవే ,మిగిలినవి అక్కడ వుంటాయో ఎవరైనా పట్టుకు పోతారోనని .మరునాడు ట్యూషన్ కి వెళ్ళే దారిలో వాటికోసం చూసాం ,మిగిలినవి అన్నీ అలానే వున్నాయి .మా ట్యూషన్ కావడం ఆలస్యం అక్క బుక్స్ బాక్స్ నుండి తీసేసి ,మా బుక్స్ కూడా అక్క చేతిలో పెట్టి ముందుగా వెళ్ళిపోయి రెండు డబ్బాల నిండుగా చెమటలు కారుకుంటూ నింపుకుని మా స్థావరం లో పోసాము .ఈ విషయం చాల గుట్టుగా మా అమ్మకి తెలియనీయకుండా జాగ్రత్తపడ్డాము,బహుశ కథల ప్రభావం వల్ల సీక్రెట్ గా వుంచామేమో ఇప్పటికి అర్ధం కాదు . మొత్తానికి మేమేదో సాహసం చేసి వజ్రాలు సంపాధించుకున్నట్లు ఘనంగా బావించాము .
ఒక ఆదివారం పెరట్లో మేము నల్గురం ఆడుకుంటూ ఆలీబాబా సినిమాలో లా వజ్రాలు లేక్కలేసి కొలుద్దాము అని మొత్తం ఇసుకనుండి త్రవ్వి మా ఇంట్లో భియ్యం కొలిచే సోల తో కోలుస్తుండగా మా చిన్ని చెల్లె రెండేళ్లది మా దగ్గరకి ఆడుకోవటానికి వస్తే దాని రెండు బుల్లి చేతుల నిండా వజ్రాలు పోసాను మురిపెంగా.అది రెండు గుప్పెళ్ళనిండుగా పుచ్చుకుని మా దగ్గరనుండి ఎప్పుడు ఇంట్లోకి వెళ్లిందో గమనించలేదు ,మా అమ్మ కంగారు పడుతూ మా దగ్గరికి వచ్చి ,' చంటిదాని చేతికి గాజుపెంకులు ఎవరిచ్చారు,ఎక్కడివి అవి ,నాన్న విడిపిస్తున్న వదలడం లేదు'అంటూ ఆందోళన గా అడుగుతూనే మేము ఆడుతున్న వజ్రాలను చూసి కెవ్వున అరిచింది ,ఎంటివి ఇక్కడికి ఎలా వచ్చాయని ...ఆ క్షణాన మాకేం అర్ధం కాలేదు ,..'ఇవి వజ్రలమ,నేనుచెల్లి తెచ్చాం 'అని గర్వంగా చెప్పాను .ఇంతలో మా నాన్న రావడం చెల్లిని ఎత్తుకుని ,దాని చేతిలోవి నాన్న చేతిలో వున్నాయి...నాన్న ని చూసి అమ్మ మొత్తం కథ చెప్పడం నాన్న మొఖం చాల కోపంగా పెట్టుకుని ,మా అమ్మ ని బాగా తిట్టారు పిల్లలు ఎమ్చేస్తున్నారో కనీసం గమనించడం లేదని...అనక మా ముగ్గుర్ని విచారించి మా అక్కని అందరిని లోపలి పొమ్మని నన్ను చెల్లిని అలానే నెల మీద మోకాళ్ళ మీద సాయంత్రం వరకు కూర్చోమని ,నాన్న చైర్ తెచ్చుకుని పెరట్లో మా ఎదురుగానే పేపర్ చదువుతూ కూర్చున్నారు,మధ్యమధ్యలో 'ట్యూషన్ కి పంపిస్తే అవలాగా పెంకులు ఎరుకుంటార'అనిసుప్రభాతం చదువుతూ మద్యాహ్నం భోజనాల సమయానికి ఇద్దర్ని లేపి ,మరొక్కసారి అలాటివి చేయకూడదని హెచ్చరించారు ,హెచ్చరించ్డమే కాక మా భ్రమలు తొలగించారు ఆ 'వజ్రాలు'ఏమిటో వివరించారు.
ఇంతకి మేము సంపాధించుకొచ్చిన 'వజ్రాలు' ఒక లారీ ఆక్సిడెంట్ అయినా తాలుక గాజుముక్కలూ .,లారీ ముందున్న అద్దం పగిలి నుజ్జుగా అయ్యి స్పటికం లా చిన్న చిన్న మెరిసే రాళ్ల లా వున్నాయి,కొంచెం గట్టిగ పట్టుకుంటే చేతులు కూడా తెగుతాయి ..రోడ్ల మీద ఇప్పుడు అలాటివి కనబడిన చెల్లికి నాకు అవే జ్ఞాపకాలూ ,అప్పుడప్పుడు తలుచుకుని నవ్వుకుంటాం.ఎంత అమాయకమైన రోజులో తిరిగి అక్కడికి వెళ్లి పోవాలని అనిపిస్తుంది.

31, జులై 2009, శుక్రవారం

నా బహుమతి 'పుస్తకం'

ఈ మద్య ఒక నవలని మరల చదవవలసినపుడు దానికోసం పుస్తకాల షెల్ఫ్ అంతా గాలించినా దొరకలేదు .ఎమైపోయిందబ్బా అని ఆలోచిస్తుంటే ఫ్లాష్ బాక్ లు కళ్ళ ముందు గిర్రున తిరిగాయి సినిమాల్లో లాగ.అప్పుడప్పుడు వచ్చే స్నేహితులు నచ్చిన పుస్తకాలు తీసుకుపోయి వాళ్ళిష్టం వచ్చినపుడు అంటే యాడదికో ,ఆర్నేల్లకో మళ్ళి తీసుకొచ్చిపడేయడం ,అలా ఆ పుస్తకానికి రెక్కలొచ్చి ఉంటాయని సరిపెట్టుకుని ఇంకోటి తెచ్చిపెట్టుకున్న .అలా అని నేను పుస్తకాలు ఎవరి దగ్గర తీసుకొని చదవనని కాదు , ఒకవేళ తీసుకున్న సదరు యజమానికి చెక్కు చెదరకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను , పైగా ఆ పుస్తకానికి అట్ట వేసుకుని మరి చదువుతాను యధాతధం గా ఇవ్వాలనే ప్రయత్నంతో . నాకో చెడ్డ అలవాటుంది ,చదవడం తో ఆపకుండా చదివిన దాన్ని గురించి ఎవరోకరి తో చెప్పడం ,వాళ్లు ఆ పుస్తకం చదవాలనుంది ఇవ్వమని అడగడం ,సదరు పుస్తకం అడిగిన వాల్లెంటపడికూడా పోవడం అది మనింటి మొహం చూడడానికి నెలలు పట్టడం ,ఒక్కోసారి జాడలు కూడా లేకపోవడం , మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు కనిపించినవల్ల చదువుతాడు ,చదివి దాన్ని ఎక్కడ వదిలేస్తాడో తెలీదు ,అదేమంటే చదివేసాంగా అంటాడు ,తన దగ్గరికి పుస్తకాలు వెల్లాయంటే ఆశలు వదులుకోవాల్సిందే .తనని తరుచు విసుక్కుంటాను ,జాగ్రత్త లేదని ,...చిన్నప్పుడైతే ఎవరికైనా ఏవైనా ఇస్తే అడిగేసేదాన్ని ,ముఖ్యంగా పుస్తకాలు లాటివి . ఇప్పుడైతే అడగడానికి చచ్చే మొహమాటం. నా చిన్నతనం లో జరిగిన సంఘటనా తరుచు గుర్తోస్తుంటాది,అదీ చెప్తాను .

అవి మేము చిత్తూర్ లో వున్నా రోజులు .అప్పుడు నేను అయిదు ఆరు తరగతులు చదివాను .అప్పటికే వేసవి తరువాత క్లాసు లు మొదలయ్యి రెండు నెలలు దాటి పోయాక ఒక ప్రభుత్వ స్కూల్లో మమ్మల్ని చేర్పించారు. మేము సంచార జాతికి చెందినోల్లం కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడి వాళ్ళతో కలిసిపోతామన్నమాట :) మరి ఏడాదికో ఊరాయే . అక్కడ చదువు తో పాటు ఆటపాటలు ,అనేక సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్లు . అక్క ,నేను అన్నింటా పార్టిసిపేట్ చేసేవాళ్ళం .ఒకసారి చిల్డ్రెన్స్ డే సందర్భంగా భారిగా పోటీలు నిర్వహించారు .నేను పాటలు,నృత్యం,పైంతింగ్,వ్యాస రచన ,వక్రుక్త్వ (స్పీచ్) పోటీలు అన్నిటికి నా పేరు ఇచ్చేసా ,అస్సలే మనం జాక్ అఫ్ అల్ ట్రేడ్సే కదా ముందు వెనుక ఆలోచించకుండా గొప్పగా దూకేసాం .అన్నింటిలో పాల్గొని చిన్నదో పెద్దదో బహుమతులు గెలుచుకున్నాం ,ఏమి లేని చోట ఆముదం వృక్షం చందాన ....అసలు కథ ఇక్కడ మొదలయ్యింది ,వక్రుత్వపు పోటిలకు పేరు ఇచ్చాను కాని ,అదేంటో నాకు సరిగ్గా తెలిదు ,ఆ రోజు మద్యాహ్నం నుండి మా అక్క ప్రాణం తీసేసా , ఎలా మాట్లాడాలి ,ఏమి మాట్లాడాలని ,అక్క తో తిట్టించుకుంటూ నేను మాట్లాడవలసిన 'గ్రంధాలయాలు ' మీద రాయిన్చుకున్నాను.చూడకుండా అంతమంది ముందు స్టేజి మీద చెప్పడం ఆ రోజుల్లో నాకు హీర్కులియన్ ఎఫ్ఫోర్ట్ అని చెప్పొచ్చు .రెండు ,మూడు సార్లు తన ముందు ప్రాక్టిస్ చేయించింది .సరిగ్గా చెప్పడం లేదని 'గ్రంధాలయాన్ని'బట్టి వేయించింది .(మనకి లెక్కలు కూడా స్టెప్ ల తో సహా బట్టి వేయడం అలవాటే )...భయం వేస్తె ఎవరి వంక చూడకుండా చెట్ల వంక ,ఆకాశం వంక చూస్తూ చెప్పెసేయమంది .

నా పేరు స్టేజి మీద పిలవగానే నా కాళ్ళ లో వణుకు వచ్చేసింది .,నిజానికి నాకు పాటలు ,డాన్సులు అందరి ముందు చేయడం కొత్తేమి కాదు ...మైక్ ముందు ఒంటరిగా స్పీచ్ నాకు కొత్త . మైక్ ముందు అందరిని చూస్తూ బేలగా వుండిపోయాను ,మా టీచర్ జడ్జి లు సైగలు చేయడం తో మా అక్క కోసం వేదికను ధైర్యం కోసం ...ఇక లాభం లేదని మెదడంతా బ్లాంక్ అవ్వుతుండగా గొంతు సవరించు కుని సభకు ,ప్రధాన ఉపాధ్యాయునికి నమస్కారాలు చెప్పి ఇలా మొదలెట్టాను "గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము"అని రెండు సార్లు చెప్పి ,అనక ఒక్క ముక్క గుర్తు రాక ఎదురు కూర్చున్న జనాలే మనస్సంతా నిండిపోయి ,ఏడుపొచ్చి ,నన్ను రక్షించేవారే లేరా ఇక్కడ అని ,బేల చూపులు చూస్తున్న నన్ను మా క్లాసు టీచర్ చొరవగా స్టేజి మీద నుండి దిగి పోవడానికి సహాయపడ్డారు.

ఇక చుడండి నా తరువాత ఒక్కొక్కరు మాట్లాడేవాళ్ళు తమ పేర్లు పిలవగానే రావడం ,దిక్కులు చూస్తూ నోరు పెగలక వెళ్లి పోవడం .ఆఖర్న వెంకటరత్నం అనే అబ్బాయి స్ప్పేడ్ గ వచ్చి అందరికి నమస్కారాలు గబగబా చెప్పేసి ,తను మాట్లాడబోయే టాపిక్ మరిచిపోయి బుర్ర గోక్కుంటూ నిలబడి పోయాడు అలా జునియర్ విభాగం పోటీలు ముగిసాయి .ఆ పోటికి సంభందించి మొదటి ,రెండో భాహుమతులు మా హెడ్ మాస్టర్ అప్పుడే స్టేజి మీద ప్రకటించారు ఫస్ట్ నాకు ,సెకండ్ వెంకటరత్నం కి ఇచ్చారు .ఇంటికెళ్ళే దారంతా అక్క నన్ను తిడుతూనే వుంది ,ఇంట్లో అందరికి చెప్పి నవ్వడం , "అయితేనేం నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినదిగా "అని సిగ్గులేకుండా వాదన పెట్టుకున్నాబహుమతి ప్రధానం చిల్డ్రన్స్ డే నాడు జరిగిందీ .అక్కా ,నేను చాల తెచ్చుకున్నాము .వ్యాస రచనకి ,ఎలాక్త్యుషన్ కి పుస్తకాలు బహుమతులుగా ఇచ్చారు .నా వ్యాస రచన కు మొదటి బహుమతి "పాయసం తాగిన పిచ్చుక " నా బ్రహ్మాండ మైన ప్రసంగానికి "చరిత్రకెక్కిన చరితార్ధులు "అనే పుస్తకం ఇచ్చారు .

ఒకరోజు అంటే ప్రోగ్రామం అయిన రెండు రోజులకు అనుకుంటాను , మాకు సోషల్ కి వచ్చే టీచర్ క్లాసు రూం లో నన్ను ,వెంకటరత్నం ని లేపి మాకు బహుమతులుగా వచ్చిన పుస్తకాలను మరునాడు తెచ్చి చుపమన్నది .మరునాడు నేను హడావిడిగా నా పుస్తకాల బాక్స్ లో పెట్టుకుని ,ఆవిడ క్లాసు రూం లో వచ్చిందో లేదో నేను వెంకటరత్నం పోటీపడి ఆవిడ దగ్గరికి వెళ్లి నా రెండు పుస్తకాలు ఆవిడ చేతుల్లో పెట్టాను అదేదో ఘన కార్యం చేసినట్లు .ఆమె చక్కగా ఆ పుస్తకాలని తన హ్యాండ్ బాగ్ లో పెట్టుకుని సాయంత్రం స్టాఫ్ రూం కి వచ్చి కలెక్ట్ చేసుకోమంది .సాయంత్రం స్టాఫ్ రూం కి వెళ్లాను ,అప్పటికే ఆవిడ వెళ్లిపోయారని చెప్పారు .మరునాడు స్కూల్ కి వెళ్ళగానే స్టాఫ్ రూం కి ముందే వెళ్లాను .,ఆ టీచర్ నన్ను చూసి ,ఇంట్లో మరచిపోయాను రేపు తెస్తాను అని చెప్పింది , ఆ రేపు రేపు కాస్త నెలలు దాటేయి ,ఒకరోజు మాత్రం మొహం చిట్లిస్తూ నలిగి జీర్ణవస్థలో వున్నా 'పాయసం తాగిన పిచ్చుక ' ఇచ్చింది .ఆమె నన్ను చూడగానే అడగకుండానే రేపు అనేసేది .ఆ రేపు కాస్త మా యన్యుఅల్ పరీక్షలయ్యి ,వేసవి లో కొవ్వూరు వెళ్ళేదాకా జరిగిందీ.ఇప్పటికి నాకు ఆ పుస్తకం గుర్తొస్తే మనస్సు కలుక్కుమంటుంది .,ఆవిడ ఎక్కడుందో కనుక్కుని నా పుస్తకం నాకు ఇవ్వు అనాలన్పిస్తుంది.తరచుగా తలపుల్లోకి వచ్చి అసహనంగా అన్పిస్తుంది ,అప్పుడప్పుడు అనిపిస్తుంది 'అయాచితంగా' వచ్చింది కాబట్టి నిలవలేదేమోనని . ఇదండీ రెక్కలొచ్చి ఎగిరిపోయినా నా జ్ఞాపకం నా పుస్తకం .నేను పూర్తిగా చదవకుండానే నా చేతుల్లోంచి జారిపోయిన ముత్యం .

4, జూన్ 2009, గురువారం

తంగేడుపూలు


రుధిర ,కాషాయ వర్ణంల్లో ఆకులు లేకుండా విరగాబూసే పూల చెట్టును మేము "తంగేడుచెట్టు" అంటాము .నేను బాగా ఇష్టపడే చెట్లలో ఇదొకటి . నిన్న సాక్షిలో ఇదే చెట్టు మీద రచయిత తన జ్ఞాపకాలూ పంచుకున్నారు , తంగేడు ని వారు తురాయి చెట్టని అంటారట ,కాని మా అమ్మమ్మ ,నాన్నమ్మ వాళ్ల పల్లెటూరిలో మాత్రం తంగేడు అనే పిలుస్తారు ,నాకు అదే తెలుసు .ఈ చెట్టుతో అనుభంధం చాల గాడమైనది .
వేసవికి ఊరు వెళ్ళడం అనగానే నా కళ్ళ ముందు కనపడే దృశ్యం ......అమ్మమ్మ ఊరిలోని పిల్లికోడు (ఏలూరు కాలువ కాబోలు )ఊరు పక్కనుండి వంపులు తిరుగుతూ వెళ్తుంది (ఎక్కడికో ) ఆ కాలువ ఒడ్డును సైనికుల్లాఅటు ఇటు నిలబడి విరగబూసి వుండేవి తంగేడుచేట్లు.ఎండి అడుగంటి వుండే కాలువ నీళ్ళ లో గాలికి రెపరెపలాడే ఆ పూల గుత్తులు ప్రతిభింభం ఇంకా ఈ కళ్ళలో అలానే వుండిపోయింది . పంటపొలాల్లో అక్కడక్కడ చింతచెట్ల ప్రక్కనే క్రొమ్మలు కనబడకుండా విరగభూసేవి . పిల్లలం ఆ చెట్ల క్రింద చేరి ఆటలాడే వాళ్ళం ,వాడ్ని వీడ్ని బ్రతిమాలి ఆ పూలగుత్తులు చేతుల నిండా పట్టుకెల్లెదాన్ని..అదోరకమయిన పిచ్చి వాసన వేసేవి ..పూలతో పాటు మొగ్గల గుత్తులు తెంపి చెట్ల క్రింద భయంకరమైన జూదం ఆడే వాళ్ళం -:) ఎవరైనా సాహస వీరులు ఇద్దరు పందేంకి మొగ్గల్లో వున్నపుప్పొడి కాడలు పట్టుకొని వాటి తలలు తెగడానికి యుద్ధం చేసే వాళ్లు , కొంచెం చిన్న పిల్లలం gumpuluga vidipoyi పందెం కాసేవాళ్ళం ...పెద్ద వాళ్లు కూడా చాల ఆసక్తిగా చూసేవాళ్ళు .మా ఆటలతో ఇంటి నిండా అవే వుండేవి ...ఆ మొగ్గలు పట్టుకుని ఇంట్లో ఖాళీగా ఎవరు దొరుకుతారా ఆడటానికి వెదుక్కునే వాళ్ళం . మా బొమ్మల పెళ్లి ఆటల్లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అవే పూల దండలు .
ఒక వేసవి మధ్యాహ్నం పిల్లలందరం (మా అమ్మ వాళ్లు ఆరుగురు ,వాళ్ల పిల్లలం ) ఇంటి ఆ వరణలో వున్న గేదెల చావడిలో బొమ్మల తో ఆడుతున్నాం ,వాటికి పెళ్లి పూల దండలు హడావిడి నేను చూస్తో తంగేడు పూలతో చేసిన దండలు బొమ్మలకి చాల పెద్దవి అవుతున్నాయి ,బోలెడన్ని పూలు మిగిలి పోతున్నాయి అని మా అక్క వాళ్ళతో నేనొక ఐడియా చెప్పాను ,దాని ప్రకారం నేను ఇంట్లోకెళ్ళి ఊయ్యాలలో నిద్రపోతున్న మా పెద్దమామయ్య కూతురు సత్య ని (యేడాది పిల్లనుకుంట ) ఎవరు చూడకుండా చావడి లోకి తీసుకొచ్చా ,అప్పటికే రెండేళ్ళ మా చిట్టి తమ్ముడు శ్రీనుగాడ్ని మా అక్క వాళ్లు తయారు చేసి పీట మీద కూర్చోబెట్టారు ,నేనేమో ఈ బుడ్డి దాన్ని నిద్ర లేపి పడకుండా వాడి ప్రక్కన కూర్చోబెట్టి ఇద్దరికీ తంగేడుపూల దండలు వేసి పెళ్లి చేస్తుండగా ...ఇంట్లో నుండి అందరు కంగారుగా ఊయ్యాలలో పిల్ల లేదు అంటు వెదుకుతుంటే ....మా అమ్మ వాళ్ల నాయనమ్మ మా వద్దకు రానే వచ్చి పాప మెళ్ళో వున్న దండ పీకేసి మా అందర్ని తిట్ల దండకంతో తగులుకొంటే అందరం పరార్ పెళ్లి కొడుకుని వదిలేసి .........గంట దాక ఎవ్వరం పెద్దొళ్ళకి అందలేదు ..ఆ రోజు జీవితం లో మరిచిపోలేదు ,,ఇప్పుడు తలుచుకుని నవ్వుకుంటాం . తంగేడుపూల దండ ఎంతపని మా చేత చేయించిందో కదా అని .
మా ఇంటి ప్రక్క ఉత్తరం దిక్కు పెద్ద తంగేడు చెట్టు వుంది . ఉదయాన్నే వరండాలో కూర్చుని టీ తో పాటు వాటి అందాన్ని త్రాగుతాను .-:) దాని పక్కనే వున్న గుల్మొహర్ క్షణ క్షణం పస్పు పూలు రాలుస్తూ కుంకుం ప్రక్క పసుపు అద్దుతున్నట్లు ....భలే వుంటాది .... అన్నట్లు నిన్న ఏజెన్సీ ఏరియా కి పని మీద వెళ్లాను ......దారికిరువైపులా వున్న తంగేడు పూలు చూస్తూ నన్ను నేను మరిచిపోయాను ..అస్సలు ప్రయాణం అలసటే తెలిలేదు .....'ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై .....అడవి ...సాగిపోనా ..." ఒట్టు అక్కడినుండి రాబుద్ది కాలేదు . వేసవి కాలం లో మల్లెపూల తో పాటు గాజు తోట్టేల్లో నీళ్ళలో ఈ "అగ్నిపూలు " కూడా ఫ్లోవేర్వాస్ గా ఆమరుస్త్హాను ,ఇంట్లో .

28, మే 2009, గురువారం

"ఇప్ప పూలు "

ఈ మద్య సాక్షి పేపర్ లో వరుసగా సమ్మర్ స్పెషల్ -చెట్టు కథలు వరుసగా ప్రచురిస్తున్నారు ,అవి చాల బాగుంటున్నాయి .మనల్ని భాల్యం లోకి మరి ఇంక్కేక్కడికో తీస్కుని వెళ్తున్నాయి .వీలయితే తప్పకుండా చదవండి . ఈ రోజు ఫలవంతమైన చెట్టు ,నిన్న అరుణమ్మ ఏరూ....పత్తాటి చెట్ల రేవూ రాసారు .నిన్నటి చెట్టు కథ రాసింది స.వెం .రమేశ్,ఈ కథని రెండు మూడు సార్లు చదుకున్నాను ,నాకైతే చాల నచ్చింది .పత్తటి చెట్టు కథ చదివి తాటి చెట్టు తో నా అనుభంధం రాద్దామనుకున్నాను బ్లాగ్ లో ....ఈ లోపు మన నెమలికన్ను "మురళి "రాసేసారు ..అందుకే మన ప్రయత్నం విరమించేసాం . ఆ మద్య ఒకరు సాక్షి లో విప్పపూల చెట్టు (ఇప్ప పూలు ) గురించిరాసి మన జ్ఞాపకాల తేనె తుట్టు ను కదిపెసారు ,అప్పుడే పంచుకోవాలనుకున్నాను కాని టైం కుదరలేదు .


ఈపాటికి అందరికి అర్ధం అయ్యే వుంటుంది మనకున్న "పూల పిచ్చి" ...మనం ఏ పువ్వును వదలం చిన్నప్పుడైతే తల లోకి ఇప్పుడేమో ఫ్లవేర్ వాస్ లోకి వెళ్తుంటాయి .(మనం ఆఫీసు కి పూలు పెట్టుకోం బాగోదని ప్చ్.....) పూలు అనే మాట వినబడితే చాలు ఎక్కడ అని అనేదాన్ని ....అలాంటి పిచ్చన్న మాట :)


నేను రెండవ తరగతి లో వుండగా మా నాన్నగారికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయ్యింది ,మాకు ఫైనల్ పరీక్షలు జరుగు తున్నాయని నాన్న ముందు ఒక్కరే వెళ్లి జాయిన్ అయ్యారు . ఒక వారం తరువాత అక్కడి జవాన్లను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు ,,వాళ్లు సామాను షిఫ్ట్ చేయడానికి సహాయపడ్తారని. మేము వెళ్లబోయే ఇల్లు ,ఆఫీసు ఇల్లు కలిపే వుంటుందని ,వేహికాల్స్ చెకింగ్ కి అన్ని అక్కడికే వస్తాయని మా అమ్మతో జవాన్ (అటెండర్ ) చెప్తుంటే విన్నాము ..మా అమ్మ కుతూహలంగా ఆ ఇంటి వైశాల్యం ,గదులు పెరడు ,,అంతక్రితం వుండి వెళ్ళిన ఆఫీసర్ ఫ్యామిలీ వివరాలు ,పని మనుషుల వివరాలు అన్ని అడుగుతుంటే వాళ్లు హుషారుగా ఇంక అడిగినవి అడగనివి చెబుతుంటే మనము నోరు తెరుచుకొని మరి విన్నాము ...మేము వెళ్ళ బోయే ఇంట్లో ప్రహరీ లా సీతాఫల చెట్లు వున్నాయని సీజన్లో లో గంపలు గంపలు పండి తినలేక పారేయ్యలని మొక్కల కోసం ఎక్కడత్రవ్విన రాక్షసి బొగ్గు వస్తుందని ఇంటి వెనుక విప్పపూల చేట్టుందని కావలసినన్ని పూలని చెబుతుంటే ఇక మనం ఈస్ట్మాన్ కలర్లో ఆ పూలన్నీ కోసేసుకున్నట్లు (ఇప్పటికి కళ్ళల్లో మెదులుతుంది ) ఇక మా అమ్మని ఊపిరాడ నీయలేదు ,ఆ పూలు బీరు (సార ) చేయడానికి వుపయోగిస్తారని చెప్పింది ...అప్పటివరకు హైదరాబాద్ వదిలి వెళ్లడానికి బెంగాపడ్డ మనం ఎప్పుడెప్పుడు కొత్తగూడెం చెట్టు .తరువాత రెండురోజులకు మేము కొత్తగూడెం వెళ్ళాం .మేము అక్కడికి చేరడం గుర్తు లేదు ,,నిద్ర లేచేసరికి కొత్త ఊర్లో కొత్త ఇంట్లో వున్నాం . నేను లేచేసరికి అమ్మ జవాను తీసుకొచ్చిన ఎల్లమ్మ (పనమ్మాయి )తో మాట్లద్తోందిఆ అమ్మాయికి మా అందరిని పరిచయం చేసింది ..నాకయితే ఎప్పుడెప్పుడు పూలు చూడాలా అని కోరిక ,ఎల్లమ్మని అడిగాను మన ఇంటి వెనుక




10, ఏప్రిల్ 2009, శుక్రవారం

నా స్నేహితులు -6

సెప్టెంబర్ నెల చివరి లో కూడా మెయిన్ క్లాసు లు సీరియస్ గా జరిగేవి కాదు మా ఎగ్జాం వచ్చి నవంబర్ లో అక్కడ హాస్టల్లో చదువు వాతావరణం కాగడ పెట్టిన కనబడేది కాదు ,,అక్కడి నీళ్ళ వల్లోవాతావరణం వల్లో నాకు టైఫాయిడ్ , మలేరియా ఎటాక్ అయ్యాయి .మామూలు జ్వరమేనని భలవంతాన తిరిగేదాన్ని ,కదలలేక ఒకరోజు మంచం మీదనే వుండిపోతే రామ నా దగ్గరే ఉండిపోయి నాకు చేసిన హెల్ప్ మరిచిపోలేనిది ..అలానే నా పక్క రూమ్ పిల్లలు గోదాదేవి ,భాగ్య , శాంతి ని మరిచిపోలేను .చాల కాలం నాకు ఫోనులో తరుచు మాట్లాడేవారు తరువాత నా పని ఒత్తిడి లో పడిదూరం పెరిగిపోయింది .జ్వరం తీవ్రమయి అక్టోబర్ మొదటి వారం లో నేను మా ఊరు వెళ్ళిపోయాను మొత్తం సర్దుకుని .రామ అన్ని తానయి నేను ఇంటికి వెళ్ళేవరకు నాతోనే వుంది ...చాల దగ్గరయ్యాము .. అక్కడి వారందర్నీ వదిలి వెళ్లడానికి చాల భాద పడ్డాను ,వుండటం వల్ల నా చదువు కూడా నష్టపోవడం తో వెళ్ళిపోయాను . రామ తన స్నేహితుడి నే మ్యారేజి చేసుకుంది ఒక ఆఫీసర్ భార్యగా స్థిరపడింది ఇప్పటికి నాకు టచ్ లో వుండే స్నేహితురాలే .
నేను సివిల్ సర్వీసు తోపాటు గ్రూప్ వన్ రాయడం జరిగిందీ , నవంబర్ లో డిసెంబర్ లో వరుసగా మెయిన్స్రాసాను .అంతక్రితం రాసిన గ్రూప్ టుసంభందించి ఒక జాబు లో చేరటం జరిగిందీ ,,నాకు ప్రక్క మండలం లో వున్నా ప్రసన్నకుమారి నాకు మంచి మిత్రురాలే తనది మహబూబ్నగర్ లోని వనపర్తి ఎక్కువగా మీటింగ్స్ లో కలిసేవాళ్ళం మా ఇద్దరి అభిరుచులు చాల దగ్గరగా వుండేయిగంటల కొద్ది కబుర్లు దొర్లి పోయేవి .ఉద్యోగం లో శాశ్వత మిత్రులు వుండరు అన్నది మా స్నేహం పట్ల నిజం కాదు . నేను రాసిన సివిల్స్ మెయిన్స్ మరల పోవడం యధాప్రకారం కొంత కాలం డిప్రెషన్ ఉండటం తరువాత రాసిన గ్రూప్ వన్ పాస్ కావడం ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ కావడం జరిగిందీ .ఇంటర్వ్యూ ముందు రోజు వాసంతి పరిచయం కావడం తరువాత జుబ్ల్లె హిల్స్ ట్రైనింగ్ సెంటర్లో తను నా ప్రక్క రూమ్మేట్ అవ్వింది . వాసంతి కూడా మా గూటి పక్షే ,...విచిత్రమో యాద్రుచికమో తెలిదు కాని దాదాపు అందరు చక్కటి అభిరుచులున్న వాళ్ళే మా ట్రైనింగ్ పార్ట్ నెర్స్ ...అదే సమయం లో ప్రసన్నకుమారి వాళ్లకు ఒక నెల ట్రైనింగ్ జరిగిందీ అనుకోకుండా అక్కడ కలిసాము . నేను ఇల్లు ఊరు వదిలి అప్పటివరకు చదువులో పడ్డ అలసట తీర్చుకున్నది ఆ నలభయి ఐదు రోజుల్లోనే . మరల నా స్కూల్ రోజులు ,కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి ,,మా పాప మీద కూడా భేంగా లేకుండా ఉతహంగా ఉల్లాసంగా గడిపాను గడపడమే కాదు నా ఫ్రెండ్స్ ఖాతా లో మరో నలుగుర్ని జమ చేసుకున్నాను .అందరు అల్లరి చేసే వాళ్ళే ఒక్కరు ఒక్క క్లాసు కూడా తిన్నగా వినేవాళ్ళం కాదు ,బహుశ అందరు అప్పటివరకు నాలానే అలసిపోయివుంటారు .{ తరువాత}

8, ఏప్రిల్ 2009, బుధవారం

నా స్నేహితులు -4

పీ.జి. తరువాత నా ప్రపంచం ఇల్లు పుస్తకాలు మా పాప .దాదాపు మా ఫ్యామిలీ మెంబెర్స్ తో {అక్కాతమ్ముల్లు}తప్పించి నాకు బయట స్నేహాలు కొంత కాలం లేనట్టే ,మా శ్రీవారు వున్నా అభిప్రాయాల్లో ఉత్తర ,దక్షిణం . నా అభిరుచులన్నీ తనకు సిల్లీగా తోచేవి , నేను ఎంత అల్లరి దాన్నో తనంత పెద్దమనిషి తరహాగా వ్యవహరించేవాడు , నేను చక్కని పాటలు వింటోంటే తను ఇంట్లో వున్నంత సేపు చెత్త క్రికెట్ పెట్టేవాళ్ళు , ఏమి రాకపోతే స్పోర్ట్స్ చాన్నేల్ లో ఏదొకటి చూసేవారు పగలు రాత్రి తేడ లేకుండా క్రికెట్ వస్తోంటే చూస్తోనే వుండేవాళ్ళు .మా అమ్మ వాళ్ళింట్లో ఎవ్వరం క్రికెట్ చూడం ,టీవీ లో అది వస్తున్నంత సేపు నాకు కంపరంగా వుండేది , అలా మా ఇద్దరి అభిరుచుల్లో తీడావుండేవి . నాకేదైనా మంచి కథ చదివిన ,జోక్ చదివిన పక్కన వాళ్లకు చదివి వినిపించే దురలవాటు వుండేది ,ఇక్కడ ఆగలేక చెప్పిన ఊఁ కొట్టేవాళ్ళు కాని తిరిగి అడిగితె మళ్లీచెప్పమనే వారు ,పరిస్థితి అర్ధం అవ్వి తనని విసిగించడం మానేసాను. మా పాప తో నా ఊసులు మొదలయ్యాయి ,ప్రతిది తనకి చెప్పేదాన్ని ,అది ఇంతింత కళ్ళేసుకునిపెద్దదానిలా వినేది . మా పాప ,అతను స్కూల్ ఆఫీసు లకు వెళ్ళగానే నా ప్రపంచం లోకి వెళ్ళేదాన్ని , పాటలు వింటూ నేను అప్లై చేసిన జాబు కి సంభందించి బుక్స్ లోకి వెల్లిపొయెదాన్ని.నాకు మా పక్కింటి వాల్లెవరో తెలిదు ,ఎదురింటి వారెవరో తెలియదు , ఇంట్లోనుండి బయటకి రావడం అంటే అమ్మ వాళ్ళింటికి వెళ్ళడానికో ,లేదా సెకండ్ షో వారంకి ఒకసారి వెళ్లినపుడో మాత్రమె . మా పాప స్కూల్ నుండి వచ్చిన నన్ను డిస్ట్రబ్ చేయకుండా పక్కనే కుర్చుని చదవడమో ఆడడమోచేసేది వాళ్ల నాన్న వచ్చేంతవరకు . పగలంతా పుస్తకాలు తరువాత మా అమ్మాయే నా స్నేహితులు.మా పాప తన మూడవ ఏట నుండే నాకు చక్కటి సలహాలు ఇచ్చేది , బహుశ చదవడానికి అతిశయోక్తి గా వుందేమో కాని ఇది నిజం ,పెరిగేకొద్దీ తను నాకు మంచి స్నేహితురాలయింది , మేము ఇద్దరం కూర్చున్నామంటే మాకు సమయం కూడా తెలియదు . నేను చదివిన చదువుకి సంభందించి నాలుగు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను ,కాని జాబు రాలేదు. నా పీ.జి బాచ్ వాళ్ళంతా యెన్ .జి .వో. లలో ను , ఇండస్ట్రీ లలోను చేరిపోయారు , నేను మా చెల్లి చిన్న వాటికి సరిపెట్టుకోలేక సెంట్రల్ గవర్నమెంట్ లో పెర్సనల్ పోస్ట్ లకు ప్రయత్నిస్తో మిగిలిపోయాము కొంత కాలం వరకు . ఒక వుద్యోగం వచ్చినట్లు వచ్చి చేజారి పోయింది ఇటువంటి పరిస్థుల్లో మా అమ్మాయి ,మా శ్రీవారు నన్ను ఐ .ఏ .ఎస్ కి రాయమన్నారు.{:-( బ్లాగర్ పవన్ కళ్యాన్ ఐఏ ఎస్ ల } మా పాప నన్ను చాల చాల ప్రోతహించింది ఈ విషయం లో పెద్ద ఆరిందలనన్ను సివిల్ సర్వీసెస్ వైపు చూసేలా చేసింధనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు . అప్పటికే మా అక్క తమ్ముళ్ళు ఆ వైపు ప్రయత్న్నల్లో వుండడం వలన మా అమ్మాయి నన్ను ఆ దిశ గా మళ్లీ న్చిందని చెప్పవచ్చు .{ రేపు}

6, ఏప్రిల్ 2009, సోమవారం

నా స్నేహితులు -2

నా స్నేహితుల పుణ్యాన అసలు సమయం తెలిసేది కాదు .ఆదివారం కాని పండగ రోజు కాని మనకు నిరంతరం ప్రవేట్లు వుండేవి :) మా బోటనీ ట్యుషన్ పక్కనే రఫీ వాళ్ల ఇల్లు వుండేది ,అతను కూడా మా బాచ్ వాడే ,వాళ్ళఅక్క డిగ్రీ అయ్యి ఇంట్లో ఖాళీగా వుండేది అక్క కి పెళ్లి సంభందాలు చూస్తుండేవాళ్ళు ,ఆవిడ మా అందరికి లీడర్ గ వుండేది .రఫీ వాళ్ల అమ్మ నాన్న ఇంట్లో వుండేవాళ్ళు కాదు ,ఆయన బిజినెస్ ఆవిడ ఏదో జాబు చేసేవారు ,సో మా అందరి మీటింగ్ ప్లేస్ వాళ్ల ఇల్లే . వాళ్ల ఇంట్లో వాళ్ళంతా అందరితో ఆప్యాయమ్గా వుండేవాళ్ళు వాళ్ల పండుగలకు తప్పకుండ మేమంతా వుండవలసినదే .నిజంగా మేమంతా అరమరికలు లేకుండా కలసిపోయాము .నా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం మా ఇంటికి స్వేచ్ఛగా రాగాలిగేవారు అబ్బాయిల్ని ఇంటికి పిలిచేంత ధైర్యం వుండేది కాదు , అమ్మ ఏమి అనదుకాని నాన్న ఏమైనా అంటారేమోనని పిలిచేదాన్ని కాదు ఇంటర్ ఫైనల్ జరిగేప్పుడు ఫిజిక్స్ పేపర్ లీక్ అయిన సంధర్బంలో అందరు మా ఇంటికి ఒక రాత్రి పూట వచ్చారు నాన్న వున్నారు ,నాన్న వాళ్ళందరితో బానే మాట్లాడారు ,అప్పటినుండి మేము వేరు వేరు బ్రాంచెస్ కి వెళ్ళిన ఊరు వస్తే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళు .నా క్లోజ్ ఫ్రెండ్ ఫాతిమా హైదరాబాద్ వెళ్ళిపోయింది ,వాళ్ల నాన్న ట్రాన్స్ఫర్ వల్ల.మేము ఇద్దరం చాల సంవతరాలు వుత్తరాలు పెద్దపెద్దవి రాసుకునేవాళ్ళం ,మా కబుర్లన్నీ చదివిన పుస్తకాల మీద ,మేము అయిదుగురం మెడిసిన్ కి రాసాము కాని ఎవరికి సీట్ రాలేదు ,మిగిలిన అబ్బాయిలందరూ ఇంజనీరింగ్ లో చేరారు ఒక్క రామ మాత్రం చేరలేదు

నా స్నేహితుల్లో రజని కి ఇంటర్ సబ్జెక్టు ఒకటి మిగిలింది ,లలిత్ నేను ఒకటే కాలేజిలో చేరాము ఇంకో ఫ్రెండ్ ఆశ వేరే కాలేజ్ లో చేరింది ,నాది బిఎస్సి అయితే లలిత్ బియ్యే ,నాన్నకి నన్ను ఎలా అయిన మెడిసిన్ లో చేర్పించాలని ,నాకు తెలీకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసారు ,అమ్మ దగ్గర ఏడ్చి గోల చేసి నేను చదవలేనని మొత్తుకుంటే పయ్మేంట్ సీట్ డ్రాప్ అయ్యింది , సైన్సు కూడా చదవను ఆర్ట్స్ లోకి పంపమని గోల చేసి {అన్నం మాని మౌనం} పర్యవసానం నాన్న ఆర్ట్స్ మార్చడానికి వొప్పుకుని మా ప్రిన్సిపాల్ ని రిక్వెస్ట్ చేస్తే ఆ సిస్టర్ ఒప్పుకోల ,వొక రెండు నెలలు చూసి చదవలేకపోతే మారుస్తాను అన్నారు , నా మొండితనం కి నాన్న నాతో చాల నెలలు మాట్లాడలేదు , మొత్తానికి రెండు నెలలకి లలిత్ వున్నా క్లాసు లో చేరాను ,కేవలం తనకోసం ఆర్ట్స్ కి వెళ్లాను ,ఫాతిమా తరువాత తన ప్లేస్ లలిత్ అవ్వింది ,తనే కనుక లేకపోతె ఈ సరికి నేను డాక్టర్గా వుండేదాన్ని .ఆ వయస్సులో స్నేహితులే లోకంగా వుండి మా నాన్న కోరిక తీర్చలేకపోయానని ఇప్పటికి అనిపిస్తుంది . మేము డిగ్రీ మొదటి సంవతరం లో వుండగా ఇంటర్ పోయిన రజని హంగ్ చేసుకుని చనిపోయింది ,తన సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన రోజు ,మా స్నేహితులంతా ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాల కాలం పట్టింది .

లలిత మా ఇంట్లో ఒక సభ్యురాలిగా కలిసిపోయింది ,తను మా ఇంటికి రాని రోజు వుండేది కాదు ,నేనంటే చాల ప్రేమ అనేది అందరిని వరుస పెట్టె పిలిచేది ,మాతో పాటు మా బాబాయి కొడుకు ,అమ్మ చిన్న తమ్ముడు ఇంట్లో వుండి చదివేవాళ్ళు ,వాళ్ళని మాలనే అన్నయ్య అనేది , అన్నిటికి తానయి కలిసిమెలసి వుండేది ,నాకు చాల ప్రాణం గ వుండేది , కాని లలిత నాకు వొకరోజు పెద్ద షాక్ ఇచ్చింది ...{మిగిలినది తరువాత }

31, మార్చి 2009, మంగళవారం

నా స్నేహితులు -1

మా ఇంట్లో ఆరుగురి పిల్లల్లో ఎక్కువ వ్యవహారాలు ఫ్రెండ్స్ గ్యాంగ్ ను మైంటైన్ చేసే వాళ్లేవరఅని ఆలోచిస్తే ముందు మనముంటాము ఆ తరువాత పెద్ద తమ్ముడుంటాడు.ఇప్పటి కథే కాదు చిన్నప్పటి నుండి వున్నఅలవాటు.ఎప్పుడు సెలవలు రాని ఏవి రాని మేము ఇంట్లో ఆడుకోవాల్సిందే వస్తే మా స్నేహితులు మా ఇంటి కి వచ్చి ఆడుకోవాల్సిందే .మేము వెళ్ళ లంటే బోల్డన్ని ఆంక్ష లు వుండేవి ,ఇందు లో అబ్బాయిలకు ఏమి మినహాయిమ్పు వుండేయి కాదు :-(ఎక్కువగా పక్కింటి పిల్లలో ఎదురింటి పిల్లలో మాతో వచ్చి ఆడుతుండే వాళ్లు .స్కూల్ స్నేహితులు స్కూల్ వరకే పరిమితం అయ్యేవాళ్ళు . పరిస్తతులవల్ల కాని మా అమ్మ శిక్షణ కాని మేము ఆరుగురం మంచి స్నేహితులమే అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. మనస్సుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు నాకు గుర్తున్నంత వరకు ఆరవ తరగతి వరకు ఒక్కలిద్దరు మాత్రమె .
వేసవి సెలవలకో ,సంక్రాంతి పండుగకో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు కొందరు చుట్టాల పిల్లలతో కలసి ఆడేదాన్ని వాళ్ల ఇళ్ళకు తిరిగేదాన్ని అలానే మా పెద్ద తమ్ముడు అందరితో కలిసి ఆడేవాడు .ఇప్పటికి ఊర్లు వెళ్ళితే మాకు స్నేహితుల కొదవ లేదు మిగిలిన నలుగురికి స్నేహితులు తక్కువ అనే చెప్పవచ్చు.
నాకు బాగా గుర్తున్నంత వరకు నాన్నమ్మ వాళ్ల ఊర్లో మా ఇంటి వెనుకనే బోడి {అన్నపూర్ణ అస్సలు పేరు }అనే అమ్మాయి నా వయస్సుది నేను వున్నన్ని రోజులు వదలక అంటిపెట్టుకుని వుండేది ,ఊరంతా తిప్పేది ,సంక్రాంతి ఎప్పుడు నాన్నమ్మ ఊర్లోనే జరుపుకునే వాళ్ళం ,తెల్లవారు ఝాము భోగి మంటలు దగ్గర్నుండి గట్ల పైన పూసే ముల్లగోరింత పూలు కోసుకోవడం బంతి పూలు కోసుకుని గుమ్మలకి దండలు కట్టడం వరకు పోటీలు పడేవాళ్ళం ,పాపం అన్నిటికి తనే వెనక్కి తగ్గేది .మేము సెలవలు అయ్యి తిరుగు ప్రయాణం అవ్వుతుంటే ఆ వుదయం నుండి భిక్కముఖం పెట్టేది .బోడి ని ఆఖరి సారి చూసింది నా సెవెంత్ క్లాసు సంక్రాంతి సెలవల్లో , వేసవి సెలవలు మొదలయ్యేప్పటికి బోడి చనిపోయిందని కబురు వచ్చింది .పిడకలు గుడు వద్ద పురుగు కుట్టిందని చెప్పిందని ,వాళ్లు పసరు వైద్యం చేయడం రాత్రికల్లా చనిపోవడం జరిగిందట , చనిపోవటం అంటే ఏమిటో మొట్టమొదటి సారి తెలుసుకున్నాను .అప్పటివరకు చావు మీద సరైన అవగాహన వుండేది కాదు ,మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ల ఇంటి వైపు వెళ్లడానికి భాదగా వుండేది , వాళ్ల అమ్మ {శకుంతల పిన్ని }నన్ను ఇప్పటికి చూసిన కంట తడి పెట్టుకుంటది ,వాళ్ల అమ్మాయిని తలుచుకుని , నాకు ఇప్పటికి సంక్రాంతి ,ముల్లగోరింత పూలు ,మినప ,పెసరకాయలు అనగానే స్మ్రితి పదంలో బోడి మెరుస్తది ఒక "మెరుపులా".
నేను ఎనిమిదవ తరగతిలో హాస్టల్ కి వెళ్ళాక చాల మంది స్నేహితులయ్యారు మాదొక పెద్ద గ్రూప్ అయిన అందులోనే సబ్ గ్రూప్ మల్లి అందులో ఇంకో సబ్ గ్రూప్ దాన్లో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ వుండేవాళ్ళం నాగు నాకు చాల ఇష్టమయిన స్నేహితురాలు మనం ఎంత డామినేట్ చేసిన ఫీల్ అయ్యేది కాదు చాల నెమ్మదిగా వుండేది తనతో సరదాకి కూడా ఎప్పుడు గొడవ పడలేదు ,తనకి నాన్న చిన్నతనం లోనే పోయారని విని నాకు తనంటే ఎంతో జాలిగ వుండి అస్సలు భాద పెట్టడం ఇష్టం వుండేది కాదు.తను నాకు కోపం తెప్పించిన అస్సలు పట్టించుకునేదాన్ని కాదు ఇంటర్ బయాలజీ కలిసే చదివాము ,ఇంటర్ లో తనకి నాకు ఒకటే సెక్షన్ వస్తాదో రాదోనని ఆందోళన కూడా పడ్డాను. మా స్కూల్ గ్యాంగ్ అంత అదే కాలేజీ లో చేరారు అంత డిగ్రీ లు కలిసే ,మనం మాత్రం మిడ్ ఇంటర్ లో నా బృందాన్ని వదిలి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది .అప్పటి మా స్నేహం ఇప్పటికి కొనసాగుతూనే వుంది ప్రతి దినం మాట్లడుకో పోయిన మా మద్య చిన్నప్పటి చనువు వాతావరణం వుంటుంది .ప్రతి ఇయర్ ఏదొక సమయంలో మేము కలుస్తుంటాము ,మా పిల్లలకు ఆశ్చర్యంగా ఉంటది ,ఇంత పెద్ద గ్రూప్ ఇప్పటికి ఎలా వుంటారా అరమరికలు లేకుండా అని .అందరం రకరకాల ప్రదేశాల్లో వున్నాం విదేశాల్లో ముగ్గురున్నారు .అయిన ఎవరు వచ్చిన తీరిక కల్పించుకుని కలుస్తుంటాము .
నేను విజయవాడ వెళ్ళాక అక్కడ కెమిస్ట్రీ ,ఫిజిక్స్ ప్రైవేటు లలో పెద్ద గ్యాంగ్ తయారయింది .అందులలో ఇదివరకులా కాకుండా అబ్బాయిలు కూడా వుండేవారు ,మొత్తం పదకొండు మందిమి . అమ్మాయిలు ఐదు అబ్బాయిలు ఆరు దాదాపు వారంతా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ,వాళ్ళలో ఫాతిమా నహీద్ అని నాకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలు వుండేది ,మనకులాగా తనకిపుస్తకాల పిచ్చి ,ఆఖరికి డిటెక్టివ్ నవల కనబడిన ప్రవేట్ లోనే వెనక కూర్చుని చదివేది .
{తరువాత రాస్తాను }

8, మార్చి 2009, ఆదివారం

అభిమాన రచయితలు

అభిమాన హీరో గురించి ఇంత క్రితం మీతో పంచుకున్నాను ,.ఇకపోతే అభిమాన రచయితగురించి కూడా చెప్పాలి .నాకు ఒక్కో వయస్సులో ఒక్కొక్కరి మీద అభిమానం పుట్టేది ,వరుసగా నాలుగు పుస్తకాలు చదవగానే ,వారి అభిమానినవడం అన్నమాట !ఇలా చిన్నప్పుడు తరుచు పార్టీలు మారుస్తూ వుండేదాన్ని .టీనేజ్ వరకు ఇదే తంతు.
మా ఇంట్లో మా ఆరుగురు పిల్లలకు చదివే అలవాటు వుంది.వారపత్రికలకోసం,నొవెల్స్ కోసం ఒకరితరువాతఒకరని పోటి పడేవాళ్ళం .చదివాక వాటి మీద చర్చ కూడాఉండేది.మాతో పాటు మా అమ్మ కూడా సభ్యురాలే .
ఇప్పట్ల రచయితల ఫొటోస్ తరుచు వచ్చేయి కాదు ,అరుదుగా కనపడేవి ,వారి అడ్రసులు మాత్రం ప్రచురించేవారు .దాదాపు అందరి ఫొటోస్ చూసాం ,కాని ఒకరు మాత్రం ఎలా వుంటారో ,ఊహలక్కుడా అందేది కాదు .
ఆయన రాసిన కథలు చదువుతూ ,దాదాపు ఆ కథ లో హీరో పాత్ర తో రచయితను వుహించుకునేదాన్ని {నేను మాత్రమె సుమా} మీకు ఇప్పటికి అర్ధం అయ్యే వుంటుంది ,ఏ రచయిత గురించి చెబుతున్నానో .ఆయన రాసినవన్నీ చదివాను ,సీరియల్స్ క్రమం తప్పకుండాను చదివేదాన్ని ,చంద్ర బొమ్మల్లో,కరుణాకర్ బొమ్మల్లో ని హీరో తో రచయితను పోల్చుకున్న ,,అదండీ మన అభిమాన రచయిత పట్ల మనకున్న అడ్మిరషన్.
మా చిన్న చెల్లికి కూడా చాల ఇష్టపడేది ,క్లాస్ పుస్తకాలతో పాటు నొవెల్స్ కూడా పెట్టుకుని మంచం కి గోడ కి మద్య వున్నా స్థలం లో ఇరుక్కుని కూర్చొని చదివేది.{నాన్న కాని గదిలోకి వస్తే కనపడకుండా వుంటానికి }

ఒకరోజు చిన్నచేల్లి,పెద్దచేల్లి తబ్బిబ్బుగా ఒక వుత్తరం చదువుతు ,కనబడ్డారు ,వాకబు చేయగా మా చిన్నచేల్లి రచయితకు వుత్తరం రాయటం,ఆయన సమాధానం ఇవ్వడమే కాకుండా ,తను విజయవాడ వస్తోన్నట్లు ,కలవాలంటే మ్యుజ్యమ రోడ్లోని మహాలక్ష్మి బుక్ సెంటర్ కి రమ్మని టైం చెపుతూ రాసారు. మా చెల్లి ని అభినందిస్తూ ,{మనం ఆ పని చేయలేదుకదా ,ఎనిమిదవ తరగతి లో మా నాన్న ఇచిన క్లాసు వల్ల ఎవరికి రాయలేదు ఎంత మనసు లాగుతున్న }ముగ్గురం ఎమైనసరే వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకుని అమ్మకి విషయం చెప్పాము .అమ్మ నాన్నకి ఎలాను చెప్పదు.అప్పటికి మేము పెద్దోలం కూడాను.
మేము ముగ్గురం చెప్పిన అడ్రెస్స్ వెదుక్కొంటూ వెళ్ళాం ,మాకు ఏవి సరిగ్గా తెలిసేవి కాదు ,ఆటో అబ్బాయ్ సహాయం తో బుక్ సెంటర్ కి చేరాము. నాకైతే ఒకటే టెన్షన్ ఏదో అద్బుతం చూడబోతున్నాఅన్నంత .బుక్సెంటర్ లో యజమాని ,సేల్స్ కుర్రాడు తప్ప ఎవరు లేరు .మేము వచ్చిన పని చెప్పగానే ,వారు సాదరంగా మమ్మల్ని లోనికి పిలిచి కూర్చోమన్నారు ,,ఆ రచయిత బయట పని మీద వెల్లరని ,మమ్మల్ని వుండమన్నారని చెప్పారు .ముగ్గురం ఆ వుక్కలో,చెమటలు తుడుచుకొంటూ ఎదురు చూస్తో ,ఏ చిన్న అలికిడి అయిన అతనేమోనని చూస్తోండగా ,షాప్ ముందు కీచుమంటూ రిక్షా ఆగింది ,అందులోనుండి తెల్లగా,భారీగా వున్నా వ్యక్తి దిగి లోపలికి వచ్చారు ,మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంట ,హెవీ పర్సనాలిటీ ని ఆసక్తిగా గమనిస్తోండగా ,సదరు యజమాని వచ్చిన వ్యక్తి తో ,,మమ్మల్ని వుద్దేశించి వీరు మీకోసం ఎదురు చూస్తోన్నారు ,మీరు రమ్మన్నారట ,అని అన్నారు.
ఇక చూడండి నా అవస్థ ,వూహలకి ,వాస్తవానికి తేడ తో ,వారితో సరిగ్గా మాట్లాడలేక ,వారు ఆఫర్ చేసిన షోడా ను తాగలేదు ,ఆయన నాది కూడా తాగేసి ,తనకి షోడలంటే చాల ఇష్టమని డిక్లేర్ చేసారు.,మా ఇద్దరి చేల్లిల్ల పరిస్తితి కూడా ఇంచుమించు ఇదే ,కాని నాల గ బయటపడలేదు. అరగంట మాట్లాడి సెలవు తీసుకున్నాం. ఇంటికి వచ్చాక వారం రోజులు ఇదే టాపిక్ ,అందరు నన్నుటీజ్ చేసారు . ఇప్పడు తలుచుకుని నవ్వుకుంటాను , ఈ మద్య సాక్షి ఇంటర్ వ్యూ లో కూడా తన ఫోటో ఇవ్వలేదు .ఇప్పటికి ఆయన నా అభిమాన రచయితే.

26, ఫిబ్రవరి 2009, గురువారం

అభిమాన హీరోలు

అభిమాన హీరోలు అనగానే నాకు ఒక విషయం మదిలో తళుక్కుమంటది .ఈ విషయం తప్పకుండ మీతో షేర్ చేసుకోవాల్సిందే .
నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా జరిగిన ఉదంతం.మేము ఏలూరు సెయింట్ తెరిసా స్కూల్లో చదువుకున్నాము ,అందులోనే హాస్టల్లో ఉండేవాళ్ళం .హాస్టల్లో ఎక్కువ శాతం గోదావరి జిల్లా వాళ్ళుండే వాళ్ళు ,ఎపుడు సినిమాలే హాట్ టాపిక్ .ఉదయానే పేపర్ చూడమంటే సినిమా బొమ్మలు ,కొత్త సినిమాలు ,వాటి విశేషాలు చూసేవాళ్ళు ,అక్కడికి వెళ్ళాక మనము నేర్చుకున్నమనుకోండి ,....
మాది పద్నాలుగు మంది తో కూడిన గ్రూప్ ,ప్రతి ఒక్కరికి అభిమాన హీరో ,మరియు హీరోయిన్ ఉండే వారు.అంటే వారి మీద సర్వ హక్కులు వారివే ,పేటెంట్ అన్నమాట.,మనకి ఆ హీరో ఇష్టమైన చెప్పే హక్కు ఉండదు,మనసులోనే ఉంచుకోవలన్నమాట ,లేకపోతె వాళ్ళహీరో ముందు మనవాళ్ళు చులకన కావడమే కాకుండా ,గొడవలు పడేవాళ్ళు
మా విజ్జి మరీను మురళి మోహన్ ని మాట పడనిచేది కాదు,చూపు సరేసరి .
ఆ నేపధ్యం లో నేను ఎంచు కున్నాను కృష్ణం రాజు ని .
రాత్రి డిన్నర్ తరువాత మాకు ఒక గంట రేక్రేషన్ ఉండేది ,అపుడు మేము ,సినిమా కబుర్లు విన్నవి ,కన్నవి గోరంతలు కొండంతలు చేసి చెప్పుకునే వాళ్ళం ,మా అభిమాన హీరో లకి సంబంధించి న పాటలు పాడుకునే వాళ్ళం ,అదే విదంగా సండే మద్యాహ్నం నుండి డిన్నర్ వరకు ఫ్రీ ఉండేది ,ఆ సమయాల్లో ఇలాటి కబుర్లతో గడిపే వాళ్ళం .అభిమనహేరో ల కి సంభందించి ఏ వార్తా ఉన్నా కట్ చేసి దాచు కునేవాళ్ళం .
ఒకరోజు సినిమా పత్రికలో కృష్ణం రాజు గురించి రాస్తో అతని అడ్రస్ కూడా ఇచ్చారు. అతను నా అభిమాన హీరో కాబట్టి డైరెక్ట్ గ పేపర్ కటింగ్ ,నా దగ్గరకు చేరింది.నేను అడ్రెస్స్ దొరికింది కదా అని ఒక ఉత్తరం రాసాను ,అన్నయ్య మీ అభిమానిని అంటూ {హ..హ..హ}అతని నుండి లెటర్ వస్తే సిస్టర్స్ ఒపెంచేసి అక్షింతలు వేస్తారని ,చివరికి మా ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను .నా స్నేహబృందమంత ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఆ లెటర్ ని డే స్కాలర్ సహాయం తో పోస్ట్ చేసాం.

వేసవి సెలవవలు ఇచ్చారు ,మేము ఇంటికి వెళ్లి పోయాము .మాది చాల పెద్ద ఫ్యామిలీ .ఆడుకోవటానికి ఇంకొకరి అవసరం లేకుండా పిల్లలం మేమే సరిపోయేవాళ్ళం ,నాన్న ఇంట్లో ఉన్నంత సేపు పిన్ పడిన వినపడేది ,,ఆయన బయటకి వెళ్ళగానే గోలంతా మా ఇంట్లోనే ఉండేది .
ఒకరోజు మద్యాహ్నం మా అమ్మ మా అందర్నీ చుట్టూ కూర్చోబెట్టి ఏవో కథలు చెబుతుండగా ,నాన్న ఇంటి ముందున్న ఆఫీసురూం నుండి నన్ను పిలిచారు ,సాదారణంగా గెస్ట్ లు వచ్చినపుడే ,ఏ కఫ్ఫే,టీ చెప్పడానికో,పనివాళ్ళు అందుబాటులో లేనపుడే మమ్మల్ని పిలిచేవారు. అలాంటిదేదో అనుకుని నాన్న రూమ్ లోకి వెళ్ళాను .నాన్న ముఖం చాల సీరియస్ గ ఉంది {అసలెప్పుడు సీరియస్ ఇంకా అన్నమాట }అక్కడ ఎవ్వరు లేరు .
"ఏంటి నాన్న పిలిచారు "వినయంగా అన్నాను .
నాన్న నా వైపు చూడకుండా ,కాబినెట్ సైజు ఫోటో,ఒక లెటర్ చేతి లో పైకి ఎత్తి చూపిస్తో "ఏంటిది?"అన్నారు.
ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు .నాన్న చేతి వంక చూడగానే ,ఫోటో లో హుందాగా కృష్ణం రాజు ,అతని లెటర్ పాడ్ మీద నాకు రాసిన ఉత్తరం ,ఒక్కసారే ఆనందము ,వెంటనే భయం కలిగింది .
"ఇదన్న మాట కాన్వెంటు లో మనం చేస్తున్న ఘనకార్యం ,సిస్టర్స్ నీవేదో తెలివి కలదానివి ,అది ,ఇది అంటే నేను ఘర్వపడుతున్నాను "
మన దగ్గర సమాధానం లేదు .అస్సలికే నాన్నంటే భయం,అక్కడ సిస్టర్స్ కి జడిసి మన స్నేహితుల ప్రోద్బలంతో ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను ,ఐన ఇలా ఉత్తరం వస్తుందని కాని,నాన్న ఇలా చూస్తారని కానీ అనుకోలేదు .
"చూడమ్మా ,ఏదైనా చూసి వదిలివేయాలి ,ఆహ్లాదం కోసం మనం సినిమాలు చూస్తాం ,వాళ్లు తమ వృత్తి గ నటిస్తారు .అది వారి ఉద్యోగం,ఇపుడు నేను ఉద్యోగం చేసినట్లుగా ,ఐన అదంతా రంగుల ప్రపంచం ,అదే నిజమనుకుని భ్రమపడకు ,తీరిక దొరికితే మంచి పుస్తకాలు చదువు ,మరొక్క సారి ఇల్లాంటి సంధర్బం తీసుకురాకు ,"అని మెత్తగా మందలించారు.
తలాడించి ఇంట్లోకి వెళ్తోన్న నన్ను ,వెనక్కి పిల్చి ,"ఇదిగో తీసికో "అంటూ ఫోటో ,ఉత్తరం నా చేతి లో పెట్టి వెళ్ళమన్నారు .బిక్కచచ్చిన నేను గది లోకి వచ్చి అమ్మ వాళ్ళకి చూపించాను .తమ్ముడు వాళ్ళు ఫోటో చూసి గంతులు వేస్తోంటే ,పెద్దయ్యాక అక్కలుగా మనం చెప్పాలేమో అనుకున్నాను,.నాన్న దగ్గర ఏమిజరిగిందో మనం చెప్పకుండానే అమ్మకి ,అక్కకి అర్ధం అవ్వింది .
చాల కాలం ఆ ఉత్తరం ,ఫోటో నా "మధురస్మృతుల"కట్ట లో ఉండేది .
సెలవుల తరువాత స్కూల్ కి వెళ్ళిన నా అభిమాన హీరో గురించి మాట్లద్తే వొట్టు.సినిమాలంటే మనల్ని ఆహ్లదపరిచేవి అని అప్పటికి ,ఇప్పటికి నమ్ముతాను.
ఇప్పటికి తల్చుకుంటాను ,నాన్న తన టీనేజ్ కూతురికి ఎంత హుందాగా చెప్పారు,అని.
ఇదండీ మన అభిమాన హీరో గారి కథ .

23, ఫిబ్రవరి 2009, సోమవారం

తామరాకులో ఆమ్లెట్

తామరాకులో ఆమ్లెట్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా?,తామరాకులో మల్లెపూలు కట్టడం తెలుసు గుడిలో ప్రసాదం తినడం తెలుసు ,కాని ఇదేమిటబ్బాఅని అనుకుంటే తప్పకుండ నా బాల్యంలోకితొంగి చూడవలసిందే అమ్మమ్మ వాళ్ళఊరు వెళ్ళాల్సిందే.
మేము చిన్నతనంలో నాన్న గారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండేవాళ్ళం .ప్రతి వేసవి సెలవులకి కృష్ణాజిల్లాలోని అమ్మమ్మ వాళ్ళ ఊరో ,నానమ్మ ఊరో వెళ్ళేవాళ్ళం .అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చి అప్పటికి వారం రోజులు అయ్యుంటది మాకు ఆడుకోవడానికి తక్కువ స్నేహితులు ఉండేవారు..అంతామా మామయ్యా స్నేహితులే .మామయ్యంటే పెద్దాడు కాదు మా అమ్మ కి చిట్టి తమ్ముడే మా అక్క  కన్నా రెండేళ్ళు మాత్రమె పెద్దవాడు .అందుకే మేము వాడిని అరేయి ,ఒరేయి అన్నయ్య అనే వాళ్ళం .మాకేమో వాడితోనూ ,వాడి స్నేహితులతోను ఆడుకోవాలని,వాడేమో మమ్మల్ని తప్పించుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు వాడి స్నేహితులతో రహస్య సమాలోచనలో ఉండేవాడు.వాడు చేసే అల్లరి పనులు తాతయ్య వాళ్ళకు చెప్తామని తప్పించుకు తిరిగేవాడు .ఇంట్లో ఉన్నంత సేపుమాతోనే ఆడేవాడు
.మమ్మల్ని ఎండలో తిరగనిచ్చే వాళ్లు కాదు .,మాకేవైన అవ్వితే మా నాన్న తో వేగలెమని,,అది కాక డాక్టర్ సదుపాయం తక్కువని ఇంట్లో వాళ్ళు మేము ఎండలోకి తిరగకుండా మా పైనే కళ్లు వేసి ఉండేవారు .
ఒకరోజు మావయ్య స్నేహితులంతా పిట్టలను కొట్టే కర్రలను పట్టుకొని మా ఇంటికి వచ్చారు .అప్పుడు మా తాతగారు ఇంట్లోనే ఉన్నారు .మా మావయ్య వాళ్ళను చూసి తాత గారు నిద్రపోయాక వస్తానని వాళ్ళతో రహస్యంగా చెప్పి ఇంట్లోకి వచ్చాడు. అది మన కంట్లో పడింది.అక్కకి చెల్లికి కూడా చెప్పాను .ముగ్గురం వాడిని ఎంతో బ్రతిమిలడం మమ్మల్ని కూడా తీసికెళ్ళమని.సరేనని బుద్ధిగా చెప్పి మేము ఆటల్లో పడగానే తప్పించుకుపోయాడు.మేము ఎప్పటికో గమనించి పెద్దలందరూ కబుర్లలోనునిద్రలోను ఉన్నారని గమనించి పాలేరుకుర్రవాడిని అమ్మ వాళ్లకు చెప్పొద్దని మండుటెండలో ఇంటి వెనుక వైపు నుండి పంటపొలాల్లో పడ్డాం. మా వాడిని వెతుక్కొంటూఎందుకంటె  ఖ   చ్చితంగా వాడు ఏ చెరువులోనో ,ఏదో చింత చెట్టు మొదట్లోనో తేలేవాడు .
మేము ఎక్కువ ప్రయాసపడకుండానే దొంగలంతా దొరికారు.మేము ముగ్గురం పొలాల గట్లపైనున్న జనపపూల కొమ్మల్నిరేమ్మల్ని తొలగించుకొంటు ,ముఖమంతా చెమటలతో గాలికి రేగిన మా తలలపై పడిన జనప పుప్పొడితో  ఒగరుస్తూ ఆ పిల్ల గ్యాంగ్ ని చేరాము. మమ్మల్ని చూడగానే మా వాడి ముఖంలో కంగారు ఆశ్చర్యం ఒక్కసారే ముప్పిరికోనగా 'అమ్మావాళ్ళకి చెప్పకండే ఈ సంగతి 'అంటూ మా ముగ్గురితో ఒట్టు వేయించుకున్నాడు .అసలు మేము ఏమి చెప్పకూడదో  తెలియకపోయినా అసలు మేము ఇటు వచినట్లు తెలిస్తే మాకు పూజ జరుగుతదని తెలిసిన బింకంగా హామీ ఇచ్చాము
అక్కడ వాళ్లు మమ్మల్ని చూసి మాటలు ఆపేశారు అక్కడ ఏదో జరుగుతోంది .కాని ఎలా కనుక్కోవాలో అర్ధం కాలేదు . మిగిలిన ముగ్గురు కనబడలేదు నలుగురు మాత్రమె ఉన్నారు మిగిలినవారేరి "అని అరా తీశాను అన్నయ్య ఏదో చెప్పేలోపు మా చెల్లి చూసేసింది ."అక్క పక్కన భోదే లో దాక్కున్నారుపసి గాడు "అని చెప్పింది. దాగుడు మూతలు ఆడుతో మమ్మల్నిఆడనివ్వరా "అంటు పంట భోదే వైపు పరిగెత్తి చూదుము కదా భోదే నుండి పొగలు సన్నని మంటలు మా వెనుకనే అందరు మూగారు.తొంగి చూసిన మాకు ఒకటే ఆశ్చర్యం!
మూడు ఇటుక రాళ్ళ తో పొయ్యి పెట్టి దాని పై కుండ పై పెట్టె మూత పై సలసల నూనెలో కాలుతున్న ఆమ్లెట్ ,,
"హమ్మ దొంగల్లార మీరు ఇంటి వద్ద నుండి గుడ్లు తెచ్చి ఇలా దొంగతనంగా వండుకు తింటున్నారా"అని నేను అంటున్నానో లేదో అన్నయ్య స్నేహితులు అప్పుడే పక్కనే ఉన్నా చెరువు లో త్రుంచుకొచ్చిన తామరాకులో వేడివేడి ఆమ్లెట్ పెట్టి మా ముగ్గుర్ని తినమని ఇచ్చారు మా మవయ్యేమో తినొద్దు అమ్మ ఊరుకోదు తెలిస్తే అని,,మేము ముగ్గురం వాడి వంక నిర్లక్ష్యంగా చూసి తలో ముక్క తిన్నాము ,ఇంతలో మా ఇంటి పాలేరు మమ్మల్ని వెదుకుతూ  వచ్చాడు అమ్మ మాకోసం కంగారు పడుతోందని తెలిసిందని చెప్పాడు అంతే మేము ముగ్గురం చేతి లోది అక్కడ పారేసి ఒకటే పరుగు దారిలో చెప్పాం "రాముడు ,,అన్నయ్య వాళ్లు ఏమి చేస్తున్నారో తెలుసా ?"అని .అదేదో రహస్యం కనుక్కోన్నట్లో ,,.ముందు మీరు త్వరగా ఇంటికి నడవండి అమ్మ కోపంగా ఉంది అంటూ అయిన మనం వినిపించుకోకుండా "అన్నయ్య వాళ్ళు ఆమ్లెట్ వేసుకున్తోన్నారు ఎవరు చూడకుండా "అన్నాను.దానికి రాముడు "తూథ్ "వాళ్లు కాకి గూళ్ళు పిచిక గూళ్ళు చెదరగొట్టి అలాటి పనులు చేస్తన్నారు ,మన బాబు తినడు సరదాగా కలుస్తాడు అని వివరించాడు .అంతే మేము ఒక్క పెట్టున అరుస్తో మేము తిన్నది "కాకి"గుడ్ల అనివుమ్ము ఊస్తో వాంతి అవుతదేమో అన్నంతగా ఏడుస్తో ఇంటికి పరిగెత్తికెళ్ళి అమ్మకి విషయం చెప్పడం,మాకు "వాంతులు "కాలేదు కాని వీపులు విమానం మోత ఎక్కినవి .ఆ తరువాత మా మామయ్యా సంగతి తాతగారు చూసారు..అది వేరే కథ.ఇప్పటికి తల్చుకుని నవ్వుకుంటాం ..


',