7, మే 2009, గురువారం

"చినుకు"

ప్రతి నెల "చినుకు " మాసపత్రిక క్రమం తప్పకుండ నా ఆఫీసు కి వస్తుంది ,అది ఇంటికి తీసుకెళ్ళకుండా ఏదొక టైములో ఒక్కో కథ ,వ్యాసాలు ,సమీక్షలు చదువుకుంటాను ,అలా ఎందుకంటె ఇంట్లో పనుల్లోపడి దాన్ని నెగ్లెక్ట్ చేస్తానేమోనని సందేహమన్నమాట .చినుకు పుట్టి అప్పుడే మూడవ యేడు నిండుతున్నట్లుంది .పత్రిక రాగానే నేను ముందు చూసేది నండూరి రాజగోపాల్ ఏమి రాసారా అనేది .....తను రాసే సంపాదకీయం . రవి కాంచని చోట కవిగాంచున్ అన్నట్లు ,ఆయన తొంగి చూడని అంశం వుండదని అనుకుంటుంటాను .మే నెల పత్రికలో కన్యాశుల్కం నాటకం మలిముద్రణ అయ్యి వందఏళ్ళు అయ్యిందని "తూర్పు బలబలతెల్లవారెను"అంటు ఓ చక్కని సంపాదకీయం రాసారు . ఇప్పుడు వచ్చే మంచి పత్రికలు ఏమైనా వున్నాయా అంటే వాటి ప్రక్కన "చినుకు" మాస పత్రిక పెట్టవలసిన్దేనంటాను నేనయితే .పుస్తకం వెలపది రూపాయలు మాత్రమె .
ఈ నెల పత్రికలో "ఊరాపిచ్చుకలు" కథ జ్ఞాపకాల్లోకి తరిమింది ...రచయిత్రి జి.అనసూయ అంతరిస్తున్న పిచ్చుకలను సెజ్ లవల్ల అంతరిస్తున్న ఊర్లను చక్కగా వివరించారు . కళ్ళ ముందే పిచ్చుకలు అంతరించటం చూస్తూ అయ్యో అంటూ భాద పడడం తప్పించి ఏమి చేయలేకపోతున్నాం .....పర్యావరణంలో మార్పు వల్ల అవి అంతరిస్తున్నాయి అని విన్నాను మరియు చదివాను ..పదేళ్ళ క్రితం మా ఇంటి కిటికీ లో కర్టెన్ వెనుక ఒక పిచ్చుక జంట ఉండేది ,పగల్లంతా అటుఇటు షికార్లు చేస్తూ మా పాప గదిలో డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చుని అద్దం లో చూస్కోంటూ ఎన్నో విన్యాసాలు చేసేవి ...ఎంత నిశ్శబ్దం లోను వాటి కిచకిచ లతో అదోలాటి సందడి చేసేవి ...రాత్రవగానే డైనింగ్ టేబుల్ పక్కనున్న కిటికీ లో చేరి కర్టెన్ వెనుక బుద్ధిగా ముడుచుకుని కూర్చునేవి ....ఒకరకంగా మేము ముగ్గురం వాటిని పెంచామనే చెప్పొచ్చు ...అవి మాలో భాగంగా తిరిగాయి ,,మా పాపకయితే మరీను .... వాటితో ఎప్పుడు మాట్లాడుతుండేది .ఇంటికి కలర్స్ వేసేప్పుడు వాటిని తాకోద్దని మా పాప ఎన్నో హెచ్చరికలు చేసింది పెయింట్ వేసేవాళ్ళకు ...తను స్కూల్ నుండి వచ్చేసరికి అవి తిరుగుతూ ఇంట్లో కనపడలేదని గొడవ చేసింది రాత్రికి వస్తాయిలే అని బుజ్జగించాము ,ఆందోళన పడుతూనే ...అప్పటికి ఆగింది ,,,రాత్రి బోజనంకి ముగ్గురం కూర్చొని అవి వచ్చాయేమోనని కర్టెన్ తీస్తే ఖాళి స్థలం వెక్కిరించింది ....పాప ఏడ్చి అన్నం తినలేదు ,,నేనూను .రోజూ ఎదురు చూసేవాళ్ళం ......ఎక్కడ కిచకిచమన్న పరిగేట్టేవాళ్ళం ఇద్దరం ....అవి గుర్తొస్తే ఎంతో దిగులేసేది ...ఆ కిటికీ దగ్గరకి వెళ్తే దూరమైన ఆత్మీయులు గుర్తోచ్చేవాళ్ళు ...మా అమ్మాయి అవి వెళ్లడానికి నేను వాళ్ల నాన్న కారణం అంటుంది ...అస్సలు పెయింట్ వేయకపోతే అవి వెళ్ళేవి కాదని ....ఆ ఇల్లు అద్దెకి ఇచ్చి కొత్త ఇంట్లోకి వచ్చేప్పుడు కొంత రిలీఫ్ గా ఫీల్ అయ్యాను ఆ "జ్ఞాపకాలు"నుండి తప్పుకోవచ్చని . ఏ గోరింకను ,పేరు తెలియని పిట్టల్ని చూసిన మా పిచ్చుకలు గుర్తొస్తాయి ......చూసారా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాను .....అన్నట్లు "చినుకు" చూడండి సాహితీప్రియులారా .

11 కామెంట్‌లు:

ఉమాశంకర్ చెప్పారు...

"చినుకు" నించి "పిచ్చుక" దాకా వెళ్ళిపోయారు. :)

అవును చాలా బాధాకరం.కొన్ని నెలల క్రితం ఒక బ్లాగులో చదివానండీ పిచ్చుకల అదృశ్యం గురించి.రాసినవారు గుర్తులేదుగాని చాలా బాగా రాసారు.

చినుకు,వీరిది ఆన్లైన్ ఎడిషన్ ఉందా?

Hima bindu చెప్పారు...

@ఉమా
ఆన్ లైన్ ఎడిషన్ లేదేమోనండి ...మనం ఈ విషయాల్లో పూర్ కాబట్టి కనుక్కొని చెబుతాను .మీకు ఇంట్రెస్ట్ అంటే చెప్పండి అక్కడినుంచే కాపీ మీకు డైరెక్ట్ గా వచ్చే ఏర్పాటు చేస్తాను.

పరిమళం చెప్పారు...

చిన్నిగారు పిచ్చుకల తో అనుబంధం నాకూ ఉందండీ !రాస్తే మరో పోస్ట్ అవుతుందేమో .. :) :)

@ ఉమా శంకర్ గారూ ! పిచ్చుకల మీద రాసిన బ్లాగ్ లు ఇవేనండీ !
sahitheeyanam.blogspot.com "అంతరించిపోతున్న పిచ్చుకలపై...",
maruvam.blogspot.com "మావూర్లో అవతరించిన పిచ్చుకపై "

Bolloju Baba చెప్పారు...

చినుకు ఎడ్రస్ ఇవ్వగలరా? దయచేసి.
పిచ్చుకలగురించి వ్రాసిన వాళ్లలో నేనూ ఉన్న్నాను.
http://sahitheeyanam.blogspot.com/2009/01/blog-post_12.html

Hima bindu చెప్పారు...

@బోల్లోజుబాబా గారు
మీ పోస్ట్ తప్పక చదవాలి ..
చినుకు మాసపత్రిక
దత్తాస్ నయబజార్
రాజ్ యువరాజ్ ఎదురుగా
గాంధీనగర్ ,విజయవాడ ౩
ఎడిటర్ రాజగోపాల్ ఫోన్ నెంబర్ ..98481 32208

Hima bindu చెప్పారు...

@పరిమళం
మీరు రాస్తే చదవడానికి నేను రెడీగా వున్నాను ....రాయండి.

మురళి చెప్పారు...

సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ పిచుకలని చంపేస్తోందని చదివానండి ఎక్కడో.. టెక్నాలజీ తో మనం రెట్టింపు సౌఖ్యాలు అనుభవిస్తూ సగం ప్రకృతిని నాశనం చేస్తున్నాం.. బాగుందండి మీ టపా..

ఉమాశంకర్ చెప్పారు...

చిన్ని గారూ,

థ్యాంక్స్ అండీ. మీకు శ్రమ ఎందుకు వారి నంబర్ అడుగుదామనుకున్నా. మీరిచ్చిన వ్యాఖ్యలో అల్రెడీ కనపడింది. :)

Thanks again :)

Hima bindu చెప్పారు...

@మురళి
నిజమేనండి ...ఈ సెల్ టవర్స్ ఇళ్ళ మద్య వచ్చి ....రాబోయే రోజుల్లో మన మనుగడే ప్రశ్నార్ధకం అయ్యేట్లుంది ..ధన్యవాదాలు .
@ఉమా
అయ్యో ఇందులో శ్రమ ఏముందండి ....అంగుళం కూడా కదలకుండా చిటికెలో చేసేస్తానండి ...అవ్వకపోతే మొహమాటపడకుండా చెప్పండి .

చైతన్య.ఎస్ చెప్పారు...

మా ఇంట్లో కూడా ఇలాగేనండి పెయింట్ వేయడం మూలంగా పిచ్చుకలు వెళ్ళిపోయాయి :(

మరువం ఉష చెప్పారు...

బాబా గారి కవితకి స్పందనగా నేను వ్రాసిన కవిత ఇది -

మావూర్లో అవతరించిన పిచ్చుకపై ...
http://maruvam.blogspot.com/2009/01/blog-post_12.html

నిజంగా అలా పదుల సంఖల్లో ఉదయాన్నే కిచ కిచమటూ అవి వాలుతుంటే ఎంతో ఆనందం. ఇప్పుడు కూడా సాయంత్రం 5 గంటల సమయం నా ఎదురుగా వాలి ఆటలు పాటల్లో సమయం గడుపుతున్నాయి, వాటికి తోడు కొన్ని గోరింకలు ఇతర పక్షులూను. నిన్ననే గమనించా, పోర్చులోని లైటు హోల్డరుమీద ఓ గూడు వుంది, అది పిచ్చుకదేమోనని కాస్త సంబరం, కాస్త అయితే బాగుండునని ఆశ.