25, అక్టోబర్ 2013, శుక్రవారం

బెజవాడ భోరుమంది

  • బెజవాడ భోరుమంది!
    నాలుగు రోజులనుండి గుండె పగిలేలా పోగిలిపోగిలి ఏడుస్తుంది యెందుకంటారు?
    బహుశా 
    తన రాష్ట్రం  రెండు ముక్కలు అవ్వుతున్నదనేమో !ఇంకా నాలుగురోజుల్లో చేసుకునే రాష్ట్రావతరణ దినోత్సవం కడదనేమో !

8, అక్టోబర్ 2013, మంగళవారం

అదే నా మొదటి ప్రేమలేఖ

రాసాడు చెప్పలేక :)
ప్రేమా ప్రేమ ప్రేమా!
అసలు ప్రేమకు సరైన భాష్యం తెలియని వయస్సులో అందుకున్నాను 
కనీసం నవలలో చదివినట్టు స్కూలు ఫైనలు కాదు తొమ్మిదో తరగతి మద్యలో వున్నాను 
అసలు విషయంలోకి వెళ్తే డబల్ రూళ్ళ పేపరు మీద ఇలా రాసాడు 
 ''ప్రియానిన్నుచూడని జీవితం జీవితం కాదు'' 
రోజు సాయంత్రం నీకోసమే సినిమా హాల్ గేటు దగ్గర నిలబడుతున్నాను 
వచ్చే జన్మ లో కూడా నీ ప్రేమను కోరే ప్రేమికుడు ,రిప్లై సూన్ ,టా టా 
                            రాళ్ళపల్లి శేఖర్   
మొత్తం చదివాకా అప్పుడు అడిగాను నాకు ఈ ఉత్తరం  తెచ్చి ఇచ్చిన మా ఇంటిగల వాళ్ళబ్బాయి ప్రసాదును . ''ఇదేవరికోసం ప్రసాదు రాసిన వాడేవడు "అని .నీకొసమె అని టక్కున సమాధానం చెప్పాడు మరి నాపేరు లేదుగా ఉత్తరంలో అన్నాను ఇంకాస్త కన్ఫర్మ్ చేసుకోవడానికి అది మా అక్క కోసమో లేక మా పెద్ద చెల్లి కోసమో అని నా అనుమానం .ఇప్పడు ఈ ఉత్తరం ఇచ్చినవాడు ఎక్కడ వున్నాడు అని అడిగాను చూడాలనే ఒకింత కుతూహలంతో మా ఇంటి వెనుకనే సినిమా హాల్ వుండేది   ప్రసాద్ నన్ను వీధి వైపు మేడ మీదకి తీసికెళ్ళి సదరు శేఖర్ని చూపించాడు ,థూ వీడా! అసలు బుద్దుందా(అదే ఆరడుగుల హీరోల వుంటే అనేదాన్ని కాదేమోఅప్పట్లో సినిమా హీరోలే మన కళ్ళకి మనుషులుగా ఆనేవారు  ) వాడు ఇవ్వగానే నువ్వు నాకు తెచ్చివడమేనా అని గట్టిగ కోప్పడి పిల్లలందరూ కూర్చున్న చోటికి వచ్చి ఆ ఉత్తరాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాను వాళ్ళలో ప్రసాద్ వాళ్ళ కజిన్ స్పీడ్ గా లేచి ధియేటర్ దగ్గర ఇంకా నిలబడే వున్నా సదరు వ్యక్తిని కాలరు పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి వచ్చి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ కి రెండు తగిలించాడు మా గుసగుసలు గోల చూసి వచ్చి అడిగిన పెద్దొళ్ళకి విషయం తెలియనీయలేదు 
.ఈ సంఘటన మేము హాస్టల్ నుండి దసరా సెలవలకి ఇంటికి వచ్చినపుడు జరిగింది సదరు ప్రేమికుడు నా ఇంటర్ వరకు నా నీడ లానే కదిలేవాడు కాని ఆఖరికి ఊరు మారిన కొత్త కాలేజి గేటుబయట కనబడి ఉలిక్కిపడేలా చేసాడు ..ఆ తరువాతెప్పుడో కాలేజికి వెళ్ళే దారిలో ..... అప్పటినుండి ఇప్పటివరకు మరి కనబడలేదు రెండేళ్ళ క్రితం రెండేళ్ళు అక్కడ పనిచేసినపుడు మా పాత ఇంటి వైపు వెళ్లినపుడల్లా చిన్ననాటి సంఘటన గుర్తోచేది ....   నా  రెండో లేఖ ముక్కుమొహం తెలియని కలం స్నేహితుడి నుండి ...(తరువాతి భాగం ) 

5, అక్టోబర్ 2013, శనివారం

నాటి చిరుదివ్వెలేయమ్మా

రేపు సమైఖ్యబందులో భాగం గా విద్యుతు కి అంతరాయం కలుగుతుందని ముందు జాగ్రత్తగా రేపటికి సరిపడా నీరు మొబైల్ చార్జింగు చేసుకోండని  హెచ్చరిక వస్తే హడావిడిగా టాంకులు నింపడం తెలియని వారికి  తెలియచేయడం చేసాక తీరికగా కూర్చొని ఆలోచిస్తే ఒక్కరోజు అంతరాయం కలుగుతుంది అంటేనే ఇంత కంగారుపడి పోతున్నాము పూర్వం ఇవేవి లేకుండా ఎంత ప్రశాంతమైన జీవితం అనుభవించారు అనిపించి ఒక్కసారిగా నా బాల్యం లోకి జారిపోయాను .... ఇప్పటికి ఎప్పటికి అధ్బుతమైన ఆనంద క్షణాలు ఏవయ్య అంటే నా బాల్యమే . ఎలక్ట్రిసిటీ (కరెంటు )లేకుండా గడిపిన బాల్యం తెలుసు . నాన్న ఉద్యోగరీత్యా పట్టణాల్లో వున్నా మా అమ్మమ్మ నాయనమ్మ ఊర్లు చిన్న గ్రామాలే అక్కడ కరెంటు ఉండేది కాదు కాస్త మేము పెద్ద తరగతుల్లోకి వచ్చాక ఆ ఊరుల్లో విద్యుత్తు దీపాలు వచ్చాయి . ప్రతి ఏట సంక్రాంతి సెలవులకి వేసవి సెలవలకి తెలంగాణలో వున్నా రాయలసీమ లో వున్నా మా కృష్ణా జిల్లాకి చేరవలసిందే నాన్న వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు తప్పనిసరిగా కూడా వుండేవారు ఆయన పూర్తిగా అక్కడ గడపలేక పోవడానికి కారణం కరెంటు లేకపోవడం ... మాకయితే మండే ఎండ సయితం చల్లని వెన్నెలలా తోచేది !మా పిల్లలికే  కాదు మా అమ్మకి అలానే వుండేది . అబ్బో అసలా రోజులే వేరు !ఇంట్లో ఏ గదిలో వున్నా చల్లని గాలితో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాళ్ళం అసలు ఫ్యాన్ అవసరమే వుండేది కాదు చుట్టూ చక్కని చిక్కటి పచ్చదనం పైరగాలి . సాయంత్రం అవుతుంటే చాలు ఇంట్లో వున్నా పాలేరు (పనివాళ్ళు )కొట్టుగది (స్టోర్ రూం )ప్రక్కన కూర్చుని ముగ్గుపిండి కిరసనాయిలు ప్రక్కన పెట్టుకుని అందమైన దీపంబుడ్లనుపెట్రోమాక్స్ లాంతర్లను శుభ్రం చేసి ఉంచేవాడు  చీకటి తెరలు కమ్ముతుండగా అమ్మమ్మో పెద్దనాయనమ్మో (అమ్మ వాళ్ళ నానమ్మ )పెద్దత్హో దీపాలు వెలిగించి గది గదిలో స్టాండు లో అమర్చేవారు గది సైజు బట్టి దీపం వుండేది బోజనాల గదిలోనూ ఇంటి ముందు వసారాలో పెట్రోమాక్సులు తగిలించేవారు .సాయంకాలపు ఆటలనుండి వచ్చిన మాకు ఈ పనులన్నీ చూడటం సరదాగా వుండేది అమ్మమ్మ దీపం పుచ్చుకుని వెళ్తుంటే ఆవిడ కొంగు పుచ్చుకుని గది గదికి తిరగడం స్నానాలు కానిచ్చి ఆ బుడి బుడి దీపాల వెలుగులో వేడివేడి అన్నంలో గొంగురా ముద్దపప్పులు కమ్మటి నేతితో అమ్మమ్మ చేతో పిన్నమ్మల చేతో గోరుముద్దలు తినడం తడి ఆరని జ్ఞాపకాలు .. అన్నట్లో ఇప్పట్ల ఫిల్టర్ వాటర్ లేదు శ్రేష్టమైన చెరువు నీరు రాగి ఇత్తడి బిందుల్లో పోసి అనక మట్టి కుండల్లో నింపి ఉంచేవారు అప్పుడు ఏ జబ్బులు రాలేదు త్వరగా ఇప్పడు వచ్చినట్లు .నీల్ల కి కరెంటుకి సంభందం వుండేది కాదు మా ఊరి చెరువుల నిండా నీరే .... ప్రక్కనే వున్నా పిల్లికోడు నిండా నీరే .మా ఊర్లోకి వెళ్ళాలి అంటే ఆ కాలవ ప్రక్కనుండి వెళ్ళాలి అక్కడి నుండే దూరంగా దీపాల వెలుగులు మిణుకు మిణుకుమంటూ కనబడేవి అంత దూరపు ప్రయాణపు బడలికి వదిలేసి ఆత్రంగా వెలుగులు చూసేవాళ్ళం ... ఎప్పుడు మేము మా ఊరు చేరేసరికి రాత్రయ్యేది మా కోసం కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తూ గ్రామ మొదట్లోనే కారుకి ఎదురు వచ్చేవాళ్ళు .... గాఢమయిన అనుభంధాలు .్‌మ్మ్        

18, సెప్టెంబర్ 2013, బుధవారం

విరామం


ఒకటా రెండా నెల రోజులు దాటి పది రోజులు అయ్యిపోయాయి :-(
మొదటి పదిరోజులు అయాచితంగా వచ్చిన సమయాన్ని ఆనందంగా గడిపేసాక
ఇక మొదలయ్యింది ఇరవయ్యి నాలుగు గంటలు ఇంట్లో కుర్చోవాలంటే నా వాళ్ళ కావడం లేదు తిరిగే కాలు తిట్టేనోరు కుదురుగా వుండవ్వన్న చందాన నాకేమి తోచడం లేదు ఇలాటి తీరిక సమయం కోసం ఎంత ఎదురు చుసేదాన్నో ఇంట్లో వుండే ఆడాళ్ళను చూసి అసూయా పడ్డ  రోజులెన్నో
 ఉదయాన్నే లేవడం సూర్యోదయం చూస్తూ టీ త్రాగుతూ గంట సేపు ప్రకృతిలో విహరించి వంటగది కార్యక్రమాలు చక్కబెట్టి అయ్యవార్ని ఆఫీసు కి పంపి ఇంకేమి చేయ్యాల్ చెయ్యాలి అనుకుంటూ ఫోన్ తీసుకుని వివిధ నగరాల్లో సమ్మెలు ఎలా జరుగుతున్నాయో మిత్రుల నుండి ప్రత్యక్ష ప్రసారాలు విని కాసేపు వాపోయి  అలుపోచ్చేదాక ఎక్కడెక్కడి చుట్టాలని కదిపి ఫోనుల్లో క్షేమ సమాచారాలు విచారించి కాసేపు బుజ్జులు తో ఆదుకుని పుస్తకాలు ముందేసుకుని రోజుకి ఒకటి రెండు చొప్పున పూర్తి చేస్తూ సాయంకాలం బెడ్ రూమ్ కిటికీ లోంచి క్రుంగిపోయే సూర్యుడిని చూస్తూ మొక్కల్ని కాసేపు పరామర్శించి చీకటి పడుతుండగా ఇంట్లోకి వచ్చి డిన్నర్ ప్రిపరేషన్ ముగించి సగం చదివి వదేలేసి వున్నా పుస్తకం చేతబట్టుకుని మద్య మద్యలో శ్రీవారు టీవి చూస్తూ చేసే వ్యాఖ్యానాలకి ఆ ..ఉ  అంటూ సమాధానం చెబుతూ మధ్యలో చిన్ని తో గంట కబుర్లు చెప్పి ఆ రోజు ముగింపు అలా కరిగిపోతుంది ,కొద్ది పాటి మార్పులు చేర్పుల తో ప్రతి రోజు ఇలానే వుంటుంది నిద్ర లేవడం వంట చేయడం తినడం నిద్రపోవడం హ్మ్మ్ ... నో ఆఫీసు నో స్టాఫ్ నో బాస్ నో విసిట్ట్స్ నో టెన్షన్స్ ... హమ్మో ఇంట్లో వుంటే ఇంత హరిబుల్ గా ఉంటుందా .ఉద్యోగ విరమణ జీవితం ఇలానే ఉంటుందన్న మాట ...ఈ సమస్యలు అందరికి ఆమోద్యంగా ఎప్పటికి పరిష్కారం అవుతాయో ఆఫీసు ముఖం ఎప్పుడు చూస్తామో .... 

29, ఆగస్టు 2013, గురువారం

వామ్మోవిందు( వివాహ) భోజనం

"బెండకాయ ముక్కలకంటే జీడిపప్పులు బాగా గుప్పించారే !"సన్నటి కీచు గొంతు ....
నా విస్తరి వైపు చూసాను నిజమే జీడిపప్పులో అక్కడక్కడ బెండి ముక్కలు
"అబ్బ చక్కెరపొంగలి నిండా అంత నెయ్యి పోసేసారు ఇదేంటబ్బా వీళ్ళు గృహప్రవేశం కి పెట్టినట్లు పూర్ణాలు వండించారు ! ఒక బొంగురు గొంతు ... నా విస్తర్లో అవి వున్నాయో లేవో ఒకసారి స్కాన్ చేసాను తినాలనిపించక కార్న్ సమోసా ముక్క త్రుంచి నోట్లోవేసుకున్నాను
"అదేవిటి కప్పులో వున్నా పెరుగావడ కనీసం రుచి చూడకుండా ఈవిడ సమోసా తింటుందేవిటీ "కీచు స్వరం
"డైటింగ్ కాబోల్ను" బొంగురు గొంతు
"అది దోసబద్దల ఆవకాయ లేక పచ్చి మామిడి ముక్కల పచ్చడా ?ఒక ముక్క కొరకోచ్చుగా బొత్తిగా అటు వైపు కూడా చూడట్లేదు "అదే బొంగురు గొంతు
"పిన్నీ వీళ్ళు అప్పుడే సాంబారులోకి వచ్చేశారు ... అరె ఉలవ చారనుకుంటాను వీళ్ళకి  వడ్డించ కుండానే వెళ్ళిపోతున్నాడు "కీచు .....
"ఇదేంటి బట్టర్ స్కాచు లాగుందే ఒక రకమే పెడుతున్నరల్లె వుందే మొన్న మా అక్కాయి ఆడపడుచు కూతురి పెళ్ళిలో ఎన్ని రకాల ఐస్ క్రీములు అనుకున్నారు అబ్బో చెప్పలేనన్ని "బొంగురు
నా సహనం నశించి ఒక్క ఉదుటున లేచి వెనక్కి తిరిగి "నీ యబ్బ మీరే కూర్చుని తినండీ మేం పోతాము" అని (మనస్సులో )కుర్చీని వెనక్కి నెట్టాను.

"అయ్యో కొంచెం చూసుకుని వెళ్ళండి "కీచు గొంతు .. హడావిడిగా నేను ఖాళి చేసిన కుర్చీలో కూర్చుంటూ ....
 ఈ మాటలన్నీ ఎవరు ఎవరితో ఏ సందర్భం లో అంటున్నారని అర్ధం అయ్యే వుంటుంది ..
.నిన్న రాత్రి ఒక వివాహానికి వెళ్ళాము అక్కడ బోజనాలు జరుగుతున్న హాలు క్రిక్కిరిసిపోయుంది అప్పటికి మేము కూర్చున్నది మూడో బంతి కాబోలు మాకు వడ్డన మొదలయిందో లేదో తరువాతి ట్రిప్ కొరకు మా వెనుక జనాలు ప్రతి కుర్చీ వెనుక ఒకరు దడి కట్టేశారు కడితే కట్టారులే వాళ్ళ తొందర వాళ్ళది అనుకుంటే విస్తర్లలోకి చూస్తూ ఒకటే కబుర్లు ,నాకు ఇరువైపులా అమ్మా చెల్లి వాళ్ళు తినలేక మొహమొహాలు చూసుకొంటూ ఏదో తిన్నాములే అనిపించారు.

ఈ మధ్యకాలం లో విందు భోజనలంటే భయం వేస్తుంది తినకుండా వచ్చేస్తే మర్యాదగా వుండదు తిందాము అంటే ప్లేట్ పుచ్చుకుని కస్టపడి తిన్నాము అనిపించాలి పోనిలే ప్రశాంతంగా కుర్చుని తిందాము అంటే కుర్చిల వెనుక కాపలా తట్టుకోలేము . ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేసినా ఎవరికి వాళ్ళు హడావిడి పడతు ముగించుకు వెళ్ళాలిసిందే తినేవారి వెనుక నిలబడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కనీసం గ్రహించరు .కుర్చి ఖాళి అవ్వడం ఆలస్యం ఎంగిలి విస్తర్ల ముందు కూర్చోవడం ,రాను రాను మనం ఎటు పోతున్నామో అర్ధం కావడం లేదు
  ఇదివరకు పూర్తి బంతి లేచి అక్కడ శుభ్రం చేసిన తరువాత తరువాతి వారికి పిలుపు వచ్చేది ఇప్పుడు అలా కాదు అటు అక్షతలు జల్లడం ఇటు వచ్చి తినే వారి వెనుక సీట్ రిజర్వ్ చేసుకోవడం ... వడ్డించినవి పూర్తిగా తినలేక ముందు వెనుక నిలబడిన వారి చూపులు తప్పించుకుంటూఅయ్యిందనిపించి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా పండో పాలో తీసుకుని కడుపు నింపుకోవడం చేస్తున్నాము . ..   



2, ఆగస్టు 2013, శుక్రవారం

ఎవడి గోల వాడిదే

ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు అడిగాడట వెనకటికి ఒకడు  ; )అట్లా వుంది పరిస్థితి రాష్ట్రం లో కొంత ప్రాంతం విభజనకి నిరసనగా ఆందోళన దిశగా ఉద్వేగంలో ఉంటె నా బోటి వాళ్ళంతా లెక్కలు వేసుకుంటున్నాము "హమ్మ ..నా ముందున్న కొంతమంది సీనియర్లు తెలంగాణా లోకి వెళ్ళిపోతే అబ్బో మేము సీనియరు ఆఫీసర్లం అయిపోయి  వావ్వ్ మా కలలుసాకారం అయ్యే రోజులు దగ్గరలోనే వున్నాయని ఉద్వేగం తో ఉక్కిరిబిక్కిరి  అవ్వుతున్నాము :)" మా ముంగలున్న  ఆంధ్రోళ్లు బోతే ఇగ నేనేగంద ఈడ సీనియర్ను"ఓ తెలంగాణా అధికారి చతురు.   నలుగురు అధికారులు కలిసినచోట ఇద్దరి ఫోను సంభాషణ ఇదే దిశగా సాగుతుంది .ఇక్కడ తెలంగాణా సీమంధ్ర అధికారులు ఒకరితో ఒకరు ఐకమత్యంగా పరిహాసంగా సాగిస్తున్న సంభాషణ .ఇంతా చేసిన చివరికి మా వాదము సమైఖ్యనాదమే:)   

22, జూన్ 2013, శనివారం