27, ఆగస్టు 2012, సోమవారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-6

ఆత్మీయ అతిధులంతా తీరిక చేసుకుని ఎంతో దూరం నుండి అమ్మాయిని పెళ్లి కుమార్తె  ను చేసే కార్యక్రమానికి వచ్చి దీవించి ఇంటి ముందు తాటాకు పందిరి క్రింద ఏర్పాటు చేసిన బోజనాలు చేసారు .మధ్యాహ్నం రెండు తరువాత అమ్మాయిని కూర్చుండబెట్టి ఎదురుగా పాలు పెరుగు పళ్ళెం లో నింపి పసుపు కొమ్ములు కట్టిన రెండు పెద్ద రోకళ్ల ను పళ్ళెం లో ముంచి అటుఇటుగా పాప బుజాలకి తాకించారు నాయి బ్రాహ్మడు. పెద్దలు తాతలు పెదన్నాన్నలు బాబాయిలు మేనమామలు మేనత్తలు పెద్దమ్మలు చుట్టాలు ఒక్కొక్కరుగా వచ్చి వడ్లు(బియ్యం ) దోసిట అమ్మాయికి అటునిటు పోసి వారి చిత్తం కొలది రూపాయిలు అమ్మాయి కి దిష్టి  తీసి ప్రక్కనున్న పళ్ళెం లో వేసారు ఇదొక గంటపైన సాగింది (మేళ తాళ ల తో ) మరొక ప్రక్క ముత్తైదువలు తలంబ్రాల బియ్యం కలపటం ముగించేసర్కి అమ్మాయి పెద్దలందరికి  మొక్కి ఇంటినుండి కళ్యాణ మండపంకి బయలుదేరడం చాల హడావిడిగా జరిగింది పాప వెళ్ళేప్పుడు వాళ్ళ నాన్న అమ్మమ్మ పిన్నులు అత్తలూ అంత మనసార దీవించి  వీడ్కోలు పలికారు. మరొకవైపు మా ఆడపడుచులు మా వారి బావగార్లు మా తమ్ముళ్ళు మేనమామలు చాకలిని తీసుకుని పానకాల బిందెలతో వియ్యాల వారికి స్వాగతం పలకడానికి వెళ్ళారు వారి వెనుక నేను మా వారు పెళ్లి కుమారునికి
ఆహ్వానం పలకడానికి ఎదురు వెళ్ళాము .చాకలి గుమ్మడికాయతో దిష్టి తీసిన తరువాత మా అమ్మాయికి తమ్ముడు (చెల్లి కొడుకు ) బావగారిని ఆహ్వానిస్తూమెడ లో ఉత్తరీయం కప్పాడు  మా ఆడపడుచులు ఆరతి ఇచ్చాక కాబోయే అల్లునికి ఆహ్వానపత్రిక శాస్త్రోక్తంగా కొంత నగదు పెట్టి విడిదికి ఆహ్వానించాము ఇలా........తరువాత పానకాలు అందించడం .....ఆ తరువాత ఇంటికి పోయి అన్నీసర్దుకుని కళ్యాణ మండపం  దారి పట్టాము.
మా వారికి సర్జరీ కావడం వలన ఎవర్ని ఆయన స్వయంగా  ఆహ్వానించలేదు ఫోన్ ద్వారానే పిలుపులు కార్డ్స్ పంపడం అయ్యింది అయిన ఎవ్వరు నొచ్చుకోకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు ముహూర్తం ఎనిమిది పదమూడు కి కావడం వలన బోజనాలు ఆహ్వానం నా అక్కచేల్లిల్లు ఆడపడుచులు కజిన్స్ ముఖ్యంగా కొంతమంది స్నేహితులు నా ఆఫీసు స్టాఫ్ చూసుకున్నారు
పెళ్లి మంత్రాలను అయిదుగురు పురోహితులు సామూహికంగా ఉచ్చారణ చేస్తుండగా వివాహం మొదలయ్యింది.అమ్మాయి తో అక్కడే గౌరీపూజ అటు ప్రక్క అబ్బాయి చేత వరపూజ జరిపించి  కన్యాదాన కార్యక్రమానికి కూర్చున్నాము .వధూవరులు జీలకర్ర బెల్లం అయిన తరువాత సుమారు రెండు గంటలు పైన బంధు మిత్రులు అక్షతలు వేసే కార్యక్రమం జరిగింది మాతో పాటు మా వియ్యంకులు ఓపిగ్గా అన్ని గంటలు నిలబడి అతిధులకి నమస్కరించారు .ఎంతో దూరం నుండి వచ్చిన మిత్రులని అధికారులని బంధువులని పేరుపేరునా పలకరించి మా ఆతీధ్యం స్వీకరించి వెళ్ళమని కోరాము .మద్యలో ఒక పది నిముషాలు క్రిందికి వెళ్లి అతిదులని పలకరించి వచ్చాము .ఆ తరువాత మిగిలిన వివాహ తంతు చక్కని ఉచ్చారణతో అర్దాలను వివరిస్తూ జరిపించారు సన్నాయి బ్యాండు మేళాలు సమయానికి తగినట్లు వీనుల విందు చేసాయి .వధూవరులు అరుంధతి నక్షత్రం చుసేవరకి అక్కడే వుండి మిత్రులను భందువులను కలుసుకుని వచ్చిన వారికీ కృతజ్ఞతలు తెల్పి సెలవు తీసుకున్నాము .ప్రతి కార్యక్రమం చక్కగా పద్దతిగా చేసామని బంధుమిత్రులు అభినందనలు తెల్పారు.
   

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-5

తెల్లవారు ఝాము మూడుగంటల నలబయ్యి నిమిషాలకి తడి ఆరని కురులతో దీపారాధనకి ముగ్గురం కూర్చున్నాము మరొక ప్రక్క వంటింట్లో చిన్నపిన్ని మామయ్యా కూతురు నైవేద్యం తయారుచేసే హడావిడి లోవుండగా  పురోహితుని వేదమంత్రాలువాద్యకారుల  సన్నాయి మేళం ఆద మరచి నిద్రపోతున్న వారందనీ మేల్కొలిపింది
 ఇక్కడ మా పంతులుగారి గురించి చెప్పాలి ,చక్కని స్వరం తో వినసొంపుగా మంత్రాలను చదువుతారు ఎంత పనులున్న మన చెవులు ఒప్పగించాలని అనిపిస్తుంది .ఇంట్లో జరిగే కార్యక్రమాలకి విధిగా వీరి చేతుల మీద నడవ వలసిందే .ప్రతి పని శ్రద్దగా చేపిస్తారు . మొట్టమొదట వీరిచే గణపతి హోమం ఇంట్లో చేయించాము వీరు కాక మరో నలుగురు కలిసి చేసారు షుమారు ఏడెనిమిది గంటలు  మాకు అలసట రాలేదు అప్పుడే ముగ్దురాల్ని అయ్యి మా అమ్మాయి పెళ్లి మీచేతుల మీదనే చేయిస్తాను అని వాగ్దానం చేశాను అనుకున్నట్లే పాప నిశ్చితార్ధం లగ్నపత్రిక అంత వీరే నిర్వహించారు .మా దీపారాధన అమ్మ వాళ్ళు మాకు వస్త్రాలు ఇవ్వడం ఆడపడుచులు హారతి ఇవ్వడం పూర్తయ్యేసరికి ఫలహారాలు తీసుకునే సమయం అయ్యింది .
బంధువులు స్నేహితులు  కాలనీ వాళ్ళు అందరిని ఉదయం  ఫలహరాలకి మధ్యాహ్నం భోజనాలకి ఇంటికే ఆహ్వానించడం జరిగింది రాత్రి పెళ్లి విందులు మాత్రం మాకు దగ్గరలోని కళ్యాణమండపం లో ఏర్పాటు చేసాము వేడివేడి కట్టేపొంగాలి గారెలు పూరీలు సాంబారు కాఫీ టీ లు రుచిగా శుచిగా వడ్డించారు,ఇంకో ప్రక్క తొమ్మిదవ నలుగు స్నానం కి హాల్ మద్యలో పీటలు వేసి అమ్మాయికి మంచి గులాభి పన్నీరు నువ్వుల నూనె వెన్నపూస కలిపి ఒంటికి నలుగు  తల పైన నూనె తో మర్దన చేసి తలస్నానం చేయించి సాంబ్రాణి తో తలకి ధూపం పట్టి మేనమామలు తెచ్చిన పట్టు చీర కట్టబెట్టి పెళ్ళికూతుర్ని చేసాము.అమ్మాయికి గాజులు ఇచ్చి మేమిద్దరం అక్షతలు వేసి పెద్దవరయిన మా అమ్మ నాన్న తో అక్షతలు వేయించి వరుసగా పెద్దలందరి దీవెనలు తీసుకున్నాము ,పాప చేత ముత్తయిదువలందరికి తాంబూలం బ్లౌసే ఇప్పించాము ...తలంబ్రాలు బియ్యం కలపడం మధ్యాహ్న బోజనంతరం మొక్కులు కాలి గోర్లు తీసే తతంగం నాలుగున్నర లోపే పెళ్ళికూతురు ఇంటి నుండి కళ్యాణ మండపం  చేరుకోవాలి  ఈలోపు వియ్యాల వారికీ పానకలతో విడిదికి ఎదురు వెళ్ళాలి ....       

25, ఆగస్టు 2012, శనివారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-4

నాలుగవ రోజు నలుగు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే వుంది మా అమ్మాయి బాల్య స్నేహితులు డిగ్రీ స్నేహితులు సెంట్రల్ యునివెర్సిటీ స్నేహితులు నా స్నేహితులు ఎక్కడెక్కడి వారో వచ్చారు పలు రాష్ట్రాల సమ్మేళనం ఆ నాడు మా ఇంట కానవచ్చింది .వారందరికీ తెలుగువారింట వివాహ  వ్యవహారాలు ఒకింత వింతగాను ఆసక్తిగా అనిపించి శ్రద్దగా పాల్గొన్నారు.అతిధులను ఆహ్వానిస్తూనే మరొక ప్రక్క మరుసటి రోజు వివాహానికి జరగవలసిన పనులను పర్యవేక్షిస్తూ ఇంటివారందరికి ఒక్కొక్కపని అప్పగించడం జరిగింది .  వివాహసమయం లో ఏర్పాటు చేసే   విందు  భోజన పూర్తి పర్యవేక్షణ నా స్నేహితురాలు మరికొంతమంది దగ్గరి బంధువులు బాద్యత తీసుకున్నారు (అన్నిటికంటే అతి ముఖ్యం నా ఉద్దేశం లో )
మధ్యాహ్న భోజనం తరువాత మగ పెళ్ళివారు కొంతమంది స్త్రీలు (ఆడపడుచులు అబ్బాయి మేనత్త వరుసైన వారు )తొమ్మిది మంది పెద్దలు అమ్మాయికి "ప్రధానం"తీసుకువచ్చారు .ఈప్రధానం లో అమ్మాయికి  అత్తింటి వారు పెట్టె చీరే సారెలుసూట్ కేస్ టాయిలెట్ కిట్ సహాఇంకా  పసిడి వెండి కానుకలు,లడ్డులు పూలు తమలపాకులు అరటిగేలలు ఎండుకోబ్బరిచిప్పలు కర్జురాలు రవికె పన్నాలు పసుపు కుంకం గులాము వున్నాయి.పెళ్ళికూతురు కి పట్టు చీరే కట్టబెట్టి తూర్పు సింహ ద్వారానికి అభిముఖంగా పీట మీద తోటి పెళ్ళికూతురి సహా కూర్చోబెట్టి అమ్మాయి తరుపు పెద్దలు (మగవారే )అబ్బాయి తరుపు పెద్దలు వృత్తాకారంలో క్రింద కూర్చుని తాంబూలాలు ఒకరికొకరు మార్చుకుని (నిశ్చితార్ధం రోజు వియ్యంకులు మార్చుకున్నట్లు )వారిచ్చే ప్రతి వస్తువు అక్కడ వున్నా బంధు మిత్రులకి చూపిస్తూ నచ్చలేదని (సరదాకి )ఆడపెళ్ళి వారు గోల చేస్తూ అమ్మాయి బరువుకి ఏమాత్రం తగ్గకుండా వస్తువులు తూకం వేయాలంటూ ఒక రెండు గంటలు సాగింది. మంగళ సూత్రం తాడు నల్లపూసలు తప్పించి మిగిలిన వస్తువులన్నీ పెళ్లి కుమార్తె కి అబ్బాయి తరుపు పేరంటాళ్ళు ఒక్కొక్కటిగా అలంకరించారు.అయిదుగురు పెద్దలు పట్టు ఉత్తరీయంలో సన్నని పోగులతో కూడిన పసుపు బందు పోగు గుండ్రంగా నిలబడి అమ్మాయి  మెడ లో వేసారు అది పదహారు రోజుల పండగ వరకి ఉండాల్సింది .వారు తెచ్చిన పళ్ళు పూలు తాంబూలాలు ఆ కార్యక్రమంలో వున్నా స్త్రీ లందరికి పసుపు కుంకం తో ఇచ్చారు ,పెళ్లి పెద్దలు అటుఇటు వారు బెల్లం పానకాలు మార్చుకుని త్రాగారుఆ తరువాత మగ పెళ్ళి వారు అల్పాహారం మాత్రం తీసుకుని  ఒక పెద్ద ముత్తయిదువని పెళ్లి కూతురు వద్ద వదిలి పెళ్ళికి కలుద్దామని సెలవు తీసుకున్నారు ఆ సాయంత్రం కూడా  ఎక్కడెక్కడో మిగిలి వున్నా బంధువులు నలుగు పెట్టి పసుపులు వేసారు మర్నాడు కేవలం తల్లి మాత్రమె చేయాలి కాబట్టి .ఆ రాత్రి అన్ని సర్దుకుని విశ్రాంతి తీసుకునే సరికి తెల్లారు ఝాము రెండున్నర అయ్యింది .ఎవ్వర్కి నిద్రలు లేవు ఎక్కడ చుసిన గుంపులుగా కూర్చుని కబుర్లు ఆటలు గోలలు మామిడి తోరణాలు ఉదయం దీపారాధన తరువాత కట్టడానికి తోరణాలు తయారు చేస్తూ అబ్బాయిలు ..ప్రతి ఒక్కరు భాద్యతగా తమకిచ్చిన పనులు చేస్తూ కనిపించారు .తెల్లారు ఝాము ముడున్నరకే దీపారాధన అని సన్నాయి మేళం వాళ్ళు వచ్చేశారు గంటయిన విశ్రాంతి తీసుకుందామని అప్పటికే అలసి నిద్రలో వున్నా నా చిన్ని ప్రక్కలో చేరి నిశబ్దంగా  కన్నీరు తుడుచుకుంటూదగ్గరికి తీసుకుని పోదుపుకుని నిద్రకి ఉపక్రమించాను .         

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-3

మూడవ రోజు మా చిన్న మేనమామ ఇంట్లో మా కజిన్స్ ఇంక కొంతమంది దగ్గరి భంధువులు చాల ఘనంగా వేడుక చేసారు విందు భోజనాలు పెళ్లి వారిని తలదన్నినట్లు ఏర్పాటు చేసారు .ఇక్కడ ఒక విషయం చెప్పాలి సనాతనం మరియు ఆధునికం కలిపే ఈ అయిదురోజుల తతంగం సాగింది ఒక ప్రక్క పూజలు నలుగు  స్నానాలు  జానపద గీతాలు మంగళ గీతాలు శ్రద్దగా ఆచరిస్తునే మరొక ప్రక్క సంగీత్ సాయంత్రపు సమయాల్లో నిర్వహించడం, మరొక ప్రక్క గంటగంట కి ఫలహారాలు ఆత్రేయపురం నుండి పూతరేకులు మడత కాజాలు కాకినాడ నుండి కాజాలు ఒంగోలు మైసూరు పాకం నిడదవోలు నుండి లడ్డులు డ్రై  ఫ్రూట్ పూతరేకులు అరెసలు సున్నుఉండలు గంపలు గంపలు గారెలు బూరెలు గంపలనిండా పళ్ళుపూలు ఎటు చుసిన మల్లెల పరిమళం పిల్లల కోసం ఫ్రిజ్ నిండా రకరకాల చాక్లెట్స్ పళ్ళ రసాలు ఇది వుంది ఇది లేదు అని తడుముకోకుండా అందరికి అన్ని అందుబాటులో పెట్టాము
,మూడవరోజు సాయంత్రం అబ్బాయిలు ఆఖరకు మావారితో సహా ఆడి పాడారు మామయ్య కొడుకులు ఇంకా కజిన్స్ అత్యద్భుతంగా డాన్స్ చేసారు .పాప లగ్నం నక్షత్రం అనుసరించి కొన్ని పూజలు పెళ్ళికి ముందు చేయవలసినవి మూడో రోజు చేయించారు
.ఇదే రోజు భందువులందరికి నూతన వస్త్రాలు కుంకుమ బరిణ లు పిలుపుల   సమయంలో అందని వారికి బహూకరించడం జరిగింది .అమ్మాయిని పెళ్ళికూతుర్ని చేసిన సమయంలోనే అంత అక్షతలు వేసి పట్టుబట్టలు కానుకలు ఇవ్వడం జరుగుతుంది .అమ్మమ్మల నుండి అత్తలనుంచి పెద్దమ్మ పిన్నులు ఇంకా స్నేహితులు ఆత్మీయుల నుండి వెల కట్ట లేని వస్త్రాలు నగలు అందుకుంది .
.దూరం ఊర్లనుంది వచ్చిన భందువులకు వసతి ఏర్పాట్లు చేసాము కేవలం అర్ధరాత్రుళ్ళు పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవడనికే ,అదీ కాక మా చుట్టూ ప్రక్కలే పది పైన  దగ్గర చుట్టాలం వున్నాము దానితో వసతి కోసం దూరం ఊరు భంధువులు ఇబ్బంది పడలేదు
.ఇల్లంతా పూల తోరణాలతో విద్యుత్ దీపాలతో శ్రద్దగా అలంకరించాము పందిరి క్రింద రంగవల్లులు చుట్టార పూల తోరణాలు ..వాకిట నుండి ఇంటిని చుస్తే కళ్ళు చాలలేదు :) (అతిశయోక్తి కాదు )
ఆ అర్ధరాత్రి కలిగింది బెంగ నా కూతుర్ని ఈ ఇంటి నుంచి పంపించేస్తున్నానని ఆ వాకిట నిలబడి  ఏడ్చాను వెక్కి వెక్కి నన్ను చూసి మా పిన్నమ్మలు చెల్లెళ్ళు స్వరం కలిపారు ........................  

23, ఆగస్టు 2012, గురువారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-2

పూల మాలలు అల్లుతూ 
గోరింతాకులు పెట్టించుకుంటూ పిన్ని ,మా మేనత్త అక్కలు చేల్లిల్లు మరదలు 
అమ్మలు అమ్మమ్మలు మా పిల్లలు  సంగీత్ ...సార్ వాస్తా ర్స్తార 
రెండో రోజు పూర్తిగా గోరింతాకులు పెట్టుకునే ముందు ఆడి పాడి 
                      ఇటురాయే  ఇటు రాయే నీ మీద మనసాయె  అంటూ పిల్లలు పెద్దలు                                      
 రెండో పూట ప్రక్క వీధిలో వున్నా మా అమ్మ వాళ్ళ ఇల్లు (మా అమ్మాయికి మేన మామల ఇల్లు )పెళ్లి కళ సంతరించుకుంది.అక్కడ కూడా ఇదే క్రమం లో పెళ్లి కూతుర్ని చేయడం విందు భోజనాలు ( పసుపువేసాక అమ్మాయి  ఊరి పొలిమేర దాటకుండా దగ్గరలో సంచరించ వచ్చట )మద్యాహ్నం మా ఇంట గోరింటాకు ఉత్సవం జరిపాము చుట్టాలు ఊర్లో వున్నా స్నేహితులు ఇరుగు పొరుగు వీధుల ఆడవారిని పేరంటం పిలిచాము .మధ్యాహ్నం మొదలయ్యి రాత్రి బోజనాల వేళకి పూర్తయ్యింది ,ఆ పూట పెళ్లి కూతుర్ని మా ఆడపడుచులు మరదళ్ళు చేసారు .....        

22, ఆగస్టు 2012, బుధవారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి

అమ్మాయి పెళ్లి చేసి అప్పుడే ఆరు నెలలు పూర్తి కావొస్తుంది.సరదాగా నా బ్లాగులో నాటి  పెళ్లి వేడుకలు  షేర్ చేసుకోవాలనిపించి అలనాటి పెళ్లి సందడి పంచుకుంటున్నాను .
అసలు ఇంత త్వరగా వివాహం చేస్తాను అనుకోలేదు అప్పుడెప్పుడో మావారు హార్ట్ ప్రోబ్లం తో సిక్ కావడం తిరిగి కోలుకోవడం జరిగింది ఆరోగ్యంగా తిరుగుతున్నపుడే భాధ్యతలు  తీర్చుకోవాలని గట్టిగ నిర్ణయించుకుని  సంభంధం రావడం ఖాయం చేసుకోవడం జరిగింది లేకుంటే ఏదొక ఉద్యోగం లో స్థిరపడ్డాక చేయలనుకున్నాము.
మా అమ్మ,పిన్ని వాళ్ళంతా పూర్వంలా తొమ్మిది రోజులో లేక అయిదు రోజుల పెళ్లి చేద్దాము అని నిర్ణయించేశారు .ఇక చూడండీ మా ఇల్లంతా పెళ్ళికి పది రోజుల ముందునుండి సందడే సందడి .అయిదురోజుల పెళ్లి సందడికి ఏర్పాట్లు చేసాము.
తొమ్మిది పూట్ల పసుపు స్నానాలు అంటే పెళ్లి జరగబోయే రోజు ఉదయం తొమ్మిదో సారి పెళ్ళికూతుర్ని చేయడం అన్నమాట.
ఈ కార్యక్రమానికి ముందు వరుడి ఇంటికి పళ్ళు స్వీట్స్ కానుకలు  ఆహ్వాన పత్రిక తీసుకుని నేను మా శ్రీవారు మా మేనమామల తో కలిసి వెళ్లి ఆహ్వానించి వచ్చాము.
ఈ అయిదు రోజులు మా వారి తరుపు నా తరుపు  ఆత్మీయ బంధువు లంత కొలువులకు సెలవు పెట్టి మా సంతోషంలో భాధ్యతలను నెత్తిన పెట్టుకుని మాకు ఎటువంటి శ్రమ లేకుండా ఆద్యంతము పంచుకున్నారు .
వున్నా ఊర్లో చుట్టాలు దూరంగా వున్నా చుట్టాలు సహితం  ఇరవయి రెండు ఉదయానే వచ్చేసారు.మా పల్లె నుండి తాటి ఆకుల్ని పందిరి వేసే చుట్టాల్ని పిలిపించి పెద్ద పందిరి వేసి అందమైన ముగ్గులతో అలంకరించి   మా భంధువులు కాక ఇరుగు పొరుగుపెద్దలను ఆహ్వానించి గంధం పసుపు కుంకుమలతోమంగళ వాద్యాల తో పెళ్లి కూతుర్ని చేయడం జరిగింది.దాదాపు మూడు వందల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు ...మొదటిరోజు మా  కాబోయే అల్లుడు వారి భంధువులు కూడా ఈ వేడుకలో వున్నారు.
పసుపు కార్యక్రమం ఎలా చేశామంటే ..............
ముగ్గుల మద్య పసుపు పీటలు వేసి(ఒకటి తోడి పెళ్ళికూతురికి ) వధువుని కూర్చుండబెట్టి  .
పచ్చికొమ్ముల పసుపు పెసర సున్ని  కచ్చురాలు భావంచాలు మంచి గంధం సాన మీద తీసినది గిన్నెల నిండా  తీసుకుని పెద్ద ముత్తైదువలు అమ్మలు అమ్మమ్మలు తల పై నూనె అక్షతలు వుంచి వధువు కి నలుగు పెట్టి మేలమాడుతూ నలుగు పాటలు పాడారు..వారే ఇద్దరకి నలుగు స్నానాలు కుంకుడు శికాయలతో తలకిపోసి అక్కడ కూడా పాటలు పట్టు చీరతో వధువుని అలంకరించి మంగళ హారతులు పాడి వధువు చేత తాంబూలాలు ఇప్పించి   పెద్దలంత అక్షతలతో దేవెనలు ఇవ్వడం ఖరీదైన కానుకలు వస్త్రాలు వధువుకు ఇవ్వడం విందు భోజనాలుఏర్పాటు చేయడం జరిగింది . నాది  మావారిది పెద్ద పెద్ద కుటుంభాలు కావడం వలన తొమ్మిది పసుపు స్నానాలు పూట పూట కి పంచేసుకున్నారు .మేనత్తలంత ఒక పూట పిన్నులంతా ఒకపూట అలా పెళ్లి రోజు ఉదయం వరకు సాగింది .(తరువాత). 



  

,