బద్దకంగా వుండి ఈ రోజు ఎటు వెళ్ళలేదు ...మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో నేల మీద పడుకుని కనిపించిన వార పత్రిక తిరగేస్తూ తెలీకుండానే మాగన్ను నిద్ర పోయాను ...ఇంతలో వేసవి ఎండకి చెలరేగిన ఎదురుగాలికి తెరచి వుంచిన తలుపులు టపటప కొట్టుకున్నాయి ...ఆ చప్పుడుకి మన పగటి నిద్రకి అంతరాయం కలిగి లేచి తలుపులు దగ్గరకి వేద్దామని ఉత్తర గుమ్మం వైపు వెళ్లాను ....అక్కడ కొంతమంది ఉల్లాసంగా -ఉత్సాహంగా (రెండు ఒకటేనా ?)మాట్లాడతూకనిపించారు ...నన్ను చూడలేదు ...పక్కకి వచ్చి తలుపు ప్రక్కనే నిలబడి ఏమి మాట్లాడుకుంటూన్నారా అని ఆలకించాను ....టాపిక్ రసవంతంగా నడుస్తుంది ...ఒకటే కువకువలు ...వుండుండి గంభీరంగా ఒక గొంతు ...గాలికి ఎగిరిపడుతున్న తమ పయటకొంగుకూడా సరిచేసుకోకుండా ఒకరిమీద ఒకరు పడిఒకటే నవ్వులు .
"మీ తలంతా ఒకటే దుమ్ము ,...కాస్త ఆ నవ్వులాపి దులుపుకోవచ్చుగా "గంభీరమయిన స్వరం తో తూర్పునున్న "రావిచెట్టు".
"అబ్బా పోదూ ఎప్పుడు ఇలానే సతాయిస్తారు ...కాస్సేపయిన ఈ గాలితో సయ్యాటలు ఆడవద్దామీరన్ని దాటి వచ్చారని మరచిపోవద్దు "గారాలుపోతూ ....గడసరి "గుండుమల్లె "......
"చూడమ్మా ! పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏవిటా మాటలు ....పెద్దాయన ఎమన్నారని ?ఒళ్ళంతా దుమ్ము ,,కాస్త దులుపుకోమన్నారు ....అంతేకదా ....ఆయన ఈ కాలనీ పుట్టినప్పటినుండి వున్నారు ..మన అందరికి పెద్ద ....నిన్న కాక మొన్న వచ్చి ఏవిటా మాటలు " కాస్త నొచ్చుకుంటూ మందలింపుగా .....రావి పక్కనే ఒద్దికగా ఒదిగి వున్నా "వేప".
పోనీలే చిన్నవాళ్ళు ...వాళ్లకు మాత్రం ఏం తెలుసు .....కాసేపాగితే పార్వతి వస్తుంది ....ఎలాను స్నానం చేయిస్తుంది .....రావి.
"లేదు బాబాయిగారు పార్వతి సరిగ్గా పట్టించ్కోవడం లేదు ....చిన్ని వచ్చేసరికి రాత్రయి పోతుంది ....ఇదివరకులా చిన్ని ప్రతి వుదయం అందరిని పలకరించడం లేదు ....చాల మారిపోయింది ...పార్వతి ని మాత్రం అడుగుతూనే వుంటుంది ...మనల్నిగురించి ......నన్ను చూడండి ..మా అక్క గెల వేసి పోయి ఆరునెలలు అవుతుంది ...వరుసగా నలుగురం స్తంభాలలా పెరిగాము ....సరయిన పోషణ వుంటే నేను ఇలా వట్టిపోయి వుండేదాన్ని కాదేమో .....ఆవేదన వ్రేల్లగ్రక్కింది "అరటి"..
"అబ్బో మమ్మల్ల్ని అడవుల్లో నుండి తీసుకొచ్చింది ...మేము ఎలా వున్నా సర్దుకుపోతాం అంటూ గోప్పలుపోయేవాళ్ళు కదా .....అప్పుడు చిన్ని ని పొగుడుతూ వుండేవాళ్ళు ...ఎవరయితేనేం పార్వతి వుందిగా " వెక్కిరింతగా ప్రక్కనే వున్నా దానిమ్మ .
"అవునూ ఈ రోజు చిన్నివాళ్ళాయన అంత శ్రద్దగా ఎరువు నీళ్లు పోశాడు .....నేనోచ్చాక ఇదే మొదటిసారి చూడడం ." నెలక్రితమే ఇంట్లోకి వచ్చిన ఓ ముద్దు గులాభి బాల .
"ఓస్ అదా ! చిన్ని వాళ్ల అమ్మాయికి రంగురంగు చేపల పిచ్చి ....చక్కగా విశాలమయిన నదులలోను ...సముద్రంలోనూ ఆడుకుంటున్న పిచ్చి కూనలను పనిలేని వెదవలు (క్షమా)పట్టి గాజు తోట్టేల్లో పెట్టి అమ్ముతుంటారు ....మన చిన్ని లాంటి వాళ్లు కొనుక్కొచ్చి గాజు తొట్టెలో నీళ్లు పోసి ,ఆక్సిజెన్ పెట్టి అపురూపంగా మనల్ని పెంచినట్టు పెంచుతారు ,నెలకోసారి ఆ తొట్టి జాగ్రత్తగా కడిగి పెట్టె భాద్యత ఆయనదే ,,లేకపోతె అమ్మాయిగారు గోల పెట్టేస్తారు....ఆ నీళ్లు త్రాగితే మనకి భలం అని ఆయన తొట్టె కడిగిన ప్పుడల్లా జాగ్రత్తగా అందరకి త్రాగిస్తాడు " అంది ...వయ్యారాల "విరజాజి" .
"హుష్ ...నెమ్మది ...చిన్ని తలుపు దగ్గరే వుంది ...తీరికగా వుందేమో మనతో ఊసులాడ వస్తున్నట్లుంది "గానుగ చెట్టును ఆసరా చేసుకుని మొదటి అంతస్తును చేరుకున్న "మనీ ప్లాంట్ "....విరగబూసిన కనకంబరాల్ని చూస్తూ ..సంపెంగలు ...రాదామనోహరాలు ..విరజాజుల వాసనలు అన్ని కలిసి గమ్మతయిన పరిమళం వేదజల్లుతుండగా మత్తుగా నడిచాను వాటి దరికి ...ఊసులాడ {పూలు గుసగుసలాడేనని సైగ చేసెనని ఇన్స్పిరేషన్ తో }.