మేము చిన్నతనంలో ఇంట్లో ఏ పుస్తకం కనబడిన చదివేసేవాళ్ళం,చదవడమే కాకుండా ఆ బుడత వయస్సులోనే మాలో మాకు చర్చలు ,వాద ప్రతివాదాలు వుండేవి.మా నాన్న ప్రత్యేకించి పిల్లలికి సంభందించి 'చందమామ ,బొమ్మరిల్లు ,భాలమిత్ర పుస్తకాలు మిగిలిన వారపత్రికలతో పాటు తెప్పించేవారు.అప్పట్లో కథల్లోవన్ని నిజమే అని నమ్మే వయస్సు .మా అందరికంటే అక్క చాల పుస్తకాలు చదివేది,చదవడమే కాకుండా తనకు చెప్పాలని మూడ్ వచ్చినప్పుడల్లా వింతవింత కథలు చెప్పేది,మేము నోర్లు తెరుచుకుని మరీ వినేవాళ్ళం.అలా విన్న కథల్లో "ముత్యలదీవి ,వజ్రలదీవులు ,పగడాల దీవులు,బంగారం నిధులు ,ఇలా సాగేవి,అవన్నీవిన్నప్పుడు వాటిని చూడాలని,అలా సముద్రంలో ప్రయాణం చేసి ముత్యపు
చిప్పలు కుప్పలుగా తెచ్చుకోవాలని చాల ఆశగా వుండేది .ఖాళి దొరికినప్పుడల్లా సెలవురోజుల్లో సాహసయాత్రలు మా ఆటల్లో బాగం అయ్యేవి.పగడాల దీవులు,ముత్యాల దీవుల వేట అన్న మాటా .
మేము హైదరాబాద్ లో వున్నప్పుడు విజయనగర్ కాలనీ లో మా ఇంటికి కొంత దూరం లో మా అక్కచేల్లెల్లంముగ్గురం పాండురంగారావు మాస్టర్ దగ్గర ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం .మా అక్క నాకన్నా రెండు క్లాసులు ఎక్కువ చదివేదిఅంటే అక్క నాలుగో క్లాసు మనం రెండన్నమాట .ఆమె స్నేహితులు మమ్మల్ని పిల్లకాయల్ల చూసేవాళ్ళు,అందుకని వాళ్ళు కొంచెం ముందుగా గ్రూప్ గా నడిచేవాళ్ళు .చెల్లి నేను ఒక్క క్లాస్సే,తను నాకన్నా ఒక్క సంవస్తరం చిన్నది ,మరి మా ఇద్దర్ని ఎలా ఒకటే క్లాస్ లో చేర్పించారో తెలీదూ,ఇద్దరికీ కలిపి ఒకటే తట్ట బుట్టాను.(అనక నేను డబల్ ప్రమోషన్ కొట్టి తనకన్నా ముందుకి వెల్లిపోయననుకోండి మరల పీ.జి లో చచ్చినట్లు కలిసే చదివాం ) మా చెల్లి కి నాకు కలిపి ఒకటే అల్యూమినియం బాక్స్ వుండేది అందులోనే ఇద్దరి పుస్తకాలు వుండేయి.ట్యూషన్ నుండి వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు వంతులవారిగా మోసేవాళ్ళం.
ఒకరోజు మేమంతా ట్యూషన్ అయ్యాక ఇంటికి వస్తుండగా రోడ్ వార అల్లంత దూరం లో ధగ ధగ మెరుస్తూ (ఎండకి)వజ్రాలు కనబడ్డాయి,చెల్లి నేను ఒక్కసారే చూసాం,అక్క అవేమి పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ మా ముందు నడుస్తుంది .అక్కని ఆగమంటే వాళ్ళంతా చూసేసి వాటాఅడుగుతారని ఇద్దరం అక్కడే ఆగిపోయాం,అక్క కొంత దూరం పోయాక నేనే అరిచి చెప్పాను ,మా కోసం కమ్యునిటీ హాల్ దగ్గర ఆగమని,...అక్కకి తెలిసి నేను ఏ గోడవార పూలు కోస్తానికో అనుకుని ,వెనక్కి తిరిగి నాకు వార్నింగ్ ఇచ్చింది ,'మరల యే గండు చీమనో చేతికి పట్టించుకుని వస్తే మాత్రం తీయను,తరువాత నీ ఇష్టం'అని ముందుకు వెళ్లిపోయింది . చెల్లికి నాకు కళ్ళు పండుగే పండుగ,మొదట కనపడినవి కాక దానికి కొంచెం దూరం లోనే కుప్పగా వజ్రాలు పోసివున్నాయి .నేను పుస్తకాల పెట్టె ఖాళి చేసేసి పుస్తకాలు చెల్లి చేతిలో పెట్టి ఆ డబ్బా నిండా నింపుకుని మాకోసం ఎదురు చూస్తున్న అక్కని దాటుకుని ఇద్దరం ఇల్లు చేరేము,వాటిని ఎక్కడ దాచాలో మాకు సమస్య అయ్యి పెరటిలో వున్నా మామిడి చెట్టు మూలలో పోసి ఇసుకతో కప్పి పెట్టాము . ఖాళి చేసిన పుస్తకాల పెట్టి పట్టుకుని ఇద్దరం ఇల్లు గేటుతుంటే మా అమ్మ ఇద్దర్ని కేకవేసింది,'ఎక్కడికి మళ్ళాపెట్టె పట్టుకుని బయలుదేరారు 'అని.మా అక్క మాకు ఎదురు రానే వచ్చింది అంతలోపు..మా దగ్గర సమాధానం లేకఆ రోజుకి విరమించుకున్నాం .మా అక్కని తీసికెళ్ళి పెరటిలో దాచిన వజ్రాలు చూపించాం రహస్యంగా,అక్క వాటిని చూసి ముచ్చటపడింది కాని ఇవి వజ్రాలు కావేమోనని సందేహం వెలిబుచ్చింది,అయినా అక్కడ మిగిలినవి కూడా అక్క బాక్స్ లోను మా బాక్స్ లోను నింపి తెచ్చేయాలని ఆలోచన చేసాము.ఆ రాత్రంతా మా కబుర్లు అవే ,మిగిలినవి అక్కడ వుంటాయో ఎవరైనా పట్టుకు పోతారోనని .మరునాడు ట్యూషన్ కి వెళ్ళే దారిలో వాటికోసం చూసాం ,మిగిలినవి అన్నీ అలానే వున్నాయి .మా ట్యూషన్ కావడం ఆలస్యం అక్క బుక్స్ బాక్స్ నుండి తీసేసి ,మా బుక్స్ కూడా అక్క చేతిలో పెట్టి ముందుగా వెళ్ళిపోయి రెండు డబ్బాల నిండుగా చెమటలు కారుకుంటూ నింపుకుని మా స్థావరం లో పోసాము .ఈ విషయం చాల గుట్టుగా మా అమ్మకి తెలియనీయకుండా జాగ్రత్తపడ్డాము,బహుశ కథల ప్రభావం వల్ల సీక్రెట్ గా వుంచామేమో ఇప్పటికి అర్ధం కాదు . మొత్తానికి మేమేదో సాహసం చేసి వజ్రాలు సంపాధించుకున్నట్లు ఘనంగా బావించాము .
ఒక ఆదివారం పెరట్లో మేము నల్గురం ఆడుకుంటూ ఆలీబాబా సినిమాలో లా వజ్రాలు లేక్కలేసి కొలుద్దాము అని మొత్తం ఇసుకనుండి త్రవ్వి మా ఇంట్లో భియ్యం కొలిచే సోల తో కోలుస్తుండగా మా చిన్ని చెల్లె రెండేళ్లది మా దగ్గరకి ఆడుకోవటానికి వస్తే దాని రెండు బుల్లి చేతుల నిండా వజ్రాలు పోసాను మురిపెంగా.అది రెండు గుప్పెళ్ళనిండుగా పుచ్చుకుని మా దగ్గరనుండి ఎప్పుడు ఇంట్లోకి వెళ్లిందో గమనించలేదు ,మా అమ్మ కంగారు పడుతూ మా దగ్గరికి వచ్చి ,' చంటిదాని చేతికి గాజుపెంకులు ఎవరిచ్చారు,ఎక్కడివి అవి ,నాన్న విడిపిస్తున్న వదలడం లేదు'అంటూ ఆందోళన గా అడుగుతూనే మేము ఆడుతున్న వజ్రాలను చూసి కెవ్వున అరిచింది ,ఎంటివి ఇక్కడికి ఎలా వచ్చాయని ...ఆ క్షణాన మాకేం అర్ధం కాలేదు ,..'ఇవి వజ్రలమ,నేనుచెల్లి తెచ్చాం 'అని గర్వంగా చెప్పాను .ఇంతలో మా నాన్న రావడం చెల్లిని ఎత్తుకుని ,దాని చేతిలోవి నాన్న చేతిలో వున్నాయి...నాన్న ని చూసి అమ్మ మొత్తం కథ చెప్పడం నాన్న మొఖం చాల కోపంగా పెట్టుకుని ,మా అమ్మ ని బాగా తిట్టారు పిల్లలు ఎమ్చేస్తున్నారో కనీసం గమనించడం లేదని...అనక మా ముగ్గుర్ని విచారించి మా అక్కని అందరిని లోపలి పొమ్మని నన్ను చెల్లిని అలానే నెల మీద మోకాళ్ళ మీద సాయంత్రం వరకు కూర్చోమని ,నాన్న చైర్ తెచ్చుకుని పెరట్లో మా ఎదురుగానే పేపర్ చదువుతూ కూర్చున్నారు,మధ్యమధ్యలో 'ట్యూషన్ కి పంపిస్తే అవలాగా పెంకులు ఎరుకుంటార'అనిసుప్రభాతం చదువుతూ మద్యాహ్నం భోజనాల సమయానికి ఇద్దర్ని లేపి ,మరొక్కసారి అలాటివి చేయకూడదని హెచ్చరించారు ,హెచ్చరించ్డమే కాక మా భ్రమలు తొలగించారు ఆ 'వజ్రాలు'ఏమిటో వివరించారు.
ఇంతకి మేము సంపాధించుకొచ్చిన 'వజ్రాలు' ఒక లారీ ఆక్సిడెంట్ అయినా తాలుక గాజుముక్కలూ .,లారీ ముందున్న అద్దం పగిలి నుజ్జుగా అయ్యి స్పటికం లా చిన్న చిన్న మెరిసే రాళ్ల లా వున్నాయి,కొంచెం గట్టిగ పట్టుకుంటే చేతులు కూడా తెగుతాయి ..రోడ్ల మీద ఇప్పుడు అలాటివి కనబడిన చెల్లికి నాకు అవే జ్ఞాపకాలూ ,అప్పుడప్పుడు తలుచుకుని నవ్వుకుంటాం.ఎంత అమాయకమైన రోజులో తిరిగి అక్కడికి వెళ్లి పోవాలని అనిపిస్తుంది.