21, నవంబర్ 2010, ఆదివారం

కార్తీకం-నా ఉపవాసపూజ

ప్రతి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజు మనకి గొప్ప భక్తి శ్రద్దలు వున్నా లేకపోయినా పూర్తిగా ఆహారం మానేసి (ఒకటి రెండు సార్లు టీ) ఉదయం సాయంత్రం శివాలయ దర్శనం చేసుకుని చుక్కని చూసి ఆవేల్టికి మన భక్తి చాలించి శుభ్రంగా తినల్సినవన్నితినేయడం రివాజు .ఒకవేళ మనం మరిచి పోయిన మా భక్తి చెల్లి (పెద్దది )ముందు రోజునుండే మొదలు పెడ్తుంది "రేపు చీకటితో నాలుగ్గంటలకి గుళ్ళో ఉందామా లేక అయిదు గంటలకి సరిపోతుందా అని ...ఆవు నెయ్యి తెప్పించావ ,లేక అక్కడే కొందామ ,పెద్ద ప్రమిదలు అయితే బాగుంటాయి చిన్నవి మరీ ఇరుకు అనుకుంటా ఇలా వుంటాది ఒకప్పుడు అమ్మ చేసేది ఇంత హడావిడి ,బహుశ అమ్మ వారసత్వం పుచ్చుకుని వుంటుంది .
ఈ రోజు రెండే రెండుసార్లు టీ తాగాను మద్యలో మనకి ఫ్రిడ్జ్ లో వున్నా చాక్లెట్స్ మీద కమల (అమ్మాయి కాదు )మీద మనసు లాగినా చా ....వద్దులే అని మనసుకి సరిపెట్టుకున్నాను ...హమ్మయ్య ఈ రకంగా అయిన ఒక అరకిలో అన్న తగ్గుతానులే అనే దురాశ తో నిన్న నాతో తెచ్చుకున్న బండెడు ఫైల్స్ పైన మనస్సు లగ్నం చేసి హ్యాపీగా హోం వర్క్ పూర్తి చేసి నా కళ్ళు కాళ్ళు డైనింగ్ రూం వైపు వెళ్ళకుండా జాగ్రత్తపడి మొత్తానికి దిగ్విజయంగా కార్తికపౌర్ణమి ఉపవాస దీక్ష పూర్తిచేసాను అప్పటికి ఇంట్లో వున్నా దుష్టశక్తులు నా దీక్ష భగ్నం చేయాలనుకున్న వారి కోరిక ఫలించలేదు .గుడినుండి సరాసరి అమ్మవాల్లింటికి వెళదామనుకున్న (వాళ్ళింట్లో వెయిట్ చూసే మెషిన్ వుంది ,నా దగ్గర లేదు ) ప్రసాదం ఇద్దామని కాని అమ్మే ఎదురొచ్చింది :-(
గుడికి వెళ్ళిన నా మనసు కళ్ళు నేను చేసే పనికన్నా(పూజ ) గుడి ప్రాంగణం లో దేదీప్య మానంగా వెలుగుతున్న దీపలమీద అక్కడ మిలమిల మెరిసిపోయే అందమైన అమ్మాయిల కట్టుబొట్టు పరిశీలనతోనే సరిపోయింది .అక్కడ గంటపైన గడిపిన ప్రశాంతంగా ఓ మూల అరుగుపైన అలానే వుండి పోవాలన్పించింది .విశాలమైన ఆవరణలో రామాలయం శివాలయం ప్రక్క ప్రక్కనే కట్టారు,మా కాలనీ ప్రక్కనే వున్నా సింధిస్ కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గుడి అది ,చుట్టుప్రక్కల కాలనీ వాళ్ళంతా ఇక్కడికే వస్తుంటారు ...మొదట్లో పలుచగా వచ్చేవారు ఇప్పుడు విపరీతమైన తాకిడి ,బహుశ ఆ గుడికి ఆదాయ వనరులు ,వితరణలు సమకూరుతున్నట్లు అక్కడి నిర్వహణ తీరు తెలుస్తుంది. గుడికి వెళ్ళినప్పుడల్లా అనుకుంటుంటాను వీలైనప్పుడల్లా కొంత సేపైనా కూర్చుని వెళ్ళాలి అని ...నా నిర్ణయం ఆ గుడి ఆవరణ దాటి ఇవతలికి రాగానే చల్లటి చలిగాలిలో కలిసిపోతుంది ప్చ్..
పూజ ముగించుకుని గుడి బయటికి వస్తూనే అక్కడ వచ్చే సాంబ్రాణి కర్పూర హారతుల సువాసనకి తోడు గుప్పుమనే మల్లెపూల పరిమళం ఆవరించింది ...ప్రక్కనే బుట్టెడు మల్లిపూలు ...నా కాళ్ళు అప్రయత్నంగా అటేసి కదిలాయి ,నా వెనుకే నా చెల్లి ,రత్నాలు ...మూర ముప్పయ్యి రూపాయలంట ! పావలా అర్ధరూపాయిలు పోయి ,రెండు రూపాయల మూర ఏకంగా ముప్పయ్యి ...కాలంకాని కాలం కదా అని సరిపెట్టుకుని కోనేసాం హ్మ్మం ఎందుకో తెలిదు ఏ కాలం పూలు ఆ కాలం లో వస్తేనే బాగుంటాయని అనిపిస్తుంది.ఈ మల్లెపూలంటే తగని పిచ్చి నిజం చెప్పాలంటేఒక పూవు అందం ఇంకో పువ్వుకి వుండదు ...మల్లెల వాసన ..వేసవి రోజులు ఊరు వెళ్ళితే చిన్నాన్నమాకోసం ప్రతిరోజు గుడివాడ నుండి తీసుకు రావడం ,నానమ్మ పర్యవేక్షణలో మాలలు కట్టడం ...మల్లెల పరిమళాలు అంటే మా ఊరి జ్ఞాపకాలు భాల్యంలో నన్ను అల్లుకున్న పరిమళం ముఖ్యం నా పుట్టినరోజు న నా జడంతా మల్లెపూలతో నిండిపోయేది .........ఏవి నాటి పరిమళాలు ......నానమ్మ ,బాబాయి ఇద్దరు లేరు ....
బంతిపూలు వాసనలకి నా భాల్యానికి బోల్డంత భంధం ...సంక్రాంతి కి నానమ్మ ఊర్లో మేము ఉండాల్సిందే ముద్దబంతులు ,ఊక బంతులు ,బియ్యపు బంతులు ,కారపుబంతి ,ఒంటిరెక్క ....అమ్మమ్మ వాళ్ళ పెరట్లో పొలాల గట్ల మీద కూడా ఉండేవి ...ఆ బంతి పూల వాసన దీర్ఘంగా ఆఘ్రానిస్తే రెక్కలోచ్చే ఊర్లో వాలిపోతాం ....వర్షా కాలం లో వచ్చే చేమంతులు ,చిట్టి చేమంతులు ,గడ్డి చేమంతులు నాన్న వాళ్ళ చెక్ పోస్ట్ నుండి గంపలు గంపలు వచ్చేవి వాటికి నా భాల్యపు వాసనలే ...ఇకపోతే శీతాకాలం లో వచ్చే లిల్లీ (నిషిగంధ ) అదొక గమ్మత్తయిన పరిమళం ..లిల్లీ పూల గుత్తులు ఇంట్లో వుంటే ఎన్నిరోజులయిన పరిమళం ఆ గదిని వీడదు ...ఎక్కడ లిల్లీ పూలను చుసిన వాటి పరిమళం నన్ను తాకిన నా పెళ్లి రోజు గుర్తొస్తుంది ...మా ఇల్లంతా లిల్లీ పూలవాసనలతో ఉండేది ....కాలం కాని కాలం లో ఇప్పట్లా అన్ని రకాల పూలు వచ్చేయి కాదు ........హ్మం కార్తిక పౌర్ణమి.....ఎక్కడ్నుంచి ఎక్కడికో పంపేసింది .

4 కామెంట్‌లు:

జయ చెప్పారు...

చాలా బాగుందండి, మంచిమంచి పూలను గుర్తుచేసారు. కార్తీకపౌర్ణమి నాడు పూర్ణ చంద్రునితో పాటుపోటీపడే అందమైన దీపాలంకరణ కోసమే నేను ప్రత్యేకంగా గుడికెల్తాను.

Hima bindu చెప్పారు...

@వేణు శ్రీకాంత్
థాంక్యూ
@జయ
హమ్మయ్య నాకు తోడున్నారు :-)

Manjusha kotamraju చెప్పారు...

baagundi mee upavasa pooja

siri చెప్పారు...

Sree Raaga

mee lily poolu, naaku kuda naa pelli gurtuchesayi. winter kanuka lily pula jada vesaru. aa sugandham ippatikee naaku manasulo taazaga undi.
adento gani Hyd lo lily lu anta vasana raavu ade maa vijayawada Lenin Centre area ki velte chalu lily la parimalam ghuppuna takutundi. maa chinnappatinunchi ippatikee aa fragrance lo emee marpu ledu.