23, ఫిబ్రవరి 2011, బుధవారం

ఫనా లో ఇష్టం అయిన పాట

ఎంత ఇష్టం అయిన సినిమా అయిన పదేపదే చూసేవి వేళ్ళలో లెక్కపెట్టవచ్చు .పాటలు మాత్రం వందల్లో వింటాను .అలా లెక్క పెట్ట దగిన సినిమా లో ''ఫనా ''చేరుతుంది .ఎందుకో ఎన్ని సార్లు చూసిన అప్పుడే చూసిన అనుభూతి కలుగుతుంది.ఈ పాట వినేకొద్ది వినాలి అనిపిస్తుంది .

19, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రవాహంలోప్రయాణం

ప్రవాహంలో లో నా ప్రయాణం నిన్నటినుండి మొదలయ్యింది .చాలాకాలం తరువాత తీరికగా ధియేటర్ కి వెళ్లి "అప్పల్రాజు"సినిమా చూసివచ్చాను.ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లాను కాబట్టి నాకు చాల నచ్చింది .సినిమా కామెడి కాదని ప్రారంభంలోనే ప్రేక్షకులకి తెలియజేసినప్పటికి సినిమా సగం నుంచి వేణుమాధవ్ బృందం హాస్యం పండించింది.సినిమాయలోకం,ఔత్సాహిక కళాకారుల కష్టాలు ఇలా తెరమరుగున వుండే విషయాలు విశేషాలతో ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది.సరదాగా చూడతగిన సినిమా .

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఇదే జీవితమా!

ఎందుకో నా ఆలోచన ధోరణిలో రాను రాను మార్పు కనిపిస్తుంది.ఒకప్పుడు వున్నపోటీ తత్వం ఇప్పుడు ఉండటంలేదు ప్రతిపనికి ఇప్పుడు చేయకపోతే నష్టం ఏవిటి నేనే ఎందుకు చేయాలి చేయకపోతే వచ్చే పరిణామాలు ఏవిటి ఇలా సాగిపోతుంది ....నావరకు ఫరవాలేదు కాని నాకున్న ఒక్కగానొక్క బిడ్డ మీద కూడా నా ప్రతికూల ఆలోచనలు ప్రసరిస్తున్నాను.ఒకప్పుడు విపరీతంగా ప్రోత్సహించిన నా నోటి తోనే అంత కష్టపడకు సర్వీసులు తెచ్చుకోవడమే జీవితం కాదువేరే వైపు కూడా జీవితం వుంది ఇంకా నచ్చినట్లు జీవించవచ్చు అని హితవులు పలుకుతున్నాను .నాకులా తను ఎందుకు ఇబ్బంది పడాలి అంత అవసరమాఅని నా మనస్సు ఎదురు తిరుగుతుందికొన్ని సౌఖర్యాలు అధికారాల తోపాటు ఎన్నో అసౌఖర్యాలు మనస్సుకి నచ్చనివి కూడా భరించాలి. తినడానికి నిద్రపోవడానికి సమయం లేని పని ఒత్తిడితో కొన్నాళ్ళకి ఆరోగ్యాన్ని కోల్పోయి చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి మిగుల్చుకుంటామో అర్ధం కావడం లేదు..దీనికి ఎక్కడో చోట ఆనకట్ట వేయవలసిందే అనుకుంటాను .గతంలో ఎంతోమంది మిత్రులు ఇంతా కష్టపడాలా అని అంటుంటే వారు ఇలా నిరుత్సాహ పరుస్తున్నారు ఇదేమి ధోరణి అనిపించేది.మనకోసం మనం బ్రతుకుతూ సాధ్యమైనంత మనకున్న పరిధిలోనే సాటి మనుష్యులకు సాయపడలేమా..దానికిప్రభుత్వుద్యోగమే తోడ్పాటు కావాలా స్వచ్చంద సంస్థ ద్వారాకూడా మన అభీష్టం మేర తోడ్పాటును అందించవచ్చును కదా అనిపిస్తుంది.బహుశా అక్క కూడా ఇలానే ఆలోచించి కొన్ని నెలలుబ్రేక్ తీసుకుందేమో..హ్మం ...ప్రతిది తెలియకుండానే అక్క అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తున్న నేను తనలానే మార్పు కోరుకున్టున్నానేమో చూడాలి.నాన్న మాకు ఇచ్చిన స్ఫూర్తి మా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం ప్చ్... ..

14, ఫిబ్రవరి 2011, సోమవారం

అమ్మమ్మ ఊర్లో వాలంటైన్స్ డే సెలెబ్రేషన్స్



ఈ రోజు ''ప్రేమికులరోజు "అందరము అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరుపుకోవాలని అంతా నిశ్చయించుకున్నాము:-) .మా ఊరు చాల అందంగా వుంటుంది ఇల్లు ని ఆనుకుని పొలము తోటలు వుంటాయి.అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తాతయ్య పెద్దమామయ్య ఫ్యామిలీ వుంటారు. అమ్మమ్మ కొంతకాలం క్రితం గతించాక అక్కడికి వెళ్ళడం తగ్గిపోయింది .మా అమ్మావాళ్ళు మొత్తం ఆరుగురు వాళ్ళపిల్లలం అలానే మా పిల్లలు ఇంకా మా తాతగారి తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తానికి కలిపి ఒక వెయ్యిమందిమి ఉదయం ఎనిమిదికల్లా చేరిపోయాము.
అంతా ప్రేమికులరోజు శుభాకాంక్షలు ఒకరికొకరం తెలుపుకున్నాం (ఫలహారాలు ఆరగిస్తూ ).పదకొండు గంటల సమయంలో మాపెద్దమామయ్యా కొడుకు కి తను మూడు సంవత్సరముల నుంచి ఇష్టపడుతున్న అమ్మాయికి మా తాతయ్య అద్వర్యంలో వివాహం జరిపించారు.వైవిధ్యంగా చేయాలనీ ప్రేమికులరోజుని నిర్ణయించారు
ఆ అమ్మాయి వాళ్ళ తరుపు కొంతమంది (ఫ్యామిలీ )మాత్రమె వచ్చారు .తాతయ్య మనవాడి మనస్సు అర్ధం చేసుకుని అన్నీ తానయి నిర్వహించారు.చాలా కాలం తరువాత అమ్మమ్మ ఊర్లో చిన్నపిల్లలం అయిపోయాం .మా భాల్యమిత్రులు కూడా చాలామందిని కలిసే అవకాశం కలిగింది .థాంక్స్ టూ98 years తాతయ్య.
రోజులు ఎలా మారిపోయ్యాయో ...హ్మం .

12, ఫిబ్రవరి 2011, శనివారం

బుజ్జులు




మా ఇంట్లో ముగ్గురికి 'బుజ్జులుగాడ్ని'చూడకుండా వుండనిదే తోచడం లేదు .ఇదివరకు అటుఇటు తిరిగి వచ్చిన తొట్టెలో చేపపిల్లలు ఏమి చేస్తున్నాయో వాటికి ఫుడ్ వేశార లేదా అని అరా తీసి వేయకపోతే వేసి కాసేపు వాటితో కబుర్లు చెప్పేదాన్ని .ఇప్పుడు బుజ్జులు మా జీవితం లో అడుగు పెట్టాక బంగారు చేపల్ని నిర్లక్ష్యం చేసాము వాటిని శ్రద్ద తీసుకోవడం తగ్గిపోయి నిన్న గాక మొన్న వచ్చిన ఈ బోడి బుజ్జులు ఆక్రమించింది .ఈ బుజ్జులు ఏమి చేసిన మాకు అధ్బుతమే ఇది చాలా తెలివైనది అదేకాక చాలా క్రమశిక్షణ తో ప్రవర్తిస్తుంది ఒక్క విషయం లో తప్పించి .అదేమిటంటే కొత్తవాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళను నిలవనీయకుండా ఆనందం తో ఒక్క వుదుటున వాళ్ళ ఒడిలో చేరి గారాలు పోతుందీ మేం ఎంత చెప్పిన అస్సలు లెక్క చేయదు పైగా మీతో నాకేమి పని అన్నట్లు ఒక లుక్ వేసి వచ్చిన వాళ్ళ బుజాల మీదో చేతి మీదో తల వాల్చేసి వాలుగా మా వైపు చూస్తాది.వచ్చిన వాళ్ళు కుక్కలంటే భయం లేని వాళ్ళయితే పర్లేదు ఇబ్బంది పడేవాళ్ళతోటే మాకు ఇబ్బంది అప్పుడు వీడ్నికంట్రోల్ చేయడానికి బోల్డు కష్టపడాలి ..కట్టేసామా ఇక మమ్మల్ని మాట్లాడనీయకుండా గోల గోల దాని బాషలో గొణుగుతూ వుంటాది ఇవన్ని పడేకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు సహనం తో కాసేపు బుజ్జులు ని వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకుంటే బాగుండును అనిపిస్తుంది .పగలంతా మా పాపకి ఎదురుగా కూర్చుని చదివిస్తూ మద్య మద్యలో దానికి బోర్ కొట్టినపుడు మేడపైకి లేక ఇంటి చుట్టూషికారుకి తీసుకుని వెళ్తే సంతృప్తి పడుతూ రాత్రయ్యేసరికి సింహద్వారం ఎదురుగా కూర్చుని మారాక కోసం పడిగాపులు పడ్తువుంటుంది మాఇద్దరిలో ఎవరు ముందు వచ్చిన రెండు నిమిషాలు ఆడిరెండోవారు వచ్చే వరకు గుమ్మం వద్దనే ఎదురుచూస్తుంటది వచ్చాక ఇక ఆటలు మొదలుపెడ్తది.బుజ్జులుకి నిద్ర వచ్చిన నిద్రపోకుండా ఎవరు మెలకువగావుంటారోవాళ్ళ ప్రక్కనే కునికిపాట్లు పడుతూ చివరి లైటుతీసేవరకు వుండి ఆనక నిద్రపోతుంది .
ఉదయాన్నే మాకంటే ముందు లేచిన అల్లరి చేయకుండా మేము లేచాక ఒక్కొక్కర్నీ పలకరించి వెళ్తుంది ..బుజ్జులుకి ఆరుబయట షికార్లంటే ప్రాణం ప్రకృతిని పరవశంగా ఆరాధిస్తుంది. గాలి వీచే దిశగా ముఖం పైకెత్తి కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంది చెట్టుకొమ్మలు గాలికి కదులుతుంటే చెవులు రిక్కించి వింటూ మనకి ఏదో చెప్పాలని తాపత్రయపడ్తుంటది .చెట్టు మీద చిన్ని చిన్ని పిట్టల్నిఅటు ఇటు పరుగులు తీసే ఉడుతల్నిపూలపై వాలుతున్న తెనేటిగలను మురిపెంగా కళ్ళు ఇంతేసుకుని చూస్తాది.కాకుల్ని మాత్రం అస్సలు సహించదు అవి వెళ్ళేవరకు విసిగిస్తూనే వుంటది.బుజ్జు చీకట్లో దోమల్ని అతి సునాయాసంగా పట్టేస్తుందిపట్టినవి పట్టినట్లు గుటుక్కుమని మింగేస్తుంది.ఆల్ అవుట్ ఎందుకు దండగ బుజ్జులు చెంత వుండగా అని మా అమ్మాయి గర్వంగా అందరికి చెబుతాది.
బుజ్జు నాకు మరీ మరీ ఎందుకు ఇష్టం అంటే శ్రీవారిని అస్సలు టి.వి చూడనీయదు తను తీరికగా టివి ముందు కనిపిస్తే చాలు పద బయటికి షికారు పోదాం అంటూ సతాయిన్చేస్తాది ,బుజ్జులు కోరిక ఈయన అస్సలు కాదనరు స్పోర్ట్స్ చానల్ కట్టేసి మరీ అమ్మగారు ఎటు తీసుకుపోమ్మంటే అటు తీసుకొని వెళ్తారు ఆ రకంగా మా ఇంట్లో వెధవక్రికెట్ గోల కొంత తగ్గింది .బుజ్జులు అలిగిందంటే మాత్రం చచ్చామే ఎంత బ్రతిమాలిన దిగి రాదూ తినదు తాగదూ.చిన్న చిన్న విషయాలకే అలుగుతాది..కొంచెం పని ఒత్తిడిలో వుండి పలకరించకపోయిన సోఫా క్రిందో మంచం క్రిందో దూరి ఎంత బ్రతిమాలిన రాదూ అది తిరిగి మామూలు అయ్యే దాక దిగులు ...అసలు ఇంత అనుబంధం పెంచుకోవద్దు ఏ కారణం అయిన దూరం అయితే తట్టుకోలెం అని అనుకున్న అనుకునే కొద్ది మరింత దగ్గర అయిపోతుంది హ్మం ..

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా తుంటరి పని


ఇంట్లో అల్లరికి చిరునామా నాదే .అమ్మమ్మ ఊరు వెళ్తే ఇక నాకు హద్దు వుండేది కాదు.ఒక వేసవి సాయంత్రం స్నేహితుల తో ఆటల్లో మునిగి మద్యలో దాహం వేస్తె ఇంట్లోకి పరుగున వచ్చి(పెరటి దారి ) పెద్ద మట్టికుండ లోని చల్లటి నీళ్ళను అక్కడే బోర్లించి వున్నఇత్తడి చెంబు తో తీసుకుని గటగట కొన్ని తాగి మిగిలిన నీళ్ళను ఏంచేయాలో తెలియక తిరిగి కుండలో పోసేద్దామా అని ఒక క్షణం ఆలోచించి మనసొప్పక అటు ఇటు చుస్తే బియ్యపు డ్రమ్ము మూత తీసి కనబడింది ,అమ్మమ్మ బెడ్డలు వడ్డుగింజలు ఏరే కార్యక్రమం పెట్టుకుని బియ్యం తీసుకొని మూత పెట్టలేదు,ఇకనేం మిగిలిన చెంబులోని నీళ్ళు డ్రమ్ములో పోసేసాను..నీళ్ళు క్షణం లో మాయం అయ్యిపోయాయి అది నాకు ఆశ్చర్యం కలిగించి మరో చెంబుడు పోసాను నీరు మరల మాయం అయ్యేసరికి ఇక వరుసబెట్టి చెంబుల మీద చెంబులు పోస్తుంటే ముందు వసారాలో వున్న అమ్మమ్మ వాళ్ళు చప్పుడుకి హుష్ అంటూ పిల్లి కాని వచ్చిందేమో అని లేచి వస్తుంటే చప్పున మూత పెట్టేసి ఎంచేక్కగా బయటికి వురికేసాను ఆటల్లో పడిపోయి నేను చేసిన పని మరిచిపోయాను .
ఆ మరునాడు మా అందరకి టిఫిన్లు తినిపిస్తూ అమ్మ పిన్ని వాళ్ళు హడావిడిగా వుండగా అమ్మమ్మ "హవ్వ హవ్వ ..ఇదేమి పనమ్మా అజ్జో ఇలా అయ్యింది ..ఎవరి పని ఇది "అని మొత్తుకుంటూ పాలేరు పిల్లాడ్ని డ్రమ్ము పట్టించి వాకిట్లో బోర్లించేరు అందరం ఎమైందా అని వాకిట్లోకి వెళ్లి చుస్తే బియ్యం ఉండలు ముద్దలు ....ఒక్కసారే నేను చేసినపని గుర్తొచ్చింది.కాని నోరు మెదపలేదు .అమ్మమ్మ పని వాళ్ళనే తిట్టింది .ఎవరికేం మాయరోగం వచ్చింది తూముడు బియ్యం నాశనం చేసారు అంటూ ...నేనే అని చెబితే అమ్మమ్మ తిట్టదు కాని అమ్మ చేతిలో మాత్రం తప్పదని గుడ్లప్పచెప్పిఅలా నిలబడిపోయానుఒక ప్రక్క చెప్పేయాలని (అసలే మన నోట్లో నువ్వు గింజ నానదాయే )కష్టపడి ఆపుకున్నాను .ఆ తరువాత కొన్నాళ్ళకి అమ్మమ్మకి చెప్పేసాను సరదాగా నేనే ఆ పని చేసానని.ఇప్పటికి ఆ జ్ఞాపకానికి తడి ఆరలేదు .బియ్యం కడుగుతున్నప్పుడు అమ్మమ్మ గుర్తుకు వస్తది .