29, అక్టోబర్ 2009, గురువారం

నేను -4

కళ్ళు తెరిచి చూసేసరికి నేనొక విశాలమైన ప్రాంగణం లో వున్నాను ఇక్కడ పక్షుల కిలకిలలు సెలయేటి గలగలలు లేవు .అంత రణగొణ ధ్వనులు,దుమ్ము ,రకరకలయిన మనిష్యులు వస్తుపోతున్నారు నన్ను తాకి ''నిఖార్సైన జాతి"అంటున్నారు .వారి మాటలు అర్ధం కాలేదు కాని ఒక్కటి మాత్రం తెలిసింది ,మేము పుట్టిపెరిగిన నేలమంచిదని నీరు మంచిదని వాటితో జాయలు వస్తాయని దాని వలెనే నా అందం ఇనుమడించిందని....
మా కోసం పోటీపడి పెద్దమొత్తం చెల్లించి సాయంత్రం వరకైనా అక్కడ వుండనీయలేదు.
అక్కడినుండి మరొక ప్రదేశానికి చేర్చారు ...నాకు ఒకటే ఆశ్చర్యం ,ఇంత చిన్న మానవుడు మమ్మల్ని ఎంత అవలీలగా తరలిస్తున్నాడో అని.బక్కచిక్కిన ఒక వ్యక్తి తన చేతిలో సరంజామా తో వచ్చి మమ్మల్ని చూసి అతని కళ్ళు మెరవగా ఆప్యాయంగా స్పృశించాడు ,అతని వెనుక వచ్చిన వారికి ఏదో పురమాయించాడు.నన్ను ప్రక్కకి తీసుకువచ్చి వారివద్దనున్న రంపాలతో అడ్డదిడ్డంగా నన్ను ముక్కలు ముక్కలు చేసారు,అదృష్టం నా గుండెను కోయలేదు...కోసినా భరించే శక్తి నాకొచ్చింది .ఆ నాటినుండి ఆ ముగ్గురు మమ్మొధలక దినారాత్రులు మాతోనే గడిపారు ,చెప్పొద్దు !నాకు ఆసక్తిగానే వుండేది వారేం చేస్తారా చూడాలనే .నా భాదని నా వారిని మరచిపోయి ఈ కొత్త ప్రపంచంలో పడిపోయాను ఆసక్తిగా చూస్తూ ..
మమ్మల్ని చూస్తే మాకే ఆశ్చర్యంగా వుండేది వారి చేతుల్లో నునుపుదనం సంతరించుకున్నాం ముట్టుకుంటేనే జారిపోయేట్టుతయారయ్యాం ,మాకు రకరకాలైన లేపనాలు అద్దేవారు నాజుకుదనం కోసం మిషనుల్లో పెట్టేవారు ..ఆ బక్కచిక్కిన వ్యక్తికి మేము ప్రాణం అని అర్ధం అయ్యింది ,ఎంత అందంగా చేసిన తృప్తి పడక ఇంకా మాకు మెరుగులు దిద్దేవాడు,ఎండ వానకి కూడా మేము తట్టుకుని నిలబడాలనే కోరిక వ్యక్తం చేసేవాడు

ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగా పూసిన పూలను కాయలను కర్కశంగా చిదిమి మరల పునః సృష్టిగావిస్తున్నాడు.నా బాధను మరపించుటకు నా పూలను నన్నే నమ్మి ఆశ్రయించిన పిట్టలను నాలోనే చెక్కాడు చూసి మరచిపోమ్మని
ఒక మద్యాహ్నం ఆదమరచి నిద్రలో వుండగా నా చెక్కిలిమీద వెచ్చని కన్నీటి బొట్లు నన్ను మలచిన ఆ శిల్పి కనులనుండి ,యేమి జరుగుతుందో చూసేలోపు నేను అక్కడినుండి తరలించబడ్డాను ,మనస్సు భాధతో ఒక్క క్షణం కలవరపడింది ,అయిన ఇలాటి అనుభందాలకి అతీతంగా తయారవ్వాలన్న నా సంకల్పాన్ని నిర్వీర్యం చేయదలుచుకోలేదు .
నేను క్రొత్తగా వచ్చిన ప్రదేశం చాల బాగుంది ..అందరు నాలానే మలిచిన వారేఅంతా నా జాతే ..ఒక్కొక్కరి అందం చూడటానికి కళ్ళు చాలడం లేదు ...యేమి హొయలు ! యేమి నిగారింపు లో ! ముసిముసి నవ్వులతో పలకరింపులు ,కుశలం ప్రశ్నలు ...అబ్బ నేను వెళ్లి గంటయిన కాలేదు ఎక్కడినుండో ముగ్గురబ్బాయిలు వచ్చి నన్ను నాతో మరో ఇద్దరినీ ఎంచుకుని మమ్మల్ని బయటికి తీసుకు వచ్చేశారు ,మమ్మల్ని చాల దూరం తీసుకెళ్లాలని వారిలో వారు అనుకుంటుంటే తెలిసింది ..మమ్మల్ని అపురూపంగా కట్టి చీకటి బండిలో పెట్టారు గాలి వెల్తురు లేక తెగ ఇబ్బంది పడ్డాను .నేను గమ్యం చేరేసరికి నాకోసం ఎదురుచూస్తూ అక్కడ చూసిన అందమయిన అబ్బాయి .నన్ను తనతో తీసికెళ్ళాడు ...ఓహో రేపటినుండి ఇతని తో వుంటాను కాబోలు అనుకునేలోపు ఒక ఇంటికి చేర్చాడు ..ఇంతకి నన్ను చేర్చింది చిన్ని అనే వాళ్ళింటికి ..స్నేహితులంతా కలసి మమ్మల్ని తెచ్చుకున్నారట ,చిన్ని రాలేదని చిన్ని తరుపున ఈ అబ్బాయి నన్ను ఎంపిక చేసాడు ...చిన్ని కి నేను చాల నచ్చానని అతని చెప్తుంటే విన్నాను

హమ్మయ్య ! ఇక్కడ రణగొణ ధ్వనులు లేవు ,ప్రశాంతం గా వుంది .అసలు వాకిట్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యం ..ఆ వీధంతా నా వాళ్ళే ,పచ్చగా కళకళ లాడుతూ ..నగరాల్లో ఇలాటి వీధి నేను చూడలేదింత వరకు ..మా అడవిలోకి వచ్చానా అని క్షణం భ్రమపడ్డాను .ఆ చెట్ల మీద ఆడుకుంటున్న గోరింకలను చుస్తే మనస్సోక క్షణం కలుక్కుమంది.వరండాలో పరిసరాలు చూస్తూ నిట్టురుస్తూ నుంచున్న నన్ను నెమ్మదిగా ఎవరో వచ్చి ఇంట్లోకి చేర్చారు నిశబ్దం గా వున్నా ఆ ఇంట్లో మనుష్యులు వున్నారన్నట్లు తెలిసేది చిన్ని కాలి మువ్వల చప్పుళ్ళే.చిన్ని నన్ను అపురూపంగా చూస్తుంది .నా కోసం చిన్ని వాళ్ళ పాప గది ఇచ్చింది ,నేనోస్తానని నా ముందు వున్నవారిని వాళ్ళమ్మ వాళ్ళింట్లో బోల్డన్ని గదులున్నాయని అక్కడికి పంపేసింది .పెద్ద పెద్ద కితికిలకి వున్నా తెరలు తీస్తే మావాళ్ళంతనా కళ్ళ ముందు కనబడతారు .నా మీద మెత్తటి పరుపు వేసి తెల్ల పూల దుప్పటి వేసింది ...నిజం చెప్పోద్చు ..నన్ను చూస్తె నాకే ముద్దోచ్చాను ...చిన్ని ఇంట్లో వున్నప్పుడు నాతోనే ముచ్చట్లు ....ఈ రోజు ఆదమరచి నా మీదే వాలి నిద్రపోయింది ..చిన్ని ని చూస్తె నా గూటిలోని గువ్వపిల్లలు గుర్తొచ్చారు .....నా ఒడిలో నిశ్చింతగా ఆదమరచి నిదుర పోయిన తీరు .......బ్రతికిన మరణించినమేము సమస్త ప్రకృతిలోని జంతు జీవలకి వుపయోగ పడుతూనే వుంటాం .. ..మా సహజ లక్షణం.

నేను .......? చిన్ని ముచ్చటపడి తెచ్చుకున్న అందమయిన మంచాన్ని :):)

28, అక్టోబర్ 2009, బుధవారం

నేను -౩

యధాప్రకారం గువ్వలన్ని పిల్లల్ని నా మీద వదిలి గూడు విడిచి ఆహరాన్వేషణ కి వెళ్ళాయి .పిల్లలని గోలచేస్తూ ఆడుకుంటున్నాయి .నేను నా వాళ్ళు కబుర్లలో మునిగిపోయము .ఒక్కసారిగా మా అడివంత కలకలం రేగింది .స్వేచ్చగా తిరుగాడే జంతుజాలం కకావికలమై నలు దిక్కులు పరుగులు తీసాయి .గువ్వపిల్లలన్ని భీతి తో తల్లడిల్లి ముడుచుకుని గూటిలో దూరాయి ...పరికించి చుసిన వింత జంతువులు ...వారే మనుష్యులు .

నా దగ్గరకి వచ్చి ఆపాదమస్తకం పరికించి చూసారు,నా తనువునెల్ల తడిమి తడిమి చూసారు .అందరిలో భలిష్టమైన వ్యక్తి ముందుకు వచ్చి నా పై చేయి వేసాడు ...ఒక్కసారే ఉలిక్కిపడ్డాను,భయంతో తడబడిపోయాను,నా ఆకులన్ని జలజలమని రాలిపడ్డాయి,ఆ వ్యక్తి సంతృప్తిగా ప్రక్కని వారితో ఏదో చెప్పాడు .నాకు అయోమయంగానూ,ఆనందం గాను వుండి నా సన్నిహితులవైపు గర్వంగా చూసాను .వారు నావైపు చుసిన జాలి చూపులు అర్ధం కాలేదు .
నా ఆలోచనల్లా ఒక్కటే ఇతగాడు నన్ను తనతో తీసుకు వెళ్ళతారేమో వెళ్ళితే నగర సందర్శనం అవ్వుతుంది కదా అని.....ఆలోచనలో వుండగానే పడింది నా మీద దెబ్బ .సొమ్మసిల్లి పోయాను.మెలుకువ వచ్చి చూడగా నా కాళ్ళ వరకు నరికేసాడు ఆ మానవుడు .

భాదని ఓర్చుకుంటూ కన్నీరు కారుస్తున్న నన్ను చూసి నా సన్నిహితులంతా నిస్సహాయంగా విలపించడం మరింత కుదిపేసింది.నన్నే నమ్ముకుని గూటిని ,గూటిలోని పిల్లల్ని వదిలివెళ్ళిన గువ్వల కలకలం ,పిల్లల వెక్కి వెక్కి ఏడ్పులు ,నేలను తాకి విగత జీవులైన పసి గుడ్లను చూసి శోకిస్తున్న ఆ పిచ్చి తల్లులను చూసి ......అయ్యో !నా ప్రాణమైన పోదేమీ అని రోదించాను .నా గుండెతో పాటు వాటి గూడులన్ని చెదిరిపోయాయి .
ఆ నలుగురు నన్ను నిలువునా క్రింద పడవేసి పాశవికంగా తాటి మొకులతో కట్టి నా వారి ముందే నన్ను భలంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు ,కడసారిగా నావాళ్ళ కి కంట నీరుబుకుతుండగా కళ్ళతోనే వీడ్కోలు పలికాను .నన్ను ఈడ్చుకేల్లుతున్న వైనం చూసి అందరు ఒక్కసారే గొల్లుమన్నారు .నన్ను వదలక నా బిడ్డలైన పులుగులన్ని వారిని ముక్కుతో పొడుస్తూ భీభత్సం సృష్టించాయి .నా మనస్సు దిటవు పరచుకొని ,వారిని వారించి 'నా వారిలో నన్ను చూసుకొమ్మని ,నలుగురు కూర్చుని ముచ్చటించే వేళ నన్ను తలుచుకోమని హితవు పలికాను .,నా శరీరాన్ని కష్టపడి ఒక భారి వాహనం లో చేర్చారు ..కొంత దూరం వెంబడించిన నా బిడ్డలు మరి రాలేక శోకం తో వేనుతిరిగాయి .

అప్పటికే వాహనం లో నాలానే ఎందరో !అందరి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి .మా అందర్ని కలిపి కట్టేశారు,ఎక్కడికి జారి పారిపోకుండా .దుఖాన్ని నిగ్రహించుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చీకటిలో చుక్కలు చూస్తూ నిద్రలోకి ఒరిగిపోయాను .

25, అక్టోబర్ 2009, ఆదివారం

నేను -2

నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ లేత ప్రాయం వీడి పరిపూర్ణత్వం ఏర్పడింది నా తనువునకి .నా మేను విశాలమై నా ఆలోచనలు విస్తారం అయ్యాయి .అమాయకత్వం వదిలి జీవితం చూడటం నేర్చుకున్నాను ...నా చుట్టూ నా ఈడువారే భిడియం వీడి నా చుట్టూ వున్నవారితో నెయ్యమెరిపాను.మా మద్య ఎన్నో ఊసులు ,పగలంతా మా కబుర్లకు అంతే వుండేది కాదు రాత్రల్లాగువ్వల వద్ద నుండి మేము విన్నవి కన్నవి పంచుకునేవాళ్ళం .
రాత్రయ్యేసరికి నా తనువంత సందడే ..చిన్న కీటకాలు మొదలు రంగురంగుల పిట్టలకు ఆవాలము నేనే ..వారిని ముద్దుగా హత్తుకున్నానేగాని కొంచమైన విసుగుచెంధలేదు .ఒక గడసరి గువ్వ నన్ను తొలచి నా హృదయం లోనే గూడు కట్టుకుంది నన్నడగకుండానే....ఎక్కడినుండి తెచ్చుకుందోగానిబుల్లి గువ్వని ముద్దుగా కాపురం నా లోగిలిలోనే పగలల్లా ఆ గువ్వల జంట పిల్లలికి కాపలాగా లాలిస్తూ ....వాటి సుఖ సంతోషాల్లో ,వ్యధల్లో పాలు పంచుకుంటూ రెక్కలొచ్చి రివ్వునెగిరిపోయే పిల్లల్ని చూసి దిగులు పడుతూ కొత్తగానన్ను చేరే గువ్వల జంటలకి స్వాగతం చెబుతూ ...ఇలా ఎన్నో జంటల జీవితాలకి సాక్షి భూతం అయ్యాను

నా వయస్సు తోపాటే ప్రపంచ జ్ఞానం పెరిగింది .కాకమ్మ చిలకమ్మలు ఎప్పుడు మనుష్యుల గురించే మాట్లాడుకునేవాళ్ళు ,వాళ్ళు ఎలా వుంటారో మాకు చూడలన్పించేది .వారి మాటల బట్టి నాగరికత మార్పు వస్తుందని తెలుస్తుంది .రాను రాను అవి పట్టణాలకి వెళ్ళే పరిస్థితి తగ్గిపోతుందట,ఎంతో ఆందోళన పడుతూ అవి చెప్పుకునే కబుర్లు వింటుంటే మా మనుగడకి ఏదో ముప్పు వుంటుందని తోచేది .అసలు అవి చెప్పుకునే కబుర్ల కోసం సాయంత్రం నుండే ఎదురు చూపులు ...ఎప్పుడైనా రావలసిన సమయానికి అవి రాకపోతే ఎంతో ఆందోళనకి గురయ్యేదాన్ని .....గువ్వల ఊసులు వింటే మాకు ఆ నగరాలను చూసిరావాలనే కోరిక గా వుండేది
ఎన్నో వసంతాలు ,శిశిరాలు చూసిన ఈ నా జీవితం నిస్పృహగా మారుతున్న తరుణం లో ఒక అధ్బుతం జరిగిందీ ....

24, అక్టోబర్ 2009, శనివారం

నేను

కళ్ళు విప్పిచుసే సరికి చుట్టూ అంత పచ్చగా నాలానే ....ఎండవానలో ఊహవచ్చేవరకు ఎదిగాను ....అసలు ఎందుకు పెరుగుతున్ననో ,ఎక్కడినుంచి వచ్చానో నాకే తెలిదు ..చినుకు రాలినపుడు పరవశించుతూ ,ఉరుములు ఒరుమినపుడు ఉలిక్కిపడుతూ .. మెరుపులు చూసి ఆశ్చర్యపోతూ ....మంచుకి వణుకుతూ ఇదంతా ఏవిటని .అడగాలంటే చెప్పేవాళ్ళు లేరు అన్నిటిని చూస్తూ ...రాత్రివేళ నిద్ర రానపుడు నక్షత్రాలను లెక్కపెడుతూ ...
ఎప్పుడు పూయడం మొదలు పెట్టానో ...నాలో వయసేప్పుడు వికసించిందో నాకే తెలీదు ..వసంతం లో కోయల కూసినపుడు తొలి వలపు గుండెల్లో వికసించడం మాత్రం గుర్తుంది .ప్రకృతి నాలో నింపిన సొగసునంత నీలాకాశం కింద పచ్చగా పరిచాను .నా పూల సొగసుకి మురిసిన తుమ్మెదల ఝుంకారాలు,తీనటీగల హోరు ,సీతాకోక చిలుకల సందడి.......నాలో ఏదో చిన్న గర్వం ...నాకోసమేకదాఅని హొయలు ...అసలు ఇంతకి నేనెవర్నో ..?

19, అక్టోబర్ 2009, సోమవారం

కార్తీకసోమవారం

నిన్న రాత్రి నిద్రపోయేముందు రోజు లేచేదానికంటే అరగంట ముందు లేవాలని నిర్ణయించుకోవడం తోపాటు ఎందుకైనా మంచిదని టైం సెట్ట్ చేసి నిద్రలో వున్నా మావార్ని లేపి "అలారం మోతకి నేను లేవకపోయిన నువ్వు లేస్తావు కాబట్టి నన్ను లేపు" అని చెప్పాను .ఎక్కడికి వెళ్తున్నావు అన్న మావారిని విసుక్కుని ,ఎటు వెళ్ళడం కాదు కార్తిక సోమవారం శివాలయం కి వెళ్ళాలి....అన్న నా మాటలు విన్నారో లేదో తెలీదు నిద్రలో వున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతె ఇంత హటాత్తుగా నాలో పెరిగిన ఈ భక్తి శ్రద్దలకికళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు
తను లేపకుండానే అలారం మోతకి మెలకువ వచ్చింది ...చల్లటినీళ్ళు నెత్తిమీద పోసుకుని పూలు పళ్ళు ఆవుపాలు తీసుకుని మా ప్రక్క వీధి లో వున్నా శివాలయం కి వెళ్లాను.అక్కడ చాల ప్రశాంతంగా వుంటుంది అరగంట అభిషేకం పూజ అయ్యాక ,అరగంట ఆ ఆలయ ప్రాంగణం లో వున్నా అరుగుల మీద కూర్చుని ఉసిరిచేట్టుకు పూజలు చేస్తున్న భక్తులను ,వచ్చిపోయేవారిని గమనిస్తూ ఉషోదయాన్ని గడిపేశాను .
గంట తరువాత ఇల్లు చేరిన నన్ను చూసి మావారికి ఒహటే హాచ్చర్యం:) నాకెమైందాఅని .
తనకి మాత్రమె టి చేసి ఇచ్చాను ....తను ప్రశ్న వేయక ముందే చెప్పాను ..ఈ రోజు నేను ఉపవాసం వుండబోతున్నాను అని ...
నువ్వు నువ్వేనా ,....అని ప్రశ్న .
నేను నేనే ....నా జవాబు .
అయితే ఏదో ప్రళయం రాబోతుంది .....తను సాలోచనగా నా వైపు చూస్తూ .
జలప్రళయం వచ్చేసింధిగా ....ఇంకేం వస్తుంది ....నేను .
భూకంపం రావచ్చేమో ....నువ్వేమిటి ,శ్రద్దగా గుడికి వెళ్ళడం అంతటి తో సరిపెట్టుకోక కార్తిక సోమవారం ఉపవాసం ,మీ అమ్మ వెనకపడితెగాని పౌర్ణమికి దీపాలు వెలిగించే నీవు ...హ్మం ...ఏదో అయ్యింది నీకు ......మావారు ఒకింత మురిపెంగా (భక్తి ఎక్కువ )
యెమికాలెధుగాని..మీ పేరున పాప పేరున పూజ చేయించాను మంచిదని .,వంట మీ ఒక్కరికే ...చేయమంటావా ?వద్దా ?......నేను .
టిఫిన్ చేయి చాలు ,బయట తినేస్తాను ....మరి ఆఫీసుకి వెళ్ళవా ?...తను .
ప్చ్ ...వెళ్ళను....రెస్టు తీసుకుంటాను
పోనీ నేను వెళ్ళేప్పుడు మీ అమ్మ వాళ్ళింట్లో డ్రాప్ చేయనా ...తను .
అబ్బ వద్దులే ..నేను వెళ్ళాలంటే వెళ్తానుగా.........నేను. .
నెట్ కూడా చూడవా ?....నవ్వుతు ...తను .
అయ్యో ....అదేకదా మనకి కాలక్షేపం ....
హమ్మో ఒక్కరోజు నా అంతట నేను గుడికి వెళ్ళితే ఎంత ఆనందమో కదా ఈయనకి ....అసలు సంగతి చెపితే ఆయన ఫీలింగ్స్ యెట్లా వుంటాయో ....
గత ఆరునెలల నుండి నేను చాల లేజీ గా తయారయ్యాను .ఉదయం నా షెడ్యులు అస్తవ్యస్తంగా వుంటుంది .బొత్తిగా సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా తయారయ్యాను .పని మీద కూడా శ్రద్ధ తగ్గింది .ఆఫీసు విషయాలు బర్డెన్ గా ఫీల్ అవ్వుతున్నాను ....అలాటి ఆలోచన క్రమమే మార్చుకోవాలని తెగ ప్రయాస పడుతున్నాను .కనీసం ధ్యానం కి ఇరవయ్యి నిమిషాలైనకేటాయించే నేను పూర్తిగా నిర్లక్ష్యం చేసాను ..నన్ను నేను నిర్లక్ష్యం చేసుకుంటున్నాను ...ఇలానే వుంటే ఏమై పోతానో అనే భయం అంతర్లీనంగా ....హెచ్చరిస్తుంది .నిన్నంత బాగా ఆలోచించాను ...సోమవారం నుండి అమలు చేయాలి ...ఎలాను కార్తిక మాసం ...ఒంటికి అలానే మనస్సుకు పట్టిన బద్దకం వదుల్చుకోవాలి .....పూర్వం పు చిన్ని లా మారాలంటే వేకువనే నేనచరించే "భావాతీత ధ్యానమే "మార్గమని నా అంతర్వాణి పదేపదే చెబుతుందీ ...ప్రశాంతమైన వాతావరణం లో పునః ప్రారంభించాను నా ధ్యానం ..
నాకిష్టమైన శీతాకాలపు ఉదయాలు పొన్నాయిచెట్లు రాల్చే పూలను ఏరుకుంటూ మసక చీకట్లలో నడిచే నా నడకను...భాల భానుడి వేలుగురేకల్ని మిస్ కాకూడదనే ధృడమైన సంకల్పం తో నా వెనుకటి జీవితానికి శ్రీకారం చుట్టాను ....ఈ కార్తికసోమవారం ...ఈ రోజు పూర్తిగా నాది ....రాబోయే రోజులకి రచన చేస్తూ ......

16, అక్టోబర్ 2009, శుక్రవారం

''అల ''జడి

హమ్మ !యెంత నంగనాచివమ్మకృష్ణమ్మా
నిన్నటి వురుకు పరుగులేమయ్యయమ్మా ..
చేయాల్సినదంతా చేసేసి మౌనంగా సాగిపోతున్నావే
కలలో కూడా ఊహించని కల్లోలం రేపావే
కంటిమీద కూసంత కునుకు తీయనీక కుదిపెసావే
నీ ఒరవడికి తట్టుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేసావే
ప్రశాంతంగా సాగుతున్న జీవితాన్ని కలతబెట్టావే

నీ ప్రేమావేశ మొహంతో వువ్వేత్తరంగాలతో
నీ సందిట భందీ చేస్తే తట్టుకోగాలరనుకున్నవా
చూడు నీవు చేసిన గాయాలు ఇంకా మాయనేలేదు
చేయవలసినధంత చేసి నన్నేరగానట్టు కదిలి పోతున్నావా
నీవు చేసిన అల్లరి ఓపికగా భరించామే కాని నీపై కినుక వహించలేదే
ఎందుకంటావా ......నువ్వంటే మాకెంతో ఇష్టం అని చెప్పమంటావా ..........




ఒక్కసారి ఆలోచించండీ

దీపావళి అందరికి ఇష్టమైన పండుగే ...చిన్నప్పుడు నాకు చాల చాల ఇష్టం ...పుట్టిన రోజుకోసం ఎదురు చూసినట్లు ఎదురు చూసేదాన్ని ...కాని ఈసారి పండగ చేసుకోవడం అంటే మనస్సు ఒప్పడం లేదు ...చేసుకునేంత మంచి వాతావరణం లేదు .........రాష్ట్రం లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఆనాటి జాడలు పోలేదు అయిన తప్పదు మన పద్ధతి ప్రకారం మనం జరుపుకుంటాం ....
ఒక్కసారి భాణసంచా కొనేప్పుడు ఆలోచించండీ అనవసరంగా తగలబెట్టేవాటిల్లోకొంత వరద ప్రాంత భాధితులకు వెచ్చించండి ...మన ఆనందం కోసం వెచ్చించే రూపాయి ఒకరి ఆకలి అయిన తీరుస్తుందేమో .....ఆలోచించండీ.

14, అక్టోబర్ 2009, బుధవారం

నా "అద్దాల గోల "

ఈ మద్య ఉదయాన్నే పేపర్ చదవాలంటే తెగ ఇబ్బందిగా వుంది ...ఇబ్భంది ఉదయాన్నే లేవటం లో అనుకుంటున్నారా ....అబ్బే ..అదేమీ కాదు అంత చిన్న చిన్న అక్షరాలూ మరీ నలకల్లా కనబడీ పేపర్ కాస్త దూరం పెట్టుకుని చదుతుంటే అంత కష్టపడే బదులు కాస్త ముఖానికి ఆ అద్దాలు తగిలించుకోరాదు అంటూ ఓ ప్రక్క ఈయనగారి వెక్కిరింత ...అసలే కళ్ళద్దాలు అంటే చిరాకు పొద్దున్న పొద్దున్నే ఏమి పెట్టుకుంటాం అందుకే లాంగ్ షాట్ లో చదుతు సరిపెట్టుకుంటున్న కొన్ని తరువాత చదవచ్చులే అని వాయిదా వేసేస్తున్నాను ..అస్సలు మొన్న మొన్నటివరకు గ్లాసెస్ లేకుండా బానే చదివాను రాను రాను తేడా స్పష్టంగా తెలుస్తుంది .కొన్నాళ్ల క్రితం గమనించి టెస్ట్ కి వెళితే ప్రాబ్లం ఏమీలేదు కాని గ్లాసెస్ వాడాలి అన్నారు డాక్టర్ ..అదేంటండీ ప్రాబ్లం ఏవిటంటే .....వయస్సు తల్లీ అన్నారు ...దీన్ని చత్వారం అంటారు ఒక్కోసారి తగ్గిపోతుంది ,చదివేప్పుడు రాసేప్పుడు తప్పనిసరిగా వాడండి ,కళ్ళు స్ట్రైన్ అవ్వవు అన్నారు ...

నేను ఉదయం పేపర్ చూడటం తప్పించి మిగిలిన సమయాల్లో అంటే ఆఫీసు పని లో ,పుస్తకాలు చదివేప్పుడో ,ఇలా సిస్టందగ్గర వున్నప్పుడో తప్పనిసరిగా నా సులోచనలకి పనిపెడుతూనే వున్నాను .
ఒకసారి ఒక జర్నలిస్ట్ పని మీద నా దగ్గరకి వచ్చారు ..మాట్లాడారు తనకి కావలసిన సమాచారం ఇచ్చాను ,ఏవో ఫైల్స్ చూసి చెప్పాల్సి వస్తే గ్లాసెస్ తీసి పెట్టుకుని ఫైల్ చూస్తూ చెబుతుంటే సడెన్గా అతను ...మీరు గ్లాసెస్ పెట్టుకుంటే పెద్దవాళ్ళ లా...వున్నారు అని ముఖం మీద అంత పరిచయం అప్పటికి లేకపోయినా అనేసారు .,అంతే మనము ఉలిక్కిపడ్డాం-:) అసలే మనకి సంతూర్ అని బిరుదాయే.....ఏ కాలేజ్ ?పెళ్లి అయ్యిందా అని అప్పటివరకు అనిపించుకుని :):)...ఇప్పుడేమో వెధవ కళ్ళద్దాల వలన పెద్దరికమా!...నేను తేరుకుని ''పెద్దదాన్నే కదా అలానే కనిపిస్తాను ''...అని వెధవ నవ్వు నవ్వి వురుకున్నాను .
ఇక ఆరోజు ఇంటికి వెళ్ళాకా మా పాపని ,మావారిని అడిగాను ,నేను అద్దాలు పెట్టుకుంటే ఏవైనా తేడా వుందా అని ,వాళ్ళ ప్రాణం తీశాను ...మా పాపమో '' కాస్త అమ్మ లా కనబడుతున్నావు ఇలానే రోజాంత పెట్టుకో ''అన్నది నన్ను ఎడ్పించడానికి..అమ్మ ని ,చెల్లిని అందర్ని అడిగి చివరికి తేలింది ఏవిటంటే మనకి అద్దాలు నప్పడం లేదని ..అలాటి కళ్ళద్దాలు పూర్తిగా వాడే పరిస్థితి వస్తుందేమోనని నా బెంగ . ..నిజానికి నాకు ఇవి కొత్త కాదు ఇది చెప్పాలంటే మరోసారి నా ఇంటర్ అయ్యి డిగ్రీ కి అడుగు పెట్టిన మొదటి నెలలోకి వెళ్ళాల్సిందే ..................రేపు చెబుతాను

9, అక్టోబర్ 2009, శుక్రవారం

క్రిటికల్ కేర్ లో 'బాపుబొమ్మ'

సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా సిటీలో వున్నా మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కి వెళ్లాను ..ఐ.సి .యు విసిటింగ్ హౌర్స్ సాయంత్రం రెండు గంటలు మాత్రమె కావడం వలన ఒకింత ఉద్విగ్నత తో రూం దగ్గరకి చేరి నా చేతిలోని హ్యాండ్ బాగ్ అక్కడే కూర్చ్చున్న మా కజిన్ ఒడిలో విసిరినంత పనిచేసి తలుపు తోసుకుంటూ రూం లోకి వెళ్లాను.నా కళ్ళు మూలనున్న బెడ్ వైపు వెళ్ళాయి...ఒక్కసారే దిగులు కళ్ళు మసకబారిపోయాయి .....క్రిటికల్ కేర్ బెడ్ మీద ''బాపు బొమ్మ ''...అటు ఇటు నర్సేస్ బ్రతిమాలుతూ పాలు తాగిస్తూమద్య మద్యలో ఆమె తల అడ్డంగా తిప్పుతూ ....నేను తనని సమీపించగానే నన్ను చూసి కనుబొమలు ఎగరవెస్తు నవ్వింది ఆ హాస్పిటల్ రూల్స్ ప్రకారం రెండుజడలు వాళ్ళ యునిఫారం షర్ట్ వేసుకున్న తనని చూస్తుంటే పోలిక లేకపోయినా 'వసంతకోకిల''సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చింది .నన్ను గుర్తుపట్టలేదు ..అర్ధం అయ్యింది ...ఎప్పుడో వుండుండి మన లోకం లోకి వస్తుంది..అప్పుడు నన్ను అడుగుతుంది అలానే మాట్లాడిస్తూ వుండగా హటాత్తుగా మన లోకం లోకి వచ్చి నన్ను గుర్తుపట్టి కన్నీరు .....తనకి జ్వరం రావడం తల నొప్పి రావడం చెబుతుండగానే మరల వేరే ధ్యాసలో చిన్న పిల్ల లా గోల ....మూడు రోజుల్లో ఎలా వుండే మనిషి ఎలా అయ్యిందో తలుచుకుంటే గుండె చెరువు అయ్యింది .రంగు మారి,పాలిపోయిన పెదవులు నిర్లిప్తంగా ఎటో చూస్తున్న కళ్ళు చిక్కిపోయిన చెంపలు ....యంత మార్పూ ....ఈమేనా ''బాపుబొమ్మ''....
కళ్ళు తుడుచుకుంటూ బయటకి వచ్చి కొంచెం ఎడంగా వున్నా బాల్కనీ లో కూర్చున్న వచ్చేపోయే వారిని చూస్తూ ...ఒక్కసారే నా మనసు గతం లోకి పరిగెట్టింది... ఆమెను మొట్ట మొదటిసారి నేను ఆరవ తరగతి చదువుతుండగా చూసాను .స్కూల్ నుండి వచ్చేసరికి మా ఇంటి బయటి చక్కబల్ల ఊయ్యాలలో ఒడిలో నెలల బాబుతో అపరిచితురాలు ,కళ్ళు చెదిరే అందం ...మెరిసిపోతూ బాపుబొమ్మ (ఈ పేరు అక్క పెట్టింది ) ఊయల నుండి నేలను తాకుతున్న పెద్ద జడ ....పోటి పడుతూ ఆమె పమిట చెంగు ....అలా కళ్ళార్పకుండా చూస్తున్న మమ్మల్ని ఆవిడకు పరిచయం చేసింది మా అమ్మ .ఆవిడ నవ్వుతుంటే మరింత అందంగా వుంది ...కాసేపట్లో ఆవిడతో కలసిపోయము .ఆమె అమ్మమ్మ చెల్లి కోడలాట.. మా అమ్మకి తమ్ముడు వరుస అవ్వుతాడు ..అతను కొవ్వూరు క్యాంపు కి వస్తు ఆమెను కూడా తీసుకు వచ్చాడట .మాకు చుట్టాలు అప్పటివరకు సరిగ్గా తెలియదు..వున్నా రెండురోజులు సరదాగా గడిచిపోయింది..ముఖ్యంగా అక్కా నేను ఆమె అందాన్ని తెగ అడ్మిరే చేసేవాళ్ళం .
తరువాత మేము కాలేజికి వచ్చాక నాన్నగారు పనిచేసే ఊర్లోనే అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళుకూడా ట్రన్స్ఫెర్మీద రావడం ఆమె తన పిల్లల్ని తీసుకు రావడం మేము వెళ్ళడం జరిగిందీ ..ఆమెలో అందం ఏ మాత్రం తగ్గలేదు సరికదా అప్పటికంటే ఇంకా అందంగా వుండినది .ఏ చీర కట్టిన బొమ్మలా వుండేది .
నా నిశ్చితార్ధం రోజు ఆమెదే మా అత్తగారి తరుపు హడావిడి ....ఎందుకంటే ఆమె ఆ ఇంటి పెద్దకోడలు కాబట్టి ...నేను ఆ ఇంటి చిన్న కోడలిని ...ఆ బాపు బొమ్మ నా తోటికోడలు.ఇప్పటికి ఏభయ్యేళ్ళ వయస్సంటే ఎవ్వరు నమ్మరు నలభయ్యిలో అడుగు పెట్టినట్లున్టది....అమృతం తాగుతున్నావా అని అడుగుతుంటాను...అన్నిటికి నవ్వే తన సమాధానం ......
మూడు రోజులక్రితం హటాత్తుగా తలనొప్పి తీవ్ర జ్వరం తో పడిపోయి ఒక రోజంతా కోమాలో వుండి...మృత్యు ముఖం నుంచి బయటపడింది బ్రెయిన్ ఫివేర్ ..ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా ..మనలోకం లోకి వచ్చి తన లోకం లోకి వెళ్ళిపోతుంది ..మెలుకువ వస్తే అందరికోసం చూస్తుంది అదీ నిమిషాలే ....కోలుకుని మాలోకి రావాలని అందరం ఎదురుచూస్తున్నాం ...ఆ పిల్లలు మరీ తల్లడిల్లుతున్నారు .....ఆ పైవాడు ఏం చేస్తాడో చూడాలి ....

8, అక్టోబర్ 2009, గురువారం

నేనంటే క్రేజ్ ....

నేనంటే ఎంత క్రేజ్ అర్ధం అవ్వుతుందిఈ మద్య బ్లాగ్ లో పదెపదె నన్ను తలుచుకుంటూ నా పేరుతో కామెంట్స్ రాస్తున్నారు,రాసేది ఆడో మగో కూడా బొత్తిగా అర్ధం కావడం లేదుకాని తరచి తరచి ఆలోచించగా ఈ రెండు జాతి కాకుండా మూడో జాతివాళ్ళని అర్ధం అవ్వుతుంది ...
ఏమైతేనేం "చిన్ని"అంటే పిచ్చి క్రేజ్ అనితెలుస్తుంది

6, అక్టోబర్ 2009, మంగళవారం

ఎవడి గోల వాడిదే

ఎవరిగోల వారిదంటే ఇదే కాబోలు ..ప్రకృతి వైపరీత్యలకి ఎవరు మాత్రం ఏమి చేయగలరు,ముందే గమనించితే సాద్యమైనంత (అంటే మానవునికి చేతనైనంత ) నివారణ ముందస్తు జాగ్రత్త తీసుకోవడం తప్పించి .ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమైన కర్తవ్యం,మిగిలినవి అంటారా''బ్రతుకుంటే బలిసాకుతిని అయిన గడపొచ్చు"అనే నానుడి వుండనేవుంది.
కాని ఈ మీడియా ముఖ్యంగా ఎలెక్ట్రోనిక్ వాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే చాల విచారం కలుగుతుంది,ఇరవయ్యి నాలుగు గంటల సమాచారం పేరుతో చెప్పడానికి ముడిసరుకు(-వార్తలు )లేక పూసింది అంటే కాసేసింది అంటూ వక్రభాష్యం చెబుతూ సగం ప్రజలలో భయాందోళనలు కలగచేయుచున్నారు .మూడు రోజుల నుండి వరధప్రాంతల్లో జిల్లా యంత్రాంగం పోరుగుజిల్లా యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రజలు 'అతి ధీమా 'తో యంత్రాంగానికి సహకరించక ఇప్పుడు నిండా నీరు వచ్చి మునిగాక వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని,అన్నం ,పాలు లేవని చలికి వణుకుతున్నాంఅని ,మూగజీవాలు సైతం కరకట్టల్లో ఆవాసం చేయాల్సి వస్తుందని ,కరకట్టల మీదే వంటలని మీడియా ని పిలిచి కధనాలు చెబుతుంటే ,వారికి మీడియా తందాన అంటూ అధికారులు నిర్లక్ష్యం కరకట్టల మీద వంటలు అంటూ కధనాలు .....ఇదే మీడియా వారిని ఎందుకు ఖండించదు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి ,ప్రభుత్వం ,సేవ సంస్థలు వసతి బోజనాలు ఏర్పాటు చేసారు,ఆస్తులుకాదు ముఖ్యం ప్రాణాలు కాపాడుకుని ,కట్టు విప్పి మూగజీవాల ప్రాణం కాపాడమని ....అలాచెబితే ఎలా అక్కడితో కథ సుఖాంతం అవ్వుతుంది కదా ,కధనాలు వెదుక్కోవాలి కదా ..
ఇప్పటికిప్పుడు కొల్లూరు మండలం 'పెసరలంక 'లో జరగని పడవ ప్రమాదాన్ని జరిగినట్లు వక్రీకరించడం ...వార్తా వచ్చినపుడు అన్నీ పరిశీలించాకే చెప్పాలి ..అంటే కాని కథలు సృష్టించడం కాదు .ఏదేమైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగం తమ ఇల్లు వాకిళ్ళు వదిలి రాత్రి పగలు బేదం యెరుగక''మీకు మేము ఉన్నాం ''అని వరద భాదిత సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు .....ఇవ్వేమి మీడియా కి కనబడవు .....వినబడవు ....

4, అక్టోబర్ 2009, ఆదివారం

కర్తవ్యం

మన చుట్టూ ఆవరించిన'' పెను చీకటిని ''తిట్టుకుంటూ,భాధ పడటం కంటే మనమే ముందుకు వచ్చి ''దీపం ''వెలిగిస్తే కొంతైనా చీకటిని పారద్రోలగలం.