29, ఆగస్టు 2013, గురువారం

వామ్మోవిందు( వివాహ) భోజనం

"బెండకాయ ముక్కలకంటే జీడిపప్పులు బాగా గుప్పించారే !"సన్నటి కీచు గొంతు ....
నా విస్తరి వైపు చూసాను నిజమే జీడిపప్పులో అక్కడక్కడ బెండి ముక్కలు
"అబ్బ చక్కెరపొంగలి నిండా అంత నెయ్యి పోసేసారు ఇదేంటబ్బా వీళ్ళు గృహప్రవేశం కి పెట్టినట్లు పూర్ణాలు వండించారు ! ఒక బొంగురు గొంతు ... నా విస్తర్లో అవి వున్నాయో లేవో ఒకసారి స్కాన్ చేసాను తినాలనిపించక కార్న్ సమోసా ముక్క త్రుంచి నోట్లోవేసుకున్నాను
"అదేవిటి కప్పులో వున్నా పెరుగావడ కనీసం రుచి చూడకుండా ఈవిడ సమోసా తింటుందేవిటీ "కీచు స్వరం
"డైటింగ్ కాబోల్ను" బొంగురు గొంతు
"అది దోసబద్దల ఆవకాయ లేక పచ్చి మామిడి ముక్కల పచ్చడా ?ఒక ముక్క కొరకోచ్చుగా బొత్తిగా అటు వైపు కూడా చూడట్లేదు "అదే బొంగురు గొంతు
"పిన్నీ వీళ్ళు అప్పుడే సాంబారులోకి వచ్చేశారు ... అరె ఉలవ చారనుకుంటాను వీళ్ళకి  వడ్డించ కుండానే వెళ్ళిపోతున్నాడు "కీచు .....
"ఇదేంటి బట్టర్ స్కాచు లాగుందే ఒక రకమే పెడుతున్నరల్లె వుందే మొన్న మా అక్కాయి ఆడపడుచు కూతురి పెళ్ళిలో ఎన్ని రకాల ఐస్ క్రీములు అనుకున్నారు అబ్బో చెప్పలేనన్ని "బొంగురు
నా సహనం నశించి ఒక్క ఉదుటున లేచి వెనక్కి తిరిగి "నీ యబ్బ మీరే కూర్చుని తినండీ మేం పోతాము" అని (మనస్సులో )కుర్చీని వెనక్కి నెట్టాను.

"అయ్యో కొంచెం చూసుకుని వెళ్ళండి "కీచు గొంతు .. హడావిడిగా నేను ఖాళి చేసిన కుర్చీలో కూర్చుంటూ ....
 ఈ మాటలన్నీ ఎవరు ఎవరితో ఏ సందర్భం లో అంటున్నారని అర్ధం అయ్యే వుంటుంది ..
.నిన్న రాత్రి ఒక వివాహానికి వెళ్ళాము అక్కడ బోజనాలు జరుగుతున్న హాలు క్రిక్కిరిసిపోయుంది అప్పటికి మేము కూర్చున్నది మూడో బంతి కాబోలు మాకు వడ్డన మొదలయిందో లేదో తరువాతి ట్రిప్ కొరకు మా వెనుక జనాలు ప్రతి కుర్చీ వెనుక ఒకరు దడి కట్టేశారు కడితే కట్టారులే వాళ్ళ తొందర వాళ్ళది అనుకుంటే విస్తర్లలోకి చూస్తూ ఒకటే కబుర్లు ,నాకు ఇరువైపులా అమ్మా చెల్లి వాళ్ళు తినలేక మొహమొహాలు చూసుకొంటూ ఏదో తిన్నాములే అనిపించారు.

ఈ మధ్యకాలం లో విందు భోజనలంటే భయం వేస్తుంది తినకుండా వచ్చేస్తే మర్యాదగా వుండదు తిందాము అంటే ప్లేట్ పుచ్చుకుని కస్టపడి తిన్నాము అనిపించాలి పోనిలే ప్రశాంతంగా కుర్చుని తిందాము అంటే కుర్చిల వెనుక కాపలా తట్టుకోలేము . ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేసినా ఎవరికి వాళ్ళు హడావిడి పడతు ముగించుకు వెళ్ళాలిసిందే తినేవారి వెనుక నిలబడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కనీసం గ్రహించరు .కుర్చి ఖాళి అవ్వడం ఆలస్యం ఎంగిలి విస్తర్ల ముందు కూర్చోవడం ,రాను రాను మనం ఎటు పోతున్నామో అర్ధం కావడం లేదు
  ఇదివరకు పూర్తి బంతి లేచి అక్కడ శుభ్రం చేసిన తరువాత తరువాతి వారికి పిలుపు వచ్చేది ఇప్పుడు అలా కాదు అటు అక్షతలు జల్లడం ఇటు వచ్చి తినే వారి వెనుక సీట్ రిజర్వ్ చేసుకోవడం ... వడ్డించినవి పూర్తిగా తినలేక ముందు వెనుక నిలబడిన వారి చూపులు తప్పించుకుంటూఅయ్యిందనిపించి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా పండో పాలో తీసుకుని కడుపు నింపుకోవడం చేస్తున్నాము . ..   



3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరూ ఇదే రాశారా? లైన్ లో నిలబడి ముష్టి చిప్పలో వేయించుకోడం, లేకపోతే కుర్చీల వెనక నిలబడి బస్సు సీట్లు రిసర్వ్ చేసుకున్నట్లు కొట్లాడుకోడమే నేటి నాగరికత :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అసలు విందు భోజనం వైపే చూడకూడదు . హాజరు వేయించుకోవడం (అంతే అనాలి అలాంటి చెత్త ఏర్పాట్లు కాబట్టి ) ఇంటి దారి పట్టడమే బెస్ట్ అండీ !
మీ కోపం ఇక్కడ కూడా కనబడింది :)

Hima bindu చెప్పారు...

@ kastephale
@ vanaja tatineni
ఈ విందు బోజనాలు మొహమాటపు కతుకుడులు చెప్పుకుంటే కోకొల్లలు :)వనజ గారు మీ సూచనలు తప్పక పాటిస్తాను ఇక ముందు :)