ఈ మద్య ఒక నవలని మరల చదవవలసినపుడు దానికోసం పుస్తకాల షెల్ఫ్ అంతా గాలించినా దొరకలేదు .ఎమైపోయిందబ్బా అని ఆలోచిస్తుంటే ఫ్లాష్ బాక్ లు కళ్ళ ముందు గిర్రున తిరిగాయి సినిమాల్లో లాగ.అప్పుడప్పుడు వచ్చే స్నేహితులు నచ్చిన పుస్తకాలు తీసుకుపోయి వాళ్ళిష్టం వచ్చినపుడు అంటే యాడదికో ,ఆర్నేల్లకో మళ్ళి తీసుకొచ్చిపడేయడం ,అలా ఆ పుస్తకానికి రెక్కలొచ్చి ఉంటాయని సరిపెట్టుకుని ఇంకోటి తెచ్చిపెట్టుకున్న .అలా అని నేను పుస్తకాలు ఎవరి దగ్గర తీసుకొని చదవనని కాదు , ఒకవేళ తీసుకున్న సదరు యజమానికి చెక్కు చెదరకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను , పైగా ఆ పుస్తకానికి అట్ట వేసుకుని మరి చదువుతాను యధాతధం గా ఇవ్వాలనే ప్రయత్నంతో . నాకో చెడ్డ అలవాటుంది ,చదవడం తో ఆపకుండా చదివిన దాన్ని గురించి ఎవరోకరి తో చెప్పడం ,వాళ్లు ఆ పుస్తకం చదవాలనుంది ఇవ్వమని అడగడం ,సదరు పుస్తకం అడిగిన వాల్లెంటపడికూడా పోవడం అది మనింటి మొహం చూడడానికి నెలలు పట్టడం ,ఒక్కోసారి జాడలు కూడా లేకపోవడం , మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు కనిపించినవల్ల చదువుతాడు ,చదివి దాన్ని ఎక్కడ వదిలేస్తాడో తెలీదు ,అదేమంటే చదివేసాంగా అంటాడు ,తన దగ్గరికి పుస్తకాలు వెల్లాయంటే ఆశలు వదులుకోవాల్సిందే .తనని తరుచు విసుక్కుంటాను ,జాగ్రత్త లేదని ,...చిన్నప్పుడైతే ఎవరికైనా ఏవైనా ఇస్తే అడిగేసేదాన్ని ,ముఖ్యంగా పుస్తకాలు లాటివి . ఇప్పుడైతే అడగడానికి చచ్చే మొహమాటం. నా చిన్నతనం లో జరిగిన సంఘటనా తరుచు గుర్తోస్తుంటాది,అదీ చెప్తాను .
అవి మేము చిత్తూర్ లో వున్నా రోజులు .అప్పుడు నేను అయిదు ఆరు తరగతులు చదివాను .అప్పటికే వేసవి తరువాత క్లాసు లు మొదలయ్యి రెండు నెలలు దాటి పోయాక ఒక ప్రభుత్వ స్కూల్లో మమ్మల్ని చేర్పించారు. మేము సంచార జాతికి చెందినోల్లం కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడి వాళ్ళతో కలిసిపోతామన్నమాట :) మరి ఏడాదికో ఊరాయే . అక్కడ చదువు తో పాటు ఆటపాటలు ,అనేక సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్లు . అక్క ,నేను అన్నింటా పార్టిసిపేట్ చేసేవాళ్ళం .ఒకసారి చిల్డ్రెన్స్ డే సందర్భంగా భారిగా పోటీలు నిర్వహించారు .నేను పాటలు,నృత్యం,పైంతింగ్,వ్యాస రచన ,వక్రుక్త్వ (స్పీచ్) పోటీలు అన్నిటికి నా పేరు ఇచ్చేసా ,అస్సలే మనం జాక్ అఫ్ అల్ ట్రేడ్సే కదా ముందు వెనుక ఆలోచించకుండా గొప్పగా దూకేసాం .అన్నింటిలో పాల్గొని చిన్నదో పెద్దదో బహుమతులు గెలుచుకున్నాం ,ఏమి లేని చోట ఆముదం వృక్షం చందాన ....అసలు కథ ఇక్కడ మొదలయ్యింది ,వక్రుత్వపు పోటిలకు పేరు ఇచ్చాను కాని ,అదేంటో నాకు సరిగ్గా తెలిదు ,ఆ రోజు మద్యాహ్నం నుండి మా అక్క ప్రాణం తీసేసా , ఎలా మాట్లాడాలి ,ఏమి మాట్లాడాలని ,అక్క తో తిట్టించుకుంటూ నేను మాట్లాడవలసిన 'గ్రంధాలయాలు ' మీద రాయిన్చుకున్నాను.చూడకుండా అంతమంది ముందు స్టేజి మీద చెప్పడం ఆ రోజుల్లో నాకు హీర్కులియన్ ఎఫ్ఫోర్ట్ అని చెప్పొచ్చు .రెండు ,మూడు సార్లు తన ముందు ప్రాక్టిస్ చేయించింది .సరిగ్గా చెప్పడం లేదని 'గ్రంధాలయాన్ని'బట్టి వేయించింది .(మనకి లెక్కలు కూడా స్టెప్ ల తో సహా బట్టి వేయడం అలవాటే )...భయం వేస్తె ఎవరి వంక చూడకుండా చెట్ల వంక ,ఆకాశం వంక చూస్తూ చెప్పెసేయమంది .
నా పేరు స్టేజి మీద పిలవగానే నా కాళ్ళ లో వణుకు వచ్చేసింది .,నిజానికి నాకు పాటలు ,డాన్సులు అందరి ముందు చేయడం కొత్తేమి కాదు ...మైక్ ముందు ఒంటరిగా స్పీచ్ నాకు కొత్త . మైక్ ముందు అందరిని చూస్తూ బేలగా వుండిపోయాను ,మా టీచర్ జడ్జి లు సైగలు చేయడం తో మా అక్క కోసం వేదికను ధైర్యం కోసం ...ఇక లాభం లేదని మెదడంతా బ్లాంక్ అవ్వుతుండగా గొంతు సవరించు కుని సభకు ,ప్రధాన ఉపాధ్యాయునికి నమస్కారాలు చెప్పి ఇలా మొదలెట్టాను "గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము"అని రెండు సార్లు చెప్పి ,అనక ఒక్క ముక్క గుర్తు రాక ఎదురు కూర్చున్న జనాలే మనస్సంతా నిండిపోయి ,ఏడుపొచ్చి ,నన్ను రక్షించేవారే లేరా ఇక్కడ అని ,బేల చూపులు చూస్తున్న నన్ను మా క్లాసు టీచర్ చొరవగా స్టేజి మీద నుండి దిగి పోవడానికి సహాయపడ్డారు.
ఇక చుడండి నా తరువాత ఒక్కొక్కరు మాట్లాడేవాళ్ళు తమ పేర్లు పిలవగానే రావడం ,దిక్కులు చూస్తూ నోరు పెగలక వెళ్లి పోవడం .ఆఖర్న వెంకటరత్నం అనే అబ్బాయి స్ప్పేడ్ గ వచ్చి అందరికి నమస్కారాలు గబగబా చెప్పేసి ,తను మాట్లాడబోయే టాపిక్ మరిచిపోయి బుర్ర గోక్కుంటూ నిలబడి పోయాడు అలా జునియర్ విభాగం పోటీలు ముగిసాయి .ఆ పోటికి సంభందించి మొదటి ,రెండో భాహుమతులు మా హెడ్ మాస్టర్ అప్పుడే స్టేజి మీద ప్రకటించారు ఫస్ట్ నాకు ,సెకండ్ వెంకటరత్నం కి ఇచ్చారు .ఇంటికెళ్ళే దారంతా అక్క నన్ను తిడుతూనే వుంది ,ఇంట్లో అందరికి చెప్పి నవ్వడం , "అయితేనేం నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినదిగా "అని సిగ్గులేకుండా వాదన పెట్టుకున్నాబహుమతి ప్రధానం చిల్డ్రన్స్ డే నాడు జరిగిందీ .అక్కా ,నేను చాల తెచ్చుకున్నాము .వ్యాస రచనకి ,ఎలాక్త్యుషన్ కి పుస్తకాలు బహుమతులుగా ఇచ్చారు .నా వ్యాస రచన కు మొదటి బహుమతి "పాయసం తాగిన పిచ్చుక " నా బ్రహ్మాండ మైన ప్రసంగానికి "చరిత్రకెక్కిన చరితార్ధులు "అనే పుస్తకం ఇచ్చారు .
ఒకరోజు అంటే ప్రోగ్రామం అయిన రెండు రోజులకు అనుకుంటాను , మాకు సోషల్ కి వచ్చే టీచర్ క్లాసు రూం లో నన్ను ,వెంకటరత్నం ని లేపి మాకు బహుమతులుగా వచ్చిన పుస్తకాలను మరునాడు తెచ్చి చుపమన్నది .మరునాడు నేను హడావిడిగా నా పుస్తకాల బాక్స్ లో పెట్టుకుని ,ఆవిడ క్లాసు రూం లో వచ్చిందో లేదో నేను వెంకటరత్నం పోటీపడి ఆవిడ దగ్గరికి వెళ్లి నా రెండు పుస్తకాలు ఆవిడ చేతుల్లో పెట్టాను అదేదో ఘన కార్యం చేసినట్లు .ఆమె చక్కగా ఆ పుస్తకాలని తన హ్యాండ్ బాగ్ లో పెట్టుకుని సాయంత్రం స్టాఫ్ రూం కి వచ్చి కలెక్ట్ చేసుకోమంది .సాయంత్రం స్టాఫ్ రూం కి వెళ్లాను ,అప్పటికే ఆవిడ వెళ్లిపోయారని చెప్పారు .మరునాడు స్కూల్ కి వెళ్ళగానే స్టాఫ్ రూం కి ముందే వెళ్లాను .,ఆ టీచర్ నన్ను చూసి ,ఇంట్లో మరచిపోయాను రేపు తెస్తాను అని చెప్పింది , ఆ రేపు రేపు కాస్త నెలలు దాటేయి ,ఒకరోజు మాత్రం మొహం చిట్లిస్తూ నలిగి జీర్ణవస్థలో వున్నా 'పాయసం తాగిన పిచ్చుక ' ఇచ్చింది .ఆమె నన్ను చూడగానే అడగకుండానే రేపు అనేసేది .ఆ రేపు కాస్త మా యన్యుఅల్ పరీక్షలయ్యి ,వేసవి లో కొవ్వూరు వెళ్ళేదాకా జరిగిందీ.ఇప్పటికి నాకు ఆ పుస్తకం గుర్తొస్తే మనస్సు కలుక్కుమంటుంది .,ఆవిడ ఎక్కడుందో కనుక్కుని నా పుస్తకం నాకు ఇవ్వు అనాలన్పిస్తుంది.తరచుగా తలపుల్లోకి వచ్చి అసహనంగా అన్పిస్తుంది ,అప్పుడప్పుడు అనిపిస్తుంది 'అయాచితంగా' వచ్చింది కాబట్టి నిలవలేదేమోనని . ఇదండీ రెక్కలొచ్చి ఎగిరిపోయినా నా జ్ఞాపకం నా పుస్తకం .నేను పూర్తిగా చదవకుండానే నా చేతుల్లోంచి జారిపోయిన ముత్యం .