అదే నీవు.... అదే నేను
అదే గీతం.... పాడనా
కథయినా...... కలయినా
కనులలో...... చూడనా
కొండ కోన గుండెల్లో
ఎండవానానయినావు
గువ్వా గువ్వా కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహమూ... అదే మొహమూ
ఆది అంతం ....ఏది లేని.... గానము
నిన్న రేపు సందెల్లో నేడైవుందామన్నావు
కన్నీరయిన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా ....అదే ఆశగా
యెన్నినాళ్ళు నిన్న పాటే పాడను .
30, జనవరి 2010, శనివారం
26, జనవరి 2010, మంగళవారం
చేదు జ్ఞాపకం
రిపబ్లిక్ డే అనగానే నా మనస్సు తొమ్మిది యేళ్ళు వెనక్కి పరిగెట్టి కొద్ది క్షణాలు మనస్సు చేదేక్కుతుంది. నాడు భారత దేశాన్ని భుజ్ తదితర ప్రాంతాల్ని తీవ్రంగా కుదిపేసి తీవ్రమయిన భూకంపం కొన్ని క్షణాల్లోనే వేలాది ప్రాణాలు బలి తీసుకుంది. ఆనందం గా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న చిన్నారులు స్కూలు శిధిలాల క్రింద నలిగిపోయారు ,భయంకర మయిన వ్యధలు ..గాధలు ఇప్పటికి తేరుకొని కోలుకొని అనాధలు ..ప్చ్ .చాలాకాలం వెంటాడిన ఆ సంఘటనలు ...మనవంతు ఎంత చేసిన అది అత్యల్పమే ...ప్రక్రుతి ముందు అల్పులమే ...ఆనాడు అసువులుబాసిన చిన్నారులకి ,పెద్దలకి నా ప్రగాడ "నివాళి ".
21, జనవరి 2010, గురువారం
బ్లాగ్ లోకం -బంగారులోకం ముగింపు
బ్లాగ్ మిత్రులు భా.రా.రె బంగారులోకం మూడవ భాగం కూడా రాసి నూరు టపాలు పూర్తి చేయమని సలహా ఇచ్చారు .నిజానికి నేను చాల రాసినదాన్నే ఎందుకులే గొడవలు క్లుప్తంగా నాలుగు ముక్కలు రాస్తేపోలా అని ముగించేసాను .నావి వంద అని వారు చెప్పగానే వెళ్లి కౌంట్ చేసాను ....ఒక్కసారే నవ్వు వచ్చింది ..అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన పద్యం లీలగా గుర్తొచ్చింది .,"గంగి గోవుపాలు గరిట డయిన చాలు ....కడివిడయిన నేమి ఖరము పాలు "అన్నట్లు..మనం తోచనప్పుడల్లా నాలుగయిదు లైన్లు గెల్కి దానికి వంద లోకి ప్రవేశామా ! దానికి తగ్గట్లు మిత్రులు ముందస్తు శుభాకంక్షలా !
బ్లాగ్ లోకం -బంగారులోకం కొనసాగింపు తానోవ్వి నొవ్వక యెం రాయాలా అని ఆలోచిస్తే ''నిగ్రహం లేక నియంత్రణ" గుర్తొచ్చింది. ఇంకోమాటలో ఆత్మనిగ్రహం అనుకొందాం .నాకు నిగ్రహం అనగానే "ప్రవరుడు"గుర్తొస్తాడు .ప్రవరుడికి ఉన్నంత నిగ్రహం వుండాలని ..ప్రవరుడు ఎవరా అంటారా ?మా చుట్టం కాదండోయ్ ..(నేను రాసేది పండితులకు కాదని మనవి ) ప్రవరుడెవరో అతని ఆత్మా నియంత్రణ యేపాటిదో నాకు తెలిసిన కథ కొంచెం చెప్తాను .
పెద్దన రాసిన మహా ప్రభంధం "స్వారోచిష మను సంభవం" మన వాడుకలో 'మను చరిత్ర ' హీరో ప్రవరుడు -:) ఈ విప్రకుమారుడి ఊరి పేరు అరుణాస్పదం.చాలా బుద్దిమంతుడు ,ఇక చెప్పాలంటే సద్గుణ సంపన్నుడు .రోజు పూజ పునస్కారం ,ఇల్లు చక్కదిద్దుకుంటూ వుండగా ,ఒక రోజు వయసులో చిన్న అయిన "సిద్దుడు "లోక సంచారం చేసి మన హీరోగారి ఇంటికి వస్తాడు .వచ్చిన అతిధికి మర్యాదలు చేసి "స్వామి తవరికి ఇంత జ్ఞానం యల వచ్చింది ,ఏయే ప్రదేశాలు ,గిరి వన సముద్రాలు చూసారు చెప్పండీ ,అదీ ఇంత చిన్న వయస్సులో ,ఇంత స్వల్ప వ్యవధిలో ప్రపంచాన్ని ఎట్లా చుట్టారు (బ్లాగ్లంటే ఏంటి అని యల చూడాలో అని నేను అన్నట్లుగా అన్నమాట )అని ప్రవరుడు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు .అపుడు ఆ సిద్దుడు ,తనకి ఈశ్వరుని కృపచే పాద లేపనం అనే దివ్యవుషధం లభ్యం అయ్యిందని,ఆ ప్రభావంతో మనో వాయువేగంతో అన్ని ప్రదేశాలు సంచరించవచ్చని(అంతర్జాలం లా) తను చుసిన ప్రదేశాలు వర్ణించి చెబుతుంటే మన ప్రవరుడు కూడాచూడాలనిపించి తనకి కూడా ఆ దివ్యవుషధంఇమ్మనితను చూసి పుణ్యం తెచ్చుకుంటానని సిద్దుడిని కోరతాడు . సిద్దుడు దంతపు భరిణ తీసి పాదలేపనం ప్రవరుడి పాదాలకి పూసి వెళ్తాడు . ప్రవరునికి ఎప్పటినుండో "హిమవత్పర్వతం" చూడాలని కోరిక అనుకున్నదే తడవు అక్కడ వాయువేగం తో వాలిపోయాడు .
ఆ హిమవన్నగా సౌందర్యం చూసి ప్రవరుడు మైమరచికొండకొలను చెట్టుపుట్టల్లోతిరుగుతూ సూర్యకాంతి నడినెత్తికి వచ్చేసరికి ఉలిక్కిపడిఇల్లు గుర్తుకి వచ్చి తన నిత్య కృత్యాలు గతి తప్పుతాయేమోనని బెంగపడిఇంటికి వెళ్ళడానికి వెనక్కి మళ్లుతాడు.హిమపర్వతం మంచు వలనఎండ వేడికి సిద్దుడు రాసిన లేపనం కరిగిపోయి ఇల్లు చేరు దారి మరచిపోతాడు .యేల ఇల్లు చేరాలో తెలియక చింతా సాగరం లో మునిగి తన ఇంటికి దారి ఎవరైనా చెబుతారేమోనని వెదుకు చుండగా ,గరుడ పచ్చలతో పొదగబడిన భవనం లో వీణమీటుతున్న ఒక దేవకాంతని చూస్తాడు .ఆమె సౌందర్యానికి చిత్తుడై ఇలా అంటాడు
ఎవ్వతే నీవు భీత హరిణేక్షణ ! భయం లేకుండా ఇక్కడున్నావు ,మా ఊరి దారి మరిచిపోయాను దారి చెప్పి పుణ్యం కట్టుకో అని ..అప్పటికే ఆ దేవకన్య ప్రవరుడిని చూసి ప్రేమలో పడిపోయి కావలేనే పలకరిస్తున్నాడనుకొని,..ఇంతలు కన్నులుండ దేరు వెవ్వరి వేడెదు? ఏకాంతం లో వున్నా జవరండ్రని నెపం మీద పలుకరిస్తున్నావు అని ప్రవరుని పయి తనకి కలిగిన ప్రేమ ,మోహాం నిసిగ్గుగా
ఈ విధంగా వెల్లడిస్తుంది ..."నిక్కము దాపనేల ?ధరణి సురనందన !యింకా నీ పయిం
జిక్కె మనంబు నాకు ,నను జిత్తజుభారికి నప్పగించేదో?
చొక్కి మరంద మద్యముల చూరల భాటలు వాడుతేంట్ల సొం
పెక్కిన ,యట్టిపూవు బోదరిండ్లను గౌగిట గారవించేదో?
అప్పుడు మన కథానాయకుడు ,తప్పు ఏదో బుద్ధి గడ్డి తిని ఇక్కడ ఏమేమి వింతలున్నాయో చూడటానికి వచ్చాను ,నాకోసం ఎదురు చూసే బంధు జనాలు వున్నారు ,నాకు చాలా భాద్యతలు వున్నాయి వెళ్లి నా పనులు నేను చూసుకోవాలి ...చూడటానికి వచ్చానే కాని ఉండటానికి కాదు అని .....మత్తు వదుల్చుకొని "అగ్ని దేవుడిని "ప్రార్ధించి తన నిజమందిరం కి చేరిపోతాడు .
అది ప్రవరాఖ్యుని నిగ్రహం .....తాత్కాలిక ఆనందాలకి లోనయితే నిత్యకర్మ కలాపాలు భంగం అవుతాయని అది ధర్మం కాదని మన ప్రవరుడు చెబుతున్నాడు ...-:):)
ఇది చదివినవారు ఎవరికి తోచినరీతిలో వారు తీసుకోవచ్చు ........చివరికి చెప్పొచ్చేది ఏవిటంటే "సెల్ఫ్ కంట్రోల్ ".......దేనికిని ఎడిక్ట్ కాకుండా .కళ్ళ ముందు "లాప్ టాప్ " కనబడిన ,మనం ఎంత విశ్రాంతిగా వున్నా నియంత్రించుకున్న సమయంలోనే అటు చూడాలని-:):) ..చివరిగా ఒక మాట ,రాసినదంతా నాలాంటి వారికోసమే సుమా !పెద్దోళ్ళ కోసం కాదు .
20, జనవరి 2010, బుధవారం
బ్లాగ్ లోకం -బంగారులోకం ......
బ్లాగ్ ల వలన ప్రపంచంలోని సమాచారం మెరుపుకన్న వేగంగాతెలుసుకోగలుగుతాం ,అనేక మంది భావసారుప్యం వున్నా వ్యక్తుల్ని అంతర్జాలం ద్వారా కలవడం చర్చించడం విషయసేకరణ కి అవకాశం కలుగుతుంది .వార్తపత్రికల కన్నా మిన్నగా ఒక అంశం గురించి రాసినపుడు భిన్న కోణాల్లో అభిప్రాయ వ్యక్తీకరణ వెరసి అన్నిటికి మంచి వేదిక .రాజకీయ ,ఆర్ధిక సామాజిక ,సాహిత్య చర్చలు నిరంతరం ఒక చోటే నిత్యనూతనంగా అందుబాటులోవుంటాయి . పరోక్షంగా విజ్ఞానం పంచి పెంచడంలో బ్లాగ్స్ దోహదపడుతున్నాయి .
ఇక చెప్పాలంటే బ్లాగ్స్ రాసే వ్యక్తులు చాలా వరకి అజ్ఞాతంగా వుంటారు .కాని ఈ అజ్ఞాతంలో ఎన్నో వర్గ ,వర్ణ వైషమ్యాలో.ఇవి ఎంతవరకంటే వ్యక్తిగత దూషణల వరకి వెళ్ళడం వరకి వుంటుంది .తెలియని ప్రపంచంలో తెలియని వ్యక్తుల మీద కూడా విషం వెదజల్లే వర్గాలు వుంటారు అవకాశం దొరికినపుడు అవహేళన చేస్తారు ,పోనీ వారేమైనా మేధావులా అంటే అదీను కాదు ..నేను గమనించినంత వరకి విషయ పరిజ్ఞానం తో రాసేవాళ్ళు చాల తక్కువ .చాలవరకి పై పైన రాసేవాళ్ళే ఎక్కువ (నాలాగ-:) ) బ్లాగ్ ని డైరీ లా రాసేవాళ్ళ గురించి కాదు ఈ వ్యాఖ్యలు ..
బ్లాగ్ లో నా ప్రవేశం అనుకోకుండా జరిగింది . బ్లాగ్ డిజైన్ చేసి దానికి ఒక పేరు పెట్టడం అంత నా ఫ్రెండ్ తో కలిసే చేసాను .సాద్యమైనంతవరకి మన వివరాలు గోప్యంగా ఉంటేనే మంచిది అనిన తన మాటకి "ఏమవుతుంది తెలిస్తే "అని మొండిగా వాదించిన సందర్భం లేకపోలేదు ....కాలక్రమేణ నాకే తెలిసి వచ్చింది ,తెలియకపోయినా అవకాశం తీసుకుని బురదలు జల్లే వ్యక్తులు ఇక తెలిస్తే బ్రతకనివ్వరని.స్వేచ్చగానచ్చినట్లు రాసిన ,జ్ఞాపకాలు ,అనుభవాలు ఆయా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో పారడిలుగా ప్రాణం పోసుకుంటాయి .వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కూడా ఇదే వేదిక అనుకోవచ్చు
బ్లాగ్ లు రాయండి ,తెలుగును ప్రోత్శాహించండీ అంతర్జాలం లో సాహిత్యాభివ్రుద్ది చేయండీ అంటే బాగానే వుంది కాని విపరీత పోకడలతో రాసే బ్లాగ్స్ ని అదేవిధంగా డిస్కరేజ్ చేయకపోవడం ప్రధానలోపం
బ్లాగ్ మొదలెట్టడం అంటే నెట్ కి అడిక్ట్ కావడం లానే గమనించాను ,.కచ్చితంగా అందులో మంచి చెడు రెండు వుంటాయి వాటి వలన గొప్పగా ఒరిగేది ఎమిలేకపోయిన నిజ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి .వీటిపై వెచ్చించే సమయం పరిమితంగా ఉంటేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాను .చూడాలి ఎంతవరకి నియంత్రణ చేయగలనో ...ఈ నెట్ అడిక్షన్ సిగరెట్లు,కాఫీ ,మత్తు పానీయాలు లాటిదే అనికూడా నా అనుమానం ...ఇది "బంగారు లోకమా "?....అనుమానమే........ ..
18, జనవరి 2010, సోమవారం
"బ్లాగ్ లోకం -బంగారు లోకం "???????
"బ్లాగ్ లోకం -బంగారులోకం " అని సరిగ్గా తొమ్మిది నెలల క్రితం(ఏప్రిల్ ) పోస్ట్ రాసాను ,అప్పటికి నేను బ్లాగ్ రాయటం మొదలెట్టి రెండునెలలు అయ్యింది .అప్పట్లో టైం చాల వేస్ట్ చేస్తున్నాను అనే బెంగ ఒక ప్రక్కన చూడకుండా ఉండలేని పరిస్థితి మరోప్రక్కన .అప్పట్లో చాల మంది చాల రకాలుగా సలహాలు ఇచ్చారు .ఏదో క్రొత్త కాబట్టి ఇలా అంటున్నారు మరో మూడు నెలలు ఆగి అభిప్రాయం చెప్పమన్నారు .బ్లాగ్ చదవడం ,రాయడం అంటే విముఖత కలగలేదు కాని నా దైనందిన జీవితంలో మాత్రం మార్పులు కలిగాయి .ముఖ్యంగా నేను అమిత ఇష్టంగా చదివే పుస్తకాల నుండి కొంత దూరం అయ్యి వాటి స్థానే బ్లాగ్ ఆక్రమించింది రెండు నా పూల మొక్కల ఆలనాపాలనా నిర్లక్ష్యం చేయడం జరిగింది అలాగే అద్దంలా మెరిసే నా ఇల్లు కొంచెం మసకబారింది వస్తువులు స్థానబ్రంశం చెందితే కలవరపడే నేను నిర్లిప్తంగా తయారయ్యానుఆఫీసు వర్క్ మీద కొంత ప్రభావం చూపింది నాలో కొంత నిర్లక్ష్యం ఏర్పడింది .నా కళ్ళచుట్టూ డార్క్సర్కిల్స్ ఏర్పడుతున్నాయి అలసట వలన.
ఇవండీ నా ఆత్మాపరిశీలనలో తేలిన నెగిటివ్ అంశాలు . నన్ను నేను నియంత్రించుకోవడంలో కొంత వరకి సఫలం అయ్యాను .నా ఆఫీసు పని కి అంతరాయం కలగకుండా పూర్తిగా ఆఫీసు సమయంలో కూడలి ,జల్లెడ హారం చూడటం మానేసాను అసలు బ్లాగ్ అనేదాన్ని తెలియనట్లే ఉంటున్నాను .ఎటొచ్చి ఇంటికి వచ్చాక మాత్రం వీలున్నప్పుడల్లా ఓపెన్ చేస్తున్నాను .ఇది కూడా నియంత్రిన్చాలనే ఆలోచనలో వున్నాను .
.బ్లాగ్ ల వలన మనసుకి నచ్చిన మిత్రులు కూడా కలిసారు...బహుశ ఈ బ్లాగ్ లోకం లోకి అడుగుపెట్టకపోతే నాకు పరిచయం అయ్యేవారు కాదుగా .....
అసలు బ్లాగ్ లోకం బంగారులోకమా అని తరచి తరచి నేను రకరకాల బ్లాగ్స్ చదువుతుంటే నేను గమనించినవి కొన్ని ....(రేపు)
9, జనవరి 2010, శనివారం
మంచి మాటలు
"life needs money
but money is not life"
"the correction of mistake"is the first step to success.
if you are honest and frank,people may cheat you;
be honest and frank anyway
give the world the best you have,and it may never be enough;
give the world the best you've got anyway.
8, జనవరి 2010, శుక్రవారం
మా అమ్మాయి "అమ్మమ్మ"అయ్యింది
మా అమ్మాయి అమ్మమ్మ అయ్యిందంట .ఎంతో సంబరపడిపోతుంది.అప్పుడే పుట్టిన ఆ పిల్లలు చక చక చుట్టూ కలయ తిరుగుతున్నాయి ఆ ఇల్లంతా ముందే తెలుసన్నట్టు ఆ నీళ్ళలో పై నుంచి క్రిందికి విన్యాసాలు చేసేస్తున్నాయి .మా పాపమద్యహ్నం నుంచి ఒకటే హడావిడి పడిపోతుంది .పెద్ద టబ్ లోనుంచి సదరు "మీనాకుమారి "ని వేరు చేసి గాజుగోళం(ప్రసూతి రూం )లోకి మార్చి తను చదువుకునే టేబుల్ మీద పెట్టుకుని ఎదురుగా తెరిచి ఉంచిన పుస్తకం కన్నా కళ్ళన్నీవాటి మీదే పెట్టుకుని మొత్తానికి గంపెడు పిల్లల్ని కళ్ళతో చూసింది .బుల్లిగా తోకలాడిస్తూ భలే ముద్దోస్తున్నాయి .అరగంట నుండి అందరికి కాల్ చేసి మరి చెబుతుంది తన "రంగు చేపల"ముచ్చట్లు .నా బ్లాగ్ ప్రపంచానికి చెప్పమంది ,తను అమ్మమ్మ అయ్యిందని .-:)
శ్రీవారు -డైరీలు
కొత్త సంవత్సరం రాబోతుందంటే మా గవర్నమెంటు ఆఫీసులో డిసెంబర్ నెల మద్య నుండే సందడి మొదలవుతుంది గ్రీటింగ్ కార్డ్స్ ,డైరీలు పంపడం తీసుకోవడం లాటివన్నమాట.నేనైతే రెండు మూడేళ్ళ నుండి కార్డ్స్ పంపడం కూడా తగ్గించేసి ఫోన్ల మీద ,షార్ట్ మెస్సేజెస్ మీద నడిపేస్తున్నాను .గతం లో ముఖ్యమైన వారికి ఎక్కడున్నా ఫ్లవర్స్ కొరియర్ ద్వారా పంపేదాన్ని అలానే నాకు ఎవరు ఫ్లవర్స్ ఇచ్చిన ముచ్చటపడి తీసేసుకునేదాన్ని చక్కగా వాటిని వారం రోజులు పోషణ చేసి కాపాడుతుంటాను .గత తొమ్మిది యేళ్ళగా మొట్టమొదటి డైరీ ప్రముఖ దినపత్రిక నుండి అందుకుంటున్నాను ఆ తరువాతే మిగిలినవారి నుండి ....డైరీ లను చూస్తుంటే చాల ముచ్చటగా అనిపిస్తుంది అలా అని అన్నింటిని వాడలేముకదారెండు మూడు వుంచేసుకుని కావలసిన వారందరికీ పంచేస్తుంటాను .
మావారిది క్లైంట్స్ ని ఆకర్షించుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే వుద్యోగం ,వాళ్ళు తరువాతి ఏడాదికి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కొత్త సంవత్సరం రోజు వాళ్ళని తగిన రీతిలో సత్కరిస్తుంటారు పూలు ,పళ్ళు డైరీలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు .ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నాదగ్గర ఏతావాతా చాల డైరీ లు మిగిలి ఉంటాయికదా మావారు వాటిని జాతీయం చేసి (పాపం అడుగుతాడు ) చక్కా వాళ్ళ క్లైంట్స్ కి ఇస్తుంటారు .అలానే ఈ ఇయర్ కూడా నా దగ్గర కొన్ని తీసుకున్నారు .
ఈ రోజు ఉదయం నేను హడావిడిగా బయటికి వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గరకి వచ్చి రెండు పేపర్లు (రెండు పేజీలు )నా చేతికి ఇచ్చి "ఇదిగో నిన్న నరసింహారావుగారు పంపారు ,నీవు ఏదో రాసుకున్నావు "అన్నారు . నేను రాయడం ఏవిటాఅని అర్ధం కాక ఆ పేజీలు చూసేసరికి నా బుర్ర గిర్రున తిరిగింది ,అది నా చేతి రాతే డిసెంబర్ ఇరవయ్యి ఆరు ,ఏడు తారికుల్లో రాసాను కొత్త డైరీలో చివరి పేజీలు . ఒక పేజిలో డిపార్టుమెంటు సభంధించిన డేటా అది హెడ్ ఆఫీసు నుండి కాల్ వస్తే ఎదురుగా ఏమి దొరక్క పై అధికార్ని వెయిట్ చేయించే ధైర్యం లేక గబగాబ ఎవరో ముందే ఇచ్చిన డైరీలో నోట్ చేసుకుని ,ఇంఫర్మషన్ పాస్ చేసాను ఇంకొక పేజిలో ఒక ఫ్రెండ్ పూజ విధానం ఫోనేలోనే చెబితే రాసాను ఎదురుగా వుంది కదా అని ,ఆ తరువాత ఆ పేజీలే మరచిపోయాను ,అన్ని డైరీల తోపాటు అది కలసిపోయింది .మావారు తీసుకున్న డైరీల్లో ఇదికూడా వుండి సదరు నరసింహం గార్ని చేరి ,మావారిచ్చిన డైరీ చూసుకుని ముచ్చటపడి నిన్నో మొన్నో పేజీ లు త్రిప్పి పాపం నా మీద జాలిపడి జాగ్రత్తగా ఆరెండు పేజీలు మావారికి అందచేసారు "మీ మేడం గారు ఏదో నోట్ చేసుకున్నారు " అంటూ.ఒక్క క్షణం తెల్లబోయి తరువాత పడిపడీ నవ్వాను .పాపం అయన ఏం అనుకున్నారో వాడేసిన డైరీ తెచ్చారనుకున్నారో అని మా శ్రీవార్ని ఎదురు ఆటపట్టించాను .ఉడుక్కుంటూ ఇష్టం వచ్చినట్టు రాసేయడమేనా చిన్నపిల్ల లాగ అని ఎదురు దాడి కి దిగారు . ఇక నుండి జాగ్రత్త పడతారేమో చూడాలి -:)
2, జనవరి 2010, శనివారం
మరో జన్మంటూ వుంటే గోపిచంద్ కలంనవుతాను
మరో జన్మంటూ నిజంగా వుంటే గోపిచంద్ కలం గా పుడతాను .ఆయన పాదాధూళిగానైన అవుతాను
.ఈ మాటలు నేను అంటున్నాను అనుకుంటున్నారా !కాదండీ ప్రముఖ రచయిత డా.రావూరి భరద్వాజ
భావోద్వేగాలతో పలికిన పలుకులు ఇవి .
విజయవాడలోని ఇరవయ్యి ఒకటవ పుస్తక మహోత్సవ సభలో 'సాహిత్య వేదిక'లో ఈనాటి సాయంత్రం ఆరున్నర గంటలకి
కీ.శే .శ్రీ .గోపిచంద్ శతజయంతి సభ జరిగింది .వారి కుమారుడు సిని నటుడు సాయి చంద్ అధ్యక్షులుగా ,రావూరి ,మృణాళిని
వక్తలుగా పాల్గొన్నారు .సాహిత్య సభ నిండుగా సాహిత్యాభిమానులతో కళకళ లాడింది ..రావూరి భరద్వాజగారు మాట్లాడుతూ
ఆయనని అన్నం పెట్టిన దేవునిగా కొనియాడారు .సమయపాలన గురించి గోపిచంద్ గారి దగ్గర నేర్చుకున్న అనుభవం ఎంత కచ్చితంగా పాటించారంటే తన (రావూరి ) అర్ధాంగి చనిపోయిందన్న వార్త ఆఫీసు లో వుండగా తెలిసిన , ఆఫీసు సమయం ముగిసిన తరువాతే వెళ్లనని చెప్పిన వారి మాటలకి సభికులంతా కరతాళద్వనులతో ఆయనని అభినందించారు .చాల వరకి గోపిచంద్ తో వారికి వున్నా అనుభవాలని పంచుకున్నారు .చివరిగా తన ప్రసంగంలో 'గోపిచంద్ సాహిత్య పీఠం'ఏర్పాటు చేస్తే చిరస్మరణీయం గాను ఉంటుందని వారి కుమారుని కీ ప్రతిపాదించారు ,తన వంతు విరాళం ఐదు వేల అయిదువందల ఎభయ్యి ఎనిమిది అప్పటికప్పుడే ప్రకటించారు
శ్రీమతి మృణాలిని గోపిచంద్ కథ పరిణామం అసమర్ధుని జీవన యాత్ర నుండి రూపుదిద్దిన విధానం ,తాత్త్విక ద్రుక్పధం ,వివిధ కథలను ఉదహరిస్తూ ప్రసంగించారు .
అద్యక్షత వహించిన సాయి చంద్ సాహిత్య పీఠం తప్పక నెలకొల్పుతానని ప్రకటించారు .ఈ సభ కీ ఇంతమంది అభిమానులు వస్తారని ఊహించలేదని 'బెజవాడ 'అంటే బెజవాడ అనిపించారు అని తన కితాభునిచ్చారు చల్లని చలిగాలిలో ఉద్వేగభరితమైన ప్రసంగాలు వింటూ విశ్రాంతిగా కుర్చీలో చేరగిలిబడి కాసేపు ప్రపంచాన్ని మరిచిపోయాను .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)